బాలీవుడ్‌ విలక్షణ నటుడు... శశికపూర్‌
భారతీయ సినిమారంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే జీవితకాల విశిష్ట పురస్కారం ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’. ధూండీరాజ్‌ గోవింద ఫాల్కే అనే దాదా ఫాల్కే భారతీయ సినిమాకు పితామహుడు. 1913లో తొలి పూర్తిస్థాయి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించి, తన 19 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 95 సినిమాలను, పాతిక లఘుచిత్రాలను అందించిన ప్రతిభావంతుడు ఫాల్కే. ‘మోహినీ భస్మాసుర’, ‘లంకాదహన్‌’, ‘శ్రీకృష్ణ జనన్‌’, ‘కాళియ మర్దన్‌’ దాదా నిర్మించిన సినిమాల్లో పేరెన్నికగన్నవి. దాదా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1969లో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’ను తొలిసారి ప్రవేశపెడుతూ, ఆయన సంస్మరణార్ధం ఒక తపాలా బిళ్ళను కూడా 1971లో విడుదల చేసింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే ఈ పురస్కారం కింద, అవార్డు గ్రహీతలకు పది లక్షల నగదు బహుమతితోబాటు స్వర్ణ కమలాన్ని, దుశ్శాలువాను అందజేస్తారు. తొలుత ఈ బహుమతిని చలనచిత్ర ప్రధమ నటిగా గణుతికెక్కిన దేవికారాణికి అందజేశారు. ఇంతవరకు 45 మంది కళాకారులకు ఈ పురస్కారం దక్కగా, 2014 సంవత్సరానికి నాటితరం బాలీవుడ్‌, హాలీవుడ్‌ మేటి నటుడు శశికపూర్‌కు ప్రకటించారు. ఇవాళ ఆయన (డిసెంబర్‌ 4, 2017) వర్థంతి.

article image

* ఒకే కుటుంబంలో ముగ్గురు ‘దాదా’లు..
దేవికారాణి తరవాత రెండు చలనచిత్ర సంస్థలను, రెండు సినిమా థియేటర్లను నిర్మించి సినిమా కళను ప్రోత్సహించిన బీరేంద్రనాథ్‌ సర్కార్‌కు ఫాల్కే మలి పురస్కారం దక్కింది. తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’లో నటించి, ‘పృథ్వీరాజ్‌ థియేటర్స్‌’ నెలకొల్పి, భారతీయ సినిమాకు బహుముఖ సేవలందించిన పృథ్వీరాజ్‌ కపూర్‌కు 1971లో మరణానంతర పురస్కారంగా ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ప్రకటించారు. పృథ్వీరాజ్‌ పెద్ద కుమారుడు, ‘షో మ్యాన్‌’ గా గుర్తింపు పొందిన రాజ్‌కపూర్‌కు 1987లో ఈ పురస్కారం బహూకరించారు. 2015లో పృథ్వీరాజ్‌ ఆఖరి కుమారుడు శశికపూర్‌కు ఫాల్కే పురస్కారం ప్రకటించడంతో తొలితరం కపూర్‌ కుటుంబంలో ఒక్క షమ్మీకపూర్‌ను మినహాయిస్తే, ముగ్గురు కపూర్‌ వంశీయులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కినట్లయింది. పృథ్వీరాజ్‌ కపూర్‌ తరపున అప్పట్లో రాజ్‌కపూర్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించగా, తీరా తన వంతు వచ్చేసరికి ఆయాసంతో బాధపడుతూ అవార్డు స్వీకరిస్తూనే, అంబులెన్సులో వెళ్లి ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. అవార్డును స్వీకరించిన నెల తరవాత రాజ్‌కపూర్‌ మరణించడం దురదృష్టకరం. శశికపూర్‌కు 2011లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఆయనకు మూడుసార్లు జాతీయ పురస్కారం కూడా దక్కింది. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఫాల్కే అవార్డులు దక్కించుకున్న వారిలో దర్శక నిర్మాతలు బిఎన్‌. రెడ్డి (1974), యల్వీ. ప్రసాద్‌ (1982), విజయా సారథి బి. నాగిరెడ్డి (1986), పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావు (1990), నిర్మాత డి. రామానాయుడు (2009), దర్శకులు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ (2016) ఉన్నారు.

