ఆయన ముద్ర చిరస్మరణీయం!

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు అర్థం చెప్పిన వ్యక్తి సునీల్‌దత్‌. సినీ ప్రియులకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సుపరిచితులు. మరో కోణంలో రాజకీయ నాయకుడు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా పనిచేసిన కాలంలో ఆయన కేబినెట్‌లో క్రీడా వ్యవహారాల శాఖామాత్యులుగా ప్రజాసేవలో భాగస్వాములయ్యారు. నర్గీస్‌ దత్‌ ఫౌండేషన్‌ ద్వారా కేన్సర్‌ రోగులకు సాయం అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తింపుగా పదశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. ఈరోజు దత్‌ జయంతి. సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం.


* పుట్టుక... విద్యాభ్యాసం

1930 జూన్‌6న పాకిస్తాన్‌ పంజాబ్‌లోని ఝేలం మండలం ఖుర్ద్‌ గ్రామంలో జన్మించారు సునీల్‌ దత్‌ (బలరాజ్‌ దత్‌). ఐదవ ఏటనే తండ్రి దివాన్‌ రఘునాధ్‌ దత్‌ మరణించారు. భారత్, పాకిస్తాన్‌ విడిపోయిన తరువాత రఘునాధ్‌ దత్‌ స్నేహితుడు యాకూబ్‌ సహకారంతో యమునా నగర్‌ సమీపంలోని మండేలి గ్రామంలో స్థిర పడ్డారు. తరువాత ముంబైలోని జైహింద్‌ కళాశాలలో గ్య్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి బెస్ట్‌ ట్రాన్స్‌పోర్టు డివిజన్‌లో ఉద్యోగిగా చేరారు.


* కెరీర్‌ ప్రారంభం.. వివాహం

దక్షిణాసియాలో ప్రసారమయ్యే సిలోన్‌ రేడియోలో హిందీ భాషలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సునీల్‌ బాధ్యతలు నిర్వహించేవారు. 1955లో విడుదలైన ‘రైల్వేప్లాట్‌ఫాం’ సినిమాలో ‘రామ్‌’ పాత్రలో నటించి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ఆయనకు పేరు తెచ్చింది. ఆ తరువాత ‘మదరిండియా’(1957) సినిమాలో ఆయన నటనతో తిరుగులేని నటుడిగా ఎదిగారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో సహనటి నర్గీస్‌ను కాపాడారు. ఈ సంఘటన వారిద్దరి మధ్య ప్రేమ చిగురించేందుకు కారణమైంది. 1958లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు సంజయ్‌ దత్‌ బాలీవుడ్‌ హీరో. కుమార్తె ప్రియదత్‌ ఎంపీగా సేవలందించారు.


* నటుడిగా గుర్తింపు

1950-60 దశకంలో అప్రతిహతంగా నటుడిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు సునీల్‌ దత్‌. ‘సాధన’, ‘సుజాత’, ‘ముఝేజీనేదో’,‘ఖాన్‌దాన్‌’,‘పడౌసన్‌’ చిత్రాలు ఆయనకు మరింత పేరును తెచ్చిన చిత్రాలు. పలు చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో నటించారు.

* దర్శకుడు... నిర్మాత

1964లో వచ్చిన సినిమా ‘యాదే’ ఈ సినిమాతో ఆయన నటుడిగా, దర్శకుడిగా రికార్డును సృష్టించారు. దత్‌ నిర్మాతగా 1971లో వచ్చిన చిత్రం ‘రేష్మా ఔర్‌ షేరా’. ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద వసూళ్లను రాబట్టలేక నిరాశను మిగిల్చింది. 1982లో వచ్చిన నిర్మించిన చిత్రం ‘దర్‌్్ద కా రిష్తా’. అంతకు ముందు నిర్మాత, దర్శకుడు బీఆర్‌ చోప్రాతో కలిసి ‘గుమ్రాహ్‌’,‘వక్త్’, ‘హమ్‌రాజ్‌’ వంటి విజయవంతమైన చిత్రాలకు భాగస్వామిగా వ్యవహరించారు.


* అవార్డులు... గుర్తింపు

సునీల్‌ దత్‌ నటించిన పలు సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు అవార్డులను తెచ్చిపెట్టాయి.1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది. 1963లో వచ్చిన ‘ముఝేజానేదో’ సినిమాలో ఉత్తమ నటుడి అవార్డును అందుకొన్నారు. ‘యాదే’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సినిమా, ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డు దక్కింది. ‘ఖాన్‌దాన్‌’ సినిమాలో నటనకు ఫిలింఫేర్‌ అవార్డు,‘మిలన్‌’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు, షరీఫ్‌ ఆఫ్‌ ముంబైగా గుర్తింపు, ఆ తరువాత ఫిలింఫేర్‌ అవార్డులతో పాటు, జీవిత సాఫల్య, దాదాసాహెబ్‌ ఫాల్కే అకాడమీచే ‘ఫాల్కే రత్న’,రాజీవ్‌ గాంధీ జాతీయ సద్భావన అవార్డు, ఐఐఎఫ్‌ఎస్‌ లండన్‌ నుంచి గ్లోరీ ఆఫ్‌ ఇండియా అవార్డులను అందుకొన్నారు.


* రాజకీయ రంగ ప్రవేశం
1984లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సునీల్‌ దత్‌ వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి 5 సార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. ఆయన కుమారుడు సంజయ్‌ దత్‌ ఆయుధాల కేసులో ఇరుక్కొన్న కారణంగా రాజకీయ జీవితానికి దూరమయ్యారు.

* సామాజిక సేవ
భార్య నర్గీస్‌ ప్రాంకియాసిస్‌ కేన్సర్‌ బారిన పడి మరణించారు. ఆమె జ్ఞాపకార్థం దత్‌ ‘నర్గీస్‌ దత్‌ ఫౌండేషన్‌’ను కేన్సర్‌ రోగుల సహాయార్థం ప్రారంభించారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా ‘ఆపరేషన్‌ స్మైల్‌’కు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.


* మరోసారి నటుడిగా

నటన నుంచి విరామం తీసుకొన్న దత్‌ 2003లో మరోసారి నటుడిగా వెండితెరపై కనిపించారు సంజయ్‌ దత్‌ హీరోగా వచ్చిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలో హరి ప్రసాద్‌శర్మ పాత్రలో నటించారు. సంజయ్‌దత్‌ హీరోగా పరిచమైన మొదటి సినిమా ‘రాకీ’. ఆ తరువాత వచ్చిన సినిమా ‘క్షత్రియ’. ఈ చిత్రాల్లో కూడా కుమారుడితో కలిసి నటించారు.

* మరణం
ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో క్రీడాశాఖా మంత్రిగా పనిచేస్తున్న సునీల్‌ దత్‌ 2005 మే 25న గుండె పోటుతో ముంబైలో మృతి చెందారు. 

- ఓగేటి వల్లీనాథ్ Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.