సంచలన నిర్మాత బోమన్ వాడియా

1930కి ముందు ఆ తరవాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెనుమార్పులు సంభవించాయి. మూకీ యుగంలో ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు చిత్ర పరిశ్రమ పరిమితం కాగా, 1932లో టాకీలు వచ్చాక కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాల నిర్మాణ వ్యయం పెరగడంతో సినిమాలు విజయవంతం కాని పక్షంలో నిర్మాతలు నష్టాల బారిన పడి కష్టాల పాలయ్యారు. క్రమంగా చిత్రసీమ సాంఘిక చిత్రాల బాటపట్టింది. ఈ బాటలో నడిచిన తొలితరం నిర్మాతల్లో వాడియా సోదరులు ముందుంటారు. బోమన్ వాడియా, హోమీ వాడియాలు యాక్షన్, స్టంట్ సినిమాలు నిర్మించి నూతన శకానికి నాంది పలికారు. వారిలో బోమన్ వాడియా అంటే పాతతరం సినీ ప్రేమికులకు తెలుసు. అతడు ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, సినీ రచయిత. వాడియా పూర్తిపేరు జంషెడ్ బోమన్ హోమీ వాడియా. అతడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. పర్షియన్, గుజరాతి, ఉర్దూ భాషల్లో బోమన్ వాడియాకు మంచి పట్టు వుండేది. 1933లో బోమన్ వాడియా తన సోదరుడు హోమీ వాడియాతో కలిసి బొంబాయిలో ‘వాడియా మూవీటోన్’ పేరుతో సినీ నిర్మాణ స్టూడియో స్థాపించారు. వాడియా స్వస్థలం సూరత్. వారిది పారశీకుల కుటుంబం. వారి తాత ముత్తాతలు 1736 నుంచి యుద్దనౌకల నిర్మాణ వ్యాపారం చేసేవారు. వారు నిర్మించిన నౌకలు ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసేది. ఇది కాకుండా చైనా దేశానికి నల్లమందు సరఫరా కూడా చేసేవారు. బోమన్ వాడియా సినిమాల నిర్మాణాన్ని తన వృత్తిగా ఎంచుకోవడం వారి తల్లిదండ్రులకు ఇష్టముండేది కాదు. షిప్పింగ్ వ్యాపారంలోనే స్థిరపడమని చెప్పినా హోమీ వాడియా సోదరులు చలనచిత్ర రంగం వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. హిందీలో స్టంట్ సినిమాలు బోమన్ వాడియాతోనే మొదలయ్యాయి. మేరీ ఆన్న్ ఈవాన్స్ అనే ఆస్త్రేలియన్ సుందరిని బొంబాయి రప్పించి ఆమెకు ‘ఫియర్ లెస్ నాదియా’ అనే పేరుతో స్టంట్ మాస్టర్ గా పెట్టి సినిమాలు నిర్మించిన ఆధునిక నిర్మాత బోమన్ వాడియా. సెప్టెంబరు 13 బోమన్ వాడియా 119వ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు...


మూకీలకు వందనం... టాకీలకు స్వాగతం...

బోమన్ వాడియా స్వతహాగా మంచి రచయిత కావడంతో తనే సొంతంగా స్క్రిప్టులు రూపొందించి మూకీ సినిమాలు నిర్మించారు. తరవాత కొంత కాలానికి బోమన్ వాడియా తమ్ముడు హోమీ వాడియా బోమన్ తో కలిసి సినీ నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. బోమన్ వాడియా చిత్ర నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుంటే హోమీ వాడియా దర్శకత్వ బాధ్యతలు చూసుకునేవాడు. బోమన్ వాడియ తొలిసారి నిర్మించిన మూకీ చిత్రం ‘వసంత లీల (1928). ఈ చిత్రాన్ని దాదర్ వద్ద వుండే కోహినూర్ స్టూడియోలో నిర్మించారు. తరవాత అదే స్టూడియోలో వరసగా పదకొండు మూకీ చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ క్లాసిక్స్ ఆధారంగా నిర్మించినవే కావడంతో సూపర్ హిట్లు కాలేదు కానీ, కలక్షన్ల పరంగా నష్టాలు రాలేదు.


వాడియా మూవీటోన్ ఆవిర్భావం...

