62 సంవత్సరాల మదర్‌ ఇండియా

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్‌ బహుమతి మదర్‌ ఇండియా చిత్రానికి తృటిలో తప్పిపోయింది. మెహబూబ్‌ ఖాన్‌ తన 27 సంవత్సరాల సినీ జీవితంలో మెహబూబ్‌ ఖాన్‌ 25 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో 1957న నిర్మించిన ‘మదర్‌ ఇండియా’ మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన చిత్రాల్లోకెల్లా గొప్పదిగా కీర్తించబడుతోంది. 1960లో ‘మొఘల్‌-ఎ-ఆజం’ సినిమా విడుదలయ్యేదాకా మదర్‌ ఇండియా రాబట్టిన వసూళ్లను మరేచిత్రమూ అధిగమించలేకపోయింది. నవదర్శకులకు ఈ చిత్రం ఒక అధ్యయన పాఠంగా నిలిచింది. ఇందులో రాజకుమార్, నర్గీస్, సునీల్‌ దత్, రాజేంద్రకుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏకంగా ఐదు ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా, భారతదేశం తరఫున విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌ బహుమతి కోసం గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రాన్ని సూరత్, కొల్హాపూర్, నాసిక్‌ సమీప ప్రాంతాల్లో షూట్‌ చేశారు. ఈ చిత్ర క్లైమాక్స్‌ దృశ్య చిత్రీకరణ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా నర్గీస్‌ ఆ మంటల్లో చిక్కుకుంది. ఆమెకు కొడుకుగా నటిస్తున్న సునీల్‌ దత్‌ వెంటనే దూకి ఆమెను రక్షించి ప్రాణాలు కాపాడారు. తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. గతంలో నేషనల్‌ స్టూడియో వారికోసం మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అవురత్‌’ కు మదర్‌ ఇండియా చిత్రం రీమేక్‌. ఖాన్‌ ‘అవురత్‌’ చిత్ర హక్కులను కొని ‘మదర్‌ ఇండియా’ చిత్రానికి రూపం దిద్దారు. ఈ సినిమా తయారవడానికి మూడేళ్ళు పట్టింది. ముందు గేవాకలర్‌లో షూట్‌ చేసి తరువాత టెక్నికలర్‌కు బ్లోఅప్‌ చేశారు. నాటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహర్లాల్‌ నెహ్రు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించడం విశేషం. నాటి బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జి దేశాయి ఈ చిత్రానికి వినోదపన్నును రద్దు చేశారు. మెహబూబ్‌ఖాన్‌ దర్శక, నిర్మాతగా వ్యవహిరించిన ఈ చిత్రం అక్టోబర్‌ 25, 1957న తెరపై వచ్చి నేటికి సరిగ్గా అరవైరెండు సంవత్సరాలు అవుతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.