గ్రేటెస్ట్‌ కమేడియన్‌

రేడియో... నాటకం... టీవీ... సినిమా... ఇలా అన్ని వినోద మాధ్యమాల్లోనూ తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు గ్రౌచో మార్క్స్‌. ‘అమెరికాస్‌ గ్రేటెస్ట్‌ కమేడియన్‌’గా పేరు తెచ్చుకున్నాడు. తన ముగ్గురు సోదరులతో కలిసి ‘మార్క్స్‌ బ్రదర్స్‌’ పేరిట 13 సినిమాలు తీశాడు. మరో 13 సినిమాలను తానే నిర్మించాడు. న్యూయార్క్‌లో 1890 అక్టోబర్‌ 2న పుట్టిన ఇతడు తండ్రి ప్రోత్సాహం మీద తన సోదరులతో కలిసి పాటలు పాడుతూ, హాస్య కార్యక్రమాలు చేస్తూ చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ సోదరుల కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఆపై రేడియో, బుల్లితెరలపై కూడా హంగామా చేశారు. వీరిలో గ్రౌచో తనదైన వేషభాషలతో ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నాడు. నోటిలో చుట్ట, పొట్టి మీసం, గుండ్రని కళ్లజోడుతో విలక్షణంగా ఆకట్టుకున్నాడు. ఇతడి కళ్లజోడు కూడా ‘గ్రౌచో గ్లాసెస్‌’గా పేరు పొందాయి. ఎన్నో సినిమాల్లో నవ్వించి అనేక అవార్డులు అందుకున్న గ్రౌచో, కాలిఫోర్నియాలో 1977 ఆగస్టు 19న తన 86వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.