సల్మాన్‌...అక్షయ్‌... విన్‌ డీసిల్‌ యుద్ధం!

ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అందులో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ‘రాధే’తో పాటు అక్షయ్‌ కుమార్‌ హీరోగా వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’లు పోటీపడి మరీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది వేసవిలో వెండితెరపై యుద్దం చేయడానికి సిద్ధమైపోయాయి. ఇప్పటికే ఈ సినిమాలకి సంబంధించిన విడుదల తేదీలు కూడా ఖరారు చేశారు. వీటితో పాటు హాలీవుడ్‌కి చెందిన యాక్షన్‌ నేపథ్యంలో వస్తున్న ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌9’ చిత్రం కూడా పోటీకి వస్తోంది. ఈ మూడు చిత్రాలు మే 22, 2020న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 2015లో పాల్‌ వాకర్, విన్‌ డిసెల్‌ కలిసి నటించిన ‘ఫ్యూరియస్‌ 7’ ఇండియాలో దాదాపు 110 కోట్ల రూపాయలపైనే వసూళ్లు చేసింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు సీక్వెల్‌గా వసున్న ‘ఫ్యూరియస్‌ 9’ చిత్రాన్ని విడుదల చేయడానికి సుముఖత చూపుతున్నారు. ఇక సల్మాన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధే:ది మోస్ట్‌ వాంటెడ్‌ భాయి’ సినిమా కొరియన్‌కి చెందిన ‘అవుట్లాస్‌’ చిత్రానికి రీమేక్‌ చిత్రం. ఇక అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రం రాఘవ లారెన్స్‌ నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌ సినిమా. ఈ చిత్రం తమిళ, తెలుగులోనూ మంచి వసూళ్లే రాబట్టింది. మొత్తం మీద వివిధ భాషల్లో రీమేక్‌ చిత్రాలుగా వచ్చిన ఈ మూడు చిత్రాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో తెలియాలంటే కొన్నాళ్లు పాటు వేచి చూడాల్సిందే!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.