సన్‌ ఆఫ్‌ ఇండియా... మెహబూబ్‌ ఖాన్‌

తని సినిమాలు గ్రామీణ జీవనశైలికి అద్దంపట్టేలా వుంటాయి. కుగ్రామాల్లో నివసించే ప్రజలు జీవన పోరాటంలో ఎన్ని ఆటుపోట్లకు గురౌతూ వుంటారో అతని సినిమాలు చూస్తేనే అర్ధమౌతుంది. అందుకే ఆ మహనీయుని ప్రఖ్యాత దర్శకుడు కె.ఎ.అబ్బాస్‌ ‘గ్రేట్‌ రస్టిక్‌’ (గ్రామీణ ఘనాపాటి) అంటూ కీర్తించాడు. 1958లో జరిగిన ఆస్కార్‌ బహుమతుల పోటీలో విదేశీ భాషా చిత్రాల విభాగంలో అతని సినిమా ‘మదర్‌ ఇండియా’ అర్హత సాధించి చివరి దశకు చేరుకుంది. అయితే సరైన ప్రచారం కొరవడి ఇటలీ దేశపు ‘నైట్స్‌ అఫ్‌ కాబిరియా’ అనే చిత్రం బహుమతిని ఎగరేసుకుపోయింది. ఆయన సినిమా పతాకం ఎర్రని జెండా మీద సుత్తి, కొడవలితో రెపరెపలాడుతూ వుంటుంది. ధనమదాంధుడైన జమీందారు విషపు కోరల్లో అణచివేయబడిన మహిళ (నర్గీస్‌) కథాంశామైనా, కర్కశుడైన వడ్డీ వ్యాపారి వలలో చిక్కిన ఆదివాసి (షేక్‌ ముఖ్తర్‌) కథాంశమైనా, రాకుమారుని ఎదిరించే సాహసం చేసిన ఒక సామాన్య బడుగుజీవి (దిలీప్‌ కుమార్‌) కథాంశమైనా ఉదాత్తమంగా తెరకెక్కించగల సమర్ధత ఆయన సొత్తు. గుజరాత్‌లోని ఒక చిన్న పల్లెలో పుట్టి పెరగడం అతని ఆలోచనా శైలికి మార్గదర్శకమైంది. అతడే ప్రఖ్యాత మెహబూబ్‌ స్టూడియో అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌. మే నెల 28 మెహబూబ్‌ ఖాన్‌ 55వ వర్ధంతి సందర్భంగా అతణ్ణి గురించిన కొన్ని విశేషాలు...


* గుజరాత్‌ నుంచి హిందీ సినిమారంగానికి ...
మెహబూబ్‌ ఖాన్‌ పూర్తిపేరు మెహబూబ్‌ ఖాన్‌ రంజాన్‌ ఖాన్‌. పుట్టింది సెప్టెంబరు 9, 1907న గుజరాత్‌ రాష్ట్రంలోని బిల్లిమోరా పట్టణంలో. సినిమాల్లో నటించేందుకు గుర్రాలను సరఫరా చేసే మహమ్మద్‌ ఆలి మహమ్మద్‌ శిప్రా మెహబూబ్‌ ఖాన్‌ను బొంబాయికి తీసుకొచ్చాడు. బొంబాయిలో అతనికి పెద్ద గుర్రపుశాల వుండేది. అందులో మెహబూబ్‌ ఖాన్‌ను గుర్రాలకు నాడాలు బిగించే పనిలో కుదిర్చాడు. ఒకసారి దక్షిణాదికి చెందిన దర్శకుడు చంద్రశేఖర్‌ దృష్టిలో మెహబూబ్‌ ఖాన్‌ పడడం జరిగింది. మెహబూబ్‌ ఖాన్‌కు సినిమాల మీద వున్న ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్‌ అతణ్ణి బాంబే స్టూడియోలో సహాయ దర్శకునిగా నియమించి శిక్షణ ఇప్పించారు. అలా అర్దేషిర్‌ ఇరానికి చెందిన ఇంపీరియల్‌ ఫిలిం కంపెనీలో చేరి కొన్ని మూకీ సినిమాలకు సహాయ దర్శకునిగా మెహబూబ్‌ ఖాన్‌ పనిచేశారు. 