బెంగాలీ చిత్ర తొలి కథానాయకి ... కానన్ దేవి
1931లో వెలసిన న్యూ థియేటర్స్ పేరు వింటే కలకత్తా నగరం గుర్తుకొస్తుంది. ఈ స్టూడియోకి నిర్మాత బిరేంద్రనాథ్ సర్కార్. ఇందులోనే తొలి బెంగాలి టాకీ చిత్రం ‘దేనా పవోనా’ (1931) నిర్మాణం జరిగింది. భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వేదిక ఈ స్టూడియో. సినిమాలో చిత్రీకరించాల్సిన పాటల్ని స్టూడియోలో ధ్వని ముద్రణ చేసి షూటింగ్ లొకేషన్లలో సన్నివేశ చిత్రీకరణకు నాందీప్రస్తావన పలికిన తొలి స్టూడియో ఈ న్యూ థియేటర్స్. రవీంద్రనాథ టాగూర్ డెబ్భయ్యవ జన్మదిన సందర్భంగా ‘నటిర్ పూజ’ అనే ఒక బౌద్ధ సిద్ధాంత నేపథ్యంలో వుండే డాన్స్ డ్రామాను 1931లో ఇదే స్టూడియోలో ప్రదర్శిస్తే, ఆ నాటకానికి దర్శకత్వబాధ్యతలు నిర్వహించడమే కాకుండా అందులో ‘ఉపాలి’ అనే పాత్రను రవీంద్రుడు పోషించడం గొప్ప విశేషంగా ఆరోజుల్లో చెప్పుకున్నారు. 1935లో దర్శకుడు నితిన్ బోస్ ఏకకాలంలో బెంగాలి, హిందీ భాషల్లో ఒక ద్విభాషా చిత్రాన్ని ఇక్కడ నిర్మించారు. బెంగాలి లో అది ‘భాగ్యచక్ర’ గాను హిందీలో ‘దూప్ ఛావోం’ గా విడుదలైంది. బిశ్వనాథ్ భాదురి, దుర్గాదాస్ బెనర్జీ నటించిన ఈ సినిమాలో తొలిసారి ముందుగా రికార్డు చేసిన పాటల్ని లోకేషన్లలో చిత్రీకరించారు. ఆ సినిమాకు పాటలు పాడిన ఘనత కానన్ దేవి ది. అలాగే సినిమాల నిర్మాణంతోబాటు, రికార్డింగ్, పంపిణీ సదుపాయాలు ప్రవేశపెట్టిన ఘనత ఈ స్టూడియోది. పి.సి. బరువా, దేవకీ బోస్, ఫణి మజుందార్, పృద్విరాజ్ కపూర్, నితిన్ బోస్, బిమల్ రాయ్ వంటి అద్భుత నటులు, దర్శకులు, కానన్ దేవి, రాయ్ చాంద్ బోరల్, పంకజ్ మల్లిక్, పహాడి సన్యాల్, కె.ఎల్. సైగల్ వంటి సంగీత కళాకారులు న్యూ థియేటర్స్ నుండి వచ్చినవాళ్ళే. 1937లో దేవకి బోస్ న్యూ థియేటర్స్ సంస్థకు మిథిలా నగర వైష్ణవ సదాచారి ఆత్మకథను ‘విద్యాపతి’ పేరుతో సినిమాగా బెంగాలి, హింది భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. అందులో గాయకుడు పహాడీ సన్యాల్ హీరోగా నటించగా, గాయని కానన్ దేవి హీరోయిన్ ‘అనూరాధ’ గా నటించింది. ఆర్.సి. బోరల్ సంగీత దర్శకత్వంలో కానన్ దేవి ఆలపించిన ‘అంబువా కి దాలి దాలి ఝూం రహీ హై ఆలి’, ‘డోలే హృదయ్ కి నయ్యా’ అనే సోలో పాటలు, కె.సి. డే తో కలిసి పాడిన యుగళ గీతాలు ఆరోజుల్లో మారుమ్రోగిపోయాయి. దాంతో కానన్ దేవి హీరోయిన్ గానే కాకుండా మంచి గాయనిగా, ఒక అద్భుత కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. “శ్రావ్యమైన వ్యాపనం, ఆత్మీయ భావగర్భిత భాషోచ్ఛారణ, అభిలాష ధ్వనించే స్వరమధురిమ, అభిసంధానం చేయగల లయవిన్యాసం కానన్ దేవికి సర్వేశ్వరుడు ప్రసాదించిన వరం” “ అని సంగీత దర్శకుడు ఆర్.సి. బోరల్ ప్రశంసించడం కానన్ దేవి ప్రజ్ఞకు పెద్ద ప్రశంసగా భావించాలి. ఇవాళ  ఆమె (17 జూలై 1992) వర్ధంతి. ఈ సందర్భంగా ఆమెను గురించి కొన్ని విశేషాలు...


