చలనచిత్ర మౌనముని... బిమల్‌ రాయ్‌
ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు బిమల్‌ రాయ్‌ని ‘సైలెంట్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అని గౌరవంగా పిలుచుకుంటారు. శరత్‌ నవలలు ‘దేవదాస్‌’, ‘పరిణీత’లను చలనచిత్రాలుగా నిర్మించి కీర్తి గడించిన అరుదైన దిగ్దర్శకులు బిమల్‌ రాయ్‌. 50 దశకంలో బిమల్‌ రాయ్‌ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉన్నాడంటే అది ఒక వింతే. ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద పట్టణాల నుంచి, చిన్నచిన్న గ్రామాల్లో కూడా బిమల్‌ రాయ్‌ నిర్మించిన సినిమాలు నిబద్ధతతో ఆడేవి. బిమల్‌ రాయ్‌ అడుగుపెట్టిన రోజులు చలనచిత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగినవి. సాంఘిక సమస్యలనే తన కథావస్తువులుగా తీసుకొని సినిమాలుగా మలిచిన మేధావి బిమల్‌ రాయ్‌. మానవ సంఘర్షణ వంటి సున్నితమైన, జటిలమైన సమస్యలు ప్రజలకు తెలియజేయాలంటే సినిమా మాధ్యమం ఒక్కటే శక్తివంతమైన ఆయుధం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన దార్శనికుడు బిమల్‌ రాయ్‌. జూలై 12 బిమల్‌ రాయ్‌ శతజయంతి సందర్భంగా కొన్ని విశేషాలు...* తొలిరోజుల్ల్లో...
బిమల్‌ రాయ్‌ ధనిక జమీందారి కుటుంబంలో 1909 జులై12న తూర్పు బెంగాల్‌ ఢాకాలోని సువాపూర్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో వుంది)లో జన్మించారు. బిమల్‌ రాయ్‌ తాత ఆదిత్య భట్టాచార్య. వారి పూర్వీకులకు పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉండేవి. వీరు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు. బిమల్‌ రాయ్‌ ప్రాధమిక విద్యాభ్యాసం ఢాకాలో జరిగింది. తండ్రి శంకర్‌ రాయ్‌ మరణించడంతో వారి ఎస్టేట్‌ మేనేజర్‌ ఆస్తిని హస్తగతం చేసుకొని బిమల్‌ రాయ్‌ కుటుంబాన్ని గెంటివేశాడు. మరోమార్గం కానరాని బిమల్‌ రాయ్‌ తల్లి, తమ్ముళ్లతో కలకత్తా నగరానికి వలస వచ్చారు. బ్రతుకుతెరువు కోసం తంటాలు పడుతున్న బిమల్‌ రాయ్‌ని ప్రమతేష్‌ బారువా చేరదీసి, ఫోటోగ్రఫీలో తర్ఫీదు ఇచ్చి, ఫీల్డ్‌ పబ్లిసిటీ ఫోటోగ్రాఫర్‌గా నియమించారు. తరువాత కొద్ది కాలానికి బిమల్‌ రాయ్‌ కలకత్తా న్యూ థియేటర్స్‌లో రచయితగా, దర్శకునిగా పనిచేసే నితిన్‌ బోస్‌ వద్ద సహాయ కెమెరామన్‌గా నియమితులయ్యారు. అప్పుడే బ్రిటీష్‌ ప్రభుత్వానికి రెండు డాక్యుమెంటరీలు తయారు చేశారు. వాటిలో బెంగాల్‌ క్షామం మీద చిత్రీకరించిన డాక్యుమెంటరీ పండితుల ప్రశంసలు అందుకుంది. కేన్స్‌ చలన చిత్రోత్సవంలో బిమల్‌ రాయ్‌ నిర్మించిన ‘గౌతమ, ది బుద్ధ’ అనే డాక్యుమెంటరీ ఫిలింకు మంచి ప్రశంసలు లభించాయి. 