వదంతుల శాఖ మంత్రి కరీనా... ప్రసార శాఖ మంత్రి రణ్‌బీర్‌!

‘నేనే కనుక ప్రధాని అయితే కరీనా కపూర్‌ను వదంతుల శాఖ మంత్రిగా నియమిస్తాను. ఆ వదంతులను ప్రచారం చేసే రణ్‌బీర్‌ కపూర్‌ను ప్రసార శాఖ మంత్రిగా ఎంపిక చేస్తాన’’న్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌. ఓ టీవీ ఛానెల్‌ టాక్‌ షోకు హాజరైన కరణ్‌ను ‘మీరే ప్రధాని అయితే ఏం చేస్తార’ని అడగగా ఇలా సరదాగా జవాబిచ్చారు. అంతేకాదు.. దాని వెనుక ఉన్న కారణాలనూ ఆయన వెల్లడించారు. ‘‘కరీనా వదంతులంటే చెవి కోసుకుంటుంది. పొద్దున లేవగానే తన సహాయక బృందానికి ఫోన్‌ చేసి ఆరోజు వారికి తెలిసిన కొత్త విషయాలేంటో అడుగుతుంది. మళ్లీ నాకు ఫోన్‌ చేసి అవి నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుంటుంది. అందుకే ఆమెకు వదంతుల శాఖ బాధ్యతలు ఇస్తాను. కరీనా తాను విన్న వదంతులన్నీ తన సోదరుడు రణ్‌బీర్‌కు చేరవేస్తుంది. ఇంకేముంది.. వాటిని రణ్‌బీర్‌ వైరల్‌ చేసేస్తాడు. రెండ్రోజుల్లోనే వాటిని దినపత్రికల్లో వార్తలుగా కూడా వేయిస్తాడ’’ని నవ్వుతూ చెప్పారు కరణ్‌. వీరితో పాటు అక్షయ్‌ కుమార్‌కు ఆరోగ్య శాఖ, వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌లకు సామాజిక మాధ్యమాల శాఖ, సోనమ్‌ కపూర్‌కు ఫ్యాషన్‌ శాఖ కేటాయిస్తానని తెలిపారు. అయితే ‘మీకు మీరు ఏ పదవి ఇచ్చుకుంటార’ని అడిగితే హౌస్‌ పార్టీ శాఖ అని బదులిచ్చారు కరణ్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.