హృదయాలను దోచుకున్న హంగల్‌!
‘షోలే’ సినిమాలో వృద్ధుడు, అంధుడైన రహీమ్(ఇమామ్‌) చాచా కొడుకు అహ్మద్‌ను బందిపోటు గబ్బర్‌ సింగ్‌ చంపి గుర్రం మీద రామ్‌ నగర్‌కు పంపిస్తాడు. ఇమామ్‌కు ఆ వార్త చెప్పేందుకు గ్రామస్తులు సంశయిస్తూ వుండగా, ‘ఇత్నా సన్నాటా క్యో హై భాయీ’ అని అడుగుతాడు ఇమామ్‌. ఆ నిశ్శబ్దాన్ని గమనించి వెంటనే అర్ధం చేసుకుంటాడు తన కుమారుణ్ణి బందిపోటు చంపేశాడని. ‘ఏక్‌ ముసీబత్‌ కా బోఝ్‌ నహీ ఉతా సక్తే? భాయీ మై తో ఏక్‌ హీ బాత్‌ జానతా హూ ఇజ్జత్‌ కీ మౌత్‌ జిల్లత్‌ కి జిందగీ సే కహీ అచ్చీ హై. మైనే ఫిర్‌ భి ఏహి చాహూంగా కి యే దోనోం ఇసీ గావ్‌ మే రహే. మేరి నమాజ్‌ కా వఖ్త్‌ హోగయా హై. ఆజ్‌ పూఛూంగా ఖుదా సే, ముఝే దో చార్‌ బేటా అవుర్‌ క్యో నహీ దియే... ఇస్‌ గావోం పర్‌ షహీద్‌ హోనే కే లియే’ అంటూ కేవలం స్పర్శతోనే ఆ నిశ్శబ్ద పరిస్థితిని అంచనా వేయగలిగిన ఆ వృద్ధ ఇమామ్‌ చాచా పలికే సంభాషణలు హృదయాన్ని కదిలించి వేశాయి ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని. అతి చిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఆ వృద్ధ ఇమామే ప్రసిద్ధ బాలీవుడ్‌ క్యారక్టర్‌ నటుడు ఏ.కే.హంగల్‌. ఎంతో కాలంగా బాలీవుడ్‌ చిత్రరంగంలో అనేక పాత్రలు పోషించినా హిందీ భాషేతర ప్రేక్షకులకు హంగల్‌ అంటే ఎవరో తెలిసింది ఈ సినిమాతోనే... ఈ ఒక్క డైలాగుతోనే. సూపర్‌ స్టార్‌ రాజేష్‌ ఖన్నా నటించిన 16 సినిమాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు పోషించి 1966-2005 వరకు 225 సినిమాల్లో నటించించారు. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ క్యారక్టర్‌ నటున్ని గురించి సితార డిజిటల్‌ పాఠకులకు కొన్ని విశేషాలు....


పదిహేనేళ్లపాటు రంగస్థల నటుడుగా...
హంగల్‌ పూర్తి పేరు అవతార్‌ కిషన్‌ హంగల్‌. పంజాబ్‌ రాష్ట్రంలోని సయిల్‌ కోటలో ఫిబ్రవరి 1, 1917న సనాతన కాశ్మీరీ పండిట్‌ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు పండిట్‌ హరికిషన్‌ హంగల్, రజియా హుండూ. అయితే హంగల్‌ బాల్యమంతా పెషావర్‌లో గడిచింది. తొలుత హంగల్‌ దర్జీ పని చేసేవారు. తరువాత రంగస్థల నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. 1929 నుంచి 1947 వరకు సుదీర్ఘకాలం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో హంగల్‌ చురుకైన పాత్ర పోషించి స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తింపు పొందారు. పెషావర్‌లో వున్నప్పుడు రంగస్థల నటుడిగా అనేక నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు. తండ్రి పదవీ విరమణ చేశాక 1946లో పెషావర్‌ నుంచి కరాచీకి మకాం మార్చారు. స్వాతంత్ర్య సముపార్జన జరిగి భారత్, పాకిస్తాన్‌ విడిపోయాక కమ్యూనిస్టు అని ముద్రపడడంతో హంగల్‌కు జైలు శిక్ష విధించారు. అలా మూడు సంవత్సరాల కారాగారవాసం అనుభవించారు. 1949లో స్వాతంత్ర సమరయోధునిగా జైలు నుంచి విడుదలై పాకిస్తాన్‌ను వీడి బొంబాయికి వచ్చేశారు. బొంబాయిలో ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ (IPTA) లో సభ్యునిగా చేరి బల్రాజ్‌ సాహ్ని, ఖైఫీ ఆజ్మిలతో కలిసి నాటకాలు ప్రదర్శించారు. సినిమాల వైపు చూడకుండా కేవలం రంగస్థలాన్నే నమ్ముకొని 1949నుంచి 1965 వరకు స్టేజి నటుడుగానే కాలం గడిపారు.