* బాలనటుడిగా పరిచయమై...
శశికపూర్‌ అసలు పేరు బలవీర్‌ రాజ్‌ పృథ్వీరాజ్‌ కపూర్‌. ప్రఖ్యాత నటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ సంతానంలో మూడవవాడు. నాటి బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని కలకత్తా నగరంలో 18, మార్చి 1938న జన్మించిన శశికపూర్‌ తండ్రి స్థాపించిన ‘పృథ్వీ థియేటర్స్‌’ తరపున తన నాలుగవ యేటనుంచే నాటకాల్లో వేషాలు వేసేవారు. పెద్దన్నయ్య రాజ్‌కపూర్‌ నిర్మాత దర్శకునిగా 1948లో తొలిసారి నిర్మించిన ‘ఆగ్‌’ సినిమాలో చిన్ననాటి రాజ్‌కపూర్‌ (కేవల్‌) పాత్రలో నటించారు. రాజ్‌కపూర్‌-నర్గిస్‌ జంటగా నటించిన మొదటి చిత్రం కూడా ఇదే! తరవాత 1951లో రాజ్‌కపూర్‌ నిర్మించిన ‘ఆవారా’ సినిమాలో కూడా శశికపూర్‌ చిన్ననాటి రాజ్‌కపూర్‌ (రాజ్‌ రఘునాథ్‌) పాత్రలోనే నటించాడు. ఈ సినిమాలో రాజ్‌కపూర్‌ హీరోగా, అతని తండ్రి పృథ్వీరాజ్‌ కపూర్‌ జడ్జిగా, పృథ్వీరాజ్‌ కపూర్‌ తండ్రి దేవన్‌ విశ్వనాథ కపూర్‌ కమేడియన్‌గా మూడు తరాలవారు నటించడం విశేషం! శశిరాజ్‌ పేరుతో ‘సంగ్రామ్‌’ సినిమాలో చిన్ననాటి అశోక్‌ కుమార్‌గా, బాలనటుడుగా ‘దన పాని’ వంటి సినిమాల్లో కూడా శశి కనిపించారు. 1958లో సునీల్‌ దత్‌ హీరోగా పరిచయమైన ‘పోస్ట్‌ బాక్స్‌ 999’; అజిత్‌-షకీలా నటించిన ‘గెస్ట్‌ హౌస్‌’; రాజకపూర్‌-సాధన నటించిన ‘దుల్హా-దుల్హన్‌’, సినిమాలకు రవీంద్ర దావే వద్ద, అలాగే రాజకపూర్‌-షకీలా నటించిన ‘శ్రీమాన్‌ సత్యవాది’ సినిమాకు యస్సెం అబ్బాస్‌ వద్ద సహాయ దర్శకునిగా శశి పని చేశారు. అలా బాలనటుడుగా పరిచయమై, దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకుని 1961లో తొలిసారి యాష్‌ చోప్రా సినిమా ‘ధర్మపుత్ర’లో హీరోగా అవతారమెత్తిన శశికపూర్‌ తన నట ప్రస్థానంలో 116 సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు. వీటిల్లో అరవైకి పైగా హీరోగా, యాభైకి పైగా మల్టీస్టారర్‌ సినిమాలు ఉన్నాయి. ‘ధర్మపుత్ర’ సినిమా తరవాత ‘చార్‌ దివానీ’, బీమల్‌ రాయ్‌ తీసిన ‘ప్రేమపుత్ర’ వంటి సినిమాల్లో నటించినా శశికపూర్‌కు పెద్దగా బ్రేక్‌ రాలేదు.

