కభీ కభీ మేరే దిల్ మే ‘ఖయ్యాం’ ఆతా హై...
‘కభీ కభీ’ సినిమాలో ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై, కే జైసే తుఝ్ కో బనాయా గయా హై మేరే లియే’ అనే పాటను రాఖీ, శశికపూర్ వెండితెరమీద పండిస్తూ వుంటే, ప్రేమలో విఫలమైన కవి అమితాబ్ బచన్ పై ప్రేక్షకులకు జాలి కలుగక మానదు. అలాగే అమితాబ్ బచన్ రాఖీ మీద కవిత్వం రాసి ‘మై పల్ దో పల్ కా షాయర్ హూ’ అంటూ సభాస్థలి మీద ఆలపిస్తూ వుంటే రాఖీ మాత్రమే కాదు ఆ సినిమా చూడవచ్చిన విద్యార్థినులు కూడా మనసు పారేసుకున్నారు. ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో రాఖీ సంగీత ప్రియులు, విటుల మధ్య ‘ఏ క్యా జాగా హై దోస్తోం, యే కౌన్ సా దయార్ హై’ అంటూ ఆవేదనతో కూడిన పాటను పాడుతూ విలపిస్తూ వుంటే ప్రేక్షకు తట్టుకోలేకపోయారు. ‘త్రిశూల్’ చిత్రంలో శశికపూర్, హేమామాలిని ‘కభీ కస్మే నా తోడే ఉసే జీతే జీ నా చోడే, జో హో యార్ అపనా’ అంటూ తోటలో విహారంచేస్తూ ప్రేమించుకుంటూ వుంటే థియేటర్లలో కుర్రకారు లేచి నిలబడి స్టెప్పులు వేసిన సంఘటనలను మరువలేం. ఇవన్నీ సాధ్యమైంది ఆయా పాటల స్వరాల సొంపులతోనే. ఆ పాటలకు రాగాలు అల్లింది ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యాం. నటీమణి మీనాకుమారి ఉర్దూలో కవిత్వం రాస్తే దానికి ‘ఐరైట్, ఐ రిసైట్’ అనే పేరుతో ఆల్బంగా మలిచి విడుదలచేసిన సంగీతకారుడు ఖయ్యాం. సినిమాలకు కాకుండా ఖయ్యాం స్వరపరచి విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బంల లోని ‘ఘజబ్ కియా తేరే వాదే పే ఐత్బార్ కియా’ వంటి సుమధుర గీతాలు సినిమా పాటలకంటే పాపులర్ కావడం ఖయ్యాంకు హిందూస్తానీ సంగీతం మీద వున్న పట్టును గుర్తుచేస్తుంది. భారతప్రభుత్వం చేత ‘పద్మభూషణ్’ బిరుదును స్వీకరించిన ఖయ్యాం జయంతి ఈరోజు.  ఈ సందర్భంగా ఆ గాయక సంగీతకారుని  జ్ఞాపకాలు  కొన్ని....


సంగీతకారుడుగా తొలిరోజులు...
ఖయ్యాం పూర్తిపేరు మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి. పుట్టింది 18 ఫిబ్రవరి 1927న పంజాబ్ లోని రహోన్ పట్టణంలో. చిన్నతనంలోనే ఖయ్యాం ఢిల్లీ లోని తన మేనమామ గారి ఇంటికి వెళ్లి అక్కడే సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో పండిట్ అమరనాథ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. గాత్రదారునిగా, సంగీత స్వరకర్తగా అక్కడ ఖయ్యాం కు మంచి శిక్షణ లభించింది. 17 ఏళ్ళ వయసులో ఖయ్యాం లాహోర్ వెళ్లి తొలితరం పాకిస్తానీ సంగీత దర్శకుడు బాబా చిష్తి (గులామ్ అహమద్ చిష్తి) వద్ద సహాయకుడిగా పనిచేశారు. ఆరు నెలల తరవాత 1943 లో లూధియానా వచ్చేశారు. నలభయ్యవ దశకంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఖయ్యాం సైనికుడిగా దేశానికి సేవలు అందించారు. తరవాత బొంబాయి నగరానికి మకాం మార్చారు. 