అద్వితీయ అభినేత్రి...మీనాకుమారి

ఆమె నటన భారత చలనచిత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ తగినది. ఆమె నటించిన ‘బైజు బావరా’, ‘పరిణీత’, ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్’, ‘పాకీజా’ సినిమాలు బాలీవుడ్‌ చిత్రాలు వున్నంతకాలం చరిత్రలో నిలిచిపోయేవే. తనకు నచ్చిన, తాను మెచ్చిన, చాలా కష్టం అనిపించిన పాత్ర సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌లోని ‘చోటీ బహు’ అని ఆమే స్వయంగా చెప్పుకుంది. ఆ మహానటే వెండితెర విషాద రాణి... మరో సావిత్రి ... మీనాకుమారి. భర్తను ప్రేమించి, అతని కోసం చివరకు మద్యం తీసుకునేందుకైనా వెనుకాడని భార్యగా ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్’లో, అచ్చమైన బెంగాలీ యువతిలా కనపడే ‘పరిణీత’ లోని లలిత పాత్రలో ఆమె చూపిన భావోద్వేగాలు నటనకు పరాకాష్ట అని చెప్పవచ్చు. తన ముఖ లాలిత్యంతో, నటనా కౌశలంతో ఇలాంటి ఎన్నో పాత్రలకు జీవం పోసి, మరెందరో నిర్మాతలకు విజయాలను అందించి, అజరామరమైన కీర్తి ప్రతిష్టలను మాత్రం తనకు మిగుల్చుకొని 38 ఏళ్లకే నూరేళ్లు నింపుకొని ఇహలోకాన్ని విడిచివెళ్లింది ఈ మహానటి మీనాకుమారి. సెయింట్‌ ఎలిజెబత్‌ ఆసుపత్రిలో తన ప్రాణాలను విడిచిపెడుతూ ‘‘నాకింకా బ్రతకాలని ఉంది’’ అంటూ ఆక్రోశించింది. తన సమాధిమీద ‘విరిగిన వాయులీనంలో, తెగిన పాటతో, పగిలిన గుండెతో సెలవు తీసుకుంటున్నా’అని రాయించుకుంది. నేడు ఈ బహుముఖ ప్రాజ్ఞి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ విషాద సుకుమారిని గురించి డిజిటల్‌ సితార పాఠకులకు కొన్ని ఆసక్తికర విషయాలు....



* బేబీ మీనాగా మెహజబీన్‌..

మీనాకుమారి టాగూర్‌ వంశానికి చెందిన వనిత. ఆమె అమ్మమ్మ హేమసుందరిదేవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ సోదరుడు సుకుమార్‌ టాగూర్‌ కుమార్తె. జాదూ నందన్‌ టాగూర్‌ను వివాహమాడడంతో ఆమె హేమసుందరి ఠాగూర్‌గా మారింది. తన భర్త మరణించడంతో ఆమె అత్త ఆస్తులు ఇవ్వకపోగా, టాగూర్‌ ఇంటిపేరును కూడా వదలుకోవాలని శాసించడంతో కలకత్తా వదలి మీరట్‌కు వెళ్లి ఒక నర్సు ఉద్యోగంలో చేరింది. అక్కడే పరిచయమైన ప్యారేలాల్‌ శంకర్‌ అనే క్రైస్తవుణ్ణి వివాహం చేసుకుంది. అతడు ఒక ఉర్దూ పత్రికకు పాత్రికేయునిగా ఉండేవాడు. హేమసుందరికి ఇద్దరు కూతుళ్లు. వారిలో ప్రభావతిదేవి మీనాకుమారికి తల్లి. ప్యారేలాల్‌ మరణించాక తల్లి బొంబాయి చేరుకొని నాటకాల్లో నటిగా, డ్యాన్సర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ పావిన్స్‌కు చెందిన మాస్టర్‌ ఆలి బక్ష్ అనే సున్నీ ముస్లింతో పరిచయమై పెళ్లికి దారితీసింది. పఠాన్‌ను పెళ్లాడడంతో ప్రభావతి