1935లో మెహబూబ్‌ ఖాన్‌ కు తొలిసారి దర్శకత్వం నిర్వహించే అవకాశం కలిగింది. అర్దేషిర్‌ ఇరాని, చిమన్లాల్‌ దేశాయ్, అంబాలాల్‌ పటేల్‌ కలిసి 1929లో నెలకొల్పిన సాగర్‌ మూవిటోన్‌ సంస్థ నిర్మించిన ‘ఆల్‌ హిలాల్‌... జడ్జిమెంట్‌ ఆఫ్‌ అల్లా’ అనే టాకీ చిత్రానికి మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. సిసిల్‌.బి.డీమెల్లి నిర్మించిన బివ్బ్లికల్‌ మూవీ ‘ది సైన్‌ ఆఫ్‌ ది క్రాస్‌’ ఈ సినిమాకు ఆధారం. ఈ చిత్రంలో కుమార్, ఇందిర, యాకూబ్, సితార దేవి, ఖయాం ఆలి తదితరులు నటించగా, మెహబూబ్‌ ఖాన్‌ కూడా అందులో ఒక పాత్ర పోషించారు. రోమన్లకు, అరేబియన్లకు జరిగిన సంఘర్షణ, రోమన్‌ సైన్యం ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం వంటి నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోరాట దృశ్యాలను మెహబూబ్‌ ఖాన్‌ ఎంతో శ్రద్ధగా చిత్రీకరించి అద్భుతంగా ఎడిట్‌ చేశారు. సినిమా బాగా విజయవంతమైంది. ఫిలిం ఇండియా సంపాదకుడు బాబురావు పటేల్‌ ‘ఇతడు ముందుకు సాగిపోయే ధీరుడు’ అంటూ మెహబూబ్‌ ఖాన్‌కు కితాబిచ్చారు. ఈ చిత్ర విజయంతో సాగర్‌ మూవిటోన్, నేషనల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘డెక్కన్‌ క్వీన్‌’(1936), ‘జాగిర్దార్‌’ (1937), ‘హమ్‌ తుమ్‌ అవుర్‌ వో’(1938), ‘ఏక్‌ హి రాస్తా’(1939), ‘ఆలీబాబా’(1940), ‘అవురత్‌’(1940), ‘బెహన్‌’ (1941) వంటి చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ‘డెక్కన్‌ క్వీన్‌’ చిత్రంలో సురేంద్ర, అరుణాదేవి, రామచంద్ర పాల్, ఖయాం ఆలి ప్రధాన తారాగణం కాగా ప్రన్సుక్‌ నాయక్‌ సంగీతం అందించారు. అరుణాదేవి ఇందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఒకేఒక సాహస పోరాట చిత్రం ‘డెక్కన్‌ క్వీన్‌’. సమాజంలో వున్న లోపాలు, న్యాయస్థానాలలోని లొసుగులు వంటి సాంఘిక సమస్యల నేపథ్యంలో నిర్మించిన సినిమా ‘ఏక్‌ హి రాస్తా’. సాగర్‌ మూవిటోన్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా షేక్‌ ముఖ్తర్‌ నటుడుగా సినీరంగ ప్రవేశం చేశాడు. తదనంతర కాలంలో షేక్‌ ముఖ్తర్‌ అనేక విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సాగర్‌ మూవిటోన్‌ వారే నిర్మించిన మరో అరేబియన్‌ నైట్స్‌ చిత్రమే ‘ఆలీబాబా’. ఈ చిత్రాన్ని హిందీ, పంజాబీ భాషల్లో నిర్మించారు. అనిల్‌ బిస్వాస్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో హీరోయిన్‌ నిమ్మి తల్లి వహీదా బాయి రెండవ హీరోయిన్‌గా నటించింది. 