బెంగాలీ భువన్ ‘షో’మ్యాన్... మృణాల్ సేన్

మృణాల్ సేన్ పేరు తెలియని సినీ ప్రేమికులు వుండరు. సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటక్ ల సమకాలికుడు మృణాల్ సేన్. బెంగాలి చిత్రసీమకు లభించిన జాతిరత్నం. మార్క్సిస్టు భావాలు జీర్ణించుకున్న సంఘ సేవకుడు, గొప్ప సినీ నిర్మాత, అద్భుత దర్శకుడు. బెర్లిన్, మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు గౌరవ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన గొప్ప మేధావి. మృణాల్ సేన్ నిర్మించిన భువన షోమ్, ఖోరస్, మృగయా, అకలేర్ సంధానే చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ బహుమతులు అందుకున్నాయి. పునశ్చ, ఆకాష్ కుసుమ్, అంతరీన్ చిత్రాలు ఉత్తమ బెంగాల్ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి. కలకత్తా 71, ఖరీజ్ చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచాయి. తెలుగులో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఒక వూరి కథ’ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతి, కార్లోవివరి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జూరీ బహుమతి అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా నాలుగు సార్లు, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మూడు సార్లు జాతీయ బహుమతులు అందుకున్న మహానీయుడాయన. 1980లో ‘పద్మభూషణ్’, 2003లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు అందుకున్న ‘భువన షో’మ్యాన్’ మృణాల్ సేన్. మృణాల్ సేన్ 97వ జయంతి సందర్భంగా ఆ మహనీయ కళాకారుని గురించి కొన్ని విశేషాలు...


తొలి నేపథ్యం...

తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్)లోని ఫరీదీపూర్‌లో మృణాల్ సేన్ మే 14, 1923న జన్మించారు. అక్కడే పాఠశాల చదువు పూర్తిచేసి కాలేజీ విద్యాకోసం మృణాల్ సేన్ కలకత్తా చేరుకొని అక్కడి స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివి భౌతి శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వుండే రాజబజార్ సైన్స్ కాలేజీ లో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్నారు. విద్యార్థిగా వుండగానే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తరవాత పాత్రికేయుడిగా జీవితం ప్రారంభించి కొంతకాలం కలకత్తా నగరానికి దూరంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నిర్వహించారు. సినిమారంగం మీద అభిలాష పెంచుకొని సౌండ్ టెక్నీషియన్ గా కొన్ని బెంగాలీ సినిమాలకు పనిచేశారు. మృణాల్ సేన్ కమ్యూనిజం వైపు ఆకర్షితుడై మార్క్సిస్టు పార్టీలో క్రియాశీలకంగా వున్నారు. అప్పుడే... అంటే 1940 ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నారు. 1955లో మృణాల్ సేన్‌కు తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అదే ఎస్.బి. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘రాత్ భోరే’ (అరుణోదయం) అనే బెంగాలీ చిత్రం. ఉత్తమ్ కుమార్, సావిత్రి చటర్జీ, శోభా సేన్, చబ్బి బిశ్వాస్ నటించిన ఈ చిత్రానికి సలీల్ చౌదరి సంగీతం సమకూర్చారు. ఆ చిత్రం గొప్పగా ఆడకపోయినా సినీ పండితుల ప్రశంసలకు నోచుకుంది..

సినిమా నిర్మాణం మీద కృషి....