పేరు ఇఖ్బాల్‌ బేగంగా మారిపోయింది. అతడికి అప్పటికే పెళ్లయి పిల్లలున్నారు. అతడు హార్మోనియం బాగా వాయించేవాడు. కొన్ని సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు కూడా వేశాడు. ఆగస్టు 1, 1933న పుట్టిన మీనాకుమారి వీరికి రెండవ సంతానం. మీనాకుమారి అసలు పేరు మెహజబీన్‌ బానో. ఆమెకు ‘నాజ్‌’, ‘మున్నా’ అనే ముద్దు పేర్లున్నాయి. ఆర్ధిక సమస్యల వలన మీనాకుమారి పెద్దగా చదువుకోలేకపోయింది. ఆమెకు ఆకలే జీవితపాఠాలను నేర్పింది. కుటుంబ పోషణ కోసం అక్క ఖుర్షిద్‌తో కలిసి సినిమా స్టూడియోల వెంట పరుగులు తీసింది. ఈస్ట్‌ దాదర్‌ రైల్వే స్టేషను వద్ద దాదా సాహెబ్‌ ఫాల్కే రోడ్డులో రూప్‌ తారా స్టూడియోకి కాసింత దూరంలో ఒక చిన్న గదిలో వీరి నివాసం వుండేది. మీనా స్థానంలో కొడుకు పుడతాడని ఆశించిన తల్లిదండ్రులు ఆమె పట్ల వివక్షత చూపేవారు. ఖుర్షీద్‌తోబాటు ఆమె తండ్రి మీనాను సినిమాలలో చేర్చి ఆర్ధిక సమస్యలను తీర్చుకోవాలని ఆమెను ఆరవ ఏటనే విజయభట్‌ వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడే ప్రకాష్‌ పిక్చర్స్‌ వారు విజయభట్‌ దర్శకత్వంలో ‘ఫర్జాందే వతన్‌’ (లెదర్‌ ఫేస్‌−1939) అనే స్టంట్‌ సినిమా నిర్మించబోతున్నారు. మీనాకుమారిని అందులో పైడి జైరాజ్‌ కూతురుగా నటింపజేశారు. కెమెరా ముందు బెరుకు లేకుండా నటిస్తున్న మెహజబీన్‌ను చూసి ఎంతో మెచ్చుకుంటూ విజయభట్‌ ఆమె పేరును ‘బేబీ మీనా’గా మార్చారు. సినిమాలలో బిజీ అవడంతో మీనాకుమారికి స్కూల్‌కు వెళ్లే అవకాశం కూడా దొరకలేదు. ఇంటివద్దే ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకుంది. స్టూడియోలోనే విరామం దొరికినప్పుడు ఒక మూలకెళ్లి కూర్చొని చదువుకుంటూ వుండేది. ఆమెకు ఉర్దూలో కవిత్వం రాసే ప్రజ్ఞ వుంది. కథలు, గజళ్లు కూడా రాసింది. తరువాతి కాలంలో వాటిని పుస్తకాలుగా అచ్చువేయించింది. ఖయ్యూం సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన గజళ్లు ఒక లాంగ్‌ ప్లే రికార్డుగా వెలువడ్డాయి. విజయభట్‌ సినిమా తరువాత ‘అధూరి కహాని’, ‘పూజా’, ‘ఏక్‌ హి భూల్‌’, ‘నయీ రోషిణీ’, ‘కస్తూరి’, ‘విజయ్‌’, ‘గరీబ్‌’, ‘ప్రతిజ్ఞ’, ‘లాల్‌ హవేలీ’ వంటి వివిధ చిత్రాల్లో 1944 వరకు బాలనటిగా నటించింది. బాలనటిగా ఆమె నటించిన చివరి చిత్రం ‘బచ్‌ పన్‌ కా ఖేల్‌’ (1946). అప్పుడు మీనాకుమారికి 13 ఏళ్లు. బాల నటి నుంచి తారాగా ఎదుగుతున్న మధ్యకాలంలో మీనాకుమారి హోమీవాడియా నిర్మించిన ‘లక్ష్మీనారాయణ్‌, ‘వీర్‌ ఘతోత్కచ్‌’, ‘హనుమాన్‌ పాతాళ్‌ విజయ్‌’, ‘గణేష్‌ మహిమ’, ‘అలాదీన్‌ అవుర్‌ జాదుయీ చిరాగ్‌’ వంటి పౌరాణిక, జానపద సినిమాల్లో నటించింది.


* బాలనటి నుంచి హీరోయిన్‌గా ఎదిగి..
