అలనాటి అందాల నిమ్మి అస్తమయం

అలనాటి అందాల బాలీవుడ్ నటి నిమ్మి బుధవారం రాత్రి అస్తమించింది. ఆమెకు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా నిమ్మి అనారోగ్యంతో బాధపడుతూవుంది. ఫిబ్రవరి 18న ఆమె తన 87వ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డవున్ ప్రకటించడంతో నిమ్మి అంత్యక్రియలు యెలా నిర్వహించాలో బోధపడటంలేదని ఆమె మరిది ఇజహర్ హుసేన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరచారు. బహుశా రేపు ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశముంది. నిమ్మి అసలు పేరు నవాబ్ బానూ. దర్శక నిర్మాత మెహబూబ్ ఖాన్ నిర్మిస్తున్న ‘అందాజ్’ చిత్ర షూటింగ్ చూసేందుకు మెహబూబ్ ఖాన్ స్టూడియోకి వెళ్లినప్పుడు నటుడు రాజకపూర్ దృష్టి ఆమె మీద పడింది. వెంటనే స్క్రీన్ టెస్ట్ చేయించి ‘బర్సాత్’ సినిమాలో నటించే అవకాశాన్ని కలిపించారు. అదే ఆమె నటించిన తొలి చిత్రం. నవాబ్ బానూ పేరును ‘నిమ్మి’ గా మార్చింది కూడా రాజకపూరే. 1950 దశకంలో నిమ్మి ఆన్, మేరే మెహబూబ్, సజా, ఉరన్ ఖటోలా, భాయి భాయి, కుందన్, పూజా కె ఫూల్, ఆకాష్ దీప్, లవ్ అండ్ గాడ్ వంటి సినిమాలలో ముఖ్య భూమికలు పోషించింది. నిమ్మి నటించిన ‘ఆన్’ చిత్రం ప్రపంచ ప్రీమియర్ కు నోచుకున్న అతికొద్ది చిత్రాలలో ఒకటి కావడం విశేషం. ఈ ప్రీమియర్ లండన్ లో జరిగినప్పుడు నిమ్మి కూడా అందులో పాల్గొంది. రాజకపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి మేటి నటుల సరసన హీరోయిన్ గా నటించిన ఈ అందాల నిమ్మి నర్గీస్, మధుబాల, గీతాబాలి, సురయ్యా, మీనాకుమారి లతో సఖ్యతగా వుండేది. ప్రముఖ సినీ రచయిత సయ్యద్ ఆలీ రజా ను ఆమె వివాహమాడింది. రజా 2007 లో కాలంచేశాడు. నిమ్మి దంపతులకు పిల్లలు లేరు. ఈనాడు నిమ్మి మరణానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తోంది.


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.