విలనీ’లో ‘హీరో’... ప్రాణ్‌!
కరకుగా అతడు చూసే చూపు కత్తితో పొడిచినట్టు ఉంటుంది... వ్యంగ్యంగా అతడు పలికే పలుకు గుండెల్లో గునపంలా గుచ్చుకుంటుంది... ప్రతినాయకుడిగా అతడి అభినయం, క్రూరత్వానికే వణుకు పుట్టిస్తుంది... అందుకే అతడు ‘విలన్‌ ఆఫ్‌ ద మిలీనియం’ అనిపించుకున్నాడు. దుర్మార్గానికి ప్రతిరూపంగా నిలిచి, హీరోలతో సమానమైన ప్రాచుర్యాన్ని అందుకున్న అతడే ప్రాణ్‌. అతడు నటించిన 360కి పైగా చిత్రాల్లో ఏ ఒక్కటి చూసిన వాళ్లకైనా అడగండి. విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రాణ్‌ వాళ్ల జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాడని తెలుస్తుంది. విలక్షణమైన విలనిజంతో చెరగని ముద్ర వేసిన ప్రాణ్‌ తన 93 ఏళ్ల వయసులో న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ 2013 జులై 12న కన్నుమూసినా, భారతీయ చలన చిత్ర చరిత్రలో అతడెప్పుడూ చిరంజీవే. అందాల హీరోగా, అంత కంటే అందమైన విలన్‌గా, కారుణ్య శీలిగా, కడుపుబ్బ నవ్వించే హాస్యనట చక్రవర్తిగా వైవిధ్యభరితమైన పాత్రల్ని అవలీలగా పోషించి నటనకే నూతన భాష్యం చెప్పిన అసాధారణ నటుడు ప్రాణ్‌. ఓ రావణాసురుడి పేరును ఎవరూ పిల్లలకు పెట్టరు. ఓ కంసుడి పేరు పెట్టరు. అలాగే ‘ప్రాణ్‌’ పేరును కూడా ఎవరూ పెట్టేవారు కాదంటే అందుకు ఆయన అద్భుత నటనా వైదుష్యమే కారణం. ఇవాళ ప్రాణ్ వర్థంతి. 


హీరోల కన్నా మిన్నగా...
హీరోల కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకున్న ఏకైక ప్రతినాయకుడిగా పాతతరం ప్రేక్షకుల మదిలో చెక్కుచెదరని అభిమానాన్ని నింపిన ప్రాణ్‌కు భారత ప్రభుత్వం ప్రాణ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్నిచ్చి గౌరవించినా, ‘విలన్‌ ఆఫ్‌ ది మిలీనియం’గా బాలీవుడ్‌ ప్రస్తుతించినా అవన్నీ అభిమాను గుండెల్లో ఆయనకున్న స్థానం తర్వాతవేనని కచ్చితంగా చెప్పవచ్చు. ఆయన నటించిన ఏ చిత్రాన్నైనా చూడండి. అప్పుడు తెలుస్తుంది, ప్రాణ్‌ నటనలో వైదుష్యం ఏమిటో! కరుడుకట్టిన దుష్టుడిగానైనా, నిస్పృహకు గురైన తండ్రిగానైనా, సునిశిత హాస్యంతో ఆకట్టుకున్న తాగుబోతుగానైనా ఆయన పాత్రపోషణ ఎందుకంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. ప్రతినాయకుడంటే ఎలా ఉండాలో ఆయన బాలీవుడ్‌కి చవి చూపించారు. హిందీ చలనచిత్ర చరిత్రకు మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన కళ్లలోనే కరుకుదనం తొంగి చూసేది. నవ్వినప్పుడు విచ్చుకున్న పెదాల్లో సైతం కౌర్యం విరుపు కనిపించేది. ఆ రోజుల్లో ఆయనను ద్వేషించని ప్రేక్షకుడు లేడంటేనే తెలుస్తుంది, ఆయన విలనీ ఎంత ప్రగాఢమైన ముద్ర వేసేదో! సినీ తారలు పాల్గొన్న సభలో ప్రాణ్‌ ఉన్నాడంటే ప్రేక్షకులు వేదిక దగ్గరకు వెళ్లేందుకు జంకేవారు. తెరపై ఎంత కర్కోటకుడో నిజ జీవితంలో ప్రాణ అంత స్నేహశీలి. 1960 ప్రాంతంలో ‘సిర్కా’ చిత్ర షూటింగ్‌ విరామంలో ప్రాణ్‌ని మొదటిసారి కలిసిన అమితాబ్‌ బచ్చన్‌ ఆయన మాట్లాడే తీరును చూసి ఆశ్చర్యపోయారు. ‘‘విలన్‌ పాత్రల్లో ఎంతో గొప్పగా నటించే ఒక నటునికి ఇంత గొప్ప సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఉండడం సాధ్యమా?’’ అనిపించిందని ఆయనే ఆ తర్వాత చెప్పారు. ప్రకాష్‌ మెహ్రా నిర్మించిన ‘జంజీర్‌’ చిత్రంలో విజయ్‌ పాత్రకు మొదట దేవానంద్‌, ధర్మేంద్రలను పరిశీలించినా, ఆ పాత్ర అమితాబ్‌కు దక్కడం వెనక ప్రాణ్‌ హస్తం ఉంది. ఆ పాత్రే అమితాబ్‌ నటజీవితాన్ని మలుపు తిప్పింది.