1935లో న్యూ థియేటర్స్‌ వారికి పి.సి.బారువా నిర్మించిన ‘దేవదాస్‌’, ‘ముక్తి’, ‘గృహదాత’, ‘అభినేత్రి’ వంటి సినిమాలకు నితిన్‌ బోస్‌ వద్ద బిమల్‌ రాయ్‌ సహాయక ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు. న్యూ ఇండియా బ్యానర్‌ మీద కులవ్యవస్థ నేపథ్యంలో నిర్మించిన ‘ఉదయేర్‌ పథే’ (1944- తొలిసంజ దిశగా) అనే లఘుబడ్జట్‌ బెంగాలి చిత్రానికి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ‘ఉదయేర్‌ పథే’ చిత్రంలో తులసి చక్రవర్తి, బిశ్వనాథ్‌ భాధురి, మాయబోస్, బినోదరాయ్, దేవి ముఖర్జీ మొదలగు వారు నటించారు. జ్యోతిర్మయిరాయ్‌ కథకు బిమల్‌ రాయ్‌ స్కీన్ర్‌ ప్లే, దర్శకత్వంతోబాటు ఛాయాగ్రహణ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాత బి.ఎన్‌.సర్కార్‌ బిమల్‌ రాయ్‌తో ‘మిగిలిపోయిన ముడిఫిలిం ముక్కలతో సినిమా నిర్మించి నీ ప్రతిభను నిరూపించుకో’ అనే ఒక సవాలును విసిరారు. అలాగే కష్టపడి బిమల్‌ రాయ్‌ ఈ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. ఈ సినిమా టైటిల్‌ని రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచించిన ఒక గేయం నుంచి బిమల్‌ రాయ్‌ తీసుకున్నారు. ఇందులో విశ్వకవి రచించిన ‘రవీంద్ర గీతాలు’ వున్నాయి. తరువాతి రోజుల్లో జాతీయగీతంగా ఎంపిక చేసిన రవీంద్రుని ‘జనగణమన అధినాయక జయహే’ పూర్తి గీతం ‘ఉదయేర్‌ పథే’లో బిమల్‌ రాయ్‌ పొందుపరచారు. సినిమా ప్రారంభానికి ముందు టైటిల్స్‌ వచ్చేటప్పుడే ఈ గీతం వినిపిస్తుంది. మూడు నిమిషాలకు పైగా నిడివిగల ఈ గేయానికి ఆర్‌.సి.బోరల్‌ బాణీ కట్టారు. అదే బాణీలో ఇప్పుడు మన జాతీయగీతం వర్ధిల్లుతోంది. బెంగాలి బాబులు ఈ చిత్రాన్ని ఒక మాస్టర్‌ పీస్‌గా గుర్తించి గౌరవించి సంవత్సరం పాటు నడిపించారు. సరిగ్గా 27 ఏళ్ల తరువాత 1971లో ప్రమోద్‌ చక్రవర్తి ఇదే బెంగాలి సినిమాను హిందీలో ‘నయా జమానా’ పేరుతో పునర్నిర్మించారు. అందులో ధర్మేంద్ర, హేమామాలిని, అశోక్‌ కుమార్‌ ముఖ్య తారాగణం.
 
                                   
  

* కీర్తిని పెంచిన ‘దో భిగా జమీన్‌’...
