
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధుప్రీతి కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని వార్తలొచ్చాయి. దీనిపై కొంతకాలంగా చర్చలు కూడా నడుస్తున్నాయి. బంధుప్రీతిపై బాలీవుడ్ సీనియర్ నటుడు నషీరుద్దీన్ షా స్పందిస్తూ..‘‘యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నన్నెంతగానో కలచివేసింది. వ్యక్తిగతంగా సుశాంత్ ఎవరో తెలియకపోయినా అతని మరణం ఎంతో ఆవేదన కలిగించింది. మంచి భవిష్యత్తు ఉన్న నటుడు. ఇలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించడంలో అర్ధం లేదు. చిత్రసీమలో అందరూ అనుకుంటున్నట్లు బంధుప్రీతి, మనవాడు - పరాయివాడు, మూవీ మాఫియాలాంటి ఏవీ లేవు. ముఖ్యంగా మనం తల్లి తండ్రుల నుంచే చూసి ఎన్నో నేర్చుకుంటాం. ఆ విధంగా ప్రతికుటుంబంలో తను చేసే వ్యాపారం అయినా ఇంకేదైనా సరే వారసత్వాన్ని కొనసాగించాలని ఆశపడుతుంటారు. అలాగే డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లాయర్లు తమ రంగంలో తమ వారసులు ప్రవేశించి రాణించాలని భావిస్తుంటారు. అలా కోరుకోవడంలో తప్పేంలేదు. చిత్రసీమలో ఇప్పుడు గమనిస్తే ఎంతపెద్ద వారసత్వం ఉన్నా, ప్రతిభ లేకుంటే రాణించలేరు. నా వరకు నెనెప్పుడూ బంధుప్రీతి వల్ల సమస్యలు ఎదుర్కోలేదు. ఇక్కడ సినిమా వారసులే కాదు బయటి నుంచి వచ్చిన ఎంతో మంది చిత్రసీమలోకి వచ్చారు. ప్రతిభ ఉంటే వారిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ఇకనైనా బాలీవుడ్లో బంధుప్రీతి అంటూ జరిగే చర్చలు అనవసరం. అలాంటి చర్చలకు ఇకనైనా స్వస్తి పలకాల్సిందేనని..’’ చెప్పారు.