ఆయనో శిఖరం!
అమితాబ్‌ బచ్చన్‌ ఒక వ్యక్తి కాదు... ఒక సామూహిక వ్యవస్థ! అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితంలో ప్రతి దశ స్ఫూర్తి దాయకం. వేషం కోసం వెళితే వెటకారాలు ఎదుర్కున్న స్థితిలోనైనా... చిన్న చిన్న వేషాల స్థాయి నుంచి సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న దశలోనైనా... ఏబీసీడీ సంస్థ స్థాపించి అనూహ్యంగా ఆర్థికపరంగా దాదాపు దివాళా తీసిన పతనావస్థలోనైనా... ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ద్వారా తిరిగి పుంజుకున్న అనుభవంలోనైనా... ఏడు దశాబ్దాల వయసు దాటినా స్వాగతిస్తున్న పాత్రలను అందుకుంటున్న వర్తమానంలోనైనా... అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పుడూ తొణకలేదు. ఎదురైన స్థితిగతుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఎప్పటికప్పుడు ఆదర్శవంతంగా ముందుకు సాగారు. సాగుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన ఆయన జీవితంలోకి ఓ సారి తొంగి చూద్దాం! ఆయన ఎదిగిన వైనాన్ని ఓ సారి అవలోకిదాం!!* త్రివేణి సంగమం... 
ఆయన జన్మస్థానం...
అమితాబ్‌ బచ్చన్, పవిత్ర నదుల సంగమస్థానమైన అలహాబాద్‌లో 1942 అక్టోబరు 11న పుట్టారు. తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ హిందీ భాషా పండితుడు. ఆయన అమితాబ్‌ను ‘ఇంక్విలాబ్‌’ అని ముద్దుగా పిలిచేవారు. తన కలంపేరు ‘బచ్చన్‌’ను అమితాబ్‌ ఇంటిపేరుగా పెట్టారు. అమితాబ్‌ అసలు ఇంటిపేరు శ్రీవాత్సవ. అమితాబ్‌ నైనిటాల్‌లోని షేర్‌ వుడ్‌ కళాశాలలో చదివారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మల్‌ కాలేజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తల్లి తేజీ బచన్‌కు నటన మీద ఆసక్తి వుండేది. ఆ ప్రభావం అమితాబ్‌ మీద పడింది. 1969లో మృణాల్‌ సేన్‌ నిర్మించిన జాతీయ అవార్డు చిత్రం ‘భువన్‌ షోమ్‌’ సినిమాకు గళాన్ని అందించి సినిమారంగ ప్రవేశానికి బాటలు వేసుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎ.అబ్బాస్‌ 1969లో నిర్మించిన ‘సాత్‌ హిందుస్తానీ’ సినిమాలో మొదటి సారి వెండితెరమీద దర్శనమిచ్చారు. అయితే ఇది అమితాబ్‌కు పెద్దగా పేరు తేలేదు. 1971లో ఎన్‌.సి.సిప్పీ హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆనంద్‌’ సినిమా అమితాబ్‌కి మంచి గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడే యువకుడుగా రాజేష్‌ ఖన్నా నటించగా అతణ్ణి బతికించేందుకు శ్రమించే డాక్టర్‌ భాస్కర్‌గా అమితాబ్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడంతో బాటు ఆరు ఫిలిం ఫేర్‌ బహుమతులు దక్కగా, అమితాబ్‌ బచ్చన్‌కు ఉత్తమ సహాయనటుడి బహుమతి వరించింది. ఆపై జ్యోతి స్వరూప్‌ దర్శకత్వంలో ‘పర్వానా’ (1971) చిత్రంలో అమితాబ్‌ విఫల ప్రేమికుడిగా హత్యకు పూనుకొనే నెగటివ్‌ పాత్రలో నటించారు. ఆపై ప్రతి సినిమా అమితాబ్‌కి ఓ మెట్టులాగా ఉపయోగపడింది. హృషికేష్‌ ముఖర్జీ నిర్మించిన ‘గుడ్డి’ సినిమాలో అమితాబ్‌ది ప్రత్యేక పాత్ర. అమితాబ్‌ భార్య జయభాదురికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ‘రేష్మా అవుర్‌ షేరా’ బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. అలాగే ఫారిన్‌ కేటగరీలో 44వ ఆస్కార్‌ బహుమతి కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఎన్‌.సి.సిప్పీ ‘బాంబే టు గోవా’ ఆర్‌.డి.బర్మన్‌ అద్భుత సంగీతంతో హిట్టయింది. ఇదే అమితాబ్‌కి తొలి బ్రేక్‌ ఇచ్చిన సినిమాగా నిలిచింది.


* యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా...
దర్శక నిర్మాత ప్రకాష్‌ మెహ్రా 1973లో ‘జంజీర్‌’ సినిమా నిర్మించారు. సలీం జావేద్‌ రచన చేసిన ఈ సినిమా అమితాబ్‌ను ‘యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌’గా నిలబెట్టింది. సోవియట్‌ యూనియన్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌ కావడం విశేషం. ఆపై హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘అభిమాన్‌’ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది. అమితాబ్‌ అప్పటికే జయభాదురిని పెళ్లాడారు. ఆమే ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఇక ఆపై... ‘కసౌటి’, ‘బేనామ్’, ‘మజబూర్‌’, ‘దీవార్‌’, ‘షోలే’, ‘చుప్‌ కే చుప్‌ కే’, ‘దో అంజానే’, ‘కభీ కభీ’, ‘హీరా ఫేరి’, ‘అదాలత్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘పర్వరీష్‌’, ‘త్రిశూల్‌’, ‘డాన్‌’, ‘ముకద్దర్‌ కా సికందర్‌’, ‘మిస్టర్‌ నట్వర్‌ లాల్‌’, ‘కాలా పత్తర్‌’, ‘దోస్తానా’, ‘లావారిస్‌’... ఇలా ఒకో సినిమాలో అమితాబ్‌ నటన, ఆయన మీద ప్రేక్షకుల అభిమానం కూడా అంతకంతకు పెరుగుతూ వచ్చాయి.


* సూపర్‌ స్టార్డంలో ‘కూలీ’ ప్రమాదం...
1982 జూలై 26న బెంగుళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో ‘కూలీ’ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదం అమితాబ్‌ పట్ల దేశ ప్రజలకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో రుజువు చేసింది. అందులో పునీత్‌ ఇస్సార్‌తో ఫైటింగ్‌ జరిగే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంటే అమితాబ్‌ అనూహ్యంగా ఓ బల్లపై పడడంతో ఆయన కడుపులో పెద్ద గాయమై రక్తస్రావమైంది. అమితాబ్‌ కోమాలోకి వెళ్లినంత పనైంది. ఆ సమయంలో ఆయన కోలుకోవాలని లక్షలాది మంది ప్రార్థనలు, పూజలు చేయడం విశేషం.
రెండో ఇన్నింగ్స్‌...


మధ్యలో అమితాబ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసినా తిరిగి వెండితెరకు వచ్చారు. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. ‘షెహన్‌ షా’, ‘హమ్’, ‘అగ్నిపీట్‌’, ‘బడే మియా చోటే మియా’, ‘మేజర్‌ సాబ్‌’, ‘సూర్యవంశం’ సినిమాలు విజయవంతమయ్యాయి. 2000 సంవత్సరం నుంచి వైవిధ్య మైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. ‘కభి ఖుషి కభి ఘమ్’, ‘అక్స్‌’, ‘బ్లాక్‌’, ‘పా’, హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రేట్‌ గట్స్‌ బై’... ఇలా ఎన్నో సినిమాలు ఆయనలోని వైవిధ్యభరితమైన అభినయాన్ని ప్రేక్షకులకు చవి చూపించాయి. అమితాబ్‌కు లభించిన పురస్కారాలు, అవార్డులు, ప్రశంసలు ఎన్నో... ఎన్నెన్నో! లండన్, న్యూయార్క్, హాంగ్‌ కాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, ఢిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్‌ మ్యూజియంలలో అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. 2011లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను భారతప్రభుత్వం ప్రదానం చేసింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం నైట్‌ హుడ్‌ బిరుదుతో సత్కరించింది. ఇలా నవనవోన్మేషంగా సాగిపోతున్న అమితాబ్‌ అలుపెరుగని వీరుడు! పరుగాపని యోధుడు!

                                     Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.