1933లో ‘వాడియా మూవీటోన్’ పేరుతో సోదరులిద్దరూ స్టూడియో నిర్మించారు. యుద్ధ నౌక చిత్తరువును వారి లోగో గా చేర్చారు. ఆ స్టూడియోలో బోమన్ వాడియా తొలి టాకీ చిత్రాన్ని నిర్మించారు. అరేబియన్ నైట్స్ కథల ఆధారంగా నిర్మించిన ఆ సినిమా పేరు ‘లాల్-ఎ-యమన్’. ఈ సినిమా అద్భుత విజయ సాధించడంతో తమ్ముడు హోమీ వాడియా ను భాగస్వామిగా చేర్చుకొని వరసగా సినిమాలు నిర్మించడం మొదలెట్టారు. బోమన్ కు మంచేసా బిల్లిమోరా, బుర్జోర్ టాటా, నాదిర్షా టాటా వంటి పంపిణీదారుల సహకారం లభించడంతో వరసగా సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. అయితే మూడు సంవత్సరాలకే టాటా సోదరులు వాడియా మూవీటోన్ సంస్థ నుండి విడిపోయారు. వాడియా సోదరులు ధైర్యం వీడకుండా సినిమాలతోబాటు ‘న్యూస్ రీల్’, ‘ఇండియన్ గెజెట్’ వంటి డాక్యుమెంటరీలు రూపొందించారు. వీటిని సినిమా ప్రదర్శనలకు ముందు ప్రదర్శించేవారు. అంతేకాదు ‘వాడియా మూవీటోన్ వెరైటీ ప్రోగ్రాం’ పేరుతో ప్రఖ్యాత సంప్రదాయ సంగీత కళాకారుల చేత సంగీత సమ్మేళనాలు నిర్వహించి వాటిని కూడా డాక్యుమెంటరీలుగా ప్రదర్శనకు ఉంచేవారు. ఈ డాక్యుమెంటరీలలో బాల గాంధర్వ, మలిక ఫుక్రాజ్, ఫిరోజ్ దస్తూర్, పండిట్ తీర్థంకర్ వంటి మహనీయులు పాల్గొనేవారు. బోమన్ వాడియా ఎన్నో ప్రయోగాలు చేశారు. ‘నవజీవన్’ అనే సినిమాను పాటలు లేకుండా నిర్మించి ఆ చిత్రాన్ని సమాంతరంగా ఇంగ్లీష్, బెంగాలి భాషల్లో నిర్మించి సంచలనం సృష్టించారు. స్వాతంత్ర్యం వచ్చి భారత్, పాకిస్తాన్ విడిపోయాక బోమన్ వాడియా సింధి భాషలో ‘ది కోర్ట్ డ్యాన్సర్’ అనే సినిమా నిర్మించారు. ‘హోటల్ తాజ్ మహల్’ పేరుతో తొలి టెలివిజన్ ధారావాహిక నిర్మించిన ఘనత కూడా వాడియా కుటుంబానికే దక్కుతుంది. ముప్పయ్యవ దశకంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్న సమయంలో బోమన్ వాడియా భారతీయ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. తరవాత కమ్యూనిస్టు నాయకుడు ఎం.ఎన్. రాయ్ తో పరిచయం పెరిగి ఆయన స్థాపించిన ‘ర్యాడికల్ కమ్యూనిజం’ అనే పార్టీలో తీర్థం పుచ్చు కున్నారు. సాంఘిక దురాచారాలైన మహిళా దాస్య విమోచన, కుల నిర్మూలన, విద్యా దానం వంటి సమస్యల పరిష్కారానికి ఎం.ఎన్.రాయ్ కి చేదోడు వాదోడుగా వున్నారు. బోమన్ వాడియా తను నిర్మించిన సినిమాలలో ఈ సమస్యలను నేపథ్యంగా వాడుకున్నారు.


హంటర్ వాలి నాదియా తో సినిమాలు...

