నెట్టింట వైరల్‌గా.. సుహానా ఖాన్‌ లఘుచిత్రం

షారుఖ్‌ ఖాన్‌ ముద్దుల తనయ సుహానా ఖాన్‌ త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టబోతుంది. దీనికి తగ్గట్లుగానే ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీలో నటనలో ఓనమాలు దిద్దుకుంటోంది. ఓవైపు నటనపై దృష్టి పెడుతూనే ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా కుర్రకారుకు దగ్గరవుతోన్న ఈ చిన్నది... ఇప్పుడు ప్రేమలో పడిందట. అంతేకాదు త్వరలోనే తన బాయ్‌ ఫ్రెండ్‌ను తల్లిదండ్రులకు పరిచయం చెయ్యాలని చూస్తోందట. మరి ఈ మాట వింటే నాన్న ఏమంటారో ఏమో అని తెగ కంగారు పడిపోతుందట. ప్రస్తుతానికైతే ఈ అమ్మడు తన ప్రియుడిని తీసుకోని కారులో ఇంటికి బయలు దేరిందట. ఏంటి అమెరికా నుంచి కారులో ఇంటికొస్తుందా? అవును వస్తోంది. అందుకే ఈ ప్రయాణానికి రెండు రోజుల సమయం పట్టబోతుంది. మరి ఈ రెండు రోజుల ప్రేమ ప్రయాణం చివరికి ఏ కంచికి చేరుతుంది? సుహానా రిలేషన్‌ తెలిసి తన తండ్రి ఏమంటారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ షార్ట్‌ ఫిలిం చూసేయండి. ఇప్పటిదాకా చెప్పిన కథలో సుహానా నటనలో శిక్షణ తీసుకుంటుందన్న మాట వరకే నిజం.. మిగతా ప్రేమ ప్రయాణమంతా ఆమె చేసిన షార్ట్‌ ఫిలిం కథ. ‘ది గ్రే పార్ట్‌ ఆఫ్‌ బ్లూ’ పేరుతో రూపొందిన ఈ లఘు చిత్రం తాజాగా విడుదలైంది. 10 నిమిషాలే నిడివి ఉన్న ఈ వీడియోలో.. సుహానా తన కళ్లతో పలికించిన హావభావాలు, ఆమె అభినయం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వీడియోను 4లక్షల మందికి పైగా వీక్షించగా.. 4వేల మందికి పైగా లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ షార్ట్‌ ఫిలిం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎలాగు సుహానా తెరపై మెరవడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి.. ఈలోపు ఈ లఘు చిత్రం చూసి ఆనందించేయండి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.