విలక్షణమైన విలనిజానికి చిరునామా
మహా దుష్ట పాలికా! కాపాలికా!!ఆవాహయామి! దుష్టగ్రహపీడా నివారణమస్తు! సర్వారిష్టా నివారణమస్తు! మనోభీష్ట సిద్ధిరస్తు! అష్టదిగ్భంధనమస్తు!ఓ...మహాద్రష్ట నే కలవరపరిచే దుష్ట! మహాద్రష్టలం...అహంభావాన్ని సహించడు ఈ మహా ద్రష్ట...ఆశ్రయించు... అనుగ్రహం పొందు...నిన్ను ఆవహించిన దుష్ట గ్రహాలను దూరం చేస్తాడు...అవమానిస్తున్నావ్...మహాద్రష్టలం...నువ్వేమి చేయగలవ్
-జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో అమ్రిష్ పురి పవర్ ఫుల్ డైలాగులు ఇవి.



మంచి పొడగరి. ఆపై విశాలమైన ఫాలభాగాన భయం గొలిపే పసుపు కుంకుమ కలబోసిన అంత పెద్ద బొట్టు...నున్నగా గీసిన గుండు. ఆ గుండెంతా పాకిన ఎర్రెర్రని రంగు... వెనుక పిలక...పంచెకట్టు... ఛాతీని కప్పేస్తూ ఎర్రని కండువా! ఇదీ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో అమ్రిష్ పురి ఆహార్యం. చూసీ చూడగానే హడలెత్తించిన రూపమది... చిన్నపిల్లలు జడుసుకుని జ్వరం తెచ్చుకునే అభినయమది. ఇంద్రుని కూతురు ఉంగరం పోగొట్టుకుని ఇంద్రలోకం నుంచి భూలోకం రావడం... ఆ ఉంగరం కోసం నానా తంటాలు పడుతూ హీరోని ఆశ్రయించడం... ఆ ఉంగరానికి ఉన్న మహత్తు కారణంగా కొంతమంది విలన్లు ఇబ్బందులు పడడంతో పాటు ...దుష్ట శక్తుల నుంచి కాపాడమంటూ ఓ మాంత్రికుడిని ఆశ్రయించడం... ఆ మాంత్రికుడు పాత్రలో భయపెట్టే రీతిలో అమ్రిష్ పురి నట విశ్వరూపం చూపించడం ఆ సినిమాలో హైలైట్స్‌...


అమ్రిష్ పురి ప్రతి నాయకుడిగా తన ముద్ర బలంగా వేశారు. బాలీవుడ్‌లో తన క్రూరత్వంతో ఎన్నో చిత్రాలను విజయ తీరాలకు నడిపించారు. విలన్...అంటే ఇలాగే ఉండాలనే సరికొత్త డిక్షనరీ ని రాశారు.

ఖంగు మనిపించే కంఠ ధ్వని, వికటాట్టహాసంతో థియేటర్లను వణికించే వైఖరి...అమ్రిష్ పురి ప్రత్యేకతలు. సినిమా విజయానికి కధానాయకుడు ఎంత అవసరమో...ఆ కథానాయకుడిని ఢీ కొనే సామర్థ్యం గల ప్రతినాయకుడు కూడా అంతే అవసరం. అమ్రిష్ పురి ఆ కొరతను తీర్చిన ప్రతినాయకుడు. పంజాబ్ నవాన్ షహర్ లో 1932 జూన్ 22న నిహాల్ సింగ్ పురి, వేద కౌర్ దంపతులకు అమ్రిష్ పురి జన్మించారు.

* 400 సినిమాల చరిత్ర
హిందీ తో పాటు కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తెలుగు, తమిళ్ లాంటి భారతీయ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అమ్రిష్ పురి హాలీవుడ్ లో కూడా తన ప్రతిభ కనబరిచారు. విదేశీ వీక్షకులకు కూడా అమ్రిష్ పురి పేరు సుపరిచితం. 1984లో స్టీవెన్ స్పిల్ బెర్గ్ దర్శకత్వం వహించిన ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్ చిత్రంలో మోలా రామ్ గా అమ్రిష్ పురి లబ్ధ ప్రతిష్టులు. తనకు ఎంతో ఇష్టమైన సినీ విలన్ అమ్రిష్ పురి అంటూ స్టీవెన్ స్పిల్ బెర్గ్ ప్రత్యేకంగా కితాబిచ్చారు. అలాగే, 1987లో విడుదలైన శేఖర్ కపూర్ హిందీ మూవీ మిస్టర్ ఇండియా లో నటించిన అమ్రిష్ పురి ని ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆయన సుమారు 4 వందల సినిమాల్లో నటించారు..


* సోదరుల స్పూర్తితో...!
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అమ్రిష్ పురి వచ్చారు. తనకన్నా పెద్దవారైన సోదరులు చమన్ పురి, మదన్ పురి అప్పటికే ఇండస్ట్రీ లో పేరు మోసిన విలన్లు. గతకాలపు గాయకుడు కె. ఎల్. సైగల్ కి అమ్రిష్ పురి కి దగ్గర బంధుత్వం ఉంది. సోదరుల స్పూర్తితో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని భావించిన అమ్రిష్ పురి మొదటి స్క్రీన్ టెస్ట్ లోనే విఫలమయ్యారు. దాంతో, సినిమాలు తనకు అచ్చి రావనే నైరాశ్యంలో కృంగిపోయిన ఆయన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగం పొందారు. కళాకారుడు కావాలన్న తపన తో పృద్వీ థియేటర్స్ సంస్థలో చేరి సత్యదేవ్ దూబే రాసిన అనేక నాటకాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే 1979లో ఉత్తమ రంగస్థల కళాకారుడిగా సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపుతో టీవీ లో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల్లో చోటు సంపాదించుకున్నారు. అలా అలా ఆయన సినీ ఇండస్ట్రీ కి కూడా పరిచయమయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 40 సంవత్సరాలు. అంటే... లేటు వయస్సులో సినీ అవకాశం అందివచ్చినట్లయింది.