1948లో ఖయ్యాంకు తొలిసారి సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. వల్లి సాహిబ్ దర్శకత్వంలో ముంతాజ్ శాంతి, గులామ్ మహమ్మద్ నాయికా నాయకులుగా నటించిన ‘హీర్-రంఝా’ సినిమాకు రహమాన్ వర్మతో కలిసి సంగీతం సమకూర్చారు. అందులో ఖయ్యాం తనపేరును ‘శర్మాజీ’ గా మార్చుకొని ‘శర్మాజీ-వర్మాజీ’ అనే పేరుతో సంగీత దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక రహమాన్ వర్మ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. 1950లో వచ్చిన ‘బీవి’ చిత్రం ఖయ్యాం కు తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో అల్ నాసిర్, ముంతాజ్ శాంతి, ప్రాణ్ ముఖ్య తారాగణం కాగా కిషోర్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కూడా ఖయ్యాం ‘శర్మాజీ’ పేరుతోనే సంగీతం సమకూర్చారు. మహమ్మద్ రఫీ ఆలపించిన ‘అకేలే మే వో ఘబరాతే తో హోంగే, మిటా కే ముఝ్ కో పట్ జాతే తో హోంగే అకేలే మే’ అనే పాట బాగా పాపులర్ అయింది. అందులోనే గీతా దత్, ఆశా భోంస్లే ఆలపించిన ‘మౌసమ్ హై నమ్ కీ సావరియా’, ఆశా భోంస్లే ఆలపించిన ‘మేరె మాన్ కే అంగన్ చాంద్ చమ్కా’ పాటలు కూడా విజయవంతమై ఖయ్యాం కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తరవాత 1951లో ‘ప్యా కి బాతేం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.


ఫుట్ పాత్ తో ఖయ్యాంగా...
జియా సర్హది నిర్మాణ దర్శకత్వంలో 1953లో ‘ఫుట్ పాత్’ అనే సినిమా విడుదలైంది. అందులో దిలీప్ కుమార్, మీనాకుమారి నటించారు. ఈ చిత్రం బాలీవుడ్ క్లాసిక్ గా పేరుతెచ్చుకుంది. ఖయ్యాం తన సొంతపేరుతో ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ముఖ్యంగా తలత్ మెహమూద్ ఆలపించిన ‘షామ్-ఎ-ఘమ్ కే ఖసమ్ ఆజ్ ఝంగిన్ హై’, ఆశా భోంస్లే ఆలపించిన ‘పియా ఆజా రే దిల్ మేరా పుకారే’ మరియు ‘సో జా మేరె ప్యారే సో జా’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 1954లో ఫణి మజుందార్ ‘ధోబి డాక్టర్’ అనే సినిమా నిర్మిస్తే ఖయ్యాం ఆ చిత్రానికి సంగీతం అందించారు. అందులో పాటలన్నీఆశా భోంస్లే పాడటం విశేషం. వాటిలో ‘ఆంసూ పియె తేరి బిర్హన్ సజన్’, ‘పిహి పిహు బోలె పపిహరా’ పాటలు క్లాసికల్ టచ్ తో ఉంటూ మెలోడీని అందించాయి. అందులో హీరోగా నటించిన కిషోర్ కుమార్ ఆలపించిన ‘చాందిని రాతోం మే చాంద్ కహా హై’ అనే పాట కూడా జనరంజకమైనదే. తరవాత ‘తతర్ కా చోర్’ అనే చిత్రానికి ఖయ్యాం సంగీతం వినిపించినా బాగా హిట్టైన సంగీతం 1958లో విడుదలైన ‘ఫిర్ శుభా హోగీ’ లో వినిపించిందే. దర్శకనిర్మాత రమేష్ సైగల్ నిర్మించిన ఈ చిత్రంలో రాజకపూర్, మాలాసిన్హా నటించారు. రష్యన్ నవలాకారుడు దాస్తోవిస్కీ రచించిన ‘క్రైమ్అండ్ పనిష్మెంట్’ నవలకు రూపాంతరం ఈ చిత్రం. ఆ సంవత్సరం విడుదలైన అన్ని చితాలకన్నా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో పాటలు సూపర్ హిట్లైనాయి. ముఖ్యంగా ‘చీనా అరబ్ హమారా