ప్రమాదం పంచిన పవార్ విషాదం
మూకీ యుగంలో ఆమె అందాల హీరోయిన్. టాకీ యుగంలో తొలితరం హీరోయిన్ కూడా. 1928లో సర్పోర్త్ దార్ నిర్మించిన మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’లో ఆమే హీరోయిన్! 1998 లో విడుదలైన ‘లాష్’ చిత్రం దాకా ఏకబిగిన 70 సంవత్సరాలు హిందీ చిత్రసీమను శాసించిన అద్భుత నటి ఆమె. అంబా లక్ష్మణరావు సుగుణ్ అనే ఆ తార చిత్రసీమలో ‘లలితా పవార్’ గా గణుతికెక్కింది. టాకీచిత్ర నిర్మాణ ప్రారంభదశలో వచ్చిన ‘దిలేర్ జిగర్’ (1931), ‘కాళిదాస్’ (1932), ‘హిమ్మత్-ఎ-మర్దా’ (1935), ‘రాజకుమారి’ (1938), ‘దునియా క్యా హై’ (1938) వంటి విజయవంతమైన సినిమాల్లో లలితా పవార్ హీరోయిన్ గా నటించింది. 1940లో దర్శకుడు చంద్రరావు కదమ్ ‘జంగిల్-ఎ-ఆజాది’ అనే సినిమా కోసం లలితా పవార్ మీద ఒక సీరియస్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. మాస్టర్ భగవాన్ సినీ నటనకు కొత్త. (భగవాన్ దాదా తరవాతి కాలంలో మంచి హాస్యనటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు). భగవాన్ ఆ సన్నివేశంలో లలితా పవార్ చెంప చెళ్ళుమనిపించాలి. మెగాఫోన్ లో దర్శకుడు ‘స్టార్ట్’ చెప్పారు. భగవాన్ చెయ్యి బలంగా లలితా పచార్ చెంపను తాకడమే కాదు, అది ఆమె ఎడమ కంటిని ఇంకా బలంగా ముద్దాడింది. దాంతో ఆమె కంటిలోని రక్తకణాలు దెబ్బతిని కన్ను వాచిపోయింది. సరైన వైద్యం అందక పర్యవసానంగా ఆమె ఎడమ కంటికి, చెంపకు ఫేషియల్ పక్షవాతం సోకింది. అలా రెండు సంవత్సరాలు సినిమాలకు లలితా పవార్ దూరంగా ఉండాల్సి వచ్చింది. తనతో కుదుర్చుకున్న సినిమాలన్నీ రద్దు చేసుకుంది. హీరోయిన్ గా నటించే అవకాశాలు సన్నగిల్లాయి. కంటి ప్రమాదం జరిగాక హీరోయిన్ గా ఆమె నటించిన సినిమా ‘అమృత్’. ఆమెతోనే ‘అమృత్’ చిత్రాన్ని తీయాలని ఆ సినిమా నిర్మాతల ఆశయం. అటువంటి వర్ధమాన నటి తరవాత క్యారక్టర్ పాత్రలకు, హాస్య పాత్రలకు, గయ్యాళి అత్త, అమ్మమ్మ పాత్రలకు పరిమితమైంది. 18 ఏప్రిల్ లలితా పవార్ 103 వ జయంతి సందర్భంగా ఆమె గురించిన కొన్ని జ్ఞాపకాలు...


నేపథ్యం...
లలితా పవార్ మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర వున్న ఎవోలాలో 18 ఏప్రిల్ 1916 న జన్మించింది. వారిది సనాతన కుటుంబం. తండ్రి లక్ష్మణరావు షాగున్ ఖరీదైన సిల్కు బట్టల వ్యాపారం చేసేవాడు. లలితా పవార్ కు చిన్నతనం నుంచే లలితకళలమీద మక్కువ ఉండడంతో తొమ్మిదేళ్ళకే తన అన్నయ్యతో కలిసి పూణే కు వెళ్లి ‘పటిట్ ఉద్ధర్’, ‘రాజా హరిశ్చంద్ర’ మూకీ సినిమాలలో బాలనటిగా రాణించింది. ఆర్యన్ ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన 20 సినిమాల్లో ఆమె నటించింది. నలభయ్యో శకం వచ్చేసరికి హీరోయిన్ స్థాయికి చేరుకొని డెబ్భైఏళ్ళ వరకూ నటజీవితానికే అంకితమైంది. 1932 లోనే ‘కైలాష్’ అనే మూకీ సినిమాలో హీరోయిన్ గా, వ్యాంప్ గా, తల్లిగా మూడు పాత్రల్లో నటించడమే కాకుండా, ఆ చిత్ర నిర్మాణం లో పాలుపంచుకుంది. తరవాత భర్త గణపతి రావు పవార్ దర్శకత్వంలో లలితా పవార్ సొంతంగా నిర్మించిన టాకీ చిత్రం ‘దునియా క్యా హై’ (1938). లియో టాల్ స్టాయ్ రచించిన ‘రిసరక్షన్’ నవల ఈ చిత్రానికి ఆధారం. అందులో లలితా పవార్ సరసన హీరోగా మాధవ్ కాలే నటించాడు. 