కుహూ కుహూల బెంగాలి హేమంతం
1950 దశకం తొలినాళ్ళలో చిన్నతనంలో రేడియో స్విచ్‌ ఆన్‌ చేసి వివిధ భారతి ట్యూన్‌ చేస్తే ‘మన్‌ డోలే మేరా తన్‌ డోలే మేరే దిల్‌ కా గయా కరార్‌ రే ఏ కౌన్‌ బజాయే బాసురియా’ అంటూ తేనెపాకంలో ముంచిన గారెల్లాంటి లతాజీ స్వరం వినిపించేది. బ్యాక్‌ గ్రౌండ్‌లో నాగస్వరం అనలాగ్‌ సింథసైజర్‌ మీద అద్భుతంగా అలరిస్తుంటే మా బామ్మగారు ‘ఉరేయ్‌ ఆ పెట్టెను కట్టేయ్యరా. ఇంట్లోకి పాములొస్తాయి’ అంటూ భయపెట్టేది. ఈ అనుభవం ఆ తరం సంగీత ప్రియులకు అనుభవైకవేద్యం. అదే అరవయ్యో దశకంలో అదే లతాజీ గొంతులోంచి ‘కహి దీప్‌ జలే కహి దిల్‌ జరా దేఖ్‌ లే ఆ కర్‌ పర్వానే’ అంటూ మంజులగానం వినవస్తుంటే నిశ్చేష్టులై నిలబడిపోయేవాళ్ళు సినీ ప్రియులు. ఆ అద్భుత పాటల సృష్టికర్త హేమంత కుమార్‌గా వినుతికెక్కిన బెంగాలి బాబు హేమంత ముఖర్జీ (లేక) హేమంత ముఖోపాధ్యాయ.. రవీంద్ర సంగీతానికి సొబగులద్ది ప్రాచుర్యంలోకి తెచ్చిన అరుదైన గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు ఈ హేమంత కుమార్‌. భారత ప్రభుత్వం 1970లో ‘పద్మశ్రీ’ బిరుదు ప్రకటిస్తే సున్నితంగా తిరస్కరించిన మేధావి. మరలా 1987లో ‘పద్మభూషణ్‌’ ఇవ్వజూపితే దానిని కూడా స్వీకరించనని సున్నితంగా ప్రభుత్వానికి సంకేతం పంపిన సహృదయుడు. హేమంత్‌ కాలం చేసిన పాతికేళ్ళ తరవాత కూడా భారతీయ గ్రామఫోన్‌ కంపెనీ ప్రతి సంవత్సరం హేమంత కుమార్‌ ఆలపించిన, స్వరపరచిన పాటలతో కనీసం ఒక్క ఆల్బంనైనా విడుదల చేస్తూ వస్తోంది. అందుకు కారణం హేమంత కుమార్‌ స్వరాలల్లిన పాటలకు వున్న గుడ్‌ విల్‌ మాత్రమే. ఈ స్వరమాంత్రికుని జ్ఞాపకాలు కొన్ని మీకోసం...


* పవిత్ర వారణాసి నుంచి బెంగాల్‌కు..