హిందూస్తాన్ హమారా రెహనే కో ఘర్ నహీ హై సారా జహా హమారా’ అంటూ ముఖేష్ ఆలపించిన పాట బాగా పాపులర్ అయింది. అయితే ఈ పాటను అప్పట్లో నిషేధిస్తారనికూడా పుకార్లు పుట్టాయి. అలాగే ముఖేష్, ఆశా భోంస్లే ఆలపించిన ‘వో శుభా కభీ తో ఆయేగీ’ ఆనాటి రాజకీయం మీద ఒక సెటైర్ గా నిలిచింది. లాల్ కృష్ణ అద్వాని ఈ సినిమాను అటల్ బిహారీ వాజపేయీతో కలిసి చాలాసార్లు చూశానని చెప్పేవారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో వారిద్దరూ ఓటమి పాలైనప్పుడు వెంటనే వెళ్లి ఈ సినిమా చూశారట. ‘ఫిర్ శుభా హోగీ’ అనుకుంటూ ఇంటికి వెళ్లారట. వాజపేయీ ప్రధాన మంత్రి అయినప్పుడు ఇద్దరూ ‘ఫిర్ శుభా హోగీ’ సినిమా గురించి, ఆ సినిమా టైటిల్ గురించి గుర్తు చేసుకున్నారట. అదే సంవత్సరం తలత్ మెహమూద్ హీరోగా నటించిన ‘కాలా రూక్’ సినిమాకి కూడా ఖయ్యాం సంగీతం సమకూర్చారు. ఇందులో పాటలన్నీ ఆశా భోంస్లే చేతనే ఖయ్యాం పాడించటం విశేషం. ఈ విషయం పై ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘నేను స్వరపరచే గీతాలకు ఆశాజీ స్వరం అతికినట్లు సరిపోతుంది. అంతకుమించి మరే ప్రత్యేకతా లేదు’ అన్నారు ఖయ్యాం. ఇందులో తలత్ ఆలపించిన ‘ఉదాస్ ఉదాస్ ఫిజావో మే నూర్ చలకావోం ఆనా హీ పడేగా’ అనే పాట ఆరోజుల్లో అందరి నోళ్ళలోనూ నానుతూ వుండేది. 1960లో ‘బొంబాయి కా బిల్లి’, ‘బరూద్’ సినిమాలకు ఖయ్యాం సంగీతదర్శకత్వం వహించినా ‘షోలా అవుర్ షబ్నం’ సినిమా ఖయ్యాంకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

జానే క్యా డూండ్తీ రెహతీ హై...
రమేష్ సైగల్ నిర్మాణ దర్శకత్వంలో 1961లో ‘షోలా అవుర్ షబ్నం’ చిత్రం రూపు దిద్దుకుంది. ధర్మేంద్ర నటించిన తొలి చిత్రాల్లో ఇదొకటి. తారల్ మెహతా ఇందులో నాయిక. ఇందులో పాటల్ని మహమ్మద్ రఫీ, జగ్జిత్ కౌర్, లతాజీ ఆలపించారు. రఫీ ఆలపించిన ‘జానే క్యా డూండ్తి రెహతీ హై యే ఆంఖే ముఝ్ మే’ పాట గొప్ప క్లాసికల్ టచ్ వున్న ప్రేమ గీతంగా సంగీత పండితులు పరిగణించారు. ఈ పాట పాడినందుకు రఫీ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. రఫీ ఆలపించిన గొప్ప పాటల్లో ఈ పాటను కూడా సంగీత పండితులు చేర్చడం విశేషం. జగ్జిత్ కౌర్ ఆలపించిన ‘ఫిర్ వోహి సావన్ ఆయా’, మన్నాడే, గీతా దత్, రఫీ ఆలపించిన ‘అగర్ దిల్ దిల్ సే టకరాయే తో అఫ్సానా బనా డాలే’ పాటలు ఆరోజుల్లో సూపర్ హిట్లు. సోహన్ లాల్ నాజర్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘షాగూన్’ చిత్రానికి కూడా ఖయ్యాం సంగీత దర్శకత్వం నిర్వహించారు. వహీదా రెహమాన్ నటించిన ఈ సినిమాలో రఫీ, సుమన్ కళ్యాన్ పుర్ ఆలపించిన ‘పర్బతోం కే పేడోమ్ పర్ షామ్’, జగ్జిత్ కౌర్ ఆలపించిన ‘తుమ్ అపనా రంజ్-ఓ-ఘమ్’ పాటలునేటికీ మనకు సుపరిచితాలే. ఇక ముబారక్ బేగం, తలత్ మెహమూద్ లతో పాడించిన ‘ఇతనే ఖరీబ్ ఆకే భీ నా జానే కిస్ లియే’ ఒక మంత్రదండమే!