సాధారణంగా బాల నటులుగా రాణించినవారు పెద్దయ్యాక ప్రముఖ నటులుగా ఎదిగిన దాఖలాలు తక్కువే. కరిగిపోయే బాల్యంతో వారు కనుమరుగవుతూ వుంటారు. కానీ మీనాకుమారి విషయంలో ఈ సూత్రం తప్పని తేలింది. మీనాతోబాటు మంచి హీరోయిన్‌గా ఎదిగిన మరో బాల నటి ‘బేబీ ముంతాజ్‌’గా పిలువబడిన ‘మధుబాల’. 14 ఏళ్లకే తారగా ఎదుగుతున్న తొలిరోజులలోనే మీనాకుమారి తల్లి ఊపిరి తిత్తుల సమస్యతో మరణించింది. మీనాకుమారిగా మారాక ఫణి మజుందార్‌ దర్శకత్వంలో బాంబే టాకీస్‌ వారు నిర్మించిన ‘తమాషా’ సినిమా పెద్ద హిట్టయింది. అందులో దేవానంద్‌ హీరో. ఈ చిత్రానికి ఖేమ్‌ చంద్‌ ప్రకాష్, మన్నాడే, ఎస్‌.కె. పాల్‌ సంయుక్తంగా సంగీత దర్శకత్వం నిర్వహించడం విశేషం. 1952లో విజయ భట్‌ నిర్మించిన ‘బైజు బావరా’లో భరత్‌ భూషణ్‌ సరసన మీనాకుమారి నటించింది. నౌషాద్‌ సంగీతంతో ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో మీనాకుమారి హీరోయిన్‌గా సుస్థిర స్థానం చేరుకోగలిగింది. ఫిలింఫేర్‌ ఉత్తమ నటి బహుమతి కూడా అందుకుంది. తరువాతి సంవత్సరం నటించిన బిమల్‌రాయ్‌ చిత్రం ‘పరిణీత’లో ‘లలిత’ పాత్రలో నటనకు మరొకసారి ఫిలింఫేర్‌ ఉత్తమ నటి బహుమతి అందుకుంది. మరో బిమల్‌ రాయ్‌ చిత్రం ‘దో భిగా జమీన్‌’లో మీనాకుమారి అతిథి పాత్రలో కనిపించింది. 1955లో దిలీప్‌ కుమార్‌ సరసన నటించిన ‘ఆజాద్‌’ (తెలుగులో అగ్గిరాముడు) సినిమాలో ఆమె పేరు ఉత్తమనటి కోసం నామినేట్‌ అయినా బహుమతి రాలేదు. తరువాత జి.పి.సిప్పీ నిర్మించిన ‘ఆదిల్‌−ఎ−జహంగీర్‌’ (1955) సినిమాలో ప్రదీప్‌ కుమార్‌ సరసన, కె.అమరనాథ్‌ నిర్మించిన ‘నయా అందాజ్‌’, తల్వార్‌ నిర్మించిన ‘మేమ్‌ సాబ్‌’ (1956) సినిమాలలో కిషోర్‌ కుమార్‌ సరసన, బి.ఆర్‌. చోప్రా చిత్రం ‘ఏక్‌−హి−రాస్తా’(తెలుగులో కుంకుమరేఖ చిత్రం)లో అశోక్‌ కుమార్‌ సరసన, హేమచందర్‌ చిత్రం ‘బంధన్‌’లో ప్రదీప్‌ కుమార్‌ సరసన మీనాకుమారి నటించింది. ఈ సినిమాలన్నీ విజయ డంకా మ్రోగించాయి. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ‘శారద’ (1957−తెలుగులో ఇలవేల్పు) సినిమాలో రాజకపూర్‌ సరసన మీనాకుమారి నటించింది. అదే సంవత్సరం ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలోనే ‘మిస్‌ మేరి’ (మిస్సమ్మ)లో నటిస్తే అది సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తరువాత ‘యాహుది’ (బిమల్‌ రాయ్‌−దిలీప్‌ కుమార్‌), ‘సహారా’ (లేఖ్రాజ్‌ భాక్రి− ఎం.రాజన్‌), ‘ఫరిస్తా’ (రవీంద్ర దవే− అశోక్‌ కుమార్‌), షరారత్‌ (హెచ్‌.ఎస్‌. రావల్‌− కిషోర్‌ కుమార్‌), దేవేంద్ర గోయల్‌ సినిమా ‘చిరాగ్‌ కహాఁ రోష్ణీ కహాఁ’ (రాజేంద్రకుమార్‌− తెలుగులో మాబాబు), కె.ఎ. అబ్బాస్‌ చిత్రం ‘చార్‌ దిల్‌ చార్‌ రహే’ (షమ్మికపూర్‌), దులాల్‌ గుహా ‘దుష్మన్‌’ (తెలుగులో ఖైదీ బాబాయి), మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 1960లో కిషోర్‌ సాహు దర్శకత్వంలో కమల్‌ అమ్రోహి నిర్మించిన ‘దిల్‌ అప్నా అవుర్‌ ప్రీత్‌ పరాయీ’ సినిమా మీనాకుమారి జీవితంలో పెద్ద మలుపును తెచ్చింది.