article image

* హీరోగా నిలిచి..హాలీవుడ్‌లో గెలిచి..
తండ్రి శిక్షణలో స్టేజి నటుడుగా రాటుదేలి, లవ్‌బాయ్‌గా గుర్తింపు పొందినా, రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర వంటి నటులకు తొలిరోజుల్లోనే వచ్చినంత బ్రేక్‌ శశికి రాలేదు. బాలీవుడ్‌లో నటిస్తూనే ఇంగ్లిషు సినిమాల వైపు దృష్టి సారించి తన కెరీర్‌ను మలుపు తిప్పుకునే ప్రయత్నం చేశారు శశికపూర్‌. బ్రిటిష్‌ దర్శకుడు జేమ్స్‌ ఐవరీ చేతిలో ‘ది హౌస్‌ హోల్డర్‌’ (1963) సినిమాలో లీలా నాయుడు సరసన, అదే దర్శకుని మరో సినిమా ‘షేక్స్పియర్‌-వాలా’ (1965)లో ఫెసిలిటీ కేండాల్‌తో శశికపూర్‌ నటించాడు. జేమ్స్‌ ఐవరీ దర్శకత్వంలోనే మరో చిత్రం ‘బాంబే టాకీ’ (1970)లో నటించాక ప్రఖ్యాత బ్రిటిష్‌ దర్శకుడు కాన్రాడ్‌ రూక్స్‌ శశికపూర్‌తో ‘సిద్ధార్థ’ (1972) సినిమా తీశాడు. అందులో సిమి గారేవాల్‌ శశికి జంటగా నటించింది. ఇవి కాకుండా మరెన్నో బ్రిటిష్‌ దర్శకులు నిర్మించిన సినిమాల్లో శశికపూర్‌ నటించడం విశేషమే! వాటిలో ‘హీట్‌ అండ్‌ డస్ట్‌’ (1983), ‘సమ్మీ అండ్‌ రోసీ గెట్‌ లైడ్‌’ (1987), ‘ది డిసీవర్స్‌’ (1988), ‘ఇన్‌ కస్టడీ’ (1994), ‘జిన్నా’ (1998), ‘సైడ్‌ స్ట్రీట్స్‌’(1998), ‘గలివర్స్‌ ట్రావెల్స్‌’ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లిషు సినిమాల్లో ఎవ్వరికీ రాని అవకాశాలు ఒక్క శశికపూర్‌కి మాత్రమే ఎలా వచ్చాయనేది ముఖ్యమైన ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే శశికపూర్‌ భార్య, బ్రిటీష్‌ నటి జెన్నిఫర్‌ కేండాలే కారణం!

* అలా చిగురించిన ప్రేమ బంధం..
శశికపూర్‌ నట జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే, జెన్నిఫర్‌ను గురించి కూడా చెప్పుకోవాలి. ఆమె లండన్‌లో పుట్టి భారత దేశంలో పెరిగింది. ఆమె తండ్రి జెఫ్రీ కేండాల్‌కు ‘షేక్స్‌పియర్‌ అరియానా’ పేరుతో ఒక సంచార థియేటర్‌ కంపెనీ ఉండేది. ఆ కంపెనీ భారత దేశంలో షేక్స్‌పియర్‌ నాటకాలను ముఖ్య పట్టణాల్లో ప్రదర్శిస్తూ ఉండేది. కలకత్తా పట్టణంలో ‘ది టెంపెస్ట్‌’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు, పృథ్వీరాజ్‌ కపూర్‌కు జెఫ్రీతో పరిచయమైంది. అలా పరిచయం పెరిగి తండ్రి ఆదేశంపై శశికపూర్‌ జెఫ్రీ బృందం ప్రదర్శించే నాటకాల్లో పాత్రలు ధరిస్తూ ఉండేవారు. వారితో టూర్‌ చేస్తున్నప్పుడు, శశికి జెన్నిఫర్‌తో పరిచయం పెరిగి ప్రేమ చిగురించింది. షమ్మీకపూర్‌ భార్య గీతాబాలి సహకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని, ముంబై వచ్చి జెఫ్రీతో కలిసి అక్కడ ‘పృథ్వీ థియేటర్స్‌’ పునరుజ్జీవనానికి కృషి చేశారు. ఇప్పుడు ‘పృథ్వీ థియేటర్స్‌’ ముంబై మహానగరంలో ఉన్న అతిపెద్ద డ్రామా థియేటర్‌. శశికపూర్‌ కూతురు సంజన ఆ థియేటర్ని నిర్వహిస్తోంది. మర్చంట్‌ ఐవరీ ప్రొడక్షన్స్‌ పేరుతో జెఫ్రీ శశికపూర్‌తో చాలా ఇంగ్లిషు సినిమాలు తీసారు. వాటి విజయంతో అనేక గొప్ప దర్శకులవద్ద ఇంగ్లిషు సినిమాల్లో నటించే అవకాశం శశికపూర్‌కు లభించింది. 1984లో శశి భార్య జెన్నిఫర్‌ క్యాన్సర్‌ బారినపడి మరణించడం శశికపూర్‌ని బాగా కుంగదీసింది.