వాడియా మూవీటోన్ సంస్థ నుంచి అనేక సినిమాలు వచ్చాయి. స్వదేశ్, బ్లాక్ రోజ్, ఫౌలది ముక్క, జై భారత్, కహా హై మంజిల్ తేరి చిత్రాలు వాటిలో కొన్ని. 1935లో మహిళా హీరోయిన్ ను ప్రధాన పాత్రలో మలిచి ‘హంటర్ వాలి’ అనే సినిమాను బోమన్ వాడియా నిర్మించారు. బ్రిటీష్ ఆర్మీకి చెందిన ఆస్త్రేలియన్ వాలంటీర్ హెర్బర్ట్ ఈవాన్స్ 1913లో సైనిక సేవలు అందించేందుకు కుటుంబంతో భారత్ వచ్చాడు. వారి కూతురు మేరీ ఆన్నే ఇవాన్స్ కు అప్పుడు ఐదేళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న హెర్బర్ట్ జర్మన్ సైన్యం చేతిలో హతమయ్యాడు. అప్పుడు మేరీ తన తల్లి మార్గరెట్ తో కలిసి బొంబాయి వదలి పెషావర్ వెళ్ళిపోయింది. మేరీ అక్కడే గుర్రపు స్వారి, వేట, షూటింగ్, బ్యాలే డ్యాన్సింగ్ లో తర్ఫీదుపొందింది. 1928లో తల్లితో కలిసి బొంబాయి చేరుకుంది. అక్కడ ఆర్మీ గిడ్డంగిలో పనిచేస్తూ హంటింగ్ లో నిష్ణాతురాలైంది. తరవాత జార్కో సర్కస్ లో చేరింది. సర్కస్ కు వెళ్ళిన బోమన్ వాడియా కు మేరీ ప్రదర్శన నచ్చి సినిమాల్లో నటించేందుకు ఒప్పించారు. అలా తొలిసారి ‘దేశ్ దీపక్’ అనే చిత్రంలో ఒక బానిస కన్య వేషంలో ఆమెను నటింపజేశారు. ఆమె నటన నచ్చి మరలా ‘నో-ఎ-యమన్’ చిత్రంలో రాజకుమారి వేషం వేయించారు. ఆ సినిమా పెద్ద హిట్టయింది. బోమన్ వాడియా తమ్ముడు హోమీ వాడియా మేరీ ఈవాన్స్ ను మంచి నటిగా తీర్చి దిద్దాడు. 1935లో వాడియా మూవీటోన్ నిర్మించిన ‘హంటర్ వాలి’ చిత్రంలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. భయం లేకుండా స్టంట్లు చేయడం, హంటర్ తో శత్రువులను తుదముట్టించడం వంటి సన్నివేశాలలో నటించి ఆ సినిమాను సూపర్ హిట్ చేసింది. దాంతో ప్రేక్షకులు మేరీని ‘ఫియర్ లెస్ నాదియా’ని ‘హంటర్ వాలి’ అని పిలవసాగారు. అవే పేర్లు మేరీ ఈవాన్స్ కు సార్ధకమై పోయాయి. 1936లో వాడియా మూవీటోన్ సంస్థ తరఫున బోమన్ వాడియా ‘మిస్ ఫ్రాంటియర్ మెయిల్’ అనే యాక్షన్ క్రైం చిత్రం నిర్మించారు. హోమీ వాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాదియా హీరోయిన్ గా నటించగా, జాన్ కవాస్ హీరోగా నటించాడు. ఇందులో నాదియా స్టంట్స్, పరుగు తీసే ట్రైన్ మీద ఫైట్లు, కార్ల ఛేజింగ్, డైనమైట్ల పేలుళ్లు ప్రేక్షకులను మురిపింపజేశాయి. ఇందులో నాదియా సర్వాంతర్యామి వంటి గుర్రాన్ని స్వారి చెయ్యడం చిత్రానికి హైలైట్ అయింది. ఈ సినిమాను ‘స్పీడెస్ట్ డైమండ్ థ్రిల్లర్’గా పత్రికలు కీర్తించాయి వందరోజులవరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమైంది. 1938లో బోమన్ వాడియా సొంతగా కథ రాసి ‘లుటారు లలనా’ అనే సాహస చిత్రం నిర్మించారు. అందులో నాదియా హీరోయిన్ గా షరాఫ్ హీరోగా నటించారు. సినిమా సూపర్ హిట్టయింది. 1939 లో బోమన్ వాడియా నిర్మించిన మరొక సాహస చిత్రం ‘పంజాబ్ మెయిల్’ అందులో నాదియా సరసన నటించింది జాన్ కావాస్. ఇందులో నాదియా కళ్ళకు ముసుగు ధరించి గుర్రం మీద సాహస కార్యాలు చేస్తూ విలన్ ను చితకబాదుతూ నటించింది. పై మూడు సినిమాలలో దేశభక్తికి పెద్ద పీట వేశారు. బోమన్ వాడియా కథ కూర్చి నాదియా తో నిర్మించిన మరో సినిమా ‘డైమండ్ క్వీన్’. ఇదొక సాహసిక కామెడీ. హోమీ వాడియా దర్శకుడు. వాడియా మూవీటోన్ నిర్మించిన డైమండ్ థ్రిల్లర్ సీరీస్ లో తొలి చిత్రం ‘వీర్ భారత్’ కాగా ఇది ఏడవది కావడం విశేషం. బోమన్ వాడియా నిర్మించిన చిత్రాలన్నిటిలోనా ఈ సినిమా అగ్రాగామిగా పేర్కొనవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సినిమా నిర్మాణం మీద ఆంక్షలు విధించి, సంవత్సరానికి రెండు సినిమాలకన్నా ఎక్కువ తీయరాదని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మధ్య కాలంలో బోమన్ వాడియా మంచి కథలు రాయడానికి అది ఉపకరించింది. ప్రముఖ పాత్రికేయుడు బి.కె. కరాంజియా ఈ చిత్ర షూటింగ్ సమయంలో దూప్ లేకుండా నాదియా చేస్తున్న సాహసిక ఫైట్లు చూసి ముచ్చటపడి ఆమెను గురించి ప్రశంసిస్తూ గొప్పగా పత్రికల్లో రాశారు. సినిమా మరొక సూపర్ హిట్ గా నిలిచింది. తరవాత బోమన్ వాడియా ఫియర్ లెస్ నాదియా తో ‘బొంబాయి వాలి’ (1941), ‘జంగిల్ ప్రిన్సెస్’ (1942),’ముకాబలా’ (1942), ‘హంటర్ వాలి కి బేటి’ ((1943) చిత్రాలు నిర్మించారు. ’11 O’ క్లాక్’ (1948) సినిమా నిర్మాణానికి ముందు బోమన్ వాడియా ను వదలి తమ్ముడు హోమీ వాడియా వెళ్లిపోవడంతో బోమన్, వాడియా మూవీటోన్ కు పరిమితం కాగా, హోమీ వాడియా మాత్రం ‘బసంత్ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి ఎక్కువగా పౌరాణిక చిత్రాలు నిర్మించాడు. బోమన్ వాడియా యాక్షన్ సినిమాలకే పరిమితమయ్యారు. విశ్వాస్, బాలమ్, మేలా, ఆంఖ్ కి షరమ్, అమర్ రాజ్ వంటి సినిమాలు నిర్మిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు.


