ఆమె జీవితం... సుమధుర ప్రేమ కావ్యం!
‘జీవితమే ఒక నాటకరంగం’ అన్నాడు ఆంగ్ల నాటక రచయిత షేక్స్‌పియర్‌. చరిత్రలో విఫలమైన ప్రేమకథలు యెన్నో! వాటిలో కొన్ని వెండితెర మీద కూడా దర్శనమిచ్చాయి. హిందీలో 1960లో వచ్చిన ప్రేమకథా కావ్యం ‘మొఘల్‌ -ఈ ఆజం’. మొగలాయీ యువ చక్రవర్తి సలీం (జహంగీర్‌), ఆస్థాన నాట్యకళాకారిణి నాదిరా (అనార్కలి)ల మధ్య చిగురించిన ప్రేమను అనుమతించని అక్బర్‌ చక్రవర్తి ఆజ్ఞకు బలియైన ఆ ప్రేయసి లాగే, తన జీవితాన్ని గడిపిన బాలీవుడ్‌ అందాల సుమమాల మధుబాల. ‘నీలీ అంఖే, సాచే బెతాలా చెహరా, లంబీ ఖడీ నాఖ్, బిల్కష్‌ ముస్కాస్, తరాషా హువాసంÞ’Â, బర్మరీ పదర్‌’ అంటూ మధుబాల అందాన్ని దర్శకుడు ఆసిఫ్‌ అద్భుతంగా వర్ణించినా, ఆ వర్ణన ఆమె అందానికి సాటిరాదన్నది నిజం. మధుబాల సినిమాలు సూపర్‌ హిట్టయినప్పుడు ఆమెను అందరూ వీనస్‌ క్వీన్‌గా కీర్తించారు. ఆడని సినిమాల దురదృష్టాన్ని కూడా ఆమెకే ఆపాదిస్తూ ‘బాక్సాఫీస్‌ పాయిజన్‌’గా విమర్శించారు కూడా. ఈ అందాల రాశి తక్కువ సినిమాల్లో నటించి, అతి తక్కువ కాలం జీవించినా, ఆమె సినిమాలను ప్రేక్షకులు మరిచిపోలేదు... మరచిపోలేరు కూడా. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 23 న ఈ భగ్న ప్రేమికురాలి వర్ధంతి. ఆ సందర్బంగా ఈ బాలీవుడ్‌ మార్లిస్‌ మన్రో మధుబాలను గురించి కొన్ని విషయాలు మీకోసం...


మధు‘బాల్య’ కథ
దిల్లీలో 1993, ఫిబ్రవరి 14న పుట్టిన మధుబాల తల్లిదండ్రులు అత్తావుల్లాఖాన్, ఆయేషాబేగం. పుష్తున్‌ ముస్లిం వంశానికి చెందిన వీరికి పదముగ్గురు సంతానం. అందులో మధుబాల ఐదవ బిడ్డ. మధుబాలకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ముంతాజ్‌ జెహాన్‌ బేగం దెహ్లవి. తండ్రి పెషావర్‌ ఇంపీరియల్‌ టొబాకో కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగం పోవడంతో దిల్లీకి వలస వచ్చాడు. మధుబాల అక్కడే పుట్టింది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల బొంబాయికి మకాం మర్చాడు. సరైన పోషణ లేక అయిదారేళ్ల ప్రాయంలోనే మధుబాల ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు కాలం చేసారు. ఆ సమయంలో ఉన్న పూరిల్లు కూడా తగలబడిపోవడంతో తొమ్మిదేళ్ల వయసున్న మధుబాలను వెంటపెట్టుకొని చిన్న చిన్న పనుల కోసం సినిమా స్టూడియోల వెంటపడ్డాడు తండ్రి. 1942లో బాంబే టాకీస్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రఖ్యాత నటీమణి దేవికారాణి ‘బసంత్‌’ సినిమాను ఆమియా చక్రవర్తి దర్శకత్వంలో నిర్మించారు. అందులో ముంతాజ్‌ శాంతి, ఉల్హాస్‌ నటించగా వారి కూతురుగా మధుబాల తెరంగ్రేటం చేసింది. ఇందులో మధుబాల ‘మేరే చోటే సే మన్‌ మే చోటి సి దునియా రే’ అనే పాట కూడా పాడింది. సినిమాలో ఆమె పేరు బేబీ ముంతాజ్‌. ఆమె నటనకు, అందానికి ముచ్చటపడిన దేవికారాణి ఆమె పేరును మధుబాలగా మార్చింది. ఆ సినిమా బాగా ఆడడంతో బాలనటిగా మధుబాలకు మంచి అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. 1944-47 మథ్యకాలంలో ‘ముంతాజ్‌ మహల్‌’, ‘ధన్నా భగ ‘పూజారి’, ‘పూల్వారి’ ‘రాజపుటాణి’ సినిమాల్లో బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది.