1929లో ఇంపీరియల్‌ స్టూడియో నిర్మించిన ‘ఆలీబాబా 40 చోర్‌’ మూకీ చిత్రానికి మెహబూబ్‌ ఖాన్‌ సహాయ దర్శకుడిగా పనిచేసి వుండడం అతనికి లాభించింది. ఇందులో సురేంద్ర, సర్దార్‌ అఖ్తర్, వహీదాబాయి, గులాం మొహమ్మద్‌ తదితరులు ముఖ్య తారాగణం. రంజాన్‌ పవిత్ర మాసంలో ఈ చిత్ర నిర్మాణం మొదలవడంతో, షూటింగ్‌ మొత్తం రాత్రి పూట కానిచ్చారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే మెహబూబ్‌ ఖాన్‌- సర్దార్‌ అఖ్తర్‌ల మధ్య ప్రేమ చిగురించి తరువాత ఇద్దరూ ఒక ఇంటివారయ్యారు. సాగర్‌ మూవిటోన్‌ సంస్థకు మెహబూబ్‌ ఖాన్‌ పనిచేసిన చివరి చిత్రం ఇదే. ఇక ‘అవురత్‌’ చిత్ర విషయానికొస్తే నేషనల్‌ పిక్చర్స్‌ వారికోసం మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన చిత్రమిది. సురేంద్ర, సర్దార్‌ అఖ్తర్‌ ప్రధాన తారాగణం. ఇదే సినిమాను 1957లో మెహబూబ్‌ ఖాన్‌ ‘మదర్‌ ఇండియా’ పేరుతో పునర్నిర్మించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. తరువాత నేషనల్‌ స్టూడియో వారికి మెహబూబ్‌ ఖాన్‌ ‘బెహన్‌’ సినిమా నిర్మించారు. షేక్‌ ముఖ్తర్, నళిని జయవంత్‌ ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రం ద్వారా మీనాకుమారి ‘బేబీ మీనా’ పేరుతో హిందీ తెరకు పరిచయమైంది. అలాగే షేక్‌ ముఖ్తర్‌కు సోదరిగా నటించిన నళిని జయవంత్‌ కూడా ఈ సినిమా ద్వారానే తెరంగేట్రం చేసింది. వీటన్నిటికీ సూత్రధారి మెహబూబ్‌ ఖాన్‌ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మెహబూబ్‌ ఖాన్‌ తన సొంత ప్రొడక్షన్‌ సంస్థను నెలకొల్పడానికి ముందు సాగర్‌ నేషనల్‌ స్టూడియోస్‌ సంస్థకు 1942లో ‘రోటి’ అనే సినిమాను నిర్మించారు. ఇందులో చంద్రమోహన్, షేక్‌ ముఖ్తర్, సితారదేవి, అష్రాఫ్‌ ఖాన్‌ ముఖ్యపాత్రలు పోషించగా మెహబూబ్‌ ఖాన్‌ ఎంతగానో అభిమానించే అనిల్‌ బిస్వాస్‌ సంగీతం అందించారు. ఇందులో బేగం అఖ్తర్‌ను అనిల్‌ బిస్వాస్‌ గాయనిగా వెండితెరకు పరిచయం చేశారు.


* మెహబూబ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ఆవిర్భావం...
