యాక్షన్‌ డైరెక్టర్‌ వీరూ దేవగణ్‌ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ స్టంట్‌ అండ్‌ యాక్షన్‌ డైరెక్టర్, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ తండ్రి వీరూ దేవగణ్‌ (85) సోమవారం ఉదయం ముంబయిలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సయస్యలతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘లాల్‌ బాద్‌షా’, మిస్టర్‌ ఇండియా’, ‘హిమ్మత్‌వాలా’ లాంటి 80పైగా చిత్రాల్లోని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు వీరు. తనయుడు అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో ‘హిందుస్తాన్‌ కీ కసమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ మరో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌ అయిన అందులోని యాక్షన్‌ సన్నివేశాలకు మంచి పేరొచ్చింది. అజయ్‌దేవగణ్‌ బాలీవుడ్‌కు పరిచయమైన ‘ఫూల్‌ జౌర్‌ కాంటే’ చిత్రంలో రెండు బైక్‌లపై ఒకేసారి నిల్చొని నడిపే సన్నివేశాలు అప్పట్లో బాగా పాపులర్‌ అయ్యాయి. వాటిని తీర్చిదిద్దింది వీరూనే. తెరవెనుకే కాదు ‘క్రాంతి’, ‘సౌరభ్‌’ లాంటి చిత్రాల్లోనూ నటించి తెరపైనా సత్తా చాటారు వీరు. ఆయనకు భార్య వీణా, ఇద్దరు కుమారులు అజయ్‌దేవ్‌గణ్, అనిల్‌ దేవగణ్, కుమార్తెలు నీలమ్, కవిత ఉన్నారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. వీరు మృతిపట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

నా తండ్రే నా ‘సింగం’
అజయ్‌దేవగణ్‌కు స్ఫూర్తి ఆయన తండ్రే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేశారు. ‘‘చాలా నిరుపేద స్థితిలో నాన్న ముంబయిలో అడుగుపెట్టారు. చాలా కష్టాలు పడ్డారు. ఒకానొక సమయంలో ఎనిమిది రోజులు ఆహారం కూడా తీసుకోలేదు. అంత సాధారణ స్థాయి నుంచి దేశం మెచ్చిన గొప్ప యాక్షన్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆ ప్రయాణం నాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఎంతోమంది అగ్రకథానాయకులు ఆయనతో పనిచేయాలని తపించేవారు. ఆయన తలకు ఇప్పటివరకూ 50కి పైగానే కుట్లు పడ్డాయి. ఎముకలు ఎన్నిసార్లు విరిగాయో లెక్కేలేదు’’ అని తన తండ్రి గురించి గొప్పగా చెబుతుంటారు అజయ్‌.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.