రెండవ ప్రపంచ యుద్ధం రావడం, స్వాతంత్య్రానంతరం భారత్‌-పాకిస్తాన్‌ విడిపోవడంతో 40 దశకంలో ఎక్కువమంది బెంగాలి సినీదర్శకులు, రచయితలు బొంబాయిలో స్థిరపడ్డారు. బిమల్‌ రాయ్‌ కూడా 1950లో బొంబాయికి మకాం మార్చారు. 1952లో బిమల్‌ రాయ్‌ బొంబాయిలో జరిగిన మొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘బైసికిల్‌ థీవ్స్‌’ అనే చిత్రాన్ని చూశారు. ఆ సినిమాలో ఉన్న సహజత్వం బిమల్‌ రాయ్‌కి ఎంతగానో నచ్చింది. అలాంటి సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. బిమల్‌ రాయ్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో సొంత చలనచిత్ర నిర్మాణ కంపెనీ స్థాపించారు. ఇంతలో బిమల్‌ రాయ్‌ భార్య మనోబినా రాయ్‌ సలీల్‌ చౌదరి రచించిన కథానిక ‘రిక్షావాలా’ను గుర్తుచేసింది. ఆ కథలో ఒక గ్రామీణ రైతు తన రెండెకరాల పొలాన్ని రక్షించుకునేందుకు కలకత్తా వచ్చి రెండువందలు ఆర్జించేందుకు మనుషులు లాగే రిక్షా లాగుతాడు. బిమల్‌ రాయ్‌కి ఆ కథా నేపథ్యం నచ్చింది. సలీల్‌ చౌదరి వద్ద అనుమతి తీసుకొని స్క్రిప్టు పని మొదలెట్టారు. ముఖ్య పాత్ర ‘శంభు మెహతో’ కోసం తొలుత పైడి జయరాజ్‌గాని త్రిలోక్‌ కపూర్‌గాని నాజిర్‌ హుసేన్‌ను గాని ఎంపిక చేద్దామని తలచినా, 1951లో వచ్చిన ‘హమ్‌ లోగ్‌’ చిత్రంలో బల్రాజ్‌ సాహ్ని నటనకు ముగ్ధుడై అతన్ని హీరో పాత్రకు ఎంపికచేశారు. ఈ పాత్ర కోసం బల్రాజ్‌ సాహ్ని మనుషులు లాగే రిక్షా లాగే విధానాన్ని అధ్యయనం చేసి కొన్ని రోజులు కలకత్తా నగర వీధుల్లో రిక్షా లాగడం అభ్యసించారు. రిక్షా కార్మికులతో మంచిచెడ్డలు విచారించారు. సాహ్ని భార్య పార్వతి మెహతోగా నటించిన నిరూపరాయ్‌ కొన్ని విషాద సన్నివేశాల్లో గ్లిజరిన్‌ వాడకుండా కన్నీరు తెప్పించి నటించింది. రవీంద్రనాథ టాగూర్‌ రచించిన ప్రఖ్యాత కవిత ‘దుయి భిగా జోమి’ (రెండెకరాల భూమి)ని స్పూర్తిగా తీసుకొని ఆ సినిమాకు ‘దో భిగా జమీన్‌’ అని పేరుపెట్టారు. ఇదే చిత్రాన్ని ఇంగ్లీషు సబ్‌-టైటిల్స్‌తో ‘కలకత్తా- ది క్రూయల్‌ సిటీ’ పేరిట చైనా, యునైటెడ్‌ కింగ్డం, రష్యా వంటి ఇతర దేశాల్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సలీల్‌ చౌదరి సంగీతం సమకూర్చగా, హృషికేష్‌ ముఖర్జీ స్కీన్ర్‌ ప్లే రాసి ఎడిటింగ్‌ కూడా చేశారు. ఈ చిత్రానికి కార్లోవి వరి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘సోషల్‌ ప్రోగ్రెస్‌’ విభాగంలో బహుమతి లభించింది. 1954లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రిక్స్‌ ఇంటర్నేషనల్‌ బహుమతి లభించింది. భారతీయ తొలి జాతీయ అవార్డుల వేడుకలో ఉత్తమ చిత్ర బహుమతి గెలుచుకొంది. ఉత్తమ దర్శకుడిగా బిమల్‌ రాయ్‌కి, ఉత్తమచిత్రంగా ‘దో భిగా జమీన్‌’కి తొలి ఫిలింఫేర్‌ అవార్డుల సంబరాల్లో బహుమతులు లభించాయి. పది అత్యద్భుత భారతీయ సినిమాల జాబితాలో ఈ చిత్రం స్థానం సంపాదించింది. సలీల్‌ చౌదరి రచించిన కథ విజయవంతం కావడంతో ఆయనే రచించిన కథలతో ‘పరాఖ్‌’, ‘ప్రేమ పత్ర’ సినిమాలు నిర్మించారు.


* బిమల్‌ ఇతర సినిమాలు...