మెహబూబ్‌ ఖాన్‌ 1942లో సొంత సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి మెహబూబ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ అనే పేరు పెట్టారు. తన సొంత సంస్థ బ్యానర్‌ మీద మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన తొలి చిత్రం ‘నైనా’ (1943). అందులో అశోక్‌ కుమార్, వీణ జంటగా నటించగా అశోక్‌ కుమార్‌కు ఆ రోజుల్లోనే మెహబూబ్‌ ఖాన్‌ లక్ష రూపాయల పారితోషికం చెల్లించారు. అది ఒక పెద్ద రికార్డుగా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్‌గా విజయవంతం కావడమే కాకుండా ముస్లిం జాతి ప్రజలకు కుటుంబ విలువలను, విధివిధానాలను, విద్య నేర్చుకోవడం మీద ఆవశ్యకతను నిర్దేశించి ఆదర్శవంతమైంది. అఘజాని కాశ్మీరి మాటలు, రఫిక్‌ ఘజ్నవి సంగీతం సమకూర్చారు. అదే సంవత్సరం మెహబూబ్‌ ఖాన్‌ నర్గీస్‌ను హీరోయిన్‌ గా నియమించి ‘తఖ్దీర్‌’ అనే ఒక కామెడీ సినిమా కూడా నిర్మించారు. మెహబూబ్‌ ఖాన్‌ సంస్థలో పనిచేయడం, హీరోయిన్‌ గా వెండితెరకు పరిచయం కావడం నర్గీస్‌కు ఈ చిత్రంతోనే మొదలైంది. నర్గీస్‌ అసలు పేరు ఫాతిమా కాగా మెహబూబ్‌ ఖాన్‌ ఆమె పేరును నర్గీస్‌గా మార్చారు. అప్పుడు నర్గీస్‌కు 14 ఏళ్లు కాగా అందులో హీరోగా నటించిన మోతిలాల్‌కు 33 ఏళ్లు. శంషాద్‌ బేగం చేత నర్గీస్‌కు పాటలు పాడించారు. గులామ్‌ మొహమ్మద్‌ రాసిన కథకు రఫీఖ్‌ ఘజ్నవి సంగీతం సమకూర్చారు. 1943 లో విడుదలైన సినిమాలు ఆర్జించిన రాబడిలో ఈ సినిమా తొమ్మిదవ స్థానంలో నిలిచి మెహబూబ్‌ ఖాన్‌ మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సహకరించింది. అశోక్‌ కుమార్‌ హుమయున్‌గా, వీణ రాజకుమారిగా, నర్గీస్‌ హమిదా బానోగా, చంద్రమోహన్‌ రాజ కుమారుడు రణధీర్‌గా, షా నవాజ్‌ బాబర్‌ చక్రవర్తిగా, కె.ఎన్‌. సింగ్‌ జైసింగ్‌గా మెహబూబ్‌ ఖాన్‌ 1945లో ‘హుమయూన్‌’ చిత్రాన్ని నిర్మించి కమర్షియల్‌ హిట్‌ చేశారు. ఈ చిత్రం ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టింది. మెహబూబ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లోనే 1946లో ‘అన్మోల్‌ ఘడి’ నే సంగీతభరిత చిత్రం వచ్చింది. ఆ సంవత్సరం అత్యధిక రాబడి ఆర్జించిన బాక్సాఫీస్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇందులో సురేంద్ర, సురయ్యా ప్రధాన పాత్రధారులు. నౌషాద్‌ తొలిసారి మెహబూబ్‌ ఖాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చిన చిత్రమిది. తన్వీర్‌ నఖ్వి రాసిన ‘ఆవాజ్‌ దే కహాఁ హై’ (సురేంద్ర, నూర్జహాన్‌ బేగం), ‘జవాన్‌ హై మోహబ్బత్‌ హసీన్‌ హై జమానా’ (నూర్జహాన్‌ బేగం), ‘మేరె బచ్పన్‌ కే సాథీ ముఝే భూల్‌ న జానా’ (నూర్జహాన్‌ బేగం) పాటలు ఇందులోవే. రఫీ ఆలపించగా అతనికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన పాట ్డతేరా ఖిలౌనా టూటా’ కూడా ఇందులోదే. తరువాతి సంవత్సరం మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘ఎలాన్‌’ కూడా బాక్సాఫీస్‌ హిట్టయింది. ఈ ముస్లిం మెలోడ్రామాలో సురేంద్ర, మునావర్‌ సుల్తానా ముఖ్యపాత్రలు ధరించగా, నౌషాద్‌ సంగీతం సమకూర్చారు. 1948లో మెహబూబ్‌ ఖాన్‌ ఒక ముక్కోణపు ప్రేమకథను సినిమాగా నిర్మించి విజయం సాధించారు. అదే ‘అనోఖీ అదా’. సురేంద్ర, ప్రేమ్‌ ఆదిబ్‌ హీరోలుగా, నసీం బాను హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నౌషాద్‌ సంగీతం అందించారు. ఇందులో ముఖేష్‌ పాటలు పాడగా వాటిని షకీల్‌ బదాయుని రచన చేశారు. ముఖ్యంగా ముఖేష్‌ ఆలపించిన ఘజల్‌ ‘కభి దిల్‌ సే దిల్‌ తకరా హో గయా’కు మంచి పేరొచ్చింది. సురేంద్ర, సురయ్యా ఆలపించిన పాటలు కూడా హిత్తయినవే. 