బాలీవుడ్‌లో కబీర్ల జోరు

ఈ ఏడాది బాలీవుడ్‌కు కబీర్‌ పేరు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఈ పేరు ప్రధాన పాత్రలుగా వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సినీప్రియులను మురిపించాయి. ఇంతకీ ఆ చిత్రాలు మరేవో కాదు.. ఒకటి షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన ‘కబీర్‌ సింగ్‌’, మరొకటి హృతిక్‌ రోషన్‌ - టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌’. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వార్‌’లో హృతిక్‌ కబీర్‌ అనే అండర్‌ కవర్‌ పోలీస్‌ పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి.. బాలీవుడ్‌లో ఈ ఏడాది అతి పెద్ద విజయాన్ని అందుకున్న రెండో చిత్రంగా నిలిచింది. ఇక దీని కన్నా ముందే ఈ మార్క్‌ను చేరుకోని సత్తా చాటింది షాహిద్‌ చిత్రం. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ‘కబీర్‌సింగ్‌’ పేరుతో సందీప్‌ రెడ్డి వంగా రూపొందిన ఈ చిత్రంలో షాహిద్‌ కబీర్‌ పాత్రలోనే జీవించారు. ఈ సినిమాతో షాహిద్‌ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను అందుకోవడంతో పాటు.. తొలిసారి మూడొందల కోట్ల క్లబ్‌లోకి చేరుకుని సత్తా చాటారు. ఇలా ఈ ఏడాది కబీర్‌ అన్న పేరు బాలీవుడ్‌కు విపరీతంగా కలిసొచ్చింది. కబీర్‌ పాత్రతోనే ఈ ఏడాది బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఓ వెబ్‌ సిరీస్‌ కూడా మెప్పించింది. అదే అమెజాన్‌లో ప్రసారమైన ‘బ్రీత్‌’. మాధవన్‌ - అమిత్‌ సద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో.. అమిత్‌ ‘కబీర్‌ సావంత్‌’ అనే పాత్రలో నటించి మెప్పించారు. మరి బాలీవుడ్‌కు ఇదొక సెంటిమెంట్‌గా మారితే ముందు ముందు ఎంత మంది కబీర్‌లుగా మెప్పిస్తారో చూడాలి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.