హేమంత కుమార్‌ జన్మించింది 16 జూన్‌ 1920న పవిత్ర కాశీ నగరంలో. అతని తాతగారు వారణాసిలో పేరు గడించిన వైద్యుడు. హేమంత్‌ తండ్రి ది జయనగర్‌. 1900 సంవత్సరంలో వారి కుటుంబం కలకత్తాలో స్థిరపడింది. కలకత్తా నగరంలోని భవానిపురాలో నసీరుద్దీన్‌ పాఠశాలలో, మిత్రా పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేశారు. తదనంతర కాలంలో ప్రఖ్యాత బెంగాలి కవిగా పేరుతెచ్చుకున్న సుబాష్‌ ముఖోపాధ్యాయ, ప్రముఖ రచయిత సంతోష్‌ కుమార్‌ ఘోష్‌లు హేమంత కుమార్‌కు సహాధ్యాయులు. వారి సాంగత్య బలంతోనే హేమంత కుమార్‌ కవితలు రాస్తూ, వాటికి స్వరాలు అల్లి పాడుతూ వుండేవారు. స్కూలు ఫైనల్‌ చదువు పూర్తయ్యాక హేమంత కుమార్‌ జాదవ్పూర్‌లోని బెంగాల్‌ టెక్నికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరారు. అప్పుడే హేమంత కుమార్‌ రాసిన కథానిక ‘దేశ్‌’ అనే ప్రతిష్టాత్మక బెంగాలి పత్రికలో ప్రచురితమైంది. అయితే కొన్ని మాసాల తరవాత కథా రచనకన్నా, హేమంత కుమార్‌కు సంగీతం మీద మోజు కలిగింది. వెంటనే ఉస్తాద్‌ ఫయాజ్‌ ఖాన్, ఫణి భూషణ్‌ బెనర్జీల వద్ద శిష్యరికం చేసి సంప్రదాయ సంగీతానికి మెరుగులు దిద్దుకున్నారు. బెంగాలి సంగీతకర్త శైలేష్‌ దత్తగుప్త తొలిసారి హేమంత కుమార్‌ సంగీత ప్రతిభను బాహ్యప్రపంచానికి తెలియపరచారు. అలా 1937లో కొలంబియా రికార్డింగ్‌ కంపెనీ వారు హేమంత కుమార్‌ ఆలపించిన గ్రామఫోను రికార్డును తొలిసారి విడుదల చేశారు. నరేష్‌ భట్టాచార్య రచించిన ‘జనితే జది గో తుమి’, ‘బోలో గో బోలో మోరే’ అనే పాటలను హేమంత కుమార్‌ ఆలపించగా సంగీత దర్శకుడు శైలేష్‌ దత్తగుప్త రికార్డు చేశారు. ఈ రికార్డు విడుదల తరవాత ప్రతి సంవత్సరం గ్రామఫోన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా వారు హేమంత కుమార్‌ ఆలపించిన సినిమాలకు సంబంధించని లలిత గీతాల వంటి పాటలను రికార్డులుగా విడుదల చేసేవారు. ఈ సంప్రదాయం 1984 వరకూ కొనసాగింది. అలాగే కమల దాస్‌ గుప్తా సంగీత దర్శకత్వంలో హేమంత కుమార్‌ ఆలపించిన నాన్‌-ఫిల్మీ హిందీ పాటలు కితనా దుఃఖ్‌ బులాయా తుమనే, ఓ ప్రీత్‌ నిభానేవాలీ తొలిసారి 1940లో గ్రామఫోన్‌ కంపెనీ వారు విడుదల చేశారు.


* బెంగాలి గాయకునిగా..
.
హేమంత కుమార్‌ తొలిసారి 1941లో ‘నిమయ్‌ సంయాస్‌’ అనే బెంగాలి సినిమాలో పాటలు పాడారు. మోతిమహల్‌ థియేటర్స్‌ సంస్థ ఫణి వర్మ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి హరిప్రసన్న దాస్‌ సంగీతం సమకూర్చారు. స్వతంత్రంగా సంగీతం సమకూర్చి విడుదల చేసిన నాన్‌-ఫిల్మీ బెంగాలి గ్రామఫోన్‌ రికార్డు 1944లో విడుదలైంది. ‘కథా కయోనాకో షుద్దు షోనో’, ‘అమర బిరహ ఆకాశే ప్రియా’ అనే అమియా బగాచి రచించిన గీతాలు అవి. అదే సంవత్సరం ‘ప్రియ బాంధబి’ అనే బెంగాలి చిత్రంలో రవీంద్ర సంగీతాన్ని హేమంత కుమార్‌ వినిపించారు. కొలంబియా రికార్డింగ్‌ కంపెనీ వారు హేమంత కుమార్‌ స్వరపరచిన రవీంద్ర సంగీత నాన్‌-ఫిల్మీ రికార్డులను కూడా అదే సంవత్సరం విడుదల చేశారు. అలాగే రవీంద్ర సంగీతంతో కూడిన రూపకాలను ఆల్‌ ఇండియా రేడియో ద్వారా వినిపించారు. 1947లో ‘అభినేత్రి’ అనే బెంగాలి సినిమాకు హేమంత కుమార్‌ సంగీత దర్శకత్వం వహించారు. బెంగాల్‌లో పెద్ద కరువు వచ్చినప్పుడు బ్రిటీష్‌ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే హేమంత కుమార్‌ ‘ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌’లో సభ్యునిగా చేరి అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిధులు పోగుచేసి అన్నార్తులను ఆదుకున్నారు. అప్పుడే హేమంత కుమార్‌కు కవి, సంగీత దర్శకుడు సలీల్‌ చౌదరితో పరిచయమైంది. సలీల్‌ చౌదరి రాసి స్వరపరచిన ఉద్యమ గీతాలను హేమంత కుమార్‌ సాంస్కృతిక కార్యక్రమాలలో వినిపించేవారు. సలీల్‌ చౌదరి సంగీత దర్శకత్వంలో హేమంత కుమార్‌ ఆలపించి రికార్డు చేసిన ‘గన్యర్‌ బంధు’ అనే ఆరు నిమిషాల గీతం వారిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరవాత వీరిద్దరూ యెన్నో గొప్ప గొప్ప పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు.