కభీ కభీ మేరే దిల్ మే...
ఖయ్యాం కు సంగీత దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1976లో విడుదలైన యష్ చోప్రా నిర్మించిన ‘కభీ కభీ’. అమితాబ్ బచన్, శశికపూర్, రాఖీ, వహీదా రెహమాన్, రిషికపూర్, నీతు సింగ్ వంటి భారీ తారాగణం తో నిర్మించిన ఈ సూపర్ హిట్ చిత్రంలో ఖయ్యాం సమకూర్చిన సంగీతం అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో సమకూర్చిన సంగీతానికి ఖయ్యాం ఉత్తమ సంగీత దర్శకుడుగా ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు. ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’ పాటను రచించిన సాహిర్ లూధియాన్వి కి ఉత్తమ గేయరచయితగా, ఆపాటను ఆలపించిన ముఖేష్ కు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ఈ పాట సినిమాలో మూడు దఫాలుగా వినిపిస్తుంది. ముఖేష్, లతా మంగేష్కర్ గళంలో యుగళ గీతంగా, ముఖేష్, అమితాబ్ గళంలో ఏక గళ గీతంగా దర్శనమిస్తుంది. రేడియో సిలోన్ లో నిర్వహించే బినాకా గీత్ మాలా వార్షిక జాబితాలో ‘కభీ కభీ మేరే దిల్ మే’ పాటకు ప్రధమ స్థానం లభించింది. ప్లానెట్ బాలీవుడ్ సంస్థ రూపొందించిన అత్యుత్తమ 100 పాటల జాబితాలో ఈ పాటకు 7 వ స్థానం లభించింది. రోజూ ఏదో ఒక హిందీ చానల్ లో ఈ పాట వినపడుతూ వుండడం మనం గమనిస్తూనే వుంటాం. ముఖేష్ ఆలపించిన ‘మై పల్ దో పల్ కా షాయర్ హూ’ మరొక అద్భుత గీతం. ఇదే పాట ‘మై హర్ ఏక్ పల్ కా షాయర్ హూ’ గా కూడా ముఖేష్ గొంతుతో వినవస్తుంది. ఇందులో లతాజీ, కిషోర్ కుమార్ ఆలపించిన ‘తేరే చెహరే సే’ పాట కూడా గొప్పదే! ఈ సినిమాకు ముందే రాఖీ గుల్జార్ ను వివాహమాడి సినిమా నటనకు స్వస్తి చెప్పాలనుకుంది. కానీ గుల్జార్ ప్రోత్సాహంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తర్వాత ఖయ్యాం కు ఇంకా మంచి గుర్తింపు తెచ్చిన మరొక యాష్ చోప్రా చిత్రం 1978లో వచ్చిన ‘త్రిశూల్’. ఇందులో సంజీవ్ కుమార్, అమితాబ్ బచన్, శశికపూర్, రాఖీ, హేమామాలిని, పూనం ధిల్లాన్ వంటి భారీ తారాగణం నటించింది. అదే సంవత్సరం విడుదలైన ‘డాన్’, ‘ముకద్దర్ కా సికందర్’ చిత్రాలతో పోటీపడి అత్యధిక రాబడి వసూలు చేసిన ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఖయ్యాం. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘మిస్టర్ భరత్’ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో ‘మోహబ్బత్ బడే కామ్ కి’ అనే పాటను జేసుదాస్, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ లతోను, ‘జా రి బెహనా జా’ అనే పాటను జేసుదాస్, కిషోర్ కుమార్, పమేలా చోప్రా లతో పాడించడం ఖయ్యాం గొప్పతనమనే చెప్పుకోవాలి. కిషోర్ కుమార్, లతాజీ పాడిన ’జానేమన్ తూ కమాల్ కర్తే హో’, ‘జో హో యార్ అపనా’ పాటలు మంచి హిట్లు. యష్ చోప్రా మన్మోహన్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ‘నూరీ’ (1979) చిత్రానికి కూడా ఖయ్యాం సంగీతం అందించారు. ఫరూక్ షేక్, పూనం ధిల్లాన్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్టయింది. వసూళ్ళలో 7వ స్థానంలో నిలిచింది. చైనా దేశంలో విజయవంతమైన చిత్రాల్లో ‘నూరీ’ కూడా ఒకటి. ఇందులో ముఖేష్ తనయుడు నితిన్ ముఖేష్ లతాజీతో కలిసి ఆలపించిన ‘ఆజా రే ఓ మేరే దిల్ బర్ ఆజా’ పాట నేటికీ వినిపించే సూపర్ హిట్ పాట. ఈ పాట సినిమాలో రెండుసార్లు వస్తుంది. ఇందులో పమేలా చోప్రా, మహేంద్రకపూర్, జగ్జిత్ కౌర్, స్వదేశ్ మహాన్ కలిసి ఆలపించిన ‘ఆశిఖ్ హో తో ఐసా హో’ అనే ఖవ్వాలి పాట జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ధర్మేంద్ర, హేమామాలినితో కమల్ అమ్రోహి నిర్మించిన రజియా సుల్తాన్ కు సంగీతం సమకూర్చింది ఖయ్యామే.


