బాలీవుడ్‌ విషాద చక్రవర్తి... గురుదత్‌

బాలీవుడ్‌ స్వర్ణయుగంలో వెలసిన ఒక అద్భుత మణిరత్నం గురుదత్‌. అతడు కేవలం ఒక అద్భుత నటుడే కాదు, మంచి రచయిత, నిర్మాత, దర్శకుడు కూడా. బెంగాలీ చిత్రసీమలో సత్యజిత్‌ రాయ్‌కి ప్రయోగాలు చేయడంలో, భావోద్వేగపు చిత్రాలు నిర్మించడంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయో, హిందీ చిత్రసీమలో గురుదత్‌ సినిమాలు కూడా అదే కోవకు చెందుతాయని సినీ పండితులు చెబుతుంటారు. యాభై దశకంలో నిర్మించిన గొప్ప చిత్రాల్లో గురుదత్‌ నిర్మించిన చిత్రాలకు తొలి పంక్తిలోనే స్థానం లభిస్తుందనే మాట నిర్వివాదాంశం. స్వాతంత్య్రానంతరం నిర్మితమైన సినిమాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాటిని అమలు పరచిన అతికొద్ది నిర్మాతలలో గురుదత్‌ ఒకరు. బాలీవుడ్‌ క్లాసిక్స్‌ అనదగిన ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే పూల్  ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్’, ‘చౌద్వి కా చాందిని సినిమాలు గురుదత్‌ ప్రసాదితాలే! ముఖ్యంగా ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే పూల్‌’ సినిమాలను అంతర్జాతీయ ‘టైమ్‌ మ్యాగజైన్‌’ 100 ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ సినిమాల జాబితాలో చేర్చింది. ‘సైట్‌ అండ్‌ సౌండ్‌ క్రిటిక్స్‌ గురుదత్‌ పేరును ‘ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫిలిం దర్శకుల’ జాబితాలో చేర్చింది. అంతేకాదు, సి.ఎన్‌.ఎన్‌ సంస్థ ‘ఆసియా ఖండంలోని టాప్‌ 25 దర్శకుల జాబితా’లో గురుదత్‌ పేరును ప్రకటించింది. జులై 9న  గురుదత్‌ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుని గురించి స్మరించుకుందాం...


కుటుంబ నేపథ్యం...

గురుదత్‌ పుట్టింది జూలై 9, 1925 న బెంగుళూరులో. ఆయన అసలు పేరు వసంత కుమార్‌ శివశంకర్‌ పదుకొణే. చిన్నతనంలో జరిగిన ప్రమాదం రీత్యా అతని తల్లిదండ్రులు వసంత కుమార్‌ పేరును గురుదత్‌గా మార్చారు. పాఠశాల చదువు కలకత్తాలో సాగింది. ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో గురుదత్‌ కాలేజీ చదువుకు స్వస్తి చెప్పి కలకత్తాలోని లీవర్‌ బ్రదర్స్‌ ఫ్యాక్టరీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరారు. కొంతకాలం పండిట్‌ రవిశంకర్‌ సోదరుడు ఉదయ శంకర్‌ ఆల్మోరా (ఉత్తరాఖండ్‌)లో నడుపుతున్న నాటక సమాజంలో చేరారు. తర్వాత 1944లో బొంబాయిలోని తల్లిదండ్రుల వద్దకు చేరారు. తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడూ పోట్లాడు కోవడం, తన మేనమామ కుటుంబం గురుదత్‌ తల్లిదండ్రులతో విరోధం పెంచుకొని వారిని ఆర్ధిక బాధలకు గురిచేయడం వంటి సున్నితమైన విషయాలు గురుదత్‌ స్వభావం మీద ఎక్కువ ప్రభావం చూపాయి. దాంతో గురుదత్‌ పూణేకు చేరుకొని ప్రఖ్యాత ప్రభాత్‌ స్టూడియోలో చేరారు. ఇక్కడే గురుదత్‌ దశ తిరిగింది. ప్రఖ్యాత నటులు దేవానంద్‌, రెహమాన్‌ లతో పరిచయమై అది ప్రాణస్నేహంగా పెరిగింది. అక్కడే నటుడిగా ‘చాంద్‌’ వంటి సినిమాలలో చిన్నచిన్న వేషాలు వేశారు. విశ్రామ్‌ బడేకర్‌ నిర్మించిన ‘లఖ్రాని’ (1945) సినిమాలో నటించడమే కాకుండా ఆ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. తర్వాత తను నేర్చుకున్న నాట్యకళాకౌశలంతో పి.ఎల్‌. సంతోషి నిర్మించిన ‘హమ్‌ ఏక్‌ హై’ సినిమాకు కొరియోగ్రాఫర్‌ గా, సహాయ దర్శకుడిగా కూడా వ్యవహరించారు. 1947 లో ప్రభాత్‌ స్టూడియో తోకాంట్రాక్టు అయిపోవడంతో కొంతకాలం బాబూరావు పాయ్‌ వద్ద స్వచ్చంద విలేకరిగా పనిచేశారు. తరవాత బొంబాయికి మకాం మార్చి ‘ది ఇల్లస్టేట్రెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ మ్యాగజీన్‌కు ఇంగ్లీషులో కథలు, శీర్షికలు రాశారు.