‘రాత్ భోరే’ చిత్రం అందించిన ధైర్యంతో మృణాల్ సేన్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు తీసేందుకు మొగ్గుచూపేవారు. 1958 లో హేమంత బేలా ప్రొడక్షన్స్ సంస్థ అధిపతి హేమంత ముఖర్జీ (సంగీత దర్శకుడు హేమంత కుమార్), మహాదేవి వర్మ రచించిన బెంగాలీ నవల ‘చినీ ఫెరివాలా’ ఆధారంగా ‘నీల్ ఆకాషేర్ నీచే’ (నీలాకాశం దిగువున) అనే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వ బాధ్యతలు మృణాల్ సేన్ కు అప్పగించారు. కాళి బెనర్జీ, మంజుడే, బికాష్ రాయ్ నటించిన ఈ చిత్రానికి హేమంత ముఖర్జీ సంగీతం సమకూర్చారు. బ్రిటీష్ ప్రభుత్వ చివరిరోజుల పరిపాలనా కాలంలో దళిత వర్గాలకు జరిగిన అన్యాయాల నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నాటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ నిషేధం రెండునెలలపాటు అమలులో వుంది. తన మూడవ ప్రయత్నంగా మృణాల్ సేన్ 1960లో కల్లోల్ ఫిలిమ్స్ సంస్థ పేరిట హేమంత కుమార్ నిర్మించిన ‘బైషే శ్రావణ్’ (వివాహ దినోత్సవం) అనే సినిమాకు దర్శకత్వం వహించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందురోజుల్లో జరిగిన ఒక బాల్య వివాహం నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానేష్ ముఖర్జీ, మాధవి ముఖర్జీ ఇందులో నటించారు. అలాంటిదే 1961 లో మృణాల్ సేన్ సొంతంగా నిర్మించిన ‘పునశ్చ’ (పునశ్చరణ) చిత్రం కూడా. అలా ఐదు సినిమాలకు ప్రాణంపోసిన మృణాల్ సేన్ 1969లో ‘భువన్ షోమ్’ అనే లఘు బడ్జట్ చిత్రాన్ని సొంతంగా నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయ ఫిలిమ్ అభివృద్ధి సంస్థ ఆర్ధిక సహాయం అందించింది. ఉత్పల్ దత్, సుహాసిని మ్యులే ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా విజయ రాఘవరావు సంగీతం అందించారు. నవీన చలనచిత్ర భవిష్యత్తుకు ఈ చిత్రం పునాది వేసింది. అమితాబ్ బచన్ ఈ సినిమాకు వ్యాఖ్యానం చెప్పటం విశేషం. మృణాల్ సేన్ కు ఈ చిత్రం ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందంటే ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు (మృణాల్ సేన్), ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్) విభాగాలలో జాతీయ బహుమతులు అందుకుంది. తరవాతి రోజుల్లో మృణాల్ సేన్ నిర్మించిన చిత్రాలలో రాజకీయ విషయాలు కథావస్తువుగా దొర్లుకుంటూ వచ్చాయి. మృణాల్ సేన్ ని సమాజం మార్క్సిస్ట్ కళాకారుడు అని ముద్రవేసింది. ముఖ్యంగా కలకత్తాలో నక్సల్ ఉద్యమం వూపందుకున్న రోజుల్లో మృణాల్ సేన్ నిర్మించిన సినిమాలు విమర్శలకు లోనయ్యాయి. మృణాల్ సేన్ సినిమాలలో కలకత్తా] నగర సామాజిక సమస్యలు కథావస్తువులుగా వుండేవి. 1961లో మృణాల్ సేన్ నిర్మించిన ‘పునశ్చ’ సినిమా మొదలు 1992లో నిర్మించిన ‘మహాపృధ్వి’ వరకు ఇదే పంధాలో మృణాల్ సేన్ సినిమాలు నడిచాయి. ముఖ్యంగా.... మానవతా విలువలకు, కుల వ్యవస్థకు ప్రాధాన్యమిస్తూ మృణాల్ సేన్ సినిమాలు నడిచేవి. మృణాల్ సేన్ చివరిసారి నిర్మించిన సినిమా 2002 లో వచ్చిన ‘అమర్ భువన్’ (నా భూమి). అప్పుడు మృణాల్ సేన్ వయసు 80 సంవత్సరాలు.

అందుకోని అవార్డులు లేవు...

