చలనచిత్ర భరతముని ... గోపీకృష్ణ
భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు. ప్రాచీన కాలంలో నాట్యాచార్యుడు భరతముని ప్రవేశపెట్టిన ఈ నాట్య ప్రక్రియ కాలగమనంలో అనేక మార్పులు సంతరించుకుంది. విభిన్న సంస్కృతులతో నిండిన మన దేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలు విలసిల్లాయి. ప్రధానంగా 1950 తరవాత వచ్చిన సినిమాలలో పాశ్చాత్య దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు జనాదరణ పొందుతూ వస్తున్నాయి. ఈ ఆధునిక నృత్య ప్రక్రియకు యెందరో నాట్యాచార్యులు శ్రమించి జనరంజకమైన నృత్యాలను సినిమాల ద్వారా ప్రవేశపెట్టి ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నారు. అటువంటి నాట్యాచార్యుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది గోపీకృష్ణ గురించి. గోపీకృష్ణ కథక్ నాట్యప్రవీణుడు. ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకనిర్మాత వి. శాంతారాం 1955లో నిర్మించిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ సినిమా పూర్తి నాట్య ప్రధానాంశంతో నిర్మించింది. అందులో గోపీకృష్ణ హీరోగా, శాంతారాం భార్య సంధ్య హీరోయిన్ గా నటించారు. ‘నైన్ సో నైన్ నహీ మిలావో దేఖత్ సూరత్ అవత్ లాజ్ సయ్యా’ అనే వసంత దేశాయి సంగీతం సమకూర్చిన పాటకు కథక్ శైలిలో గోపికృష్ణ సంధ్య తో కలిసి మైసూరు బృందావన్ గార్డెన్స్ లో చేసిన నాట్యం ఆరోజుల్లో ప్రేక్షకులకు కనువిందు చేసింది. అలాంటిదే గోపీకృష్ణ సంధ్య తో కలిసి చేసిన మరో కథక్ ‘మురళి మనోహర్ కృష్ణ కన్హయ్యా జమునా కే తట్ పే విరాజే హై’ అలాగే మరికొన్ని ’రుత్ బసంత్ ఆయీ బన్-బన్ ఉపబన్’; ‘అబ్ తో సాజన్ ఘర్ ఆజా’ (రాగమాలిక) వంటి పాటలతో కూడిన కథక్ నృత్యాలు ఆరోజుల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. గోపీకృష్ణ హిందీలోనే కాదు ‘భూకైలాస్’ తెలుగు చిత్రంలో కూడా కైలాసనాథుని ఎదుట అద్భుత నాట్యం చేసి అలరించారు. ఆగస్టు 22, గోపీకృష్ణ 86వ జయంతి సందర్భంగా ఆ ప్రఖ్యాత నాట్యాచార్యుని గురించి తెలుసుకుందాం...


కథక్ నృత్యంలో నిష్ణాతుడుగా...
గోపీకృష్ణ కలకత్తాలోని గొప్ప కథక్ నృత్యకళాకారుల కుటుంబంలో జన్మించారు. అతని మాతామహుడు పండిట్ సుఖదేవ్ మహారాజ్ కథక్ నాట్యాచార్యుడుగా ఉంటూ విద్యార్థులకు నాట్యం నేర్పుతుండేవారు. గోపీకృష్ణ మేనత్త సితారా దేవి ప్రఖ్యాత కథక్ నాట్యకారిణి. ఆమె ప్రపంచమంతా తిరిగి యెన్నో నాట్యప్రదర్శనలు ఇచ్చి మన్నన పొందిన వ్యక్తి. పదకొండేళ్ళ వయసున్నప్పుడు గోపీకృష్ణ తన మాతామహుని వద్ద కథక్ నాట్యంలో శిక్షణ పొందారు. తరవాత శంభు మహారాజ్ వద్ద కథక్ నృత్య మెళకువలు నేర్చుకున్నారు. ఆపై మద్రాసు వచ్చి శ్రీ రాజరాజేశ్వరి భరత నాట్య కళామందిర్ లో మహాలింగం పిళ్ళై, గోవిందరాజ్ పిళ్ళై లవద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పదిహేను ఏళ్ళకే గోపీకృష్ణ బెంగాల్ సంగీత సమ్మేళనంలో ప్రదర్శన ఇచ్చి ‘నటరాజు’ అనే బిరుదు గడించారు. గోపీకృష్ణ వద్ద కథక్ డ్యాన్స్ నేర్చుకున్న తారల్లో మధుబాల, వైజయంతిమాల, ముంతాజ్, సంధ్య, మనీషా కొయిరాల, రవీనా టాండన్, మాలా సిన్హా, అనితా రాజ్, పద్మా ఖన్నా, ట్వింకిల్ ఖన్నా, ఆశా పరేఖ్, డింపుల్ కపాడియా వంటి టాప్ హీరోయిన్లు వున్నారు.