దేవానంద్‌తో దోస్తీ...

బొంబాయిలో గురుదత్‌ ఇద్దరు ప్రఖ్యాత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశారు. వాటిలో అమియా చక్రవర్తి నిర్మించిన ‘గరల్స్‌ స్కూల్‌’ ఒకటి కాగా రెండవది గ్యాన్‌ ముఖర్జీ నిర్మించిన ‘సంగ్రామ్’. తరవాత గురుదత్‌కు నవకేతన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మాత, ప్రఖ్యాత నటుడు దేవానంద్‌ తను నిర్మించబోయే రెండవ చిత్రం ‘బాజీ’కి దర్శకత్వం నిర్వహించే అవకాశం ఇచ్చారు. వీరిద్దరి పరిచయం విచిత్రంగా జరిగింది. పూణే ప్రభాత్‌ స్టూడియోలో పి.ఎల్‌. సంతోషి దర్శకత్వంలో ‘హమ్‌ ఏక్‌ హై’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. దేవానంద్‌ అందులో తొలిసారి హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాకు గురుదత్‌ కొరియోగ్రాఫర్‌. షూటింగ్‌ విరామ సమయంలో దేవానంద్‌కు గురుదత్‌ తన షర్టుతో కనిపించాడు. తన షర్టు గురుదత్‌ ఎలా వేసుకున్నాడా అని దేవానంద్‌కు అనుమానమొచ్చింది. వెంటనే గురుదత్‌ను అడిగాడు. గురుదత్‌ బదులిస్తూ తన షర్టు ల్యాండ్రీలో వేశానని, మరో చొక్కా లేకపోవడంతో లాండ్రీ బాయ్‌ని అడిగి ఈ షర్టు తొడుక్కొని వచ్చానని వివరిస్తూ, దేవానంద్‌కు క్షమాపణ చెప్పాడు. ఈ సంఘటనే వారిద్దరినీ ప్రాణ స్నేహితులుగా మార్చింది. ఆ స్నేహ చిహ్నంగా వారిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. గురుదత్‌ ముందు నిర్మాతగా మారితే ఆ సినిమాలో దేవానంద్‌ హీరోగా నటించాలని, ఒకవేళ దేవానందే ముందుగా నిర్మాత అయితే ఆ సినిమాకు గురుదత్‌ దర్శకత్వం వహించాలనేది ఆ ఒప్పందం. దేవానంద్‌ తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ నవకేతన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన రెండవ చిత్రం ‘బాజీ’ (1951)కి గురుదత్‌ను దర్శకునిగా నియమించారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా కోసం గురుదత్‌ హాలీవుడ్‌ కెమెరా టెక్నిక్‌ ను ఉపయోగించి వెలుగు విరజిమ్మే షాట్‌ను చిత్రీకరించారు. తరవాతి కాలంలో అది ‘గురుదత్‌ షాట్‌’గా ప్రఖ్యాతి చెందింది. ఈ సినిమాకు గురుదత్‌ కథను సమకూర్చగా, నటుడు బల్రాజ్‌ సాహ్ని సంభాషణలు సమకూర్చడం విశేషం. అందులో దేవానంద్‌, గీతాబాలి హీరో, హీరోయిన్లుగా నటించారు. ‘బాజి’ సినిమా సూపర్‌ హిట్‌ కావడమే కాకుండా గురుదత్‌కు ఓ మంచి కానుక ప్రసాదించింది. సినిమా ముహూర్తం రోజున గీతా రాయ్‌ ఆలపించగా రికార్డు చేసిన ‘తబ్దీర్‌ సే బడీ హుయీ తఖ్దీర్‌ బనాలే’ అనే గజల్‌ గురుదత్‌ను విస్మయానికి గురిచేసింది. గీతారాయ్‌తో గురుదత్‌ ప్రేమలో పడడం, ఇద్ద్దరూ 1953లో ఒక ఇంటివారవడం, గీతారాయ్‌ గీతాదత్‌గా మారిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం గురుదత్‌ నిర్మించిన సి.ఐ.డి.లో దేవానంద్‌ హీరోగా నటించాడు. 1952లో మరో విజయవంతమైన సినిమా ‘జాల్‌’కు దర్శకత్వం వహించారు. అందులో కూడా దేవానంద్‌, గీతాబాలి జంటగా నటించారు. గురుదత్‌ నిర్మించిన రెండవ చిత్రం ‘జాజ్‌’ సినిమాలో కూడా దేవానందే హీరో. కానీ దేవానంద్‌ అన్న చేతన్‌ ఆనంద్‌ వీరిద్దరిమధ్య అడ్డుగోడగా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తరవాత సినిమాలు రాలేదు.