1949లో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అందాజ్‌’ చిత్రం అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డులు అందుకుంది. తరవాత రాజకపూర్‌ చిత్రం ‘బర్సాత్‌’ ఆ రికార్డుని తిరగరాయడం మరో విశేషం. ఇది కూడా ఒక ముక్కోణపు ప్రేమకథ. ఇందులో దిలీప్‌ కుమార్, రాజకపూర్‌ ప్రేమికులు కాగా ఆ ప్రేమరాణి నర్గీస్‌. మజ్రూహ్‌ సుల్తాన్‌ పురిని ఇందులో పాటల రచయితగా మెహబూబ్‌ ఖాన్‌ పరిచయం చేశారు. లతాజి ఆలపించిన ‘కోయి మేరె దిల్‌ మే’, ‘మేరి లాడ్లీ రే’, ముఖేష్‌ ఆలపించిన ‘హమ్‌ ఆజ్‌ కహీ దిల్‌ ఖో బైటే’, ‘తూ కహా అగర్‌’ పాటలు ఆణిముత్యాలుగా చాలాకాలం నిలిచాయి. నలభయ్యో దశకం చివరిదాకా మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లు కావడం ఒక అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. 1952లో మెహబూబ్‌ ఖాన్‌ ‘ఆన్‌’ చిత్రం నిర్మించారు. భారతదేశంలో నిర్మించిన తొలి టెక్నికలర్‌ చిత్రమిది. అప్పటిదాకా హాలీవుడ్‌ చిత్రాలను మాత్రమే టెక్నికలర్‌లో నిర్మించేవారు. ముడి ఫిలిం కొరత వలన తొలుత 16 ఎం.ఎం గేవాకలర్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చేసి తరువాత టెక్నికలర్‌ కు ‘బ్లో అప్‌’ చేశారు. చిత్ర నిర్మాణానికి చాల భారిగా 35 లక్షలు మెహబూబ్‌ ఖాన్‌ ఖర్చు పెట్టారు. ఈ చిత్రంలో దిలీప్‌ కుమార్, ప్రేమనాథ్, నిమి నటించగా నాదిరా ను ఈ చిత్రంలోనే పరిచయం చేశారు. 17 విదేశీ భాషల్లో సబ్‌ టైటిల్స్‌ వేసి ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి సూపర్‌ హిట్‌ చేసిన ఘనత మెహబూబ్‌ ఖాన్‌ ది. ’సావేజ్‌ ప్రిన్సెస్‌’ పేరుతో విదేశాల్లో విడుదలైన ఈ చిత్రం భారత్‌ నుంచి విదేశాలలో విడుదలైన తొలి సినిమాగా రికార్డులనందుకుంది. షకీల్‌ బదాయుని గేయరచయితగా నౌషాద్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. 1954లో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అమర్‌’ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇందులో దిలీప్‌ కుమార్, మధుబాల, నిమి నటించగా నౌషాద్‌ సంగీతం అందించారు.


* మెహబూబ్‌ స్టూడియో నిర్మాణం...
1954లో మెహబూబ్‌ ఖాన్‌ ‘మెహబూబ్‌ స్టూడియో’ పేరుతో సొంత స్టూడియో నిర్మించారు. విశాలమైన ఐదెకరాల స్థలంలో ఇరవైవేల చదరపు గజాల విస్తీరణంలో ఐదు ఫ్లోర్లతో, రికార్డింగ్‌ సదుపాయంతో నిర్మించబడిన అతిపెద్ద స్టూడియో ఇది. సముద్రతీరానికి దగ్గరలోని బాంద్రాలో చారిత్రాత్మక మౌంట్‌ మేరీ చర్చి కి సమీపంలో ఈ స్టూడియో నిర్మించడం జరిగింది. 1957లో ప్రతిష్టాత్మక ‘మదర్‌ ఇండియా’ చిత్రాన్ని మెహబూబ్‌ స్టూడియోలో నిర్మించారు. గురుదత్‌ ‘కాగజ్‌ కే ఫూల్‌’ చిత్రాన్ని, దేవానంద్‌ ‘హమ్‌ దోనో’, ‘గైడ్‌’, ‘జానీ మేరా నామ్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించింది కూడా ఇదే స్టూడియోలో. అయితే మెహబూబ్‌ ఖాన్‌ మాగ్నం ఓపస్‌ ‘మదర్‌ ఇండియా’ సినిమా తరవాత 1962లో నిర్మించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఈ స్టూడియోలో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన చివరి సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. అదే మెహబూబ్‌ ఖాన్‌ చివరి సినిమా కూడా!