1953లో నాటి హీరో అశోక్‌ కుమార్‌ శరత్‌ నవల ‘పరిణీత’ను హిందీలో సినిమాగా తీయాలని బిమల్‌ రాయ్‌ని దర్శకత్వం వహించమని కోరారు. అశోక్‌ కుమార్, మీనాకుమారి, మనోరమ, నాసిర్‌ హుసేన్, శీతల్‌ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి మన్నాడే, అరుణ్‌ ముఖర్జీ సంగీత దర్శకత్వం వహించారు. హృషికేష్‌ ముఖర్జీ ఎడిటింగ్, కమల్‌ బోస్‌ ఫోటోగ్రఫీ శాఖలను నిర్వహించారు. బిమల్‌ రాయ్‌కి ఉత్తమ దర్శకుని బహుమతి, మీనా కుమారికి ఉత్తమ నటి బహుమతి ఫిలింఫేర్‌ సంస్థ ప్రదానం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ హిట్టయింది. 1954లో నిర్మాత హితేన్‌ చౌదరి బిమల్‌ రాయ్‌ దర్శకత్వంలో ‘బిరజ్‌ బహు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కూడా శరత్‌ నవల ఆధారం. ఇందులో కామిని కౌశల్, అభి భట్టాచార్య, ప్రాణ్‌ ముఖ్య తారాగణం. సలీల్‌ చౌదరి సంగీతం సమకూర్చగా హృషికేష్‌ ముఖర్జీ ఎడిటింగ్‌ నిర్వహించారు. కేన్స్‌ చలన చిత్రోత్సంలో బహుమతి కోసం ఈ చిత్రాన్ని నామినేట్‌ చేశారు. బిమల్‌ రాయ్‌కి ఉత్తమ దర్శకుడిగా, కామిని కౌశల్‌కు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ బహుమతులు దక్కాయి. జాతీయ బహుమతి కూడా ఈ చిత్రానికి వచ్చింది. కిషోర్‌ కుమార్, శైలారమణిలతో బిమల్‌ రాయ్‌ ‘నౌకరి’ అనే స్వంత చిత్రం 1954లో నిర్మించారు. విద్యార్థి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, నిరుద్యోగం వంటి నేపథ్యంలో ఈ సినిమా నిర్మించారు. శరత్‌ నవల ‘దేవదాస్‌’ (1955)ను చలనచిత్రంగా స్వంత బ్యానర్‌ మీద బిమల్‌ రాయ్‌ మలిచారు. దిలీప్‌ కుమార్, సుచిత్రాసేన్, వైజయంతిమాల, మోతిలాల్‌ ప్రధాన తారాగణం. పార్వతి పాత్రకు మీనాకుమారిని, చంద్రముఖి పాత్రకు నర్గీస్‌లను తీసుకోవాలని బిమల్‌ రాయ్‌ అనుకున్నారు. అయితే కమల్‌ అమ్రోహి మీనాకుమారికి అడ్డుపడ్డాడు. చంద్రముఖి పాత్ర సహాయక పాత్ర కావడంతో నర్గీస్‌ ముఖం చాటేసింది. తరువాత పార్వతి పాత్రకు బీనా రాయ్, సురయ్యాలను పరిశీలించినా, చివరికి ఆ పాత్ర సుచిత్రాసేన్‌కు దక్కింది. దిలీప్‌ కుమార్, వైజయంతిమాల, మోతిలాల్‌కు ఫిలింఫేర్‌ బహుమతులు దక్కగా సినిమాకు జాతీయ బహుమతి వచ్చింది. ‘మధుమతి’ (1958) సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. తొమ్మిది ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకున్న ఈ చిత్రం ఆ రికార్డుని 37 ఏళ్ల పాటు నిలబెట్టుకుంది. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా కూడా ఇదే. రెండువేల సంవత్సరాలనాటి రోమన్‌ సామ్రాజ్యపు కాలంలో యూదులను శిక్షించే నేపథ్యంలో నిర్మించిన చిత్రం ‘యాహుది’ (1958). సువాక్‌ వాచా నిర్మించిన ఈ చిత్రానికి బిమల్‌ రాయ్‌ దర్శకుడు. దిలీప్‌ కుమార్, మీనాకుమారి, సోహ్రాబ్‌ మోడీ, నాజిర్‌ హుసేన్‌ నటించిన ఈ సినిమాకు శంకర్‌ జైకిషన్‌ సంగీతం సమకూర్చారు. అన్వర్‌ హుసేన్‌ అంటానియోగా, మురాద్‌ జూలియస్‌ సీజర్‌గా నటించారు. గేయరచయిత శైలేంద్రకు ఫిలింఫేర్‌ బహుమతి (ఏ మేరా దివానపన్‌ హై పాటకు) తెచ్చిపెట్టిన చిత్రమిది. 