సీత పాత్ర నుంచి... హీరోగా...
‘ప్రాణ్‌’ కిషన్‌ సికంద్‌ 12-2-1920 తూర్పు దిల్లీలో బల్లిమరాన్‌ వద్ద సంపన్న కుటుంబంలో పుట్టారు. తండ్రి కేవల్‌ కిషన్‌ ఇంజనీర్‌, తల్లి రామేశ్వరి గృహిణి. ప్రాణ్‌ బాల్యం డెహ్రాడూన్‌, కపుర్తల, మీరట్‌, సిమ్లాలలో గడిచింది. రాంపూర్‌ రజా హైస్కూల్‌లో మెట్రిక్‌ చదువుతుండగా ఫొటోగ్రఫీ మీద ఆపేక్షతో దాస్‌ కంపెనీలో అప్రెంటిస్‌గా చేరి సిమ్లాలో ఫొటోగ్రాఫర్‌గా 1936-39 మధ్య అదే కంపెనీకి పనిచేశారు. నటనపై మక్కువతో మదన్‌ పూరి నిర్వహించే స్టేజి నాటకం ‘రాంలీల’లో సీత పాత్ర ధరించారు. ప్రఖ్యాత రచయిత వలీమహమ్మద్‌ వలి ప్రేరణతో లాహోర్‌ వెళ్లి దిల్షుక్‌ పంచోలి నిర్మించిన ‘యామ్లాజట్‌’ (1940) అనే పంజాబి చిత్రంలో విలన్‌గా నటించారు. మోతిగిద్వాన్‌ దర్శకత్వం నిర్వహించిన ఆ చిత్రం విజయవంతంగా నడిచింది. తర్వాత ‘చౌదరి’, ‘ఖజాంచి’ చిత్రాల్లో నటించిన ప్రాణ్‌కి 1942లో పంచోలి హిందీ చిత్రం ‘ఖాందాన్‌’లో హీరోగా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్ర హీరోయిన్‌ నూర్జహాన్‌ అంతకు ముందు ప్రాణ్‌ నటించిన చిత్రాల్లో బాలనటిగా నటించింది. 1942-46 మధ్య కాలంలో ప్రాణ్‌ లాహోర్‌లో నిర్మించిన 22 చిత్రాల్లో హీరోగా నటించారు.


విలన్‌గా విజృంభణ...
దేశ విభజనానంతరం ప్రసిద్ధ రచయిత సాదత్‌ హసన్‌ మంటో, నటుడు శ్యాంల ప్రోత్సాహంతో లాహోర్‌ వీడి బొంబాయి వచ్చి స్థిరపడిన ప్రాణ్‌కి బాంబేటాకీస్‌ వారి ‘జిద్ది’ చిత్రంతో బ్రేక్‌ వచ్చింది. దేవానంద్‌, కామినీ కౌశల్‌ జంటగా నటించిన ఈ చిత్ర విజయంతో ప్రాణ్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంట వెంటనే ప్రాణ్‌కి ‘గృహస్తి’, ‘అపరాధి’, ‘పుత్లి’ చిత్రాల్లో విలన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘గృహస్తి’ చిత్రం డైమండ్‌ జూబిలీ జరుపుకుంది. ‘బడీ బెహన్‌’లో విలన్‌గా రాణించడంతో 1950-60 మధ్యకాలంలో దిలీప్‌కుమార్‌, దేవానంద్‌, రాజ్‌కపూర్‌ల సరసన విలన్‌గా ప్రాణ్‌ నిలదొక్కుకున్నాడు. శీష్‌ మహల్‌, అదాలత్‌, జషాన్‌ చిత్రాలల్లో ప్రాణ్‌ పలికిన గంభీరమైన డైలాగులు ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. నటనలో దర్పం, క్రౌర్యం, ద్వేషం, పగ కనిపించేవి. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రాణ్‌ చలనచిత్ర వీరవిహారం అప్రతిహతంగా సాగింది. స్వయంగా సున్నిత మనస్కుడైన ప్రాణ్‌ ‘మధుమతి’, ‘రాం ఔర్‌ శ్యాం’, ‘ఆజాద్‌’, ‘దేవదాస్‌, ‘దిల్‌ దియా దర్ద్‌ లియా’, ‘ఆద్మీ’, ‘అమర్‌ దీí’Ã, ‘జబ్‌ ప్యార్‌ కిసీ సే హోతాహై’, ‘చోరి చోరి’, ‘చలియా’, ‘జాగ్తే రహో’ వంటి చిత్రాల్లో ప్రతినాయకునిగా ప్రేక్షకుల మనస్సులో గట్టి పునాది వేసారు. స్టార్‌ డస్ట్‌ పత్రిక ప్రాణ్‌కి ‘విలన్‌ ఆఫ్‌ ది మిలీనియం 2000’ సత్కారాన్నిచ్చి గౌరవించింది. 