* ప్రారంభంలో విలన్ అనుయాయుడిగా
1970 ప్రాంతంలో ప్రారంభమైన అమ్రిష్ పురి మొదట్లో ప్రధాన ప్రతి నాయకుడికి అనుచరుడిగా చాలా చిత్రాల్లో పనిచేసారు. 1980లో సూపర్ హిట్ మూవీ హాఁ పాంచ్ చిత్రంలో ప్రధాన విలన్ గా నటించిన తర్వాత అమ్రిష్ పురి కి చెప్పుకోదగ్గ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మెయిన్ విలన్ గా ఆయనకు అవకాశాలు వెతుక్కుని మరీ వచ్చాయి. అదే సంవత్సరం సుభాష్ గయ్ సూపర్ హిట్ సినిమా విధాతలో కూడా అమ్రిష్ పురి మెయిన్ విలన్. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి హేమాహేమీలు నటించిన శక్తి చిత్రంలో కూడా విలన్ గా అమ్రిష్ పురి నటించి మెప్పించారు. 1983లో జాకీష్రాఫ్ ని హీరో గా పరిచయం చేసిన చిత్రం హీరో లో మరోసారి సుభాష్ గయ్ అమ్రిష్ పురి కి విలన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం ప్రేక్షకులకు తెలిసిందే. 1980 నుంచి 1990 వరకూ ప్రధాన ప్రతి నాయకుడిగా అనేక చిత్రాల్లో నటించిన అమ్రిష్ పురి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అమ్రిష్ పురి పేరు తలవగానే చాలా చిత్రాలు ప్రేక్షకులకు గుర్తు వస్తాయి. 1970లో ప్రేమ్ పూజారి సినిమాతో ఆయన కెరీర్ జోరందుకుంది. ఆహాత్ ...ఏక్ అజీబ్ కహానీ, రేష్మా ఔర్ షీరా, హల్చల్, సోనీ కె హాత్, హిందుస్థాన్ కె కసం, నిశాంత్, ఇమాం ధరమ్, భూమిక, రంగా ఔర్ రాజా, పాపి, హమారే తుమ్హారే, ఆక్రోస్, ఖుర్భానీ, దోస్తానా, హమ్ పాంచ్,పత్తర్ సి టక్కర్, క్రోధి, కలియుగ్, గాంధీ, విధాత, విజేత, సుగంధ, మై ఇంత్ కామ్ లూంగా, నిషాన్, అందా కానూన్, కూలీ, మందీ, హీరో...ఇలా చాలా సినిమాలు గుర్తొస్తాయి.


* అంతర్జాతీయ చిత్ర యవనికపై
అంతర్జాతీయ చిత్ర యవనికపై కూడా అమ్రిష్ పురి సత్తా చాటారు. 1982లో నిర్మితమయిన రిచర్డ్ అటెన్ బరో గాంధీ సినిమాలో అమ్రిష్ పురి పోషించిన ఖాన్ పాత్ర ద్వారా ప్రపంచ సినిమా గడప దాటారు. స్టీవెన్ స్పిల్ బెర్గ్ చిత్రం ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్ కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

* అవార్డులు-పురస్కారాలు
రంగస్థల కళాకారుడిగా 1968లో మహారాష్ట్ర స్టేట్ డ్రామా పురస్కారాన్ని అందుకున్నారు. 1979లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1986లో మేరీ జంగ్ సినిమాలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డు, 1991లో మహారాష్ట్ర స్టాట్ గౌరవ్ పురస్కార్, 1994లో సూరజ్ కా సత్వాన్ ఘోడా సినిమాలో నటనకు గాను షి డ్నీ చిత్రోత్సవం లో ఉత్తమ్ నటుడి అవార్డు, అదే సంవత్సరం సింగపూర్ చిత్రోత్సవం లో సూరజ్ కా సత్వాన్ ఘోడా సినిమాలో నటనకి ఉత్తమ నటుడి అవార్డు ని అందుకున్నారు. ఘటక్ సినిమాలో నటనకు గాను 1997లో ఉత్తమ సహాయ నటుడి గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. అదే సినిమాకి అదే సంవత్సరం ఉత్తమ సహాయ నటుడిగా స్టార్ స్క్రీన్ అవార్డు అందుకున్నారు. 1998లో విరాసత్ సినిమాకిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరం లో కళాకార్ అవార్డును ఉత్తమ సహాయనటుడి కేటగిరిలో ఆయన స్వీకరించారు.


* తిరిగిరాని లోకాలకు అమ్రిష్ పురి

కళాకారుడిగా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అమ్రిష్ పురి 2004 డిసెంబర్ 24న మరణించారు. అరుదయిన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆయన చివరి శ్వాస వదిలారు.

-పి.వి.డి. ఎస్. ప్రకాష్


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.