చిన్నతనంలోనే బ్రతుకు పోరాటం...

కానన్ దేవి పుట్టింది 22 ఏప్రిల్ 1916న పశ్చిమ బెంగాల్ లోని హౌరా పట్టణంలో. రజోబాల, రతన్ చంద్ర దాస్ ఆమెను పెంచుకున్న జననీజనకులు. కానన్ దేవి హౌరాలోని సెయింట్ ఏంజెల్స్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసింది. అప్పుడే సంగీతం మీద మక్కువ పెంచుకుంది. ఆమెలో సంగీత ప్రజ్ఞ వుందని మొదట గమనించింది బెంగాల్ విప్లవ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం. సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా కు ఏకలవ్య శిష్యురాలిగా మారి సంగీత సాధన చేసింది. ఇంతలో పెంపుడు తండ్రి రతన్ చంద్ర దాస్ ఆకస్మిక మరణంతో వారి కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. అప్పుడు కానన్ దేవికి కేవలం పదేళ్లంటే నమ్మలేం. అలా 1929లో కానన్ దేవి తొలి సారి హెచ్.ఎం.వి వారికోసం “బలో సఖి బలో తారే”, “ఓగో బోలో కెనో సఖీ నయనా ఝారే” అనే రెండు పాటల్ని బ్లాక్ లేబుల్ రికార్డులుగా పాడింది. ఆ రికార్డులు విశేషంగా అమ్ముడవడంతో వరసగా నాలుగు రెడ్ లేబుల్ రికార్డులను కానన్ దేవి చేత పాడించి విడుదల చేశారు. మెగాఫోన్ గ్రామఫోన్ కంపెనీ వాళ్ళు కానన్ దేవి గళ మాధుర్యానికి ముగ్ధులై వారి కంపెనీలో వుద్యోగమివ్వడంతో ఆమె మెగాఫోన్ రికార్డింగ్ కంపెనీకి మాత్రమే పాడటం మొదలెట్టింది. ధీరేన్ దాస్ సంగీత పర్యవేక్షణలో కానన్ దేవి చేత మెగాఫోన్ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు చాలా పాటలు పాడించి విడుదల చేశారు. భీష్మదేవ్ చటర్జీ ఆమెకు సంగీతంలో మెళకువలు నేర్పారు. ఆనంది దస్తగిర్ వంటి సంగీత విద్వాంసులు ఆమెకు రవీంద్ర సంగీతాన్ని బోధించారు. తరవాత తులసి బెనర్జీ అనే శ్రేయోభిలాషి కానన్ దేవి ని ‘మదన్ థియేటర్స్’ వారికి పరిచయం చేశారు. అది మూకీ యుగం కావడంతో ఆ స్టూడియో వారు నిర్మించిన ‘జయదేవ్’ (1926) అనే చిత్రంలో బాలతారగా చిన్న పాత్ర పోషించింది. అప్పుడు ఆమెను ‘కానన్ బాల’ అని ముద్దుగా పిలిచేవారు. తరవాత 1927లో ‘శంకరాచార్య’ అనే చిత్రంలో కానన్ దేవి నటించింది. 1926-32 మధ్యకాలంలో మదన్ థియేటర్స్ వారు జ్యోతిష్ బెనర్జీ దర్శకత్వంలో నిర్మించిన ‘రిషిర్ ప్రేమ్’ , ‘జోరేబరాత్’, ‘విష్ణుమాయ’, ‘ప్రహ్లాద్’, ‘కంఠహార్’ వంటి మూకీ సినిమాల్లో పాత్రలు పోషించింది. ‘విష్ణుమాయ’, ‘ప్రహ్లాద్’ చిత్రాల్లో మగవేషాలు వేసింది. తరవాత కానన్ దేవిని రాధా ఫిలిమ్స్ వారు స్వాగతించి మూడేళ్ళపాటు మరికొన్ని మూకీ, టాకీ సినిమాల్లో నటింపజేశారు. ఆ తరవాత కానన్ దేవి నటప్రస్థానం న్యూ థియేటర్స్ కు మారింది.