హీరోయిన్‌గా మధుబాల
పద్నాలుగేళ్ల వయసులో 1947లో మధుబాల బాంబేటాకీస్‌ తరఫున కేదార్‌నాథ్‌ శర్మ నిర్మించిన ‘నీల్‌ కమల్‌’ సినిమాలో తొలిసారి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలోనే గ్రేటెస్ట్‌ షోమ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా కీర్తి గడించిన రాజ్‌కపూర్‌ కూడా పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత నటించిన ‘చిత్తర్‌ విజయ్‌’, ‘మేరే భగవాన్‌’ ‘ఖూబ్‌ సూరత్‌ దునియా’, ‘లాల్‌ దుపట్టా’, ‘అమరప్రేమ’, ‘సింగాô’Â సినిమాలు కూడా గొప్పగా ఆడలేదు. 1949లో బాంబే టాకీస్‌ వారి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా ‘మహల’్ మధుబాలను బాలీవుడ్‌ అందలమెక్కించింది. ఇది కమల్‌ అమ్రోహికి మొదటి చిత్రం కాగా అశోక్‌కుమార్‌ హీరోగా నటించాడు. ఖేంచంద్‌ ప్రకాశ్‌ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్‌ పాడిన ‘‘ఆయేగా ఆనేవాలా ఆయేగా’’ పాట చాలా పాపులరై లతాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాటవున్న రికార్డు మీద మధుబాల పోషించిన కామిని పాత్రపేరు మాత్రమే తొలుత ముద్రించారు. ఆకాశవాణి ఈ పాటను ప్రసారం చేసినప్పుడు పాటపాడిన గాయని ఎవరో తెలుపవలసిందని బండెడు ఉత్తరాలు రావడంతో లతా పేరును తొలిసారి ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. లతా పాడిన ‘‘దిల్‌ నే ఫిర్‌ యాద్‌కియా ముష్కిల్‌ హై బహుత్‌ ముష్కిల’’్ పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. అదే సంవత్సరం అబ్దుల్‌ రషీద్‌ కర్దార్‌ నిర్మించిన ‘దులారి’ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన 8వ భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. మధుబాలకు ఇక వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నౌషాద్‌ సంగీతం సమకూర్చిన ‘‘ఆంఖో మే ఆజా దిల్‌మే సంఝూ’’, ‘‘దో దిన్‌ కీ బహార్‌ ప్యారే’’, ‘‘సుహానీ రాత్‌ ఢల్‌ చుకీ న జానే తుం కబ్‌ ఆవోగే’’ పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. 1950లో అమర్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బేఖుసూర్‌’ కూడా కలెక్షన్ల్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. 1951లో రామ్‌ దుర్వాని ‘తరానా’ సినిమా నిర్మిస్తే అందులో మధుబాల సరసన తొలిసారి దిలీప్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఒక ప్రేక్షకుడు ఈ సినిమాను 131 సార్లు చూసాడంటే అది ఎంతటి హిట్టో చెప్పాల్సిన పనిలేదు. 