1959లో బిమల్‌ రాయ్‌ నిర్మించిన సొంత సినిమా ‘సుజాత’ సునీల్‌ దత్, నూతన్, సులోచన, లలితా పవర్, శశికళ ముఖ్య తారాగణం. సుబోద్‌ ఘోష్‌ రచించిన కథను అదే పేరుతో సినిమాగా తీశారు. కేన్స్‌ చలనచిత్రోత్సవాలలో ఈ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. ఒక సద్బాహ్మ్రణ యువకునికి, ఒక హీనకుల జాతి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథ ఈ సినిమా నేపథ్యం. ఈ సినిమాకు జాతీయ బహుమతితోబాటు నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులు దక్కాయి. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు నామినేట్‌ అయింది. 1960లో స్వంత బ్యానర్‌ మీద నిర్మించిన చిత్రం ‘పరఖ్‌’. సాధన, మోతిలాల్, నాజిర్‌ హుసేన్‌ ముఖ్య తారాగణం. బిమల్‌ రాయ్‌కి ఉత్తమ దర్శకుడిగా ఈ చిత్రానికి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. బిమల్‌ రాయ్‌ తోబాటు మోతిలాల్‌ (ఉత్తమ సహాయ నటుడు), జార్జి డి’ క్రూజ్‌ (ఉత్తమ సౌండ్‌) కూడా బహుమతులు అందుకున్నారు. 1963లో వచ్చిన స్వంత చిత్రం ‘బందిని’కి ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు లభించాయి. వైజయంతి మాలకు నూతన్‌ పాత్రను ఇవ్వజూపినా ఆమె బిజీ షెడ్యూలులో ఉండడం చేత సాధ్యపడలేదు. ధర్మేంద్ర, అశోక్‌ కుమార్‌ ఇందులో నటించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు గంగా తీరాన, యరవాడ జైలులో చిత్రీకరించారు. 1964లో దర్శకత్వం వహించిన ‘లైఫ్‌ అండ్‌ మెసేజ్‌ ఆఫ్‌ స్వామి వివేకానంద’ (ఇంగ్లీషు) చిత్రం బిమల్‌ రాయ్‌ చివరి చిత్రం.


* అవార్డులు... రివార్డులు...
బిమల్‌ రాయ్‌కి వచ్చినన్ని జాతీయ, అంతర్జాతీయ బహుమతులు మరే ఇతర దర్శక నిర్మాతకు వచ్చి ఉండవంటే అతిశయోక్తి కాదు. 1953లో తొలిసారి జాతీయ బహుమతులు ప్రవేశపెట్టినప్పుడు తొలి బహుమతి గెలుచుకున్న చిత్రం ‘దో భిగా జమీన్‌’. 1954లో ‘బిరజ్‌ బహు’ చిత్రానికి వరసగా రెండవసారి జాతీయ బహుమతి లభించింది. 1955లో ముచ్చటగా మూడవసారి హిందీ ‘దేవదాస్‌’ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. మరలా 1958లో ‘మధుమతి’ చిత్రానికి, 1959లో ‘సుజాత’ సినిమాకి, 1963లో ‘బందిని’ సినిమాలకు బిమల్‌ రాయ్‌ జాతీయ స్థాయి బహుమతులు అందుకున్నారు. ఇలా ఆరు సార్లు జాతీయ బహుమతులు అందుకున్న చిత్రాలు బిమల్‌ రాయ్‌ నిర్మించినవి కావడం విశేషం. ఇక అంతర్జాతీయ స్థాయిలో ‘దో భిగా జమీన్‌’, ‘బిరజ్‌ బహు’, ‘సుజాత’ చిత్రాలు బహుమతులు గెలుచుకున్నాయి. ఫిలింఫేర్‌ బహుమతుల గురించి చెప్పాలంటే బిమల్‌ రాయ్‌ నిర్మించిన ‘దో భిగా జమీన్‌’, ‘మధుమతి’, ‘బందిని’ చిత్రాలకు ఉత్తమ చిత్ర బహుమతులు లభించాయి. బిమల్‌ రాయ్‌ ఉత్తమ దర్శకుడిగా ‘దోభిగా జమీన్‌’, ‘పరిణీత’, ‘బిరజ్‌ బహు’, ‘మధుమతి’, ‘సుజాత’, ‘పరఖ్‌’, ‘బందిని’ వంటి 7 చిత్రాలకు ఫిలింఫేర్‌ బహుమతులు అందుకున్నారు. 2007లో బిమల్‌ రాయ్‌ స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను భారత తంతి తపాలా శాఖ విడుదల చేసింది. ‘మధుమతి’ చిత్రం ఏకంగా 9 ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఈ రికార్డు 37 సంవత్సరాలుం పదిలంగా వుండడం కూడా ఒక రికార్డే.