యాభై ఏళ్లకు సినిమా నటుడిగా...
హంగల్‌ హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం అతని 52వ ఏట జరగడం విచిత్రమనిపిస్తుంది. 1966లో గేయ రచయిత శైలేంద్ర, బాసు భట్టాచార్య దర్శకత్వంలో నిర్మించిన ‘తీస్రీ కసమ్’లో తొలిసారి రాజకపూర్‌ సోదరుని పాత్ర పోషించారు. తరవాత సుబోద్‌ ముఖర్జీ నిర్మించిన ‘షాగిర్ద్‌’ చిత్రంలో సహాయ పాత్ర పోషించారు. ముఖ్యంగా ఒక తండ్రి, తాత, మామ పాత్రలను హంగల్‌ పోషించారు. చేతన్‌ ఆనంద్‌ నిర్మించిన ‘హీరా రాంఝా’, హృషికేష్‌ ముఖర్జీ చిత్రం ‘నమక్‌ హరామ్’, బాసు చటర్జీ నిర్మించిన ‘షౌకీన్‌’ సినిమాల్లో హంగల్‌కు లభించిన పాత్రలు అతని నటనా కౌశలాన్ని ప్రతిబింబింపజేశాయి. ఇక సిప్పీ నిర్మించిన ‘షోలే’ చిత్రంలోని చిన్న పాత్రను ఎంతబాగా ఎస్టాబ్లిష్‌ చేసి ఆ సినిమాలోని అగ్రతారలతో సమానంగా గుర్తింపు తెచ్చుకోవడం చెప్పుకున్నంత సులభం కాదు. ఇమామ్‌ చాచా పాత్ర హంగల్‌ నటనకు పరాకాష్ట. హంగల్‌ అద్వితీయ నటన ప్రదర్శించిన చిత్రాలు. ‘ఆయినా’, ‘అవతార్‌’, ‘అర్జున్‌’, ‘ఆంధి’, ‘తపస్య’, ‘కోరా కాగజ్‌’, ‘బావార్చి’, ‘చుప్పా రుస్తుమ్’, ‘చిత్‌ చోర్‌’, ‘గుడ్డి’ మొదలైనవి. ముందు చెప్పుకున్నట్లు రాజేష్‌ ఖన్నా నటించిన ‘ఆప్‌ కి కసమ్’, ‘అమర్‌ దీప్‌’, ‘తోడిసి బేవఫా’, ‘ఫిర్‌ వోహి రాత్‌’, ‘ఖుద్రత్‌’ వంటి పదహారు సినిమాల్లో హంగల్‌ పోషించిన సహాయక పాత్రలు అన్నీ ఆణిముత్యాలే. ‘తేరే మేరె సప్నే’, ‘లగాన్‌’ చిత్రాలు హంగల్‌కు వ్యక్తిగతంగా బాగా నచ్చిన చిత్రాలు. అయితే ‘మంజిల్‌’, ‘ప్రేమ్‌ బంధû’Â వంటి సినిమాల్లో నెగటివ్‌ పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడు కాస్త అయిష్టంగానే నటించారు. నటుడన్నవాడు ఎలాంటి పాత్రలనైనా పోషించేదుకు సిద్ధంగా వుండాలి అనే ప్రాధమిక సూత్రాన్ని నమ్మిన కళాకారుడు హంగల్‌. నేషనల్‌ ఫిలిం డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ వారు స్వంతంగా నిర్మించిన ‘దత్తక్‌’ అనే సినిమాలో హంగల్‌ నటించారు. ఈ చిత్రంలో ఇందర్‌ సేన్‌ పాత్రకోసం తొలుత మదన్‌ పురిని తీసుకుందామని దర్శకుడు గుల్‌ బహార్‌ సింగ్‌ యోచించినా, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దేవికా మిత్ర, హంగల్‌ అయితే ఆ పాత్రకు సార్ధకత చేకూరుతుందని చెప్పి, హంగల్‌ చేత పోషింపజేశారు. ఆ పాత్రలో హంగల్‌ జీవించి నటించారు. వంద సంవత్సరాల భారతీయ సినిమాను గుర్తు చేస్తూ 2012లో నిర్మించిన ‘మధుబాల- ఏక్‌ ఇష్క్‌ ఏక్‌ జునూన్‌’ అనే టెలివిజన్‌ సీరియల్లో హంగల్‌ చివరిసారి నటించారు. ‘కృష్ణ అవుర్‌ కంస్‌’ అనే సినిమాలో ఉగ్రసేన మహారాజు పాత్రకు గాత్రదానం చేశారు.