మృణాల్ సేన్ నిర్మించిన సినిమాలకు బహుమతి రాలేదంటే వింతగా వుండేది. పాశ్చాత్య సాహిత్య స్రష్ట అలెన్ మహాశయునికన్నా కలకత్తా ప్రజలు మృణాల్ సేన్ కు అందించిన ఆదరణ అంతా ఇంతా కాదు. వారి దృష్టిలో సేన్ ఒక దేవుడితో సమానం. 1982లో మృణాల్ సేన్ బెర్లిన్ లో జరిగిన 32వ అంతర్జాతీయ ఫిలిమ్ ఊత్సవంలో జ్యూరీ సభ్యుడుగా వున్నారు. 1983లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఊత్సవానికి కూడా మృణాల్ సేన్ జ్యూరీ సభ్యుడే! మరలా 1997లో జరిగిన మాస్కో ఊత్సవంలో మృణాల్ సేన్ జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు. ఇన్నిసార్లు జ్యూరీ సభ్యునిగా వ్యవహరించిన గౌరవం మృణాల్ సేన్ కి దక్కింది. కేన్స్, బేర్లిన్, వెనిస్, మాస్కో, కార్లోవి వరీ, మాంట్రియల్, చికాగో అంతర్జాతీయ ఫిల్మ్ ఊత్సవాలలో మృణాల్ సేన్ నిర్మించిన సినిమాలు ప్రదర్శనకు నోచుకోవడమే కాకుండా అనేక అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి. అంతర్జాతీయ ఫిలిమ్ సొసైటీ ఫెడరేషన్ కు మృణాల్ సేన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 


జాతీయ బహుమతులు....

మృణాల్ సేన్ జాతీయ స్థాయిలో అందుకున్న బహుమతుల జాబితా చాలా పెద్దదే! అతడు నిర్మించిన భువన్ షోమ్ (1969), కోరస్ (1974), మృగయా (1976), ఆకలేర్ సంధానే (1980) చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ బహుమతులు అందుకున్నాయి. కలకత్తా (1972), ఖర్జీ (1980) సినిమాలు జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డులు అందుకున్నాయి. ఇక ప్రాంతీయ ఉత్తమ సినిమాలుగా పునశ్చ (1961), ఆకాష్ కుసుమ్ (1965), అంతరీన్ (1993) జాతీయ పురస్కారాలు అందుకున్నాయి. మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన ఒకే ఒక సినిమా ‘ఒక వూరి కథ’ కు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి లభించింది. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు సమకూర్చగా విజయ రాఘవరావు సంగీతం అందించారు. నారాయణరావు, వాసుదేవరావు, ప్రదీప్, మమతా శంకర్ ఇందులో నటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతులు రెండు ఈ సినిమాకు లభించాయి. అంతే కాకుండా కార్లోవి వరీ, కార్థేజ్ ఫిలిమ్ ఫెస్టివల్ లలో ప్రత్యేక బహుమతులు కూడా ఈ సినిమా గెలుచుకుంది. 1978లో మృణాల్ సేన్ నిర్మించిన పరశురామ్ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక బహుమతి లభించింది. ఉత్తమ దర్శకుడుగా మృణాల్ సేన్ భువన్ షోమ్, ఏక్ దిన్ ప్రతిదిన్, ఆకలేర్ సంధానే, ఖందర్ చిత్రాలకు జాతీయ బహుమతులు అందుకున్నారు. అతడు స్కీన్ ప్లే అందించిన పడతిక్, ఖర్జీ, ఆకలేర్ సంధానే సినిమాలు కూడా జాతీయ బహుమతులు అందుకున్నాయి. మృగయా సినిమాతోబాటు మరో నాలుగు మృణాల్ సేన్ సినిమాలకు ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి.                   

                                                                                               

 పురస్కారాలు...

1979లో నెహ్రూ-సోవియట్ అవార్డు, 1981లో పద్మభూషణ్ పురస్కారం, 1993లో జాదవపూర్, రవీంద్ర భారతి, బుర్ద్వాన్, కలకత్తా విశ్వవిద్యాలయాలు డాక్టర్ ఆఫ్ లెటర్స్ పురస్కారాలు మృణాల్ సేన్ అందుకున్నారు. 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం మృణాల్ సేన్ కు లభించింది. 2017 లో ఆస్కార్ అకాడమీ బహుమతుల జ్యూరీలో మృణాల్ సేన్ సభ్యునిగా వ్యవహరించారు. మృణాల్ సేన్ 95 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. 2018 డిసెంబర్ 30 న కలకత్తా లోని భవానిపూర్ స్వగృహంలో మృణాల్ సేన్ మరణించారు. అంతకన్నా ఒక సంవత్సరం ముందే మృణాల్ భార్య గీతా సేన్ కూడా చనిపోయింది. కొడుకు కునాల్ సేన్ చికాగోలో ఉంటున్నాడు.