వ్యక్తిగత జీవితంలో...

బోమన్ వాడియా యెంతో ముచ్చటపడి కట్టుకున్న వాడియా మూవీటోన్ స్టూడియోని దర్శక నిర్మాత వి. శాంతారాం కు అమ్మేశారు. ఆ స్థానంలోనే రాజకమల్ కళామందిర్ స్టూడియో వెలసింది. సంప్రదాయ పార్సీ కుటుంబంలో హిల్లా పటేల్ అనే వనితను బోమన్ వాడియా వివాహమాడారు. వారికి విన్సి అనే కుమారుడు, హైడీ అనే కుమార్తె జన్మించారు. సమాచార రంగంలో కొత్త పుంతలు తొక్కిన నర్గీస్ కంబట్టా ను విన్సి పెళ్ళాడగా, కుమారుడు హైడీ జర్మన్ వనిత గెర్హార్డ్ మయర్ ను వివాహమాడాడు. అన్నకు విరుద్ధంగా హోమీ వాడియా మాత్రం చాలా లేటు వయసులో (1961) నాదియా ను వివాహమాడాడు. వారికి సంతానం కలగకపోవడంతో బాబీ జోన్స్ అనే అబ్బాయిని దత్తస్వీకారం చేసుకున్నాడు. బోమన్ ఇరాని 1986లో క్యాన్సర్ మహమ్మారి బారిన పడి, ఇంటికి దగ్గరలోని రోడ్డును దాటుతూ కారు ప్రమాదానికి గురై మరణించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.