* ఆనందమఠతో సంగీత దర్శకుడిగా...
బెంగాలిలో హేమన్‌ గుప్త దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు హేమంత కుమార్‌ సంగీతం సమకూర్చారు. తరవాత హేమన్‌ గుప్త బొంబాయి తరలివెళ్లి హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాలని సంకల్పించడంతో, తను తొలిసారి హిందీలో నిర్మించదలచిన ‘ఆనందమఠ’ సినిమాకు సంగీతం అందించమని హేమంత కుమార్‌కు కబురంపారు. అలా 1951లో హేమంత కుమార్‌ బొంబాయి చేరుకున్నారు. 1882లో ప్రముఖ బెంగాలి రచయిత బంకించంద్ర చటర్జీ రచించిన ‘ఆనందమఠ’ నవలను హేమెన్‌ గుప్త ఫిల్మిస్థాన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ మీద పృద్విరాజ్‌ కపూర్, గీతాబాలి, ప్రదీప్‌ కుమార్, భరత్‌ భూషణ్‌ ప్రధాన తారాగణంగా హిందీలో నిర్మించారు. బంకించంద్ర చటర్జీ రచించిన దేశభక్తి గీతం ‘వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం’ ఇందులోదే. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ పాట ప్రత్యేక ఆదరణ సంతరించుకొని ‘జాతీయ గీతం’గా గణుతికెక్కింది. రవీంద్రుని ‘జనగణమన’ జాతీయగీతంగా ఆవిర్భవించడానికి కారణాలు అనేకం కనుక ఆ విషయ ప్రస్తావన అప్రస్తుతం. ‘వందేమాతరం’ గీతానికి అద్భుత సంగీత రచన చేసింది హేమంత కుమార్‌. 2003లో బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పోరేషన్‌ సంస్థ 165 ప్రపంచదేశాల్లో ‘వరల్డ్‌ టాప్‌ టెన్‌’ పాటలను ఎంపిక చేసేందుకు ఓటింగు నిర్వహిస్తే లతామంగేష్కర్, హేమంత కుమార్‌ విడివిడిగా ఆలపించిన వందేమాతరం గీతానికి రెండవస్థానం లభించింది. హేమంత కుమార్‌ జీవనప్రస్థానంలో ఈ పాట తలమానికంగా నిలిచింది. హీరో ప్రదీప్‌ కుమార్‌ ఈ చిత్రం ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో హేమంత కుమార్‌ గీతాబాలితో కలిసిం పాడిన ‘హరే మురారే మధుకైటభ హరే, ధీర సమీరే యమునా తీరే’ అనే జయదేవుని అష్టపదులకు స్థానం కల్పించారు. ఫిల్మిస్థాన్‌ తరవాతి కాలంలో నిర్మించిన ‘జాగృతి’ (సత్యన్‌ బోస్‌-1954), ‘నాగిన్‌’ (నందలాల్‌ జశ్వంత్‌ లాల్‌-1954), ‘షర్త్‌’ (ఐ.ఎస్‌. జోహార్‌-1954), ‘భగవత్‌ మహిమ’ (1955), ‘దుర్గేశ్‌ నందిని’ (బిభూతి మిత్ర-1956), ‘చంపకలి’ (నందలాల్‌ జస్వంత్‌ లాల్‌-1957) చిత్రాలకు హేమంత కుమార్‌ సంగీత దర్శకత్వం నిర్వహించారు.


* చరిత్ర సృష్టించిన నాగస్వరం...