మృణాల్ సేన్ గురించి అమితాబ్ బచన్ తదితరులు ఏమన్నారంటే ....

అది 1969 సంవత్సరం తొలిరోజులు. ప్రముఖ బెంగాలీ దర్శక నిర్మాత మృణాల్ సేన్ గుజరాత్ లోని భావనగర్ వద్ద ‘భువన్ షోమ్’ చిత్ర షూటింగు ముగించుకొని ఫిలిం ఎడిటింగ్ కోసం బొంబాయి వచ్చారు. తన స్నేహితుడు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కె.ఎ. అబ్బాస్ ఇంటికి వెళ్ళారు. అబ్బాస్ ఆప్పుడు ‘సాథ్ హిందుస్తాని’ సినిమా నిర్మాణ సన్నాహాల్లో వున్నారు. అబ్బాస్ తో ముచ్చట్లు చెబుతూ ‘భువన షోమ్’ సినిమా కు వాయిస్-ఓవర్ కోసం మంచి కంఠస్వరమున్న కథకుడు కావాలని అడిగారు. అబ్బాస్ వెంటనే ఒక పొడుగ్గా, సన్నగా వుండే అబ్బాయిని పిలిఛి విషయం చెప్పారు. “అమి బంగ్లా జానీ” (నాకు బెంగాలీ భాష వచ్చు) అని జవాబిచ్చాడా కుర్రాడు. “అబ్బాస్ ఇతని భాష బాగాలేదు. కానీ వాయిస్ బాగుంది. హిందీ నెరేషన్ ఇతనితో చెప్పిద్దాం. కానీ నేను ఎక్కువ పారితోషికం ఇవ్వలేను” అన్నారు. ఆ కుర్రాడు ఎగిరి గంతేసినంతపని చేశాడు. “సార్ నాకు పారితోషికం వద్దు. నా పేరు టైటిల్స్ లో పడితే చాలు” అన్నాడు. సేన్ “సరే” అన్నాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు. బిగ్-బి గా గౌరవంగా పిలుచుకునే అమితాబ్ బచన్. భువన షోమ్ చిత్ర ప్రారంభంలో, సినిమా చివర్లో అమితాబ్ వాయిస్ వినపడుతుంది. టైటిల్స్ లో “వాయిస్ ఓవర్ అమితాబ్” అనే పేరు కనపడుతుంది. ఆ సినిమాకు 1970లో ఉత్తమ చిత్రం గా జాతీయ బహుమతి లభించింది. కలకత్తాలో ‘భువన్ షోమ్’ సన్మాన సభలో అమితాబ్ పాల్గొన్నప్పుడు ఒక విలేకరి అమితాబ్ వైపు వేలు చూపుతూ “మీ తదుపరి చిత్రంలో హీరో ఇతడేనా” అని మృణాల్ సేన్ అడిగాడు. మృణాల్ జవాబివ్వలేదు. కానీ హృషికేష్ ముఖర్జీ 1971 లో నిర్మించిన ‘ఆనంద్’ సినిమాలో అమితాబ్ కు అద్భుతమైన పాత్ర ఇప్పించగలిగారు. ఆ పాత్రకు ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్ బహుమతి వచ్చింది.

మృణాల్ సేన్ నిర్మించిన ఖాందర్‌లో షబానా ఆజ్మి నటించింది. క్లైమాక్స్ సన్నివేశాన్ని మొదట తీశారు మృణాల్. అందులో షబానా ముఖం చెక్కుకుపోతూ శిధిల శకలాలుగా అదృశ్యమౌతాయి. సినిమా మొదటే అటువంటి సన్నివేశాని మృణాల్ దా చిత్రీకరించడాన్ని షబానా ఆజ్మి జీర్ణించుకోలేకపోయింది. నిరసన వ్యక్తం చేసింది కూడా. మృణాల్ ఏమీ మాట్లాడలేదు. చిత్రం పూర్తయ్యాక రషెస్ చూసి షబానాకు మతిపోయినంత పనైంది. మృణాల్ పాదాలకు అభివందనం చేసి తప్పు క్షమించమని కోరుకుంది.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.