మధ్యలోనే ఆటను ఆపేసిన సుశాంత్‌


మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే... అది ప్రాణమే  ‘ఛిఛోరే’ చిత్రంలో సుశాంత్‌ పలికే డైలాగ్‌.

చదువుల ఒత్తిడి భరించలేక... ర్యాంకు సాధించలేదనే నిరాశలో కొడుకు ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఆసుపత్రిలో కుమారుడి పక్కన కూర్చొని సుశాంత్‌ పాత్ర ఆ మాటలంటుంది. మరి ఇవే మాటలను తన జీవితానికి ఎందుకు అన్వయించుకోలేకపోయాడో? అనేది అభిమానులకు, చిత్ర పరిశ్రమకు సమాధానం తెలియని ప్రశ్న.

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌... అనగానే ‘ఎం.ఎస్‌.ధోని’ చిత్రం గుర్తొస్తుందరికీ! నిజమైన ధోనీని మరిపించేంతగా సుశాంత్‌ ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ హెలికాప్టర్‌ షాట్‌.. అచ్చం అలాగే కొట్టాడు. భుజాలపై జెర్సీని అలాగే పైకి ఎగేశాడు. వ్యక్తిగత జీవితంలోనూ ధోని ఎలా ఉంటాడో... దాన్ని అనుకరించాడు. కాదు.. కాదు... జీవించాడు. ‘ఎమ్‌.ఎస్‌.ధోని - ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లపాటు సుశాంత్‌ సింగ్‌లోనూ ధోనిని చూసుకున్నారు ప్రేక్షకులు. అయితే జీవితం అనే ఆటలో సుశాంత్‌ మధ్యలోనే ఇన్నింగ్స్‌ ముగించాడు.

బుల్లితెరతో అడుగులు

బాలీవుడ్‌లో ఎలాంటి అండదండలు లేకుండా ఎదిగిన యువ సంచలనం సుశాంత్‌. ఏఐఈఈఈలో 7వ ర్యాంక్‌ సాధించిన ఆయన దిల్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాదిలో చదువు వదిలిపెట్టి, సినిమా కోసం ముంబై చేరుకున్నాడు. డ్యాన్సర్‌ అయిన సుశాంత్‌ మొదట బుల్లితెరపై మెరిశాడు. అంచలంచలుగా ఎదిగి బాలీవుడ్‌లో కీలక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌’, ‘పవిత్ర రిశ్తా’ షోలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ‘నెస్లే మంచ్‌’ యాడ్‌లోనూ నటించాడు.

దూసుకెళ్లిన కెరీర్‌

2013లో ‘కై పో చె’తో కథానాయకుడిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత సుశాంత్‌ వెనుదిరిగి చూసుకోలేదు. ‘శుద్ధ్‌ దేసీ రొమాన్స్‌’, ‘పీకే’ చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపునిచ్చాయి. 2016లో వచ్చిన ‘ఎమ్‌.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరి’తో ఆయన కెరీర్‌కి మరో పెద్ద మలుపు. ‘రాబ్తా’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోన్‌చిడియా’, ‘ఛిఛోరే’, డ్రైవ్‌’... ఇలా వరుస సినిమాలతో కెరీర్‌లో ఒకొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయికి ఎదిగాడు. చివరిగా ముఖేష్‌ చాబ్రా దర్శకత్వంలో ‘దిల్‌ బేచారా’ చిత్రంలో నటించారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ చిత్ర విడుదల ఆగిపోయింది.

కుంగుబాటే ఉసురు తీసిందా?

సుశాంత్‌ విజయవంతంగా కెరీర్‌ కొనసాగిస్తున్నప్పటికీ... కొన్ని నెలలుగా మానసిక కుంగుబాటు సమస్యతో సతమతమవుతున్నట్టు సమాచారం. చివరికి ఆ ఒత్తిడే ఆయన జీవితం అర్ధంతరంగా ఆగిపోవడానికి కారణమై ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం ముంబైలో తను ఉంటున్న ఇంటిలోనే సుశాంత్‌ ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు. ఎంతో భవిష్యత్తున్న నటుడి మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలన్నీ విషాదంలో మునిగిపోయాయి. వారం కిందటే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశ సలియాన్‌ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వారంలోనే ఆయన తనువు చాలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమ్మను తలుచుకుంటూ...

1986లో పట్నాలో జన్మించిన సుశాంత్‌ 2002లో తన కన్నతల్లిని కోల్పోయారు. తల్లిని గుర్తు చేసుకుంటూ తరచూ కవితలు రాసేవారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చివరిగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘మసకబారిన నా గతం కన్నీటి ధారల మధ్య ఆవిరైపోతున్నది. అంతులేని నా కలలు, అగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వుని కుచించుకుపోయేలా చేస్తోంది...’ అంటూ తన తల్లి, తన ఫొటోల్ని కలిపి వారం క్రితం పోస్ట్‌ చేశారు.


View this post on Instagram

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on


ప్రముఖుల సంతాపం

సుశాంత్‌ మరణం పట్ల చాలా మంది ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బాలీవుడ్‌ సినీ తారలు, క్రికెటర్లు, టాలీవుడ్‌ ప్రముఖులు మహేష్‌బాబు, వెంకటేష్, రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌లు, అల్లు అర్జున్‌ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.