ఫిల్మిస్థాన్‌ తరఫున శశిధర్‌ ముఖర్జీ సత్యన్‌ బోస్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘జాగృతి’ చిత్రంలో అభి భట్టాచార్య, బిపిన్‌ గుప్త, ముంతాజ్‌ బేగం, రాజకుమార్‌ గుప్త ముఖ్య నటులు. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్‌ బహుమతి అందుకోవడమే కాకుండా, అభి భట్టాచార్యకు ఉత్తమ సహాయ నటుడి బహుమతి కూడా తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి కూడా ఈ చిత్రానికి దక్కింది. హేమంత కుమార్‌ కవి ప్రదీప్‌ రాసిన ‘ఆవో బచ్చోం తుమ్హే దిఖాయే’ వంటి దేశభక్తి గీతాలకు అద్భుత బాణీలు సమకూర్చారు. ఇక ‘నాగిన్‌’ చిత్ర విషయానికి వస్తే ఇందులో ప్రదీప్‌ కుమార్, వైజయంతిమాల నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని పాక్షికంగా టెక్నికలర్‌లో నిర్మించారు. ఇందులో హేమంత కుమార్‌ 13 పాటలతోబాటు, బీన్‌ మ్యూజిక్‌ (నాగస్వర సంగీతం)తో ‘మన్‌ డోలే మేరా తన్‌ డోలే మేరే దిల్‌ కా గయా కరార్‌ రే, ఏ కౌన్‌ బజాయే బాసురియా’ పాటను స్వరపరచి ప్రేక్షకులను అబ్బురపరచారు. అప్పట్లో కల్యాణ్‌ జి, రవి హేమంత కుమార్‌ వద్ద సహాయకులుగా పనిచేసేవారు. కల్యాణ్‌ జి నాదస్వరాన్ని ఆనలాగ్‌ సింథసైజర్‌ మీద వాయించగా, రవి హార్మోనియం మీద బిట్లను వాయించారు. తరవాత వీరిద్దరూ ప్రముఖ సంగీత దర్శకులుగా స్థిరపడడం తెలిసిన విషయమే. ఈ పాట యెంతో ప్రజాదరణ పొందడంతో గ్రామఫోన్‌ కంపెనీ వాళ్ళు లాంగ్‌ ప్లే, షార్ట్‌ ప్లే రికార్డులుగా విడుదలచేసి మంచి లాభాలు ఆర్జించారు. ఇదికాకుండా ప్రత్యేకించి బీన్‌ మ్యూజిక్‌ రికార్డును కూడా విడుదల చేయడం గొప్ప విశేషం. ఆ రోజుల్లో హేమంత కుమార్‌ ఆలపించిన ‘తేరే ద్వార్‌ ఖడా ఎక్‌ జోగి’ పాటకూడా బాగా పాపులర్‌ అయింది. ఇక లతాజీ ఆలపించిన పాట ‘మేరా దిల్‌ ఏ పుకారే ఆజా, మేరే గమ్‌ కే సహారే ఆ జా, భిగా భిగా హై సమా ఐసే మే హై తు కహా’ రోజూ ఏదో ఒక చానల్‌ లో వింటూనే వుంటాం. హేమంత కుమార్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్‌ బహుమతి అందించిన చిత్రం కూడా ఇదే! ఒకవైపు సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుకుంటూనే, నేపథ్య గాయకుడిగా కూడా హిందీ సినిమాల్లో హేమంత కుమార్‌ బాగా రాణించారు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ సంగీత సారధ్యంలో దేవానంద్‌ కోసం ‘జాల్‌’ (1952) చిత్రంలో హేమంత కుమార్‌ ఆలపించిన ‘ఏ రాత్‌ ఏ చాందిని ఫిర్‌ కహా, సున్‌ జా దిల్‌ కి దాస్తాన్, ‘హౌస్‌ నంబర్‌ 44’ (1955)లో ఆలపించిన ‘చుప్‌ హై ధర్తీ, చుప్‌ హై చాంద్‌ సితారే’, ‘సోల్వా సాల్‌’ (1958)లో పాడిన ‘హై అపనా దిల్‌ తో ఆవారా’, ‘ఫంతూష్‌’ చిత్రంలో ఆలపించిన ‘తేరి దునియా మే జీనే సే’, ‘బాత్‌ ఎక్‌ రాత్‌ కి’ చిత్రంలో పాడిన ‘న తుమ్‌ హమే జానో’ పాటలు జనరంజకాలే కాదు .... నేటికీ ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే అలరిస్తుంటాయి. అలాగే హేమంత కుమార్‌ ఇతర హీరోలైన ప్రదీప్‌ కుమార్‌కు ‘నాగిన్‌’, ‘డిటెక్టివ్‌’, సునీల్‌ దత్‌ కు ‘దునియా ఝూటా హై’, బిశ్వజిత్‌ కు ‘బీస్‌ సాల్‌ బాద్‌’, ‘కొహరా’, ధర్మేంద్రకు ‘అనుపమ’ చిత్రాల్లో గళాన్ని ఎరువిచ్చారు. కలకత్తాలో ఒకసారి హేమంత కుమార్‌ తన గురువైన దేబబ్రత బిస్వాస్‌కు సత్కారం చేసినప్పుడు అతడు హేమంత కుమార్‌ రవీంద్ర సంగీతానికి రెండవ నాయకుడు అంటూ కీర్తించారు. బెంగాలి హీరో ఉత్తమ కుమార్‌కు హేమంత కుమార్‌ చాలా పాటలు పాడారు. వీరిద్దరూ మంచి మిత్రులుగా చాలాకాలం గడిపారు. అటు హిందీ సినిమాల్లో బిజీగా వుంటూనే ‘హరనో సుర్‌’, ‘మరుతీర్థ హింగ్లజ్‌’, ‘నీల్‌ ఆకాషేర్‌ నీచే’, ‘లుకోచురి’, ‘కుహాక్‌’ వంటి ఎన్నో బెంగాలి చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం నిర్వహించారు.


* గీతాంజలి ప్రొడక్షన్స్‌ నిర్మాతగా...
గీతాంజలి ప్రొడక్షన్స్‌ అనే సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పి హేమంత కుమార్‌ కొన్ని బెంగాలి, హిందీ సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన బెంగాలి చిత్రం ‘నీల్‌ ఆకాషేర్‌ నీచే’ సినిమాకు 1959లో రాష్ట్రపతి స్వర్ణపతకం లభించింది. తరవాత హేమంత కుమార్‌ అనేక హిందీ సినిమాలు కూడా నిర్మించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ‘బీస్‌ సాల్‌ బాద్‌’, ‘కొహరా’; ‘బీవీ అవుర్‌ మకాన్‌’, ‘ఫరార్‌’, ‘కామోషి’ కొన్ని మాత్రమే. ఈ సినిమాలన్నీ మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకున్నవే. బిశ్వజిత్‌ హీరోగా నటించిన ‘బీస్‌ సాల్‌ బాద్‌’ మిస్టరీ సినిమాకు నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులు వచ్చాయి. లతాజీ ఆలపించిన ‘కహి దీప్‌ జలే కహి దిల్‌’ పాటకు ఉత్తమ గాయని బహుమతి లభించింది. ‘కొహరా’లో లతాజీ ఆలపించిన ‘ఝూమ్‌ ఝూమ్‌ దలతి రాత్‌ లేకే చలీ ముజ్హే అపనే సాథ్‌’ పాట బినాకా గీత్‌ మాలాలో స్థానం సంపాదించింది. రవీంద్ర నాథ్‌ టాగూర్‌ నాటకాలు ‘వాల్మీకి ప్రతిభ’, ‘శ్యామా’, ‘శాపమోచన్‌’, ‘చండాలిక’, ‘చిత్రాంగద’కు హేమంత కుమార్‌ సంగీతం అందించేవారు. బెంగాలిలో నిర్మించిన ‘అనిందిత’ సినిమాకు హేమంత కుమార్‌ దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. హాలీవుడ్‌లో గాత్రం వినిపించిన తొలి భారతీయ గాయకుడు హేమంత కుమార్‌. అమెరికా ప్రభుత్వం ఆయనకు బాల్టిమోర్‌లో గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది. సంగీత అకాడమీ బహుమతి స్వీకరించిన హేమంత కుమార్‌ భారత ప్రభుత్వం ఇవ్వజూపిన పద్మశ్రీ, పద్మభూషణ్‌ సత్కారాలను సున్నితంగా తిరస్కరించిన గొప్పమనీషి. బెంగాలి గాయని బేలా ముఖర్జీని వివాహమాడిన హేమంత కుమార్‌ 26 September, 1989లో మరణించారు. బేలా ముఖర్జీ 2009 లో చనిపోయారు.-ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.