ఫిలిమ్‌ అండ్‌ టెలివిజన్‌ సోసైటీ అధ్యక్షుడిగా దర్శకుడు శేఖర్‌ కపూర్‌


ప్రముఖ దర్శక నటుడు, నిర్మాత అయిన శేఖర్‌ కపూర్‌ ఎఫ్‌టీఐఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిలిమ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీకి అధ్యక్షుడిగా బండీట్‌ క్వీన్‌ చిత్ర దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఎన్నికైనట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా జవదేకర్‌ స్పందిస్తూ..అంతర్జాతీయంగా సినీమాల్లో సుపరిచితుడైన శేఖర్‌ కపూర్‌ను ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా. అంతేకాదు ఆయన అపారమైన అనుభవం ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. శేఖర్‌ కపూర్‌ అధ్యక్ష నియామకాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని నమ్ముతున్నానని..పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్‌ కపూర్‌ పదవీ కాలం 2023 మార్చి 3 వరకు ఎఫ్‌టీఐఐ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. శేఖర్‌ కపూర్‌ మసూమ్‌, మిస్టర్‌ ఇండియా చిత్రాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలైన ఎలిజబెత్‌, ది ఫోర్‌ ఫీచర్స్, ఎలిజబెత్‌: ది గోల్డన్‌ ఏజ్‌, న్యూయార్కు ఐ లవ్‌ యు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కమల్‌ హాసన్‌ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రంలో రా ఏజెంట్‌ జగన్నాథ్‌ అనే పాత్రలో నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.