* మీనా జీవితంలోకి కమల్‌ అమ్రోహి..
సినిమాలో జరిగినట్లే మీనాకుమారి నిజ జీవితం కూడా ఒక అసాధారణ మలుపు తిరిగింది. అదే కమల్‌ అమ్రోహి అనే రచయిత, దర్శకుడు ఆమె జీవితంలోకి ప్రవేశించడం. కమల్‌ అమ్రోహి తొలిసారి దర్శకత్వం వహించిన బాంబే టాకీస్‌ వారి ‘మహల్‌’ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్టయింది. నటి మధుబాలకు సూపర్‌ స్టార్డం తెచ్చిపెట్టింది. అందులో హీరోనే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన అశోక్‌ కుమార్‌ కమల్‌ను మీనాకుమారికి పరిచయం చేశారు. ఎందుకో మీనాకుమారిని తొలిచూపులోనే కమల్‌ అమ్రోహి ఆకర్షించాడు. అతణ్ణి లాహోర్‌ నుంచి బొంబాయి తీసుకొనివచ్చి సోహ్రాబ్‌ మోడీకి పరిచయం చేసినవారు కుందన్‌ లాల్‌ సైగల్‌. కమల్‌ మినర్వా మూవిటోన్‌ సంస్థలో చేరి జైలర్, భరోసా, పాగల్‌ చిత్రాలకు కథారచయితగా, ‘చలియా’, పుకార్, ‘మై హరి’, మజాఖ్‌ వంటి సినిమాలకు సంభాషణల రచయితగా పనిచేశాడు. కమల్‌ అమ్రోహి బాంబే స్టూడియోకి తొలిసారి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘మహల్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో అతనికి ఎక్కడలేని పేరుప్రఖ్యాతులు వచ్చిపడ్డాయి. అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి. ఆయన మొదటి భార్య బిల్కీస్‌ బానో నర్గీస్‌ తల్లికి సహాయకురాలిగా వుండేది. రెండవ భార్య మెహమూదీ. ఆమెకు ముగ్గురు పిల్లలు. కలమల్‌ అమ్రోహి తన జీవితకాలంలో దర్శకత్వం వహించింది నాలుగే నాలుగు సినిమాలు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అవి ‘మహల్‌’, ‘దాయిరా’, ‘పాకీజా’, ‘రజియా సుల్తానా’. ‘మజ్నూ’ అనే సినిమాకు కూడా దర్శకత్వం చేపట్టినా అది అసంపూర్ణంగా మిగిలింది. ‘దాయిరా’, ‘పాకీజా’ చిత్రాలతోబాటు ‘దిల్‌ అప్నా అవుర్‌ ప్రీత్‌ పరాయీ’ సినిమాకు కమల్‌ అమ్రోహి నిర్మాత కూడా. మీనాకుమారి జీవితం మలుపు తిరగడానికి ఈ సినిమానే కారణం. అయితే దానికి ముందు కొంత డ్రామా నడిచింది. మీనాకుమారి నటించిన ఫణి మజుందార్‌ చిత్రం ‘తమాషా’ (1952) రషెస్‌ చూశాక కమల్‌ మీనాకుమారి మీద ఒక కన్నేసి ఉంచాడు. మఖన్‌ లాల్‌ అనే నిర్మాత కమల్‌ అమ్రోహి దర్శకత్వంలో ‘అనార్కలి’ సినిమా తీయాలని సంకల్పించి, ‘మహల్‌’ చిత్రంలో నటించిన మధుబాలను హీరోయిన్‌గా బుక్‌ చేశాడు. అయితే ఆమె దిలీప్‌ కుమార్‌ను హీరోగా బుక్‌ చేయాలని షరతు పెట్టడంతో ఆమెకు ఉద్వాసన పలికి మీనాకుమారికి అవకాశామిచ్చాడు కమల్‌ అమ్రోహి. 