ఆర్కిటిక్‌ ఖండంలో.. అరుదైన ఓడపై ఫైట్‌!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘వార్‌’. బాలీవుడ్‌ కండల వీరులు హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ పోటాపోటీ పాత్రల్లో నటిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రమిది. వాణీ కపూర్‌ కథానాయిక. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందించేలా ఏడు దేశాల్లోని 15 నగరాల్లో విభిన్నమైన లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే విడుదల చేసిన ‘ఘుంగ్రూ..’ అనే బీచ్‌ పార్టీ గీతంలో ఇటలీలోని అమల్ఫీ తీర అందాల్ని చూపించారు. అక్కడ తెరకెక్కించిన తొలి బాలీవుడ్‌ చిత్రమిదే కావడం గమనార్హం. కాగా హృతిక్, టైగర్‌ మధ్య వచ్చే ఓ భారీ పోరాట సన్నివేశాన్ని కూడా తెరపై ఇదివరకెన్నడూ చూడని లొకేషన్‌లో తెరకెక్కించారట. అతి శీతల ప్రదేశమైన ఆర్కిటిక్‌ ఖండంలో పేరుకుపోయిన మంచుగడ్డలను పగలకొట్టుకుంటూ ప్రయాణించే ఓ భారీ కార్గో ఓడపై ఈ సీన్‌ను తీసినట్లు దర్శకుడు తెలిపారు. 300 అడుగులు పొడవుండే ఈ ఓడ ఓ ప్రత్యేక విధానంలో పైకి కిందకు కదులుతూ పది అడుగుల లోతుండే మంచు గడ్డలను బద్దలుకొడుతూ ప్రయాణిస్తుంటే, దాని మీద నిలబడి హృతిక్, టైగర్‌ ఫైట్‌ చేస్తారట. అక్కడ షూటింగ్‌ అనుమతుల కోసం ఐదు నెలలు వేచి చూడాల్సి వచ్చిందని, ఈ నన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయమని దర్శకుడు చెప్పారు. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలవుతోంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.