విజయవంతమైన దర్శకనిర్మాత

గురుదత్‌ మంచి విజయవంతమైన నిర్మాత, దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు. 1954లో ‘ఆర్‌ పార్‌’ సినిమా నిర్మించి దర్శకత్వం వహించారు. గురుదత్‌కు సన్నిహిత మిత్రుడు అబ్రార్‌ ఆల్వి ఈ సినిమాకు కథ రాసి, సంభాషణలు సమకూర్చాడు. తనే హీరోగా, శ్యామా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. ముఖ్యంగా ఓ.పి. నయ్యర్‌ సంగీతం చిత్ర విజయానికి యెంతో సహకరించింది. ‘బాబూజీ ధీరే చల్నా...’ వంటి అద్భుతమైన పాటలు గీతా దత్‌ చేత పాడించి హిట్‌ చేశారు. ఆ మరుసటి సంవత్సరం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’ సినిమా నిర్మించారు. గురుదత్‌, మధుబాల ఇందులో హీరో హీరోయిన్లు. ఓ.పి. నయ్యర్‌ సంగీతం మరలా మురిపించింది. గీతా దత్‌ ఆలపించిన ‘థండి హవా కాలి ఘటా...’ ‘ప్రీతమ్‌ ఆన్‌ మిలో’ పాటలు మారుమ్రోగాయి. తరవాత తను నిర్మాతగా వ్యవహరిస్తూ మిత్రుడు రాజ్‌ ఖోస్లా దర్శకత్వంలో ‘సి.ఐ.డి.’ సినిమా నిర్మించారు. దర్శకునిగా రాజ్‌ ఖోస్లాకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంతోనే వహీదా రెహమాన్‌ బాలీవుడ్‌ చిత్రరంగ ప్రవేశం చేసింది. అందులో దేవానంద్‌ హీరోగా, షకీలా, వహీదా రెహమాన్‌ హీరోయిన్లుగా నటించారు.ఈ సూపర్‌ హిట్‌ సినిమాలో ఓ.పి. నయ్యర్‌ సంగీతం కొత్త పుంతలు తొక్కింది. ఇందులో ‘ఆంఖోం హి ఆంఖోం మే ఇషారా హోగయా’, ‘లేకే పెహలా పెహలా ప్యార్‌’, ‘యే దిల్‌ హై ముష్కిల్‌’, ‘జీనా యహా’ పాటలు నేటికీ వినపడుతూనే వుంటాయి. ప్రఖ్యాత హార్మోనికా ప్లేయర్‌ మిలోన్‌ గుప్తా ఈ సినిమాలో హార్మోనికా వాయించడం విశేషం. ఈ సినిమా విజయవంతమైన సందర్భంలో గురుదత్‌ తన గురువు రాజ్‌ ఖోస్లాకు విదేశీ కారు కొనిపెట్టారు. గురుదత్‌ నిర్మించిన సినిమాలన్నీ భావ ప్రధానమైనవే కావడంతో నటీనటులకు తమ పూర్తి స్థాయి ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కింది. గురుదత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన అద్భుత చిత్రం ‘ప్యాసా’. ఈ సినిమాకు దర్శక నిర్మాత, హీరో కూడా గురుదత్తే! గురుదత్‌ స్టూడియోలోనే ఈ సినిమా నిర్మాణం జరిగింది. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ అద్భుత సంగీతం అందించిన ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తదనంతర కాలంలో తెలుగులో ‘మల్లెపూవు’(1975)గా, తమిళంలో ‘దేవి’(1968)గా, కన్నడంలో ‘కన్తెరేడు నోడు’ (1961)గా పునర్నిర్మించారు. ‘ప్యాసా’ (1957) సినిమా అంత గొప్ప విజయాన్ని సాధిస్తుందని హిందీ చలనచిత్రరంగ పండితులు ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలో దిలీప్‌ కుమార్‌, నర్గీస్‌, మధుబాల నటించాల్సింది. గురుదత్‌ ప్రతిభను గుర్తించలేని ఈ నటవర్గం వెనక్కు తగ్గడంతో తనే హీరో పాత్రను పోషించాల్సివచ్చింది. హీరోయిన్లుగా వహీదా రెహమాన్‌, మాలాసిన్హాలు వారి స్థానాల్లో రావడం జరిగింది. ప్యాసా సినిమా విడుదలయ్యాక దాదాపు ఎనిమిది వారాలదాకా మందగమనంతో నడిచింది. ఆ తరవాత బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే గురుదత్‌ ఎంతో శ్రమించి నిర్మించిన ‘కాగజ్‌ కే పూల్‌’ (1959) సినిమా నిరాశను, పుట్టెడు నష్టాలను మిగిల్చింది. ఇందులో గురుదత్‌, వహీదా రెహమాన్‌ జంటగా నటించారు. తరవాత 1960లో నిర్మించిన ‘చౌద్వి కా చాంద్‌’ సినిమా స్మాష్‌ హిట్టయింది. గురుదత్‌, వహీదా రెహమాన్‌ నటించిన ఈ చిత్రానికి మహమ్మద్‌ సాదిక్‌ దర్శకత్వం వహించారు. రవి సంగీత దర్శకుడు. రఫీ ఆలపించిన ‘చౌద్వి కా చాంద్‌ హో’ పాట నేటికీ నిత్య నూతనమే! ఈ సినిమా టైటిల్‌ ట్రాక్‌ను కలర్‌లో నిర్మించారు. గురుదత్‌ నటించిన ఒకే ఒక కలర్‌ సినిమా ఇదే. గురుదత్‌ నటించిన ఆఖరి సినిమా హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘సాంఝ్‌ అవుర్‌ సవేరా’. అందులో హీరోయిన్‌ మీనాకుమారి. ‘బహారె ఫిర్‌ భి ఆయేంగీ’ సినిమా నిర్మాణాన్ని గురుదత్‌ 1964లో ప్రారంభించారు. అందులో తనే హీరో. అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే గురుదత్‌ మరణించడంతో గురుదత్‌ పాత్రను ధర్మేంద్ర పోషించాడు. ఓ.పి. నయ్యర్‌ సంగీతం ఈ సినిమాకు ఒక వరంగా నిలిచింది. రెండు సంవత్సరాల తరవాత ఈ సినిమా విడుదలైంది. గురుదత్‌ నటించి నిర్మించిన సినిమాలు ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ దేశాల్లో హౌస్‌ ఫుల్‌గా నడచిన సందర్భాలు వున్నాయి. గురుదత్‌ నిర్మించిన సినిమాల్లో పాటలు కథాబలాన్ని ఇనుమడించేవిగా ఉండేవి.

