‘ఉరీ’ ఖాతాలో మరో రికార్డు..
                               

ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’ సృష్టిస్తున్న సంచలనం మామూలుది కాదు. పెద్ద అంచనాలు లేకుండా ఓ సాధారణ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అసాధారణ విజయాన్ని అందుకోని భారీ వసూళ్లు దక్కించుకుంటూ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే 23వ రోజు (రూ.6.53 కోట్లు), 24వ రోజు (రూ.8.71) కోట్ల కలెక్షన్లు రాబట్టి ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం నాటికి రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. 2019లో రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో పలువురు సినీప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంతో బ్రేకింగ్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న విక్కీ కౌశల్‌.. ఇప్పుడు ఉత్తరాదితో పాటు దక్షిణాది సినీప్రియుల దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని రాబోయే కొత్త ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ యువ హీరో ప్రస్తుతం కరణ్‌ జోహార్ తెరకెక్కించబోతున్న భారీ చారిత్రక గాథ ‘తక్త్‌’లో ఓ కీలక పాత్రను దక్కించుకున్నాడు. విక్కీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఉరీ’ చిత్రాన్ని రోన్నీస్క్రూవాలా నిర్మించగా.. దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. 2016లో పాక్‌ మిలిటెంట్లపై భారత్‌ సైన్యం జరిపిన మెరుపు దాడుల నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.