article image

* బాలీవుడ్‌ డ్రీం బాయ్‌..
1960-70లో శశికపూర్‌ నట ప్రస్థానం స్వర్ణ యుగాన్ని తలపిస్తుంది. 1965లో బిఆర్‌ చోప్రా నిర్మించిన ‘వఖ్త్‌’, సూరజ్‌ ప్రకాష్‌ దర్శకత్వం వహించిన ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’ సినిమాలు శశికపూర్‌ని అమాంతం ఆకాశానికి ఎత్తివేశాయి. ‘వఖ్త్‌’ మల్టీ స్టారర్‌ సినిమాలో సునీల్‌ దత్‌, రాజకుమార్‌లతో పాటు సహాయ పాత్ర పోషించినా, ఆ చిత్ర విజయం శశికి మంచి భవిష్యత్తును ప్రసాదించింది. షర్మిలాఠాగూర్‌ తన సరసన నటించడం కూడా శశికి కలిసొచ్చింది. ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’ సినిమాలో నందాతో జంటగా నటించడం, కాశ్మీరులో పడవ నడిపే పాత్రలో నటించడం ప్రేక్షకులకు కొత్తగా తోచింది. కల్యాణ్‌ జీ-ఆనంద్‌ జీ సమకూర్చిన సంగీతం హైలైట్‌గా నిలిచి అల్జీరియా, మొరాకో, లిబియా వంటి ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఈ సినిమా బాగా ఆడింది. అల్జీరియా దేశంలో రెండు సంవత్సరాలకు పైగానే ఈ సినిమా ఆడి ఢంకా బజాయించింది. ఈ సినిమాలో నటించిన నందా అప్పటికే పెద్ద స్టార్‌గా పేరుతెచ్చుకుంది. పడవ నడిపే పాత్రను ధరించేందుకు కాశ్మీర్‌ బోట్‌ నావికుల వద్ద శశి ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాక, వారి వేష భాషలు, ఆహార పద్ధతులు అధ్యయనం చేశారు. యాభై వారాలకు పైగా ఈ సినిమా ఆడి, శశికపూర్‌-నందాలను హిట్‌ పెయిర్‌గా నిలిపింది. ఈ సినిమా విజయంతో నందా శశితో జంటగా నటించేందుకు ఎనిమిది సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవడం శశి సాధించిన విజయంగానే భావించవచ్చు. వీరిద్దరూ జంటగా నటించిన తొలి రెండు సినిమాలు ‘చార్‌ దివనీ’, ‘మెహందీ లగీమేరే హాత్‌’ బాగా ఆడలేదు. ‘జబ్‌ఫూల్‌ ఖిలే’, ‘మోహబ్బత్‌ ఇస్కో కెహతే హై’, ‘నీంద్‌ హమారీ ఖ్వాబ్‌ తుమ్హారే’, ‘రూఠా న కరో’ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్లుగా నిలిచాయి. శశి, నందాను తన అభిమాన హీరోయిన్‌గా చెప్పుకునేవారు. నందా కూడా అంతే! ఎందుకోగాని నందా కన్యగానే ఉండిపోయింది. దర్శకుడు మన్మోహన్‌ దేశాయిని పెళ్ళాడాలనుకున్న నందాకు అతని ప్రమాద పూర్వక మరణం మనోవ్యధకు గురిచేసిందని పెద్దలు అంటుంటారు. 1968లో ప్రకాష్‌ మెహ్రా తొలిసారి దర్శకత్వం నిర్వహించిన ‘హసీనా మాన్‌ జాయెగీ’, మోహన్‌ కుప్లారి సినిమా ‘దిల్‌సే పుకారా’ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచి శశికి మంచిపేరు తెచ్చాయి. కానీ రాజేష్‌ఖన్నా సినిమాల ముందు శశి సినిమాలు చిన్నబోయాయి. ఆరోజుల్లో వచ్చిన ‘కన్నాదాన్‌’, ‘ప్యార్‌కా మౌసం’, ‘అభినేత్రి’ సినిమాలు కూడా గొప్పగానే ఆడాయి. ‘సత్యం శివం సుందరం’, ‘చోరీ మేరా కాం’ వంటి సినిమాలు బాగా ఆడినా, శశి అమితాబ్‌ బచ్చన్‌ వంటి అగ్ర నటులతో పనిచేసిన మల్టీస్టారర్‌ సినిమాలు ‘దీవార్‌’, ‘కభి కభి’, ‘త్రిశూల్‌’ శశికపూర్‌ కన్నా ఇతర నటులకే పేరుతెచ్చిపెట్టాయి. దీవార్‌ సినిమాలో శశి ధరించిన పాత్రను రాజేష్‌ఖన్నా పోషించాల్సి ఉండగా అది శశికి దక్కి, ఉత్తమ సహాయ నటుని బహుమతిని వరంగా ఇచ్చింది.