  

వెలుగు చూడని గురుదత్‌ సినిమాలు

గురుదత్‌ చనిపోయేనాటికి ‘బహారె ఫిర్‌ భి ఆయేంగీ’, ‘లవ్‌’, ‘గాడ్‌’ వంటి చిత్రాలు వివిధ నిర్మాణ దశల్లో వున్నాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తనకు నచ్చకపోతే వాటిని కాల్చేసి కొత్తగా చిత్రీకరించడం వంటి కారణాల చేత ఈ సినిమాలు పూర్తి కాలేదు. ‘ప్యాసా’ చిత్ర విజయం తర్వాత గురుదత్‌ ‘గౌరీ’ అనే సినిమాను బెంగాలి, ఇంగ్లిషు భాషల్లో నిర్మించాలని సంకల్పించారు. ఈ చిత్రం తోనే తన భార్య, ప్రముఖ గాయని గీతా దత్‌ని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కలకత్తా నగరంలో సినిమా మొదలుపెట్టి రెండు రీళ్ల చిత్రాన్ని తీశారు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ ‘గౌరీ’ సినిమా కోసం రెండు పాటల్ని కూడా రికార్డు చేశారు. సినిమా స్కోప్‌లో నిర్మించ తలపెట్టిన ఈ సినిమా నిర్మాణం అర్దాంతరంగా ఆగిపోయింది. అదే సినిమా పూర్తయి ఇండియాలో నిర్మించిన తొలి సినిమా స్కోప్‌ చిత్రంగా చరిత్ర పుటలకు ఎక్కి వుండేది. అలాగే విల్కీ కోలిన్స్‌ రచించిన క్లాసికల్‌ నవల ‘ది వుమన్‌ ఇన్‌ వైట్‌’ ఆధారంగా ‘రాజ్‌’ అనే చిత్రాన్ని తన సహాయకుడు నిరంజన్‌ చేతిలో పెట్టి చిత్రనిర్మాణం మొదలెట్టారు. సునీల్‌ దత్‌ ఆర్మీ వైద్యునిగా, వహీదా రెహమాన్‌ ద్విపాత్రాభినయంతో ఈ చిత్రం మొదలైనా, ఆటుపోట్లకు లోనై చివరకు తనే హీరోగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ సంగీత దర్శకుడుగా తొలి ప్రయత్నంలో ఆశా భోస్లే, గీతా దత్‌, శంషాద్‌ బేగంలు పాడిన రెండు డ్యాన్స్‌ పాటలను రికార్డు చేశారు. సిమ్లాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఆరు రీళ్ల సినిమా పూర్తయ్యాక ఎందుకో గురుదత్‌కు సంతృప్తి కలుగక, ఆ సినిమాను ప్రక్కన పెట్టేశారు. గురుదత్‌ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మరో బెంగాలీ చిత్రం కూడా వుంది.. ఆ చిత్రం పేరు ‘ఏక్‌ టుకు చువా’. గుల్షన్‌ నందా రాసిన నీల్‌ కమల్‌ నవల నేపథ్యంలో ఈ సినిమా నిర్మించాలనుకుని, షూటింగు మొదలుపెట్టిన రోజే దానికి మంగళం పలికారు. ‘రాజ్‌’ చిత్రాన్ని పూర్తిచేయలేక పోయిన నిరంజన్‌ చేయి జారిన మరో సినిమా ఇది. ‘మోతీ కి మోసి’ అనే మరో సినిమాను తనూజ హీరోయిన్‌గా తీద్దామని ప్లాన్‌ చేసిన గురుదత్‌, నిరంజన్‌ మరణంతో ఆ సినిమా నిర్మాణానికి స్వస్తి పలికారు. లేఖ్‌ టాండన్‌, షమ్మికపూర్‌ హీరోగా నిర్మించిన ‘ప్రొఫెసర్‌’ సినిమా గురుదత్‌ తీయాలనుకున్నదే. కిషోర్‌ కుమార్‌, వహీదా రెహమాన్‌ జంటగా ఈ చిత్రాన్ని నిర్మించాలని రచయిత అబ్రార్‌ ఆల్వి చేత స్క్రిప్టు తయారు చేయించారు గురుదత్‌. అబ్రార్‌ ఆల్వి నే దర్శకత్వం వహించమని కోరారు. అతడు ససేమిరా అనడంతో శశి భూషణ్‌ చేత తీయిద్దామనుకున్నారు. కాలం కలిసి రాలేదు. ఆ స్క్రిప్టు లేఖ్‌ టాండన్‌కు అందించారు. షమ్మికపూర్‌ నటించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. గురుదత్‌ తలపెట్టిన మరో అసంపూర్తి చిత్రం ‘పిక్నిక్‌’. ఇందులో గురుదత్‌ సాధనా జంటగా నటించాల్సి ఉంది. సంగీత దర్శకుడు ఎన్‌. దత్తా చేత మహమ్మద్‌ రఫీ, ఆశా భోస్లే ఆలపించిన రెండు డ్యూయట్లు కూడా రికార్డు చేయించారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ సినిమా కూడా వెలుగు చూడలేదు.