1951 మార్చిలో మీనాకుమారి అగ్రిమెంటు మీద సంతకాలు చేసింది. ఈ మధ్యలో మీనాకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చి చిక్కి శల్యం కావడంతో, గాలి మార్పుకు ఆమె మహాబలేశ్వర్‌ వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నాలుగు నెలలు పూనా ఆసుపత్రిలో చేరింది. ఎడమచేతికి బాగా దెబ్బతగిలి ఉంగరపు వేలు, చిటికెన వేలు వంకర్లు పోయాయి. దానితో మీనా నైరాశ్యంతో కుంగిపోయింది. ఈ వార్త తెలిసి కమల్‌ అమ్రోహి ఢిల్లీ నుంచి పూనా ఆసుపత్రికి వచ్చి మీనాను పరామర్శించాడు. అతని రాకతో మీనాకుమారికి స్వాంతన లభించింది. ఇద్దరూ వారం వారం ప్రేమలేఖలు పంచుకునేవారు. మీనాకు అతని వ్యక్తిత్వం నచ్చింది. అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ ఫోనులో మాట్లాడుకుంటూనే వుండేవారు. అనార్కలి సినిమా రెండు షెడ్యూళ్లు జరిగాక నిర్మాత మఖాన్‌లాల్‌ చేతులెత్తేయడంతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. అయితే మీనాకుమారి, కమల్‌ అమ్రోహిల సాంగత్యం మాత్రం బలపడుతూనే వుంది. 1952 ఫిబ్రవరి 14న మీనాకుమారి ఆసుపత్రికని తన చెల్లెల్ని తోడు తీసుకొని వెళ్లి కమల్‌ స్నేహితుడు బాకర్‌ ఆలీ సమక్షంలో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తండ్రికి విషయం తెలిసి విడాకులిచ్చేయమని ఒత్తిడి తెచ్చాడు. కమల్‌ తీస్తున్న ‘దాయిరా’ సినిమా షూటింగుల్లో పాల్గొనరాదని శాసించాడు. కానీ మీనాకుమారి తండ్రి మాటలు లెక్క చేయకుండా 1953 ఆగస్టు 14న కమల్‌ ఇంటికి చేరి సంసార జీవితం సాగించింది. అమ్రోహి అసలు భార్య ఈ విషయాన్ని సహించలేక పిల్లలతో బయటకు వెళ్లిపోయింది. మూడేళ్ళు వారి కాపురం బాగానే గడిచింది.


* బీటలు వారిన వైవాహిక జీవితం..
కమల్‌ అమ్రోహితో జీవితం పంచుకున్నాక కూడా 1964 వరకూ మీనాకుమారి తీరిక లేకుండా నటిస్తూనేవుంది. బంగారు బాతు ఇంట్లో వుంటే కమల్‌కు మరేం కావాలి? పెట్టుబడి మీనాకుమారిది, నిర్మాత పేరు మాత్రం కమల్‌ అమ్రోహిది. అదే కిషోర్‌ సాహు దర్శకత్వం వహించిన ‘దిల్‌ అప్నా అవుర్‌ ప్రీత్‌ పరాయీ’ సినిమా. మీనా కుమారి అద్భుతంగా నటించిన సినిమా ఇదేనని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. తరువాత మరో సూపర్‌ హిట్‌ చిత్రం ‘కోహినూర్‌’ విడుదలై ఢంకా బజాయించింది. 