1967, 69, 72 సంవత్సరాలకు ఉత్తమ విలన్‌గా ప్రాణ్‌ని ఫిలింఫేర్‌ ఎన్నుకుంది. ప్రాణ్‌ ఆషీం బెనర్జీ వంటి బెంగాలీ బాబులు నిర్మించిన కొన్ని బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు. 60 దశకంలో 40వ పడిలో ఉన్నా ప్రాణ్‌కి మంచి డిమాండ్‌ ఉండేది. అది ఎటువంటి డిమాండ్‌ అంటే షమ్మికపూర్‌, ధర్మేంద్ర, రాజేంద్ర కుమార్‌, జాయ్‌ ముఖర్జీ వంటి అగ్రనటులకన్నా ఎక్కువ పారితోషికం తీసుకునేంత! మొదట్లో దిలీప్‌ కుమార్‌, రాజ్‌కపూర్‌ వంటి నటుల సరసన విలన్‌ విరివిగా నటించినా, 1970-80 దశకంలో దేవానంద్‌ చిత్రాలు జానీ మేరా నాం, జోషీలా, ఏ గులిస్తా హమారా, వారంట్‌, దేశ్‌ పరదేశ్‌లలో ప్రాణ్‌కి మంచి పాత్రల్ని సృష్టించడం ద్వారా చిత్ర విజయాలకు అవి బంగారు బాటల్ని వేశాయి.

కేరెక్టర్‌ నటుడిగా...
1967 ప్రాణ్‌ చలనచిత్ర జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించిన సంవత్సరం. మనోజ్‌కుమార్‌ నిర్మించిన ‘ఉపకార్‌’ చిత్రంలో ఊరికి ఉపకారి అయిన మంగళ్‌ చాచాగా వికలాంగుని పాత్రలో ప్రాణ్‌ జీవించారు. ఆ తర్వాత అమితాబ్‌ నటించిన ‘జంజీర్‌’లో షేర్‌ఖాన్‌గా నటించి గొప్ప క్యారెక్టర్‌ నటునిగా గుర్తింపు పొందారు. షేర్‌ఖాన్‌గా తన ఆహార్యం ఎంత సహజంగా ఉండాలో తనే మేకప్‌ మేన్‌కి వివరించి విగ్గు, గడ్డం, మీసాలు తయారుచేయించారు. తల వెంట్రుకల్ని వెనక్కి విసిరే తీరు, కంటిచూపు అన్నీ విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రాణ్‌ది గంభీరమైన గాత్రం. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా అందరూ ప్రాణ్‌ని కీర్తించేవారు. క్రమశిక్షణ విషయంలో గాని సమయపాలన విషయంలో గాని, ప్రాణ్‌కి నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉండేవి. షూటింగ్‌లకు ఏనాడు గైర్‌హాజర్‌ కాలేదు..లేటుగానూ రాలేదు. షూటింగ్‌ విరామ సమయాల్లో కలివిడిగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిష్కరింపజేసేవారు. ప్రాణ్‌కి సంభాషణలు రాసేటప్పుడు రచయితలు కూడా కొన్ని ప్రమాణాలు పాటించేవారు. అది దుష్ట పాత్రయినా అశ్లీలతతో కూడిన సంభాషణలు పలకరాదనేది ప్రాణ్‌ పద్ధతి. తన సహచర నటులు సరిగ్గా నటించడం లేదని తలచినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతినకుండా తగిన సూచనలు చేసేవారు. అందుకే అందరికీ ప్రాణ్‌ అంటే ఎంతో ఇష్టం. ‘మజ్‌ బూర్‌’లో మైఖేల్‌ పాత్రలో ఒక క్రిష్టియన్‌గా, ‘విక్టోరియా నం. 203’లో అశోక్‌కుమార్‌కి తోడుదొంగగా, ‘షహీత్‌’లో క్రూరమైన నేరస్తునిగా, ‘బాబి’లో నిస్పృలో ఉన్న తండ్రిగా ప్రాణ్‌ నటన అసమానం. ప్రాణ్‌ ఏకసంథాగ్రహి. ఒకసారి స్క్రిప్టు చూస్తే చాలు, డైలాగులు తప్పులు లేకుండా ఉచ్చరించేవారు. 