                                 
* ఆస్కార్‌ బహుమతి మిస్సైన మదర్‌ ఇండియా...
27 సంవత్సరాల సినీ జీవితంలో మెహబూబ్‌ ఖాన్‌ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1957లో నిర్మించిన ‘మదర్‌ ఇండియా’ మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన చిత్రాల్లోకెల్లా గొప్పదిగా కీర్తించబడుతోంది. 1960 లో ‘మొఘల్‌-ఎ-ఆజం’ సినిమా విడుదలయ్యేదాకా మదర్‌ ఇండియా రాబట్టిన వసూళ్లను మరేచిత్రమూ అధిగమించలేకపోయింది. నవదర్శకులకు ఈ చిత్రం ఒక అధ్యయన పాఠంగా నిలిచింది. ఇందులో రాజకుమార్, నర్గీస్, సునీల్‌ దత్, రాజేంద్రకుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏకంగా ఐదు ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా, భారతదేశం తరఫున విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌ బహుమతి కోసం గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రాన్ని సూరత్, కొల్హాపూర్, నాసిక్‌ సమీప ప్రాంతాల్లో షూట్‌ చేశారు. ఈ చిత్ర క్లైమాక్స్‌ దృశ్య చిత్రీకరణ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా నర్గీస్‌ ఆ మంటల్లో చిక్కుకుంది. ఆమెకు కొడుకుగా నటిస్తున్న సునీల్‌ దత్‌ వెంటనే దూకి ఆమెను రక్షించి ప్రాణాలు కాపాడారు. తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. గతంలో నేషనల్‌ స్టూడియో వారికోసం మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అవురత్‌’ కు మదర్‌ ఇండియా చిత్రం రీమేక్‌. ఖాన్‌ ‘అవురత్‌’ చిత్ర హక్కులను కొని ‘మదర్‌ ఇండియా’ చిత్రానికి రూపం దిద్దారు. ఈ సినిమా తయారవడానికి మూడేళ్ళు పట్టింది. ముందు గేవాకలర్‌లో షూట్‌ చేసి తరువాత టెక్నికలర్‌కు బ్లోఅప్‌ చేశారు. నాటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహర్లాల్‌ నెహ్రు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించడం విశేషం. నాటి బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జి దేశాయి ఈ చిత్రానికి వినోదపన్నును రద్దు చేశారు. 

                           

* మరికొన్ని విశేషాలు...
మెహబూబ్‌ ఖాన్‌ తొలి భార్య ఫాతిమాకు ముగ్గురు కుమారులు. ఆమె నుండి విడిపోయాక మెహబూబ్‌ ఖాన్‌ నటి సర్దార్‌ అఖ్తర్‌ను పెళ్లిచేసుకున్నారు. ఖాన్ నూరేళ్ళ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని, భారత తంతి తపాలా శాఖ స్మారక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. 1961లో మాస్కోలో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌ లో మెహబూబ్‌ ఖాన్‌ జూరీ సభ్యునిగా వ్యవహరించారు. భారత ప్రభుత్వం మెహబూబ్‌ ఖాన్‌కు ‘హిదాయత్‌ కర్థ్‌ఎ-ఆజం’ అనే బిరుదు ప్రదానం చేసింది. 28 మే నెల 1964న 56ఏళ్ల వయసులో మెహబూబ్‌ ఖాన్‌ బొంబాయిలో మరణించారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.