అవకాశం దక్కని దేవదాసు చిత్రం...

ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రమతేష్ చంద్ర బరువా (పి.సి. బరువా) పర్యవేక్షణలో న్యూ థియేటర్స్ వారు 1935లో శరత్ చంద్ర చటర్జీ ప్రతిష్టాత్మక నవల ‘దేవదాసు’ ను బెంగాలి భాషలో సినిమాగా నిర్మించాలని నిర్ణయించి అందులో హీరోగా బరువా నటించేలాగా, పార్వతి పాత్రను కానన్ దేవి పోషించేలాగా ముందుగా అనుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కానన్ దేవి అప్పుడు రాధా ఫిలిమ్స్ వారి కాంట్రాక్టులో ఉండడంతో వాళ్ళు కానన్ దేవిని ‘దేవదాసు’ చిత్రంలో నటించేందుకు ససేమిరా అన్నారు. దాంతో పార్వతి పాత్రను జమునా బరువా పోషించాల్సి వచ్చింది. దేవదాసు సినిమా జమున బరువాకు మంచి యాక్టింగ్ మార్కెట్ ను ప్రసాదించింది. నిజానికి రాధా ఫిలిమ్స్ వారితో కానన్ దేవి కాంట్రాక్టు అప్పటికే పూర్తయింది. కానీ వాళ్ళు ఆ విషయాన్ని తొక్కిపెట్టి కానన్ దేవిని వదలలేదు. ఆ విషయం కానన్ దేవికి తరవాత గానీ తెలియరాలేదు. విషయం తెలిశాక కానన్ దేవి రాధా ఫిలిమ్స్ ను వదలి న్యూ థియేటర్స్ సంస్థలో చేరింది. 1937 లో పి.సి. బరువా నటించి దర్శకత్వం వహించిన ‘ముక్తి’ అనే సినిమాలో కానన్ దేవికి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి బిమల్ రాయ్ (తరవాతి కాలంలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు) ఛాయాగ్రహణం నిర్వహించగా పంకజ్ మల్లిక్ సంగీతాన్ని, రవీంద్రనాథ టాగూర్ పాటలను సమకూర్చారు. బెంగాలి, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రంలో కానన్ దేవి తనే పాటలు పాడుకుంది. 1941 దాకా కానన్ దేవి న్యూ థియేటర్స్ సంస్థతో ద్విభాషా చిత్రాలు ‘స్ట్రీట్ సింగర్/సాథి’ (1938), ‘సపేరా/సపురే’ (1939), ‘లగాన్/పరిచయ్’ (1941) వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా, గాయనిగా నటించి మెప్పించింది. లగాన్ చిత్రంలో ఆమె కె.ఎల్. సైగల్ సరసన నటించింది. ఈ చిత్రం లోని నటనకు బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఉత్తమనటి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అందులో కానన్ దేవి పాడిన “హమారీ లాజ్ నిభావో స్వామీ” పాట సూపర్ హిట్టయింది. 1956లో నటుడు, నిర్మాత, దర్శకుడు గురుదత్ తన ‘ప్యాసా’ చిత్రం కోసం ‘లగాన్’ నేపథ్యాన్నే ఎన్నుకున్నారు. 