మీనాకుమారి ఉర్దూ గేయాలకు స్వరాలల్లి...
ప్రముఖ నటి మీనా కుమారి మంచి ఉర్దూ కవయిత్రి అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె చరమాంకంలో ఈ కవితలే ఆమెకు సన్నిహితులుగా, నిర్లిప్తను దూరం చేసే సహచరులుగా ఉండేవి. ’నాజ్’ అనే కలం పేరుతో మీనాకుమారి రచించిన ఉర్దూ కవితలను గుదిగుచ్చి ఖయ్యాం ‘ఐ రైట్, ఐ రిసైట్’ అనే పేరుతో ఒక లాంగ్ ప్లే రికార్డును 1971లో రూపొందించారు. అది సంగీత ప్రియులను అలరించింది. మీనాకుమారే ఈ గీతాలను ఆలపించడం ఈ రికార్డు ప్రత్యేకత. ఈ రికార్డును 2006లో తిరిగి విడుదల చేశారు. ఒకసారి కమల్ అమ్రోహి, మీనాకుమారి రేడియో వింటుండగా ‘షాగూన్’ చిత్రంలోని ‘పర్బతోం కే పేడోమ్ పర్’ అనే పాట వినిపించింది. అది ఖయ్యాం సంగీతం నిర్వహించిన పాట అనే తెలుసుకున్నారు. అప్పుడు కమల్ అమ్రోహి ‘రజియా సుల్తానా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఈ పాట విన్న తరవాత వారిని తొలిగించి ఖయ్యాం ను సంగీత దర్శకుడిగా నియమించారు. ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలో పాటలు కూడా అద్భుతాలే. 1979లో శ్యామ్ చావలా ‘మీనాకుమారి కి అమర్ కహాని’ చిత్రం నిర్మించారు. అందులో మీనాకుమారితో నటించిన హేమాహేమీలందరూ కనిపిస్తారు. సోహ్రాబ్ మోడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఖయ్యాం సంగీతం సమకూర్చారు. ఖయ్యాం సంగీతం సమకూర్చిన చివరి చిత్రం ‘గులామ్ బంధు’ (2006) కాగా 2000 లో వచ్చిన ‘ఏక్ హై మంజిల్’ సినిమా తరవాత సంగీత దర్శకత్వానికి ఖయ్యాం దూరంగానే వున్నారు.


అవార్డులు...
2011 ఖయ్యాం కు భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రదానం చేసింది. 2013 లో లతా మంగేష్కర్ ప్రవేశపెట్టిన హృదయనాథ్ మంగేష్కర్ అవార్డు ఖయ్యాంను వరించింది. 2007లో అఖిల భారత సంగీత అకాడమీ అవార్డు లభించగా ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో సమకూర్చిన సంగీతానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని బహుమతి లభించింది. ‘కభీ కభీ’, ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో సమకూర్చిన సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఖయ్యాం కు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ‘నూరీ’, ‘తోడి సి బేవఫా’, ‘బజార్’, ‘రజియా సుల్తాన్’ చిత్ర సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిలింఫేర్ బహుమతులకోసం ఖయ్యాం పేరు ప్రతిపాదించబడింది. ముంబై లోని జుహు వద్దగల సుజయ్ ఆసుపత్రిలో చేరిన ఖయ్యాం తన 92 వ ఏట 20 ఆగస్టు 2019 న కన్ను మూశారు.ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.