1942లో దర్శకుడు గింజాల్ వీనస్ ప్రొడక్షన్స్ సంస్థకు ‘కీర్తి’ అనే సినిమా నిర్మించాడు. అందులో జైరాజ్ సరసన లలితా పవార్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో నటనకు జైరాజ్, జగదీశ్, సునాలినీ దేవి, ఊర్మిళ ల కంటే అత్యధిక పారితోషికాన్ని తీసుకున్నది లలితా పవరే! సినిమా షూటింగ్లో గాయపడిన తరవాత నాలుగేళ్ళకు పైగా నటనకు దూరంగా ఉంటూ, పునఃప్రవేశం చేశాక క్యారక్టర్ నటనకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా కోడళ్ళను రాచి రంపానపెట్టే అత్త పాత్రలు, గయ్యాళి భార్య పాత్రలు లలితా పవార్ కు ట్రేడ్ మార్కులయ్యాయి. అయితే హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో రాజకపూర్ నిర్మించిన ‘అనాడి’ (1959) సినిమాలో లలితా పవార్ ఎల్.డి’సా అనే దయనీయమైన పాత్రను అద్భుతంగా పోషించింది. ఆ పాత్ర పోషణకు ఫిలింఫేర్ సంస్థ నుంచి లలితా పవార్ ఉత్తమ సహాయనటి బహుమతిని అందుకుంది. అలాగే లేఖ్ టాండన్ నిర్మించిన ‘ప్రొఫెసర్’ (1962)చిత్రంలో షమ్మికపూర్ ప్రేమకోసం ప్రాకులాడే ధనికురాలు సీతాదేవి వర్మగా అద్భుత నటన ప్రదర్శించింది. ఈ సినిమాలో నటనకు ఫిలింఫేర్ సంస్థ నుంచి ఫిలింఫేర్ వారి ఉత్తమ సహాయనటి బహుమతిని మరొకసారి అందుకుంది. రామానంద్ సాగర్ నిర్మించిన మెగా టెలివిజన్ సీరియల్ ‘రామాయణ్’ లో మందరమ పాత్రను సమర్ధవంతంగా పోషించి వీక్షకుల మన్ననలందుకుంది. భారత ప్రభుత్వం లలితా పవార్ ను భారతీయ సినిమా ప్రధమ మహిళగా గుర్తిస్తూ ఘనంగా సత్కరించింది. ఆమె గణపతి రావు పవార్ అనే వ్యక్తిని పెళ్ళాడింది. కానీ అతడు లలితా పవార్ చిన్న చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించి అతనికి దూరంగా జరిగింది. కొన్నేళ్ళ తరవాత సినీ నిర్మాత, అంబికా స్టూడియో అధిపతి రాజ్ ప్రకాష్ గుప్తాను వివాహమాడింది. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు.అలరించిన లలిత సినిమాలు...
ప్రభాత్ ఫిలిం కంపెనీ వారు 1944 లో విశ్రం బడేకర్ దర్శకత్వంలో నిర్మించిన ‘రామశాస్త్రి’ చిత్రంలో పేష్వా రఘోబా దాదా భార్య ఆనంది బాయిగా నటించింది. ఇందులో రామశాస్త్రి పాత్రను గజానన్ జాగిర్దార్ పోషించారు. రాజకమల్ స్టూడియో అధిపతి వి. శాంతారాం 1952లో ‘దహేజ్’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో హీరో కరణ్ దేవన్ తల్లి గా లలిత నటించింది. వసంత దేశాయి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం బాగా ఆడింది. అదే సంవత్సరం దిలీప్ కుమార్, నిమ్మి జంటగా నటించిన అమియా చక్రవర్తి సూపర్ హిట్ సినిమా ‘దాగ్’ లో దిలీప్ కుమార్ కు తల్లిగా లలిత నటించింది. మరొక శాంతారాం సినిమా ‘పరచైన్’ (నీడ)లో కూడా లలితా పవార్ ది అద్భుతమైన పాత్ర. 1955 లో రాజకపూర్ కె.ఎ. అబ్బాస్ దర్శకత్వంలో ‘శ్రీ 420’ అనే చిత్రాన్ని నిర్మించారు. రాజకపూర్, నర్గీస్ నటించిన ఈ సూపర్ డూపర్ చిత్రంలో లలితా పవార్ గంగా మాయి పాత్రలో చాలా బాగా రాణించింది. గురుదత్ నిర్మించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ కామెడీ సినిమాలో హీరోయిన్ మధుబాల అత్త సీతాదేవి పాత్రలో జీవించి నటించింది. 1961 లో సుబోద్ ముఖర్జీ నిర్మించిన ‘జంగ్లీ’ చిత్రంలో లలితా పవార్ హీరో షమ్మికపూర్ తల్లిగా నటించి మెప్పించింది. ఇక దేవానంద్ నిర్మించిన ‘హమ్ దోనో’ సినిమాలో దేవానంద్ తల్లిగా నటించింది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని 2011 లో కలర్ లోకి మార్చి విడుదల చేశారు. వి. శాంతారాం నిర్మించిన ‘సెహరా’ చిత్రంలో హీరోయిన్ సంధ్యకు తల్లిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. దర్శకనిర్మాత ఒ.