1962లో వచ్చిన గురుదత్‌ సినిమా ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్’లో నటనకు మీనాకుమారికి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు కూడా ఎంపిక చేశారు. ‘మై చుప్‌ రహూంగీ’ (తెలుగులో మూగనోము) సినిమాలో నటనకు మీనాకు ఫిలింఫేర్‌ నామినేషన్‌ దక్కింది. కానీ బహుమతి రాలేదు. ‘ఆరతి’ సినిమాలో నటనకు కూడా బహుమతి లభించింది. అలాగే శ్రీధర్‌ నిర్మించిన ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’ (తెలుగులో మనసే మందిరం) సినిమాలో నటనకు కూడా ఉత్తమ నటి బహుమతి అందజేశారు. మీనాకుమారి నటించిన తొలి కలర్‌ సినిమా ఎ.కె.నాదియాడ్‌ వాలా నిర్మించిన ‘చిత్రలేఖ’. తరువాత ‘భీగీ రాê’Â, ‘కాజల్‌’ (ఫిలింఫేర్‌ బహుమతి లభించిన చిత్రం) ‘ఫూల్‌ అవుర్‌ పత్తర్‌’ ‘నూర్జహాన్, ‘బహు బేగం’, ‘బహారోం కి మంజిల’Ë్, ‘అభిలాషా’ వంటి సినిమాలలో మీనాకుమారి అద్భుత నటన ప్రదర్శించింది. అయితే కమల్‌ అమ్రోహి నిర్మించిన ‘దాయిరా’ మాత్రం రెండు రోజులే ఆడి, నష్టాలు మూటకట్టించి అటకెక్కింది. దాంతో కమల్‌ అమ్రోహి మీనాకుమారి సినిమాలకు డేట్లు చూసే మేనేజర్‌ అయిపోయాడు. ఆఖరుకు కమల్‌ అమ్రోహిని సినిమా వేడుకల్లో మీనాకుమారి భర్తగా పరిచయం చేయడం మొదలవడంతో అతడు న్యూనతకు లోనై, మీనా మీద ద్వేషం పెంచుకున్నాడు. బిమల్‌ రాయ్‌ నిర్మించిన ‘దేవదాసు’ సినిమాలో కమల్‌ నిర్వాకంతో మీనా ‘పార్వతి’ పాత్రను వదలుకోవలసి వచ్చింది. ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులాం’ సినిమాకు కూడా అడ్డుపడితే, గురుదత్‌ నేరుగా మీనాకుమారితో మాట్లాడి కాల్షీట్లు తీసుకున్నాడు. కమల్‌ అమ్రోహి మీనాకుమారికి షరతులు విధిస్తూ గృహిణిగా ఉండిపోవాలని, సినిమాషూటింగులు ఆరు గంటలకే ముగించుకొని ఇల్లు చేరాలని, మేకప్‌ రూమ్‌లోనికి ఎవరినీ రానీయరాదని, కారులో మరొకరెవ్వరూ ఎక్కరాదని, ఇతరుల కారులో ఆమె ఎక్కరాదనేవి ఈ షరతులు. అంతే కాదు కమల్‌ అమ్రోహి తన మిత్రుడు బాకర్‌ ఆలీతో మీనాకుమారి కదలికలమీద నిఘా ఏర్పాటు చేశాడు. గుల్జార్‌ మేకప్‌ రూమ్‌లోకి అడుగు పెట్టాడని బాకర్‌ ఆలీ అడ్డుపడి, మీనా మీద చెయ్యి చేసుకున్నాడు. దాంతో బాధపడిన మీనా పోలీసు ఎస్కార్టు సాయంతో తన చెల్లెలు మధు (హాస్యనటుడు మెహమూద్‌ భార్య) ఇంటికి వెళ్లిపోయింది. అలా 1964 మార్చి 5న వీరిద్దరి దాంపత్యం విచ్ఛిన్నమై పోయింది. కమల్‌ అమ్రోహి 1956లో మొదలుపెట్టిన అతని కలల ప్రాజెక్టు ‘పాకీజా’ మూలపడిపోయింది. మీనాకుమారి కూడా ఆ సినిమాను పూర్తి చేయదలచుకోలేదు.



* మత్తుమందుకు బానిసై...పాకీజాలో నటిస్తూ..
