రేఖ కాదన్నారు.. శ్రీదేవి స్టార్‌ అయ్యారు
article image
ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘ఆఖ్రీ రాస్తా’. 1986లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రకు అలనాటి నటి రేఖ డబ్బింగ్‌ చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి, రేఖ వ్యక్తిగతంగా మంచి స్నేహితులయ్యారు. అయితే శ్రీదేవి స్టార్‌డమ్‌లో రేఖ పాత్ర ఉందని కొంత మందికే తెలుసు. రేఖ నటించలేనని చెప్పిన ‘హిమ్మత్‌వాలా’ సినిమా ద్వారా శ్రీదేవి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా బ్రేక్‌ తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీదేవికి బాలీవుడ్‌లో వరస అవకాశాలు వరించాయి. తిరుగులేని స్టార్‌గా, ‘చాందిని’గా తనదైన మార్క్‌ వేశారు.
సీనియర్‌ నటుడు జితేంద్ర.. శ్రీదేవితో కలిసి 18 సినిమాల్లో, రేఖతో కలిసి 30 సినిమాల్లో నటించారు. ఆయన ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీదేవికి స్టార్‌డమ్‌ తెచ్చిన ‘హిమ్మత్‌వాలా’కు తొలి ఎంపిక‌ రేఖ అని తెలిపారు. ‘ఈ సినిమా ద్వారా కొత్త నటిని పరిచయం చేయాలి అనుకున్నాం. తర్వాత జరిగింది ఓ చరిత్ర అయ్యింది (శ్రీదేవి బాలీవుడ్‌ ఎంట్రీ గురించి). చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను, నటుడు రాజేశ్‌ ఖన్నా కాలేజీ స్నేహితులం. కలిసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాం. ‘రాజ్‌’ సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ డేట్స్‌ కుదరక చేయలేదు. ఆ చిత్ర నిర్మాత జి.పి. సిప్పిని రాజేశ్‌ ఖన్నా దగ్గరకు పంపా. ఆ తర్వాత అది కూడా మరో చరిత్ర అయ్యింది’ అని అన్నారు.
శ్రీదేవి గురించి రేఖ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘శ్రీదేవి అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. హిందీ సినిమాలో వైజయంతిమాల, హేమమాలిని తర్వాత మూడో తమిళ సూపర్‌స్టార్‌ శ్రీదేవి. నా పరంగా ఓ నటిగా నేను వీరి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు అనుకుంటుంటా. నా కన్నా శ్రీదేవి గొప్ప నృత్యకారిణి. నేను నృత్యం చేస్తున్నట్లు మేనేజ్‌ చేస్తుంటా’ అని పేర్కొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.