ఆయన జీవితం... సినిమాకి అంకితం!
బహుముఖ ప్రజ్ఞశాలి అనే మాటకు సరైన అర్థం చెప్పినవారు భూపేన్‌ హజారికా. సినీ ప్రియులకు ఆయనో స్వరకర్త, గాయకుడు, దర్శకుడు, కవి, నటుడు. మేధావులకు ఆయనో పాత్రికేయుడు, నాయకుడు. తను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్రవేశారు భూపేన్‌ హజారికా. ఈశాన్య రాష్ట్రా సాంస్కృతిక ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా విరాజిల్లారు. సన్నిహితులు ఆయన్ని భూపేన్‌ దా అని ఆప్యాయంగా పిలుచుకొనేవారు. అస్సాంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆయన భారతీయ చిత్రరంగంలో తనకంటూ ఓ రీలును సృష్టించుకొన్నారు. భారత ప్రభుత్వం భూపేన్‌కు మరణాంతరం ‘భారతరత్న’ (జనవరి 2019) అత్యున్నత అవార్డుని ప్రకటించింది. ఈ సందర్భంగా సితార డిజిటల్‌ పాఠకులకు ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు...


ఈశాన్య రాష్ట్రాల ఆశాదీపం..
అస్సాం రాష్ట్రంలోని సాడియాలో సెప్టెంబర్‌ 8, 1926న భూపేన్‌ హజారికా జన్మించారు. గౌహతిలో ఇంటర్‌ చదివారు. తరువాత బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేసి, అక్కడే ఏం.ఏ చదివారు. ఇంకా ఉన్నత చదువుల కోసం న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ ఐదు సంవత్సరాలు మాస్‌ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ చేసి కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ సాధించారు. అంతే కాకుండా చికాగో విశ్వవిద్యాలయం నుంచి లిస్లే ఫెలోషిప్‌ను దక్కించుకోగలిగారు. సినిమా ద్వారా విద్యావ్యస్థను ఎలా అభివృద్ది చేయవచ్చు అనే అంశం మీద పరిశోధించేందుకు ఈ ఫెలోషిప్‌ ఇచ్చారు.

సినిమాల్లో..
మనదేశంలో సినీ ప్రముఖుల్లో భూపేన్‌ పేరును ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. అస్సామీ సినీమాను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ దిశగా సఫలీకృతులయ్యారు. సినిమాను ఓ ఉద్యమంలా సాగించారు. ఈశాన్య రాష్ట్రాల్ని సంఘటితం చేసి దాదాపు నలభై సంవత్సరాలు సినీ పరిశ్రమ కోసం శ్రమించిన ఏకైక వ్యక్తి భూపేన్‌. అక్కడి గిరిజనుల సంస్కృతిని సినిమా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. కేవలం సినిమా మాధ్యమం ద్వారానే ఆయన ప్రజలకు చేరువై 1967లో స్వతంత్య్ర అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అయిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన భూపేన్, గౌహతి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ సినిమా స్టూడియోను నిర్మింపజేయడంలో కృతకృత్యులయ్యారు. అలా ఈశాన్య ప్రాంతంలో సినిమా వేళ్లూనుకొనేలా చేశారు. భూపేన్‌ హజారికా బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఇంద్రమలాతి’లో నటించారు. పదేళ్ల వయసులో తొలిపాటను రాయడమే కాదు.. పాడి అందర్ని ఆశ్చర్యపరచారు. అక్కడి నుంచి ఆయన వెనుదిగిరి చూసుకోలేదు. అస్సామీ సినిమాల్ని నిర్మించడం మొదలుకొని దర్శకత్వం వహించడం.. సంగీతాన్ని సమకూర్చడం.. పాడటం.. ఇలా పలు శాఖల్లో ప్రావీణ్యం కనబరచారు. ఆయన పనిచేసిన వాటిల్లో కొన్ని సినిమాలు..‘ఎరా బాతర్‌ సుర్‌’ (1056), ‘శకుంతల’ (1960), ‘ప్రతిధ్వని’ (1964), ‘లోటిఘోటి’ (1967), ‘చిక్‌ మిక్‌ బిజులి’ (1971), ‘మోన్‌ ప్రజాపతి’ (1978), ‘స్వికరోక్తి’ (1986), ‘సిరాజ్‌’ (1988). ఈయన దర్శకత్వంలో 1958లో ‘మహుత్‌ బంధురే’ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు కొన్ని పాటల్ని ఆలపించారు కూడా! అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నువచి వచ్చిన తొలి హిందీ చిత్రం ‘మేరా ధరమ్‌ మేరీ మా’ను ఈయనే స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంగీత బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. 1977లో ఈ సినిమా విడుదలైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కొన్ని డాక్యుమెంటరీల్ని కూడా తెరకెక్కించారు. కలకత్తా దూరదర్శన్‌ కేంద్రం కోసం కూడా అరగంట నిడివితో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. అస్సాం రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్ని అందరికి పరిచయం చేయడం కోసం అయిదు రీళ్లతో ఓ డాక్యుమెంటరీని తీశారు. 1986లో విడుదలై అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాల్ని దక్కించుకొన్న ‘ఏక్‌ పల్‌’ సినిమాను ఈయనే నిర్మించారు. సంగీతం కూడా అందించారు. కల్పనా లాజ్మి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షబానా అజ్మి, ఫరూఖ్‌ షేక్, నషీరుద్దీన్‌ షా తదితరులు నటించారు. కల్పనా లాజ్మి తెరకెక్కించిన ‘రూడాలి’ చిత్రానికి భూపేన్‌ అందించిన బాణీలు హిందీ సినీప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.


పదవులు.. పురస్కారాలు
భూపేన్‌ మూడు సార్లు జాతీయ అవార్డులు తీసుకున్నారు. ‘శకుంతల’, ‘ప్రతిధ్వని’, ‘లోటి ఘోటి’ సినిమాలకు ఆ పురస్కారాలు దక్కాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనకు 1977లో బంగారు పతకాన్ని ఇచ్చి సత్కరించింది. గిరిజనుల సంస్కృతిని సినిమా, సంగీతం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఈ సత్కారం లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగానూ ‘ఛమేలీ మేమ్‌సాబ్‌’ అనే అస్సామీ సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సెన్సార్స్, భారత ప్రభుత్వం అప్పిలేట్‌ బాడీ తూర్పు ప్రాంతానికి ఛైర్మన్‌గా తొమ్మిదేళ్లు కొనసాగారు. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌లో ఆయన పలు పదవులు అలంకరించారు. బాలల చిత్రాల సొసైటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగాను ఉన్నారు. భారత ప్రభుత్వం అందించే పేద కళాకారుల వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ సభ్యుడిగాను కొనసాగారు. 1985లో జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్నారు. జ్యూరీ సభ్యుడిగా 1958 నుంచి 1990 దాకా లెక్కలేనన్ని సార్లు కొనసాగారు. భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాల్ని పొందారు. 1993లో ఇండియన్‌ ఆస్కార్‌గా పిలుచుకొనే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా.. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ - భారతప్రభుత్వం 2003లో ఆయన్ను నియమించింది. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన కీర్తి కిరీటంలో లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఉన్నాయి. కీలకమైన పదవులు కూడా చాలానే అలంకరించారు. సినిమా రంగానికి విశేష సేవలందించిన ఈయన మరణాంతరం (05-11-2011) భారత ప్రభుత్వం భూపేన్‌కు ‘భారతరత్న’ (2019) అవార్డును ప్రకటించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.