1941లోనే కానన్ దేవికి న్యూ థియేటర్స్ యాజమాన్యంతో పారితోషికం విషయమై సమస్యలు తలెత్తడంతో ఆ సంస్థను వీడి, ఫ్రీలాన్సర్ నటి/గాయనిగా బెంగాలి, హింది సినిమాల్లో రాణించడం మొదలెట్టింది. లగాన్’ చిత్రం తరవాత కానన్ దేవి తోబాటు సైగల్ కూడా న్యూ థియేటర్స్ నుంచి బయటకు వచ్చి ఫ్రీలాన్సర్ నటుడుగా మారారు. ఆపైన పి.సి. బరువా దర్శకత్వంలో ‘షేర్ ఉత్తర్/జవాబ్’ అనే ద్విభాషా చిత్రంలో కానన్ దేవి నటించింది. పి.సి. బరువా, అహింద్ర చౌదరి, జమున ఇందులో ముఖ్య తారాగణం. అందులో కానన్ దేవి గానంచేస్తూ అభినయించిన “కుచ్ యాద్ రహే తో సున్ కర్ జా”, “ఛుప్ న జానా యే చాంద్ జబ్ తక్ మై గీత్ గావూ” పాటలు బాగా పాపులర్ అయినవే. ఆరోజుల్లో కానన్ దేవి అవుట్ డోర్ షూటింగ్ కు హాజరవ్వాలంటే అభిమానులనుంచి తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ అవసరమయ్యేది. లండన్ హై కమీషనరేట్ లో 1947లో కానన్ దేవి సంగీత కచేరి ఏర్పాటు చేయడం ఆమెకు ఒక మధురానుభూతి.


గాయనిగా, నటిగా రాణించి...
కానన్ దేవికి హిందీ స్వరాలు అంతగా పలికేవి కావు. సంగీత దర్శకుడు రాయ్ చాంద్ బోరల్ ఆమెకు హిందీ ఉచ్చారణతో పాటలు పాడడంలో మంచి శిక్షణ ఇచ్చారు. దాంతో కానన్ హిందీ లో పాశ్చాత్య బాణీల్లో కూడా పాటలు పాడడంలో ప్రావీణ్యత సంపాదించింది. భారతీయ సినిమాకు ఆద్యులైన కె.ఎల్. సైగల్, పంకజ్ మల్లిక్, పి.సి. బరువా, పహారీ సన్యాల్, చబి బిశ్వాస్, అశోక్ కుమార్ లతో పనిచేసిన ఘనత కానన్ దేవిది. 1945లో చబి బిశ్వాస్ సరసన కానన్ దేవి డీలక్స్ పిక్చర్స్ వారి ‘పాత్ బెంధే దిలో’ అనే బెంగాలి చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బెంగాలి లో పెద్ద హిట్టయింది. తరవాత నిరేన్ లహరి దర్శకత్వంలో ‘బన్ పూల్’, ప్రేమేంద్ర మిత్ర దర్శకత్వంలో ‘రాజలక్ష్మి’, అపూర్వకుమార్ మిత్ర దర్శకత్వంలో ‘తుమి ఆర్ ఆమి’, దేవకీ బోస్ దర్శకత్వంలో ‘కృష్ణ లీల’, ‘చంద్రశేఖర్’, నితేన్ లహరి దర్శకత్వంలో ‘అరేబియన్ నైట్స్’ సినిమాల్లో కానన్ దేవి హీరోయిన్ గా నటించి మంచి పేరు గడించింది. 1954-59 మధ్య కాలంలో తన భర్త హరిదాస్ భట్టాచార్య దర్శకత్వంలో నాలుగు సినిమాల్లో కానన్ దేవి నటించింది. అవి... ‘నవవిధాన్’, ‘దేవత్ర’, ‘ఆశా’, ‘ఇంద్రనాథ్ శ్రీకాంత’ చిత్రాలు. ఈ సినిమాలన్నిటికీ కానన్ దేవి నిర్మాత కావడం మరో విశేషం. మొత్తం మీద కానన్ దేవి పదకొండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. దాదాపు నలభై సినిమాల్లో కానన్ దేవి ప్లే బాక్ పాటలు పాడి మంచి గాయని అనిపించుకుంది. ఆమె నిర్మించిన ఆఖరి చిత్రం ‘ఇంద్రనాథ్ శ్రీకాంత’ (1959).
