కరోనా విరామం... కళలతో సావాసం

కరోనా వల్ల వచ్చిన విరామాన్ని తారలు చక్కగా వాడుకుంటున్నారు. తమలోని సృజనాత్మకతను వెలికితీసే పనిలో కొందరు ఉంటే మరికొందరు కుటుంబ సభ్యులతో కలసి ఆటలు ఆడేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూనే, కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండమంటూ సూచిస్తున్నారు..
   

       

*సల్మాన్‌ ఖాన్‌లో ఓ మంచి చిత్రకారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కళను మరోసారి ప్రదర్శించారాయన. కరోనా వల్ల సల్మాన్‌ నటిస్తున్న ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ చిత్రీకరణ రద్దైంది. దీంతో ఇంటికే పరిమితమైన ఆయన ఓ చక్కటి చిత్రం గీశారు. బొగ్గును ఉపయోగించి చిత్రించిన ఈ బొమ్మలో ఓ మహిళ, ఓ పురుషుడు తమ ముఖాలను వస్త్రంతో పాక్షికంగా కప్పుకున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా మాస్కులను ఉపయోగిస్తున్న పరిస్థితికి ఈ చిత్రం అద్దంపడుతున్నట్లు ఉంది. ఈ బొమ్మ గీస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సల్మాన్‌. 

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) on

* కథానాయిక కత్రినా కైఫ్‌ స్వీయ నిర్బంధంలో ఉంది. కానీ ఖాళీగా మాత్రం లేదు. గిటార్‌ పట్టి రాగాలు పలికించే ప్రయత్నంలో ఉంది. గిటార్‌ వాయించడాన్ని ఆమె సాధన చేస్తోంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే ఆ వీడియోలో సౌండ్‌ లేదు. ‘‘సాధన జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో రాగాలు వినిపిస్తాను’’ అని పోస్ట్‌ చేసింది కత్రినా.

* ఆలియా భట్‌ తన సోదరి షహీన్‌తో కలసి క్యాటన్‌ అనే బోర్డ్‌ గేమ్‌ ఆడుతోంది. వ్యూహాలకు పదును పెడుతూ పాయింట్లను గెలవాల్సిన ఆట ఇది. ఆలియా ఆడుతున్న ఫొటోను షహీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘‘క్యాటన్‌ గేమ్‌లోనే కాదు.. జీవితంలోనూ గెలుస్తూనే ఉంది’’ అని పోస్ట్‌ చేసింది.

* యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాకు కవితలు రాయడం సరదా. కరోనా కల్లోలంతో ఉపాధి కోల్పోయిన పేదల గురించి కవితలు రాస్తూ ఆన్‌లైన్‌లో పంచుకుంటున్నారు. ‘ఇప్పుడు ధనవంతులకు ప్రతిరోజూ ఆదివారమైంది. కానీ పేదవాడు సోమవారం ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తున్నాడు. ధనవంతుడు కుటుంబంతో కలిసి కులాసాగా గడుపుతున్నాడు. పేదవాడు ఇంకెప్పుడు పని దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు’ అని ఆయన రాసిన కవిత ఆలోచింపజేస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.