సంజయ్‌కు ఆస్తి రాసిచ్చిన అభిమాని
article image
సినీ తారల వీరాభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడానికి కొన్నిసార్లు విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. అభిమాన తారల పేర్లను టాటూ వేయించుకోవడం దగ్గర్నుంచి వారికి గుడి కట్టడం వరకూ అలాంటివెన్నో వినే ఉంటారు. అయితే బాలీవుడ్‌ కథానాయకుడు సంజయ్‌ దత్‌ను ఆరాధించే ఓ మహిళాభిమాని చేసిన పని మాత్రం ఆయనతో పాటు అందరూ విస్తుపోయేలా చేసింది. తన పేరిట ఉన్న ఆస్తినంతా తన అభిమాన కథానాయకుడికి చెందేలా వీలునామా రాసింది. ముంబయికి చెందిన నిషి త్రిపాఠి అనే మహిళకు సంజయ్‌దత్‌ అంటే ఎనలేని అభిమానం. 62 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో గత జనవరి 29న కన్నుమూసింది. అయితే ఆ తర్వాతి రోజే ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆమె ఖాతాలో ఉన్న నగదుతో పాటు లాకర్‌లో ఉన్న విలువైన వస్తువులు సంజయ్‌ దత్‌కు దక్కేలా మరణించడానికి కొన్ని నెలల క్రితమే వీలునామా రాసినట్లు తేలింది. ‘‘ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న సంజయ్‌ షాక్‌కు గురయ్యారు. తనపై ఆమెకున్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఆస్తిని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆమె కుటుంబ సభ్యులకే ఆ ఆస్తి చెందేలా చేయడానికి సహకారం అందిస్తున్నార’’ని సంజయ్‌ వ్యక్తిగత న్యాయవాది సుభాష్‌ జాదవ్‌ వెల్లడించారు. ఈ విషయం విన్నవారంతా ఓ నటుడిపై మరీ ఇంత అభిమానముంటుందా అని నివ్వెరపోతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.