కొరియోగ్రాఫర్ గా హిందీ చిత్ర రంగంలో...
1952లో తల్వార్ ఫిలిమ్స్ వారు హెచ్.ఎస్. రావైల్ దర్శకత్వంలో ‘సఖి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో మధుబాల, ప్రీమ్ నాథ్, బిపిన్ గుప్త, ఇఫ్తేకర్, హీరాలాల్ నటించారు. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ చిత్రానికి కమల్ అమ్రోహి సంభాషణలు సమకూర్చగా నృత్యదర్శకుడిగా తొలిసారి గోపీకృష్ణ పనిచేశారు. లతా మంగేష్కర్ ఆలపించిన ‘దిల్ పెహలా అవుర్ ప్యార్ దూస్రా తీస్రీ జవాని’ ; ‘పాస్ నహీ ఆయియే హాథ్ న లగాయియే’ అనే బృందగానాలకు గోపీకృష్ణ అద్భుతమైన నృత్యరీతులు సమకూర్చారు. 1955లో దర్శక నిర్మాత వి. శాంతారాం నిర్మించిన బాక్సాఫీస్ హిట్ చిత్రం ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ సినిమాలో తొలిసారి హీరో గిరిధర్ పాత్రలో గోపీకృష్ణ తెరమీద కనిపించి తన నృత్యకళా వైభవాన్ని కన్నులపండుగ చేశారు. ఇందులో గోపీకృష్ణ సరసన శాంతారాం భార్య సంధ్య నటించగా వసంత దేశాయ్ సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈ సినిమా ఆరోజుల్లో వచ్చిన ఒక గొప్ప సంగీత నృత్యప్రధాన చిత్రం. ఇందులో పద్మవిభూషణ్ శివకుమార్ శర్మ సంతూర్ వాయించడం విశేషం. సంతూర్ వాద్యాని మొట్టమొదట వాడిన సినిమా ఇదే కావడం కూడా ఒక విశేషమే. ఇందులో హేమంతకుమార్, లతాజీ ఆలపించగా గోపీకృష్ణ, సంధ్య మీద చిత్రీకరించిన ‘నైన్ సో నైన్ నహీ మిలావో’ నృత్యం ఆరోజుల్లో పెద్ద క్రేజ్ గా మారింది. ఈ పాటను మైసూరు బృందావన్ గార్డన్ లో చిత్రీకరించారు. ఈ పాట బినాకా గీత్ మాలా వార్షిక రేటింగులో ద్వితీయ స్థానంలో నిలిచింది. గోపీకృష్ణ, సంధ్య ల మీద చిత్రీకరించిన మరొక నృత్యగీతం లతాజీ, మన్నాడే, ఉస్తాద్ ఆమీర్ ఖాన్ ఆలపించిన ‘మురళి మనోహర్ కృష్ణ కన్హయ్యా’. ఈ నృత్యగీతంలో గోపీకృష్ణ, సంధ్య లతోబాటు ముంతాజ్, మనోరమ, జయశ్రీ గడకర్, మదన్ పురి కూడా కనిపిస్తారు. ఇది పూర్తి క్లాసికల్ కథక్ నృత్యరీతి. గోపీకృష్ణ సంధ్య కలిసి కథక్ నృత్యం నేర్చుకునే పాట ‘రుత్ బసంత్ ఆయీ బన్-బన్ ఉపబన్ ద్రమ్ మిలింద్ ప్రఫులిత్ సుగంద్’ కూడా ఒక అద్భుతమే. మేఘమల్హర్ రాగంలో లతా మంగేష్కర్, మన్నాడే ఆలపించిన ‘అబ్ తో సాజన్ ఘర్ ఆజా’ పాటలో కేవలం గోపీకృష్ణ, సంధ్య ల పాద నృత్యం మాత్రమే చూపిస్తూ ప్రకృతి పులకింతను చిత్రీకరించడం శాంతారాం కు మాత్రమే సాధ్యమయిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాకు ఉత్తమ చలనచిత్రంగా జాతీయ బహుమతి తోబాటు, ఉత్తమ హిందీ చిత్ర బహుమతి కూడా లభించింది. ఫిలింఫేర్ సంస్థ శాంతారాం కు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత బహుమతులు ప్రదానం చేసింది. ఈ చిత్రానికి హీరోగా నటించడమే కాకుండా గోపీకృష్ణ కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించి మంచి నృత్యరీతులను సృష్టించారు.