* బిమల్‌ రాయ్‌ ప్రత్యేకతలు...
* బిమల్‌ రాయ్‌ చలనచిత్ర పాఠశాల నుంచి ఎంతోమంది నిష్ణాతులు హిందీ చలనచిత్రసీమకు పరిచయమయ్యారు. వారిలో హృషికేష్‌ ముఖర్జీ, సలీల్‌ చౌదరి, బసు భట్టాచార్య, గుల్జార్, నబేందు ఘోష్‌ ముఖ్యులు. బిమల్‌ రాయ్‌ స్మృత్యర్ధం హృషికేష్‌ ముఖర్జీ ‘అనుపమ’ చిత్రాన్ని బిమల్‌ రాయ్‌కి అంకితమిచ్చి కృతజ్ఞతలు ప్రకటించారు. ‘సుజాత’ చిత్రంలో కనిపించే పాత్రలు బిమల్‌ రాయ్‌ సినిమాలలో నుంచి స్పూర్తిపొందినవే కావడం విశేషం.

* బిమల్‌ రాయ్‌ సినిమాలలో పాటల చిత్రీకరణకు ఓ ప్రత్యేకత వుంది. జూనియర్‌ ఆర్టిస్టుల మీద, కొందరు సాంకేతిక నిపుణులమీద పాటలు చిత్రీకరించేవారు. బిమల్‌ రాయ్‌ వద్ద కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సచిన్‌ శంకర్‌ మీద ‘పరఖ్‌’, ‘క్యా హవా చలీ’ వంటి సినిమాల్లో పాటలు చిత్రేకరించారు. ‘బందిని’ సినిమాలో ‘అబ్‌ కే బరస్భేజ్‌ భయ్యా కో బాబుల్‌’ అనే క్లాసిక్‌ పాటను తనవద్ద ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసేబ్‌ కపూర్‌ భార్య మీద చిత్రీకరించారు. మరొక క్యారక్టర్‌ నటుడు రాజదీప్‌ మీద ‘మత్‌ రో మాతా లాల్‌ తెరేభీ బహు తేరే’ పాటను చిత్రీకరించారు. ‘ఆలం ఆరా’లో తొలి పాట పాడిన డబ్లియు.ఎం.ఖాన్‌ చేత ‘కాబూలివాలా’ చిత్రంలో ‘ఆయే మేరె ప్యారే వతన్‌’ పాట పాడించి అతని మీదే చిత్రీకరణ జరిపారు. అదే సినిమాలో ఎం.వి.రాజన్‌ చేత ‘గంగా ఆయే కహాఁ సే’ అనే పాటను పాడించి చిత్రీకరించడం కూడా ఒక విశేషం.