* సొంత సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు..
ఒకానొక సమయంలో శశికపూర్‌కు ఎంత డిమాండు ఉండేదంటే, అతను ఒప్పుకున్న సినిమాలే వందకు పైగా ఉండేవి. వాటిలో కొన్ని అసమంజసమైనవి కూడా ఉండడంతో శశికపూర్‌ తన పంధాను మళ్ళించి సినిమా నిర్మాణం వైపు మొగ్గుచూపారు. ఆదర్శ దర్శకుడు శ్యాం బెనెగల్‌ దర్శకత్వంలో రస్కిన్‌ బాండ్‌ నవల ‘ఎ ఫ్లైట్‌ ఆఫ్‌ పీజియన్స్‌’ ఆధారంగా 1857 సిపాయి ముట్టడి కథాంశంతో 1978లో ‘జునూన్‌’ సినిమాను హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్మించారు. ఇందులో శశి భార్య జెన్నిఫర్‌ కూడా నటించింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మూడు, ఫిలింఫేర్‌ తరపున ఆరు పురస్కారాలు దక్కాయి. ఈ సినిమా 11వ మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో, కైరో, సిడ్ని అంతర్జాతీయ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శితమై మన్ననలందుకుంది. అదే స్పూర్తితో 1981లో శ్యాం బెనెగల్‌తోనే మరో సినిమా ‘కలియుగ్‌’ నిర్మిస్తే అదికూడా మాస్కోలో జరిగిన 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. 1982లో తన కుమారుడు కునాల్‌ కపూర్‌ని పరిచయం చేస్తూ గోవింద నిహలాని దర్శకత్వంలో ‘విజేత’ సినిమాను హైదరాబాదు సమీపంలో దుండిగల్‌ ఎయిర్‌ బేస్‌లో నిర్మిస్తే, ఆ సినిమాకు మూడు ఫిలింఫేర్‌ బహుమతులు దక్కాయి. బెంగాలీ నటి అపర్ణాసేన్‌ను దర్శకురాలిగా పరిచయంచేస్తూ, తన భార్య జెన్నిఫర్‌ ముఖ్యపాత్రలో నిర్మించిన ‘36-చౌరంఘీ లేన్‌’ సినిమాను బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్మిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకురాలి బహుమతి లభించడమే కాక, మనిలా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, ఆర్థికంగా కూడా విజయవంతమైంది. భార్య చనిపోయాక శశి బాగా బరువు పెరిగి నటనకు పనికిరాని విధంగా తయారయ్యారు. భార్య మరణానంతరం గిరిష్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో శశికపూర్‌ నిర్మించిన ‘ఉత్సవ్‌’ చిత్రంలో అమితాబ్‌ నటించాల్సి ఉండగా ‘కూలీ’ చిత్ర షూటింగులో ఆయన గాయపడడంతో సంస్థానక్‌ పాత్రను శశికపూరే వేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు జాతీయస్థాయి బహుమతితోబాటు, రెండు ఫిలింఫేర్‌ బహుమతులు కూడా దక్కడం విశేషం. కొన్ని ఇంగ్లీషు సినిమాలు నిర్మించాక తనే దర్శకుడిగా మారి ‘అజూటా’ సినిమా నిర్మిస్తే అది ఫ్లాప్‌ అయింది. ఆ తరువాత సినీ పరిశ్రమకు తెల్లజెండా ఊపి విశ్రాంతి తీసుకోవడంలో కాలం వెళ్ళబుచ్చిన శశికపూర్‌కు 2014లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డు తీసుకున్న రెండేళ్లకు తన 79 ఏళ్ల వయసులో 2017 డిశంబరు 4న తుదిశ్వాస విడిచారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.