చెదరిన హృదయంతో మీనాకుమారి బొంబాయి కార్టర్‌ రోడ్డులో ఒక అపార్టుమెంటును కొనుగోలు చేసి మరణించేదాకా ఆమె శేషజీవితాన్ని అక్కడే గడిపింది. నిద్రలేమితో తాగుడు అలవాటు చేసుకుంది. అయితే ఈ అలవాటు ఆమెకు కమల్‌తో కాపురం పెట్టినప్పటి నుంచే వుంది. ఆ అలవాటు ఒంటరిగా ఉండడంతో మరీ ఎక్కువైంది. ఆ అలవాటే ఆమె జీవితాన్ని క్రమక్రమగా కబళించసాగింది. పగలూ, రాత్రి అనే భేదం లేకుండా రోజుకు రెండు మూడు బాటిళ్ల మద్యం పుచ్చుకోవడం మొదలెట్టింది. దాంతో మూడు సంవత్సరాల కాలంలోనే ఆమెకు లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధి తీవ్రత ఎక్కువైంది. పదే పదే ఆసుపత్రి పాలవడంతో లండన్‌ వెళ్లి మూడు నెలలపాటు చికిత్స తీసుకుంది. స్విట్జర్లాండ్‌కు వెళ్లి కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. డాక్టర్లు ఆమెను మద్యం ముట్టుకోకూడదని గట్టిగా హెచ్చరించి పంపారు. ఇదిలా వుండగా 1968లో కమల్‌ అమ్రోహి ఆమెకు ఒక వుత్తరం రాస్తూ ‘పాకీజా’ సినిమాను పూర్తి చేయాల్సి వుంది కనుక సహకరించమని ప్రాధేయపడ్డాడు. చివరికి ఆమె కోరుకున్నట్లు విడాకులు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. నర్గీస్, సునీల్‌ దత్, ఖయ్యూం, అతని భార్య జగజిత్‌ కౌర్‌ కూడా అంత చక్కటి సినిమాను వదలుకోవద్దని, పూర్తి చెయ్యమని సలహా ఇచ్చారు. అలా ఆగిపోయిన ‘పాకీజా’ సినిమా ఐదు సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభమైంది. ఆరోగ్యరీత్యా ఆ పాత్రకు న్యాయం చేయలేనేమోనన్న సందేహం మీనాకు కలగడంతో, కమల్‌ అమ్రోహి క్లోజప్‌ సన్నివేశాలను మాత్రం మీనాతో నటింపజేసి లాంగ్‌ షాట్లను, కొన్ని నృత్య సన్నివేశాలను పద్మాఖన్నాతో పూర్తిచేయించారు. ‘మొఘల్‌−ఎ−ఆజం’ సినిమా నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టితే, ‘పాకీజా’ చిత్ర నిర్మాణం పూర్తవడానికి ఏకంగా 14 సంవత్సరాలు పట్టింది. వయసు పైబడుతున్న కారణంగా మీనాకుమారి ‘ఆజ్‌ హమ్‌ అపనే దువావోం కా అసర్‌ దేఖేగే’ వంటి పాటలలోని కొన్ని నాట్యభంగిమలు చేయలేకపోవడంతో కమల్‌ అమ్రోహి లాంగ్‌ షాట్లలో పద్మాఖన్నా చేత ఆ డ్యాన్స్‌ చేయిస్తూ, క్లోజప్‌ షాట్లలో మీనాకుమారిని చూపించారు. ప్రేక్షకులు కనుక్కోకుండా ఉండేందుకు ఒంటిమీద మేలిముసుగుతో వాటిని చిత్రీకరించారు. ఒక ఆర్టిస్టుకి, దర్శకుడికి ఉండే మాటలు తప్ప షూటింగు జరుగుతున్న సమయంలో మీనాకుమారి కమల్‌తో మాట్లాడేది కాదు. సంగీత దర్శకుడు గులాం ఆలీ మరణించడంతో నేపథ్య సంగీతాన్ని, అక్కడక్కడా పాటల బిట్లను నౌషాద్‌ ఆలి పూర్తిచేశారు. తొలుత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో మొదలెట్టిన ‘పాకీజా’ రీళ్లను ప్రక్కనబెట్టి, మరలా కలర్‌లో నిర్మించారు. కమల్‌ నుంచి మీనా పారితోషికాన్ని కూడా ఆశించలేదు. ప్రీవ్యూ షోకి కూడా మీనాకుమారి హాజరు కాలేదు. చివరకు 1972లో సినిమా పూర్తై ఫిబ్రవరి 4న బొంబాయి మరాఠా మందిర్‌లో విడుదలైంది. సినిమా సూపర్‌ హిట్టయింది. రమారమి ఒక నెల తరువాత... అంటే మార్చి 31, 1972న మీనాకుమారి తనువు చాలించడంతో ప్రజలు తండోపతండాలుగా మీనాకుమారిని చూడడానికి ఎగబడ్డారు. ‘మొఘల్‌−ఎ−ఆజం’ తరువాత అంతటి మంచిపేరు ‘పాకీజా’ సినిమాకు దక్కింది. ముప్పై ఏళ్లలో మీనాకుమారి నటించింది 93 సినిమాలు మాత్రమే. ఆమె నటించిన చివరి సినిమా ‘గోమతీ కే కినారే’. అందులో ‘గంగ’ పాత్రలో రాణించిన మీనాకుమారి స్మృతికి ఆ చిత్రాన్ని అంకితం చేశారు. అలా ఒక ధృవతార నేల రాలింది. ఆమె జీవితం అయిపోయింది. కానీ, ఆమె కథ మాత్రం అయిపోలేదు. రాయాలంటే ఇంకా ఎంతో వుంది. అది ఎప్పటికీ మిగిలే వుంటుంది.