1951లో ప్రేమనాథ్‌ హీరోగా ‘బదల’్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు అమియా చక్రవర్తి దర్శకత్వం వహించగా, శంకర్‌ జైకిషన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా కూడా బాగా ఆడింది. ‘‘అయ్‌ దిల్‌ నముఝ్‌ సే ఛుపా, సచ్‌బతా క్యాహువా’’, ‘‘ఉన్సే ప్యార్‌ హోగయా దిల్‌ మేరా హోగయా’’, ‘‘రోతా మేరా దిల్‌ కిస్కో పుకారూ క్యాకరూ’’ పాటలు ప్రజాదరణ పొందాయి. హీరోయిన్‌గా వచ్చిన రెండేళ్లలోనే మధుబాలకు ఎంత పేరొచ్చిందంటే అమెరికన్‌ మాగజైన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ 1952 ఆగస్టు సంచికలో మధుబాల ఫుల్‌పేజీ ఫోటో ముద్రించి ‘‘ది బిగ్గెస్ట్‌ స్టార్‌ ఇన్‌ ది వరల్డ్‌ అండ్‌ షి ఈజ్‌ నాట్‌ ఇన్‌ బెవెర్లీ హిల్‌్్స’’ (హాలీవుడ్‌) అంటూ వ్యాసం ప్రచురించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత దర్శకుడు ఫ్రాక్‌ కాప్రా హాలీవుడ్‌కు పరిచయం చేస్తానని ముందుకొస్తే మధుబాల తండ్రి అడ్డుకున్నాడు. అశోక్‌ కుమార్, రాజకపూర్, దిలీప్‌ కుమార్‌తో బాటు ప్రదీప్‌ కుమార్, షమ్మికపూర్, దేవానంద్, సునీత్‌దత్‌ వంటి సెలబ్రిటీల సరసన; గీతాబాలి, కామిని కౌశల్, నళిని జయవంత్, నిమ్మి, శ్యామా వంటి ప్రధాన నటీమణుల సరసన కూడా మధుబాల నటించింది. 1950-60 దశకం మధుబాలదే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. గురుదత్‌ సినిమా ‘మిస్టర్‌ ఖీ మిసెస్‌ 55’ ఎస్‌డి నారంగ్‌ ‘యహుది కి లడ్కి’, రాజ్‌ ఖోస్లా ‘కాలాపానీ’, ‘శక్తి సామంత’, ‘హౌరాబ్రిడ్జి’, ‘ఇన్సాన్‌ జాగ్‌ ఉఠా’, సత్యన్‌బోసు ‘చల్తీకా నామ్‌ గాè’† కె. ఆసిఫ్‌ ‘మొఘల్‌ ఈ ఆజం’, సినిమాలు మధుబాల కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాయి. మధుబాల నటించిన అన్ని సినిమాల్లో ‘మొఘల్‌ - ఈ - ఆజం’ గొప్ప పేరుతెచ్చుకుంది. అందులో మధుబాల నటన పరాకాష్టకు చేరింది. ఈ సినిమా పూర్తవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. 1960 ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా వసూళ్ల రికార్డును 15 సంవత్సరాల పాటు ‘షోలే’ (1975) సినిమా వచ్చేదాకా నిలిచిందంటే దాని ఘనత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో మధుబాల సినిమాకు బర్మా, మలేషియా, ఇండోనేషియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో మంచి మార్కెట్‌ వుండేది. మధుబాల సంవత్సరానికి నాలుగు సినిమాలకు పైగా నటించేది. ఒకే ఏడాది (1952) ఏకంగా తొమ్మిది సినిమాలో నటించింది. హీరోయిన్‌గా తొలి నాలుగేళ్లలోనే 24 సినిమాలోల నటించి రికార్డు నెలకొల్పింది. ఆమె పబ్లిక్‌ ఫంక్షన్లలో కనపడేది కాదు. అంచేత మధుబాలను చూడాలనే క్రేజ్‌ అభిమానులకు వుండేది.


