బరువు పెరుగుతూ.. భరత నాట్యం నేర్చుకుంటూ!!

టు దక్షిణాది సినీరంగంపైనా.. అటు తమిళ రాజకీయ కురుక్షేత్రంలోనూ జయలలిత ముద్ర ప్రత్యేకమైనది. నటిగా తెరపై ఎంత మెప్పించిందో... మనసున్న నాయకురాలిగా తమిళుల మదిలో అంతే చెరగని ముద్రను వేసుకుంది ఆమె. అందుకే జయ తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా కొలువుదీరింది. ఇప్పుడామె జీవితాధారంగా ‘తలైవి’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి జయగా కంగనా ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఆమె జయలలితలా కనిపించడం కోసం చాలా కసరత్తులే చేస్తోందట. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. జయలలిత సినీ రంగంలో ఉన్నప్పుడు నాజూకు అందాలతో అందరినీ అలరించగా.. రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాక తన అందాల రూపును పూర్తిగా కోల్పోయింది. ముఖ్యంగా అప్పట్లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె స్టెరాయిడ్స్‌ వాడటంతో బాగా లావైపోయింది. ఇప్పుడు తెరపై ఆమె పాత్రను పోషిస్తున్న కంగనా కూడా లుక్స్‌ పరంగా జయకు దగ్గరగా ఉండటం కోసం బరువు పెరగాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం తాను ఉన్న బరువుకు అదనంగా మరో 6కిలోలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఇందుకోసం తన డైట్‌ను పక్కకు పెట్టి మరీ అన్ని రకాల కొవ్వు పదార్థాలు విపరీతంగా తినేయడంతో పాటు కొద్ది మోతాదులో ఫ్యాట్‌ గెయిన్‌ పిల్స్‌ తీసుకుంటోందట. ఇదే సమయంలో ఓవైపు తమిళ భాషను మాట్లాడటంలో శిక్షణ తీసుకుంటూనే భరతనాట్యం నేర్చుకుంటోందట. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో విడుదలైంది. ఈ వీడియోలో కంగనా ఓ యువతితో కలిసి ఎంతో చక్కగా భరతనాట్యం సాధన చేస్తూ దర్శనమిచ్చింది. ఏదేమైనా ‘తలైవి’ కోసం కంగనా పడుతున్న కష్టం చూస్తుంటే.. నటనపై తనకెంత నిబద్ధత ఉందో కళ్లకు కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తుండగా.. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.