పి. రల్హన్ 1966 లో నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పూల్ అవుర్ పత్తర్’ లో జీవన్ భార్యగా, గయ్యాళి అత్తగా అమోఘ నటన ప్రదర్శించింది. ఆ తరవాత వచ్చిన ‘ఆనంద్’ సినిమాలో మాట్రన్ గా, ఫి’ర్ ఒహీ రాత్’ లో హాస్టల్ వార్డన్ గా నటించింది. లలితా పవార్ కు మంచి పేరు తెచ్చిన సినిమా మన్మోహన్ దేశాయ్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘నసీబ్’(1981). అందులో లలితా పవార్ రీనారాయ్ (జూలీ పాత్ర) తల్లి మిసెస్. గోమ్స్ గా అద్భుత నటన ప్రదర్శించింది. అలా మొత్తం మీద లలిత 700 సినిమాలకు పైగానే నటించింది. అలాగే గుజరాతి, మరాఠి సినిమాల్లో కూడా లలితా పవార్ నటించి మంచిపేరు గడించింది. భాల్జీ పెందార్కర్ నిర్మించిన గుజరాతి చిత్రం ‘నేతాజీ పాల్కర్’ లలిత కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే న్యూ హనా పిక్చర్స్ వారు నిర్మించిన ‘సంత్ దమాజి’, నవయుగ ఛత్రపతి సంస్థ నిర్మించిన ‘అమృత్’, ఛాయా ఫిలిమ్స్ వారు నిర్మించిన ‘గోరా కుంబర్’ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన ’తాక్సేన్ రాజపుత్ర’, ‘చతుర్ సుందరి’ చిత్రాలు బొంబాయి థియేటర్లలో రికార్డు రోజులు ఆడి లలితకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ‘చతుర్ సుందరి’ సినిమాలో ఆమె ఏకంగా 17 పాత్రలు పోషించడం ఒక రికార్డు. 1931 లో వచ్చిన ‘దిలేర్ జిగర్’ సినిమాలో లలితా పవార్ అందం యెంత గొప్పగా ఉండేదో అని ఆరోజుల్లో పత్రికలు రాశాయి. లలితా పవార్ చివరిసారి నటించిన చిత్రం ‘భాయి’ (1997).న అందులో లలితా పవార్ ఓం పురికి తల్లిగా, పూజా బాత్రాకు నాయమ్మ గా నటించింది.


అనుభవాలు...
చిన్నతనంలో లలితా పవార్ కు సినిమాలంటే ఎలావుంటాయో తెలియదు. అప్పట్లో అన్నీ మూకీ సినిమాలే! ఒకసారి ఆరేళ్ళ ప్రాయంలో తల్లిదండ్రులతో కలిసి ఒక మూకీ సినిమాకు లలితా పవార్ వెళ్ళింది. ఆ సినిమాహాలు మొత్తం చీకటిగా ఉండడంతో ఆమె కాస్త భయపడింది. సినిమా తెరమీద బొమ్మ కనిపించడంతో అందులో బొమ్మలకు కాళ్ళు, చేతులు లేవేమని అమాయకంగా తల్లిదండ్రులను అడిగింది. భయపడి హాలుబయటకు పరుగెత్తింది కూడా. తరవాత సినిమా స్టూడియోకి వెళ్లి సినిమాలు ఎలా నిర్మిస్తున్నారో గమనించింది. ఆ అందమైన బాలికను చూసి దర్శకుడు సర్పోత్ దార్ తను నిర్మించిన ‘రామ్ లీలా’లో వేషం వేయించారు. అలా తొలిసారి ఆరురోజులపాటు షూటింగులో పాల్గొంది. అందులో నటించినందుకు లలితా పవార్ కు 18 రూపాయల పారితోషికం లభించింది. రాజకపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ లకన్నా లలితా పవార్ కాస్త వయసులో పెద్దది. అయినా వారికి ఆమె తల్లిగా నటించడం విశేషం. బ్లాక్ అండ్ సినిమాల నిర్మాణ కాలంలో లలితా పవార్ ను ‘ఈవిల్ లేడీ’ అని సంబోధించేవారు. తొలిరోజుల్లో మంచి తల్లి పాత్రలు పోషించినా తదనంతర కాలంలో వచ్చిన సినిమాల్లో కల్లోలపెట్టే గయ్యాళి అత్త పాత్రలు పోషించాల్సి వచ్చింది. ‘నౌ దో గ్యారా’, ‘సుజాత’ వంటి సినిమాలు ఆ కోవలోనివే. జీవిత అనుభవాలను నెమరు వేసుకుంటూ లలితా పవార్ 24 ఫిబ్రవరి 998న తన 82 వ ఏట పూణే నగరంలో ఒంటరిగా కాలం గడుపుతూ కాలధర్మం చెందింది.

ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.