* 1958లో బిమల్‌ రాయ్‌ ‘మధుమతి’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో బెంగాలి చిత్ర నిర్మాత రిత్విక్‌ ఘటక్‌ కథ, స్కీన్ర్‌ ప్లే రచించడం, సలీల్‌ చౌదరి సంగీతం సమకూర్చడం, హృషికేష్‌ ముఖర్జీ ఎడిటింగ్‌ చేపట్టడం ఒక అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. ఇందులో సంభాషణలను రాజీందర్‌ సింగ్‌ బేడి ఉర్దూ భాషలో రాయడం మరో విశేషం. దిలీప్‌ కుమార్, వైజయంతిమాల నటించిన ఈ చిత్రానికి దిలీప్‌ గుప్త ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేయాలి. బిమల్‌ రాయ్‌ ’మధుమతి’ చిత్రాన్ని అవుట్‌ డోర్‌లో నిర్మించాలని ఆరువారాల షెడ్యూలు తయారుచేశారు. నైనిటాల్, రానిఖేట్‌ వంటి హిల్‌ స్టేషన్‌లలో ఈ షెడ్యూలు ఖరారైంది. చిత్రీకరణ పూర్తయ్యాక నెగటివ్‌ డెవలప్‌ చేసి చూస్తే అక్కడి మంచు ప్రభావం వలన ఫిలిం సరిగా రాలేదు. మరలా నైనిటాల్‌ వంటి ప్రదేశాలకు వెళ్లి రీషూట్‌ చెయ్యడం కష్టమని వైతరిణి డ్యాం సమీపంలో సెట్టింగులు వేసి సినిమా రీషూట్‌ చేశారు. ఎక్కువ సన్నివేశాలను బొంబాయికి దగ్గరలో కాస్త చిట్టడివి వుండే ఆరే మిల్క్‌ కాలనీలో చిత్రీకరించారు. ఈ సినిమా రీషూట్‌ చెయ్యడంతో నిర్మాణ వ్యయం దాదాపు కోటి రూపాయలకు చేరుకుంది. అద్భుతమైన సంగీతం అందించిన సలీల్‌ చౌదరికి తొలి ఫిలింఫేర్‌ బహుమతి దక్కింది. ‘సుహానా సఫర్‌ అవుర్‌ యే మౌసమ్‌ హసీ’ పాట ఇందులోదే అని వేరే చెప్పనవసరం లేదు. 1958లో విడుదలైన అన్ని సినిమాలలోకేల్లా అత్యంత అధిక రాబడి ఆర్జించి బాక్సాఫీస్‌ హిట్టైన సినిమా ‘మధుమతి’.

                                     

* బిమల్‌ రాయ్‌ మరణానికి ముందు ఒక భారీ సినిమాకు ప్రణాళిక సిద్ధం చేశారు. ‘అమృత్‌ కుంభ్‌ కి ఖోజ్‌ మే’ అనే పేరుతో హిందీ-బెంగాలీ భాషల్లో ధర్మేంద్ర, షర్మీలా టాగూర్‌లతో ఈ సినిమా నిర్మించాలనేది బిమల్‌ రాయ్‌ ఉద్దేశ్యం. సమరేష్‌ బసు రచించిన నవల ఈ సినిమాకు ఆధారం. 1960లో అలహాబాద్‌లో కుంభమేళా ఉత్సవం జరిగినప్పుడు ధర్మేంద్ర మీద తొలి షెడ్యూలును పూర్తిచేశారు. గుల్జార్‌ రచన చేశారు. అలహాబాద్‌లో ఈ షెడ్యూలు జరుగుతున్నప్పుడు ముందస్తు అనుమతి లేదని పోలీసులు షూటింగును ఆపేశారు. తరువాత ఆ సినిమా బిమల్‌ రాయ్‌ది అని తెలియగానే, క్షమాపణ చెప్పి షూటింగుకు అనుమతి ఇచ్చారు. బిమల్‌ రాయ్‌ ఆర్జించిన పరపతి అలాంటిది. అలాగే ‘ది మహాభారత’ పేరుతో ఒక భారీ సినిమా నిర్మించాలనేది బిమల్‌ రాయ్‌ కోరిక. అది కూడా కోరికగానే మిగిలిపోయింది. 55 ఏళ్ల వయసులో జనవరి 8, 1966న బిమల్‌ రాయ్‌ని క్యాన్సర్‌ మహమ్మారి పొట్టనపెట్టుకుంది.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.