1950 దశకంలో ప్రాణ్‌ 62 చిత్రాల్లో, 1960 దశకంలో 60 చిత్రాల్లో నటించారు. ఇది ఒక బాలీవుడ్‌ రికార్డు. ప్రకాష్‌ మెహ్రా తీసిన 9 చిత్రాల్లోనూ ప్రాణ్‌దే కీలక పాత్ర. ప్రాణ్‌ మొత్తం మీద 361 చిత్రాల్లో నటించారు. రాజ్‌కపూర్‌ తీసిన ‘జిస్‌ దేశ్‌మే గంగా బెహతీ హై’లో బందిపోటు దొంగ పాత్ర తనకు చాలా ఇష్టమైన పాత్ర అని ప్రాణ్‌ చెప్పేవారు. ‘హం జోలి’, ‘పరిచయ్‌’, ‘జిందా దిల’Ë్, ‘హత్యారా’, ‘ధన్‌ దౌలత్‌’, ‘సనం బేవఫా’, ‘1942 లవ్‌స్టోరీ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ నటునిగా నటించిన ప్రాణ్‌ ‘జంగల్‌ మే మంగల్‌’లో ద్విపాత్రాభినయం చేశారు. విలన్‌ పాత్రలు క్యారెక్టర్‌ నటుని పాత్రలే కాదు, హాస్య పాత్రల్లో కూడా ప్రాణ్‌ రాణించారు. ‘సాధు ఔర్‌ సైతాన్‌’, ‘నయా అందాజË’్, ‘విక్టోరియా 203’, ‘మన్‌ మౌజి’, ‘బేవకూí’ÆÃ, ‘ఏక్‌రాజ’Ë్ వంటి చిత్రాల్లో ప్రాణ్‌ హాస్య పాత్రలు వేశారు. అమితాబ్‌కి ఫ్లాప్‌ చిత్రాలు ఎదురైనప్పుడు, ‘మృత్యుదాê’Ÿ, ‘తేరే మేరేసప్నే’ వంటి చిత్రాల్లో నటించి అమితాబ్‌ స్టార్డంని ప్రాణ్‌ నిలబెట్టారు.ఉద్యమశీలి...
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అందుకు వ్యతిరేక గళం విప్పిన ధీశాలి ప్రాణ్‌. అంతే కాదు, దేవానంద్‌, శత్రుఘ్నసిన్హా, ఐ.ఎస్‌.జోహార్లతో కలిసి ప్రజాస్వామ్యాన్ని తక్షణం నిలబెట్టాలని ఉద్యమం నడిపిన ప్రజా నాయకుడు ప్రాణ్‌. తెలుగులో తాండ్ర పాపారాయుడు, కొదమ సింహం సినిమాల్లో, కన్నడలో హోసరాగ చిత్రాల్లో ప్రాణ్‌ నటించారు. 2010లో ప్రాణ్‌కి ‘పద్మభూషణ్‌’ పురస్కారం లభించింది. 60వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2013 సంవత్సరానికి భారత ప్రభుత్వం ప్రాణ్‌కి ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రకటించింది.ఆరోగ్య కారణాల వల్ల ఆ పురస్కారం స్వీకరించలేని పరిస్థితుల్లో, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్‌ తివారి స్వయంగా ముంబాయిలో ప్రాణ్‌కి ఆ పురస్కారాన్ని అందజేశారు. ప్రాణ్‌కు భార్య శుక్లా, ఇద్దరు కుమారులు అరవింద్‌, సునీల్‌, కుమార్తె పింకీ ఉన్నారు. స్వయంగా క్రీడాభిమాని అయిన ప్రాణ్‌కి బాంబే డైనమోస్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ పేర స్వంత ఫుల్‌బాల్‌ టీం ఉంది. కపిల్‌ దేవ్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా అరంగేట్రం చేసినప్పుడు అతనికి ఇంగ్లాండ్‌లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన క్రీడాభిమాని ప్రాణ్‌. 2010లో సి.ఎన్‌.ఎన్‌ నిర్వహించిన ఆసియా టాప్‌ 25 గొప్ప నటుల్లో ప్రాణ్‌కి స్థానం లభించింది. సున్నిత మనస్కుడు, ఉదార స్వభావం కలవాడు, స్నేహశీలి అయిన ప్రాణ్‌ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన నటించిన చిత్రాల ద్వారా చలనచిత్ర ప్రేక్షకులకు ప్రాణ్‌ ఎప్పుడూ సజీవుడే!

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.