లేత వయసు మరణం...


‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్’, ‘చౌద్వి కా చాంద్‌’ చిత్రాల విజయాన్ని చవిచూడకుండానే గురుదత్‌ కేవలం 39 ఏళ్ళకే అక్టోబరు 10, 1964 న ఒక అద్దె ఇంటిలో మరణించడం దురదృష్టకరమనే చెప్పాలి. మద్యంతోబాటు అధికమోతాదులో నిద్రమాత్రలు మింగడం వలన అతడు మరణించాడు. సెట్స్‌లో ఎంత క్రమశిక్షణ పాటించేవాడో, వ్యక్తిగత జీవిత విషయానికొస్తే సిగరెట్లు అధికంగా కాల్చేవాడు, మద్యం అధిక మోతాదుల్లో సేవించేవాడు. గురుదత్‌ భార్య గీతా దత్‌ కూడా కేవలం 41 సంవత్సరాలకే 1972లో కాలం చేయడం మరో దురదృష్ట సంఘటన. గీతాదత్‌ కూడా అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వలన కాలేయం చెడిపోయి మరణానికి దగ్గరైంది. గురుదత్‌ చివరి ఘడియల్లో మాట్లాడింది గాయని ఆశా భోస్లేతో. తన భార్య ఎలావుందని అడిగిన మాటలే అతని చివరి మాటలుగా మిగిలాయి. గురుదత్‌ ప్రతిభను గుర్తిస్తూ దూరదర్శన్‌ 2011 లో ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అలా లేత వయసులోనే అద్భుత చిత్రాలు నిర్మించి, నేల రాలిన కుసుమం గురుదత్‌.


- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.