మరిన్ని విశేషాలు..
* భారత ప్రభుత్వం 2011 ఫిబ్రవరి 13న ఆరుగురు ప్రసిద్ధ నటీమణుల పోస్టల్‌ స్టాంపులు, ఫస్ట్‌ డే కవర్లు విడుదల చేసింది. వాటిలో మీనాకుమారితోబాటు దేవికారాణి, కానన్‌ దేవి, నూతన్, లీలా నాయుడు, సావిత్రి స్టాంపులూ వున్నాయి. మీనాకుమారిని హిందీ చలనచిత్ర రంగంలో ‘సినీ శోక దేవత’ (ట్రాజెడీ క్వీన్‌) అని ‘మహిళా గురుదత్‌’ అని ‘భారతీయ సినీ సిండ్రెల్లా’ అని కీర్తించేవారు.


*
తను హీరోయిన్‌గా నటించిన ‘మేరే అప్నే’ దర్శకుడు గుల్జార్‌ అంటే మీనాకుమారికి ప్రత్యేక అభిమానం. మీనాకుమారి పెద్దగా చదువుకోలేదు. కానీ ఆమెకు ఉర్దూ, హిందీ భాషల్లో మంచి పట్టు వుండేది. ఉర్దూ భాషలో కవితలు కూడా రాసేది. ఆ కవిత్వంతోనే మీనాకుమారి దర్శక నిర్మాత, రచయిత గుల్జార్‌కు దగ్గరయ్యింది. కవిత్వంలోని సున్నితమైన అంశాలను విడమరచి చెప్పి ఆమెకు జీవితం మీద ఆశ పెంచిన వ్యక్తి గుల్జార్‌. ఆమె అపురూపంగా రాసుకొని, భద్రపరచుకున్న డైరీలను గుల్జార్‌కు అందజేసింది. తన జీవన ప్రస్థానంలోని చివరి రోజుల్లో సేదతీర్చుకోవడానికి ఆసరా కల్పించిన నటుడు ధర్మేంద్రకు సినీ రంగంలో సుస్థిర స్థానం కల్పించింది. తన తోడబుట్టిన సోదరిలకు ఆస్తులు పంచింది. నటి మధుబాల మీనాకుమారి అభిమాని.



*
1968లో ‘అభిలాష’ సినిమా నిర్మించిన రమణి కలాల్‌.జె.దవే పారితోషికం క్రింద మీనాకుమారికి ఒక పెద్ద బంగాళా కట్టించి ఇచ్చాడు. అయితే ఆమె చివరి రోజుల్లో ఆ బంగళాను నటి ముంతాజ్‌కు చాలా పెద్ద మొత్తానికి అమ్మేసింది, ఆ వచ్చిన డబ్బును తనకోసం వాడుకున్నదా అంటే అదీ లేదు. ‘గోమతి కే కినారే’ంలో దర్శకుడిగా పరిచయమైన నిర్మాత సావన్‌ కుమార్‌ చేతిలో పెట్టింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మీనాకుమారి కాలం చేయడంతో సినిమాను ఆమె మరణానంతరం 1972లో విడుదల చేస్తూ మీనాకుమారికి అంకితం చేశారు. అది కాస్తా ఫ్లాప్‌ అయింది.



*
1961 ఫిలింఫేర్‌ బహుమతుల కోసం ఉత్తమ నటి విభాగంలో వచ్చిన నామినేషన్లన్నీ మీనాకుమారి నటించిన చిత్రాల నుండే రావడం విశేషం. అవి వరసగా ‘సాహెబ్‌ బీబీ అవుర్‌ గులాం’, ‘ఆర్తి’, ‘మై చుప్‌ రహూంగీ’ చిత్రాలు. సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌ చిత్రంలో నటనకు మీనాకుమారికే ఆ బహుమతి దక్కింది.



*
మీనాకుమారికి తెలుపు వర్ణమంటే చాలా ఇష్టం. తన ఇంటిని ధవళ వర్ణంతోనే అలంకరించేది. ఎక్కువగా తెల్లరంగు చీరలు, దుస్తులు ధరించి వేడుకలకు హాజరదియ్యేది.


− ఆచారం షణ్ముఖాచారి



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.