మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ‘రామ్‌-లఖన్‌’

బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలు ఎన్నో వచ్చాయి. వాటిల్లో ఒకటి ‘రామ్‌-లఖన్‌’. సుభాష్‌ ఘయ్‌ దర్శకత్వంలో జాకీ ష్రాఫ్, అనిల్‌ కపూర్, డింపుల్‌ కపాడియా, మాధరీ దీక్షిత్‌ నాయకానాయికలుగా నటించారు. పగప్రతీకార నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకులుగా అమ్రీష్‌ పురి, పరేష్‌ రావల్‌లు నటించారు. చిత్ర కథేంటంటే శారద (రాఖి) టాకూర్‌ ప్రతాప్‌ సింగ్‌ (దలీప్‌ తహిల్‌) పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. వీరికి రామ్‌ (జాకీ ష్రాఫ్‌) లఖన్‌ (అనిల్‌ కపూర్‌) ఇద్దరు కుమారులు ఉంటారు. అయితే ప్రతాప్‌ సింగ్‌ మేనళ్లులైన అమ్రీష్‌ పురి, పరేష్‌ రావల్‌ చిన్నగా ఇంటిలో చేరి ప్రతాప్‌ సింగ్‌ని మద్యానికి, జూదానికి బానిసను చేస్తారు. ఆ తరువాత ఆస్తి మొత్తం వాళ్ల పేరుమీద రాయించుకొంటారు. దాంతో ప్రతాప్‌ సింగ్‌ కుటుంబం బజారున పడుతుంది. తరవాత అమ్రీష్‌ పురి, పరేష్‌లు కలిసి ప్రతాప్‌ను చంపేస్తారు. ఇవన్నీ చూసిన శారద వారికి దూరంగా పోయి కొడుకులైన రామ్‌-లక్ష్మణ్‌లను పెంచి పెద్దచేస్తుంది. ఆ తరువాత ఇద్దరు అన్నదమ్ములు తమకుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తీర్చుకున్నారా లేదా అనేది మిగిలిన కథ. స్నేహా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి లక్ష్మికాంత్‌ - ప్యారేలాల్‌లు సంగీతం అందించారు. చిత్రంలోని ‘‘మై నేమ్‌ ఈజ్‌ లఖన్‌’’, ‘‘తేరా నామ్‌ లియా’’, ‘‘మెయిన్‌ హూన్‌ హీరో’’లాంటి పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ చిత్రం 1990లో జరిగిన 35వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్సుల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సరిగ్గా ముఫ్పైఒక్క సంవత్సరాల కిత్రం (జనవరి 27, 1989)న విడుదలై బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.