నృత్య దర్శకుడుగా రాణించి ...
1963లో జెమినీ వాసన్ కిషోర్ సాహు దర్శకత్వంలో నిర్మించిన ‘గ్రహస్థి’ (తెలుగులో మంచికుటుంబం & తమిళంలో మోటార్ సుందరం పిళ్ళై) చిత్రానికి గోపీకృష్ణ నృత్య దర్శకునిఘా పనిచేశారు. అందులో మనోజ్ కుమార్ సరసన శాంతారాం కూతురు రాజశ్రీ నటించింది. బాక్సాఫీస్ హిట్టయిన ఈ సినిమాలో గోపీకృష్ణ సృష్టించిన డ్యాన్స్ లు ప్రత్యేకంగా కనిపించాయి. ’జీవన్ జ్యోతి జలే’ అనే క్లాసికల్ పాటకు సంగీత దర్శకుడు రవి ఉత్తమ సంగీతదర్శకుని బహుమతి అందుకున్నారు. ఇందులో ‘ఖిలే హై సఖి ఆజ్ పుల్వా మన్ కే’ అనే పాటకు గోపీకృష్ణ కంపోజ్ చేసిన బృంద నృత్యం చాలా బాగుంటుంది. మరో యుగళ గీతం ‘జానే తేరి నజరోం నే క్యా కర్ దియా’ లో మనోజ్ కుమార్, రాజశ్రీ ల మీద ఒక సరదా నృత్యాన్ని కంపోజ్ చేశారు. తరవాత ‘దాస్తాన్’, మెహబూబా’, ‘ఉమ్రావ్ జాన్’, ‘నాచే మయూరి’, ‘రాకీ’, ‘కుద్రత్’, ‘ఆంచల్’, ‘ఖూబ్ సూరత్’, ‘మీరా’, ‘హత్యారా’, ‘పత్తర్ అవుర్ పాయల్’, ‘నమక్ హరామ్’, ‘రాజా జాని’, ‘బావర్చి’, ‘ఆమ్రపాలి’ వంటి ఎన్నో చిత్రాలకు గోపీకృష్ణ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. 1960 లో చైనా తో యుద్ధం ముగిశాక సునీల్ దత్ ఆధ్వర్యంలో ‘అజంతా ఆర్ట్స్ కల్చరల్ ట్రూప్’ తరఫున భారతదేశపు సరిహద్దుల్లో రక్షణ సేవలు అందిస్తున్న వీర జవానులను ఉత్సాహపరిచేందుకు పర్యటించిన బృందంలో గోపీకృష్ణ సభ్యుడు గా వున్నారు. ఆపైన గోపీకృష్ణ సొంతంగా ‘నట్యేశ్వర్ భవన్ డ్యాన్స్ అకాడమీ’, ‘’నట్యేశ్వర్ నృత్య కళామందిర్’ లను స్థాపించి ఔత్సాహిక కళాకారులకు నృత్యరీతులను నేర్పించారు. గోపీకృష్ణ నిరంతరాయంగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలపాటు కథక్ నృత్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. నృత్యకారుడుగా గోపీకృష్ణది ఒక ప్రత్యేకమైన శైలి. కథక్ నృత్య ప్రక్రియలో ఆ శైలిని ‘బెనారస్ ఘరానా శైలి’ అని వ్యవహరిస్తారు. ఈ నృత్యరీతిలో భరతనాట్యం, కథాకళి లక్షణాలను మేళవించి నూతన నృత్య రీతిని ప్రవేశపెట్టారు.

                                     
తెలుగు సినిమాలలో...
గోపీకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘భక్త జయదేవ’ చిత్రంలో ‘ప్రియే చారుశీలే’ వంటి రాధాకృష్ణుల నాట్య ఘట్టాలలో కృష్ణుడు గా నటించి అద్భుత నాట్య రీతులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇక ‘భూకైలాస్’ చిత్రంలో కైలాసంలో శివుని ఎదుట నాట్యం చేసి కథక్ నృత్య రీతులను అద్భుతంగా పండించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సాగరసంగమం’ చిత్రంలో ‘నాదవినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము’ అనే పాటకు నృత్య దర్శకత్వం నిర్వహించింది గోపీకృష్ణే. హిందీలో ‘నాచే మయూరి’ పేరుతో పునర్నిర్మించిన ‘మయూరి’ చిత్రానికి నృత్య దర్శకుడు కూడా గోపీకృష్ణే. అలాగే మరో విశ్వనాథ్ సినిమా ‘స్వర్ణకమలం’ లో ‘ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లు’ పాటకు కొరియోగ్రాఫర్ కూడా అతడే. మొత్తం మీద గోపీకృష్ణ 800 సినిమాలకు పైగా కోరియోగ్రఫీ అందించి కీర్తిని ఆర్జించారు.

వ్యక్తిగతం...
గోపీకృష్ణ 1964 లో సావిత్రి అనే కథక్ నృత్య కళాకారిణి ని వివాహమాడారు. 1980లో వారికి శంపా సొంతాలియా అనే కూతురు జన్మించింది. ఆమె కూడా మంచి కొరియోగ్రాఫర్ గా రాణించింది. ‘ఝలక్ దిఖలా జా’ అనే బిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వాటి టెలివిజన్ రియాలిటీ షో లో ప్రధమ స్థానంలో నిలిచింది. ఆల్ బెంగాల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ లో గోపీకృష్ణ కు ‘నటరాజ్’ బిరుదు ప్రదానం చేశారు. ప్రయాగ సంగీత సమితి ‘నృత్య సామ్రాట్’ బిరుదు తో గోపీకృష్ణ ను సత్కరించింది. భారత ప్రభుత్వం గోపీకృష్ణకు ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. గోపీకృష్ణ 18 ఫిబ్రవరి 1994లో హృద్రోగంతో ముంబైలో మరణించారు.
ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.