వ్యక్తిగతం...
కానన్ దేవికి 4 డిసెంబర్ 1940న అశోక్ మైత్ర తో వివాహం జరిగింది. అశోక్ మిత్ర తండ్రి హేరంభ చంద్ర మైత్ర కు సినిమారంగం మీద చిన్నచూపు వుండేది. అందుచేత వీరి వివాహం అశోక్ మైత్ర తండ్రి చనిపోయాకనే అనుకూలించింది. అయితే ఆరోజుల్లో కట్టుబాట్లను అనుసరించి సినిమా నటీమణులకు పెళ్ళిళ్ళు జరగాలంటే ఇబ్బందిగానే వుండేది. కానన్ దేవి పెళ్ళికి యెన్నో నిరసనలు, అడ్డంకులు ఎదురయ్యాయి. విశ్వకవి రవీంద్రుడు వీరి పెళ్ళికి హాజరై ఆశీర్వదించడం కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. వారికి సిద్దార్థ అనే కుమారుడు కలిగాడు. భర్త కానన్ దేవి ని సినిమాల్లో నటించడం మానమని సలహా ఇచ్చాడు. కానన్ దేవికి ఆ కట్టుబాటు నచ్చలేదు. దాంతో త్వరలోనే వీరి సంసార బంధం తెగిపోయింది. ఇద్దరూ విడాకులు పుచ్చుకున్నారు. తరవాత కానన్ దేవి దర్శకుడు హరిదాస్ భట్టాచార్యను 1949లో వివాహమాడింది. అప్పుడు హరిదాస్ బెంగాల్ గవర్నర్ వద్ద పెద్ద ఉద్యోగంలో వుండేవారు. కొంతకాలం నౌకాశ్రమ అధికారిగా కూడా పనిచేశారు. కానన్ దేవి ని వివాహమాడాక సినిమా దర్శకత్వం చేపట్టి కానన్ దేవితో మంచి చిత్రాలు నిర్మించారు. అయితే 1987లో కానన్ దేవి నుంచి విడిపోయి వేరుగా వుండడం సాగించాడు. కానన్ దేవి 1959 తరవాత సినిమారంగం నుంచి తప్పుకుంది. కానన్ దేవి ‘మహిళా శిల్పి మహల్’ పేరుతో ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి సీనియర్ మహిళా నటీమణులకు బెంగాలి చిత్ర పరిశ్రమ సహకారంతో ఉపాధి కల్పిస్తూ వచ్చింది. బెంగాలి చిత్రసీమకు కానన్ దేవి తొలి హీరోయిన్. ఆమెకు 1968లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. 1976లో కానన్ దేవికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 2011లో బారత తంతి తపాలా శాఖ కానన్ దేవి స్మారక స్టాంపును విడుదల చేసింది. విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించింది. ఆమె 76 ఏళ్ళ వయసులో 17 జూలై 1992 న కలకత్తాలో తనువు చాలించింది. ఆమె భర్త 13 ఏళ్ళ తరవాత (2005)లో చనిపోయాడు.

ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.