విఫల ప్రేమాయణం
పదహారేళ్ల వయసులోనే స్టార్‌ స్థాయికి ఎదిగిన మధుబాల ‘తరాన’ సినిమా సెట్‌్్స మీద దిలీప్‌కుమార్‌తో ప్రేమలో నడింది. దిలీప్‌ కుమార్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఒక రోజు పువ్వును పంపి తనతో ప్రేమకు సరేనంటే ఆ పువ్వును తీసుకోవాలని కోరింది. దిలీప్‌ అంగీకరించాడు. ‘బాదల్‌’ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో ప్రేమనాథ్‌కు కూడా ఇదే విధంగా పువ్వును పంపి ప్రేమను వ్యక్తం చేసింది. ఈ విషయం దిలీప్‌ కుమార్‌కు తెలియదు. దిలీప్‌కు మిత్రుడైన ప్రేమనాథ్‌ మధుబాల ప్రేమకు నో చెప్పాడు. మహల్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె దర్శకుడు మకల్‌ అమ్రోహిని కూడా ప్రేమించింది. దీనికి కారణం... ఆమె ఆ లేత వయసులో ప్రేమకు, వ్యామోహానికి తేడా తెలుసుకోలేక పోవడమే. చివరకు దిలీప్‌ కుమార్‌ ప్రేమకే ఆమె కట్టుబడింది. ఇద్దరూ ఏడు సంవత్సరాలు ప్రేమ సంబంధాన్ని కొనసాగించారు. ‘నయా దౌర్‌’ సినిమా విషయంలో దిలీప్‌ కుమార్‌ మధుబాలకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పినా వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. సినిమాలకు స్వస్తి చెప్పి తనను పెళ్లి చేసుకోమని దిలిప్‌ చెప్పాడు. కానీ, ఆమె తన తండ్రికి క్షమాపణ చెప్పమని షరతు విధించింది. దిలీప్‌ నో చెప్పడంతో వారిద్దరి పెళ్లి జరగలేదు. సుదీర్ఘకాలం నడిచిన ‘మొఘల్‌ - ఈ- ఆజం’ షూటింగు కోసం ఇద్దరూ పనిచేయాల్సి రావడంతో ఎడముఖం పెడముఖం గానే వారు వ్యవహారించారు. షూటింగులో దిలీప్‌ మధుబాల చెంపమీద నిజంగా కొట్టడంతో మధుబాల ముఖం కందిపోయి షూటింగు వారం రోజులు ఆగిపోయింది కూడా! నర్గిస్‌ ఆమెకు మంచి మిత్రురాలు. భరత్‌ భూషణ్, ప్రదీప్‌ కుమార్‌లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. కానీ మధుబాల ‘చల్తీకా నామ్‌ గాడీ’ సినిమా షూటింగు సమయంలో కిషోర్‌ కుమార్‌తో ప్రేమలో పడి అతనినే వివాహం చేసుకుంది. కిషోర్‌ డబ్బు మనిషి.

కలసిరాని కాలం
1957లో బిఆర్‌ చోప్రా దిలీప్‌ కుమార్‌ హీరోగా ‘నయాదౌర్‌’ సినిమా ప్రారంభించినప్పుడు నాయికగా మధుబాలను ఎంపిక చేసి 15 రోజులు షూటింగు కూడా జరిపారు. అవుట్‌ డోర్‌ షూటింగు కోసం గ్వాలియర్‌ వెళ్లవలసి వచ్చింది. అవుట్‌ డోర్‌ షూటింగు ప్రదేశంలో దిలీప్‌ మధుబాలతో ప్రేమాయణం కొనసాగించే అవకాశముంటుందని మధుబాల తండ్రి ఒప్పుకోలేదు. అందుకు కినుక వహించిన చోప్రా మధుబాలకు ఇచ్చిన ముప్పైవేల రూపాయల అడ్వాన్స్‌ రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. మధుబాల మాత్రం తండ్రినే సపోర్టు చేసింది. దీంతో ఆమె కీర్తి దెబ్బతింది. వైజయంతిమాలను హీరోయిన్‌గా పెట్టి సినిమా పూర్తిచేసి విడుదలచేస్తే ‘నయాదౌర్‌’ బాగా ఆడింది. ఐదు సంవత్సరాలు సాగిన దిలీప్‌ కుమార్, మధుబాల ప్రేమాయణానికి ఈ కోర్టుకేసుతో తెరపడింది. 1950 ప్రాంతంలోనే మధుబాలకు గుండె సంబంధ వ్యాధి బయటపడింది. ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బయట పెట్టలేదు. అది ప్రాణాంతకమని తెలసి కూడా రిస్కుతో కూడిన సన్నివేశాల్లో నటించింది. లండన్‌లో ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషను చేస్తే చనిపోయే అవకాశాలు ఎక్కువని, ఏడాదికి మించి ఆమె బతకదని చెప్పడంతో మధుబాల కేవలం మందుల మీదే నెట్టుకోచ్చింది. దిలీప్‌ కుమార్‌ మీద ప్రేమ చావక, చివరి క్షణాల్లో అతనిని చూడాలని కబురంపితే దిలీప్‌ రాలేదు. చివరకు ఆమె అంత్యక్రియలకు కూడా దిలీప్‌ హాజరు కాలేదు. ఆ విధంగా తన 36వ ఏట మధుబాల అందమైన శరీరాన్ని వదిలి పరలోకం చేరుకుంది. ఈ వీనస్‌ క్వీన్‌ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించడమే ఇప్పుడు ఆమెకు మనం ఇవ్వగలిగిన నివాళి!

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.