ఆర్ధిక ఇబ్బందులు...ఆరోగ్య సమస్యలు..
హంగల్‌ ఆరోగ్యపరంగా 2007 నుంచి బాగా డీలా పడ్డారు. అతని కుమారుడు విజయ్‌ హిందీ సినిమాలకు ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. కానీ అతని సంపాదన అతని కుటుంబానికే బొటాబొటీగా సరిపోయేది. అతడికీ 75 ఏళ్ల వయసు దాటడంతోబాటు అనారోగ్యం పాలయ్యాడు. హంగల్‌ ఆరోగ్య పరిస్థితి గమనించిన తోటి నటులు కొంత ఆర్ధిక సహాయాన్ని అందించారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా హంగల్‌ ఆసుపత్రి ఖర్చులను, మందుల ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చింది. సినిమాలలో నటించలేని పరిస్థితి హంగల్‌కు వచ్చింది. 2005లో అమోల్‌ పాలేకర్‌ చిత్రం ‘పహేలి’ హంగల్‌ నటించిన చివరి చిత్రంగా చెప్పవచ్చు. అతడు ఏడేళ్ల విరామం తరువాత పైన ఉదాహరించిన టెలివిజన్‌ సీరియల్లో నటించడం జరిగింది. నటీమణి ఆశాపరేఖ్‌ నిర్మించిన ఆసుపత్రిలో హంగల్‌ చేరారు. మూడురోజుల తరువాత ఆగస్టు 19, 2012న బాత్‌ రూములో జారిపడి వెన్నుపూసకు గాయాలవడంతో ఆపరేషన్‌ నిర్వహించారు. తరువాత శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఊపిరి తిత్తుల సమస్య అధికం కావడంతో ఆగస్టు 26న ప్రాణం విడిచారు.

మరిన్ని విశేషాలు...
* 2006లో భారత ప్రభుత్వం హంగల్‌కు ‘పద్మభూషణ్‌’ బిరుదు ప్రదానం చేసింది. శివసేన అధిపతి బాల్‌ థాకరే 1993 లో హంగల్‌ నటించిన సినిమాల మీద నిషేధం విధించాడు. అందుకు కారణం హంగల్‌ పాకిస్తాన్‌ జాతీయ దినవేడుకకు పాకిస్తాన్‌ రాయబార కార్యాలయంలో హాజరు కావడమే.
* విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర పోరాటంలో చురుగా పాల్గొన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ హింసా కాండను నిరసిస్తూ ‘నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌’లో చేరి సమ్మెలో పాల్గొన్నారు. బ్రిటీష్‌ పరిపాలనను వ్యతిరేకించి మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు.
* హంగల్‌ భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు సన్నిహిత బంధువు. నెహ్రూ భార్య కమలా నెహ్రూ హంగల్‌ తల్లికి మేనకోడలు. అయినా హంగల్‌ నివసించింది ఒంటరిగా శాంతా క్రూజ్‌లోని ఒకే పడకగది గల ఫ్లాట్‌లో. అతని గదినిండా మార్క్సిస్టు సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలు, నాటక పుస్తకాలు ఉండేవి.
హంగల్‌ కమ్యూనిస్టు సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా అనుసరించేవారు. బొంబాయి అల్లర్లు జరిగినప్పుడు శివసేన పోహించిన పాత్రను హంగల్‌ బహిరంగంగానే విమర్శించారు. హంగల్‌ నిష్కమ్రణతో నాటకరంగం మూగవోయిందని నటి షబానా ఆజ్మి వ్యాఖ్యానించారు.
* 1982లో వచ్చిన ‘ఖుద్దర్‌’ సినిమాలో హంగల్‌ పాత్ర పేరు షోలే సినిమాలో లాగే ‘రహీమ్‌ చాచా. ‘లార్డ్‌ మౌంట్‌ బాటన్‌- ది లాస్ట్‌ వైస్రాయ్‌’, ‘బాంబే బ్లూ’ వంటి టెలివిజన్‌ సీరియళ్లలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, సరస్వతి గిరి పాత్రలను హంగల్‌ పోషించారు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.