వాళ్లు 2 స్టార్లిచ్చారు.. ప్రేక్షకులు రూ.200 కోట్లిచ్చారు!


‘‘తంలో తెలుగులో ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలైనప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ, ‘కబీర్‌ సింగ్‌’పై వస్తున్న విమర్శలు మరింత పిచ్చిగా, దారుణంగా ఉన్నాయంటు’’న్నారు దర్శకుడు సందీప్‌ వంగా. ఆయన తాజాగా తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి బాలీవుడ్‌ ప్రేక్షకుల మదినీ గెలుచుకున్నారు. తెలుగులో విజయ్‌ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్‌ పోషించగా.. షాలినీ పాండే పాత్రను కియారా అడ్వాణీ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు అందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంపై పలువురు విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన సినిమాపై విమర్శకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూ ద్వారా తనదైన శైలిలో సమాధానమిచ్చారు సందీప్‌. ‘‘ఈ చిత్రంలో 24 క్రాఫ్ట్స్‌ ఉంటే.. విమర్శకులంతా కలిసి ఒక దర్శకుడిపైనే దృష్టి పెట్టారు. మా సినిమాను విమర్శించిన వారిలో ఒక్కరు కూడా.. ఇందులోని ఫొటోగ్రఫీ ఎలా ఉంది, కలర్‌ థీమ్‌ ఏ విధంగా ఉంది, బ్యాగ్రౌండ్‌ స్కోర్, సౌండ్‌ డిజైన్‌ వంటివి ఎలా ఉన్నాయన్న అంశాలపైనే మాట్లాడలేదు. ముందు అవి ఎలా ఉన్నాయో ప్రేక్షకులకు చెప్పాలి కదా. ఇలాంటి విమర్శకుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం చాలా నష్టం జరుగుతుంది. కొందరు మా చిత్రానికి రెండు స్టార్లు ఇచ్చారు. కానీ, ప్రేక్షకులు మాత్రం మాకు రూ.200 కోట్లు ఇచ్చారు. ‘అర్జున్‌ రెడ్డి’ విషయంలో విమర్శలు వచ్చినా.. వారంతా టేకింగ్‌ తదితర అంశాలపైనా మాట్లాడారు. ఏదేమైనా మా చిత్రం విజయం సాధించడం పట్ల విమర్శకులు సంతోషంగా లేరని అర్థమైంది’’ అన్నారు సందీప్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.