బాలీవుడ్‌ను మురిపించిన నవ్వుల రేడు...జానీవాకర్‌

‘జానీవాకర్‌’ పేరు వింటే స్కాట్లాండ్‌కు చెందిన ఖరీదైన మద్యం గుర్తొస్తుంది. కానీ అదే హిందీ చిత్రసీమలో బద్రుద్దీన్‌ ఖాజీ అనే వ్యక్తికి సార్ధకనామమై పోయింది. అతడే రెండవతరం హిందీ సినిమాల్లో మూడు వందలకు పైగా హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రేడు ‘జానీవాకర్‌’. నటుడు బల్రాజ్‌ సాహ్ని బద్రుద్దీన్‌ని దర్శక నిర్మాత గురుదత్‌కు పరిచయం చేసినప్పుడు అతడు అలరించిన ‘తాగుబోతు’ పాత్ర నచ్చి ఆ మద్యం పేరు వచ్చేలా ‘జానీవాకర్‌’ అని పేరు మార్చారు. అలనాటి అగ్రశ్రేణి నటులతో సహనటుడుగా నటిస్తూ నవ్వులు పంచిన ఈ హాస్యనటుడికి హీరోతో సమానంగా దాదాపు ప్రతి సినిమాలో ఒకటి, లేక రెండు పాటలు పెట్టడం పరిపాటి అయింది. జానీవాకర్‌ అసలు సిసలైన ముస్లిం. ఆర్ధిక పరిస్థితుల వలన తను చడువుకోలేక పోయినందుకు ప్రతిగా, తన ముగ్గురు కొడుకులనూ అమెరికా దేశానికి పంపి, ఉన్నత చదువులు చెప్పించి, వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దిన మార్గదర్శి జానీవాకర్‌.  ఇవాళ ఆయన జయంతి. (నవంబర్‌ 11, 1920). ఈ సందర్భంగా ఆ హాస్యచక్రవర్తి జీవిత విశేషాలను తెలుసుకుందాం.


జానీవాకర్‌గా మారిన బద్రుద్దీన్‌.....

జానీవాకర్‌ పూర్తి పేరు బద్రుద్దీన్‌ జమాలుద్దీన్‌ ఖాజీ. పుట్టింది నవంబర్‌ 11, 1920న మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో. తండ్రి ఒక మిల్లులో కార్మికుడుగా పనిచేసేవాడు. వారిది చాలా బీద కుటుంబం. బద్రుద్దీన్‌ వారికి రెండవ సంతానం. మొత్తం పదిమంది సంతానంతో ఇల్లు గడవడం కష్టంగా వుండేది. తండ్రి పనిచేస్తున్న మిల్లు మూత పడడంతో వారికి జరుగుబాటు కష్టమైపోయింది. దాంతో వారి కుటుంబం బొంబాయికి మకాం మార్చింది. వీరందరి పోషణభారం బద్రుద్దీన్‌ మీద పడింది. బద్రుద్దీన్‌ కుటుంబం కోసం చాలా కష్టపడేవాడు. అది ఎంత చిన్న పనైనా చేసి డబ్బు సంపాదించి కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చాడు. కూరగాయలు అమ్మేవాడు. ఐస్‌ క్యాండీలు అమ్మేవాడు. ఆ రోజుల్లో సినిమాల్లో కామెడీ పాత్రల్ని నూర్‌ మహామ్మద్‌ చార్లీ (ఇండియన్‌ చార్లీ అని పిలిచేవారు) అనే నటుడు పోషిస్తూ ఉండేవాడు. మన దేశపు తొలి హాస్య నటుడుగా నూర్‌ మహమ్మద్‌ గుర్తింపు పొందాడు. చార్లీ చాప్లిన్‌కి అభిమాని కావడంతో తన పేరుకు చివర చార్లీ అని తగిలించుకున్నాడు. ఈ నూర్‌ మహమ్మద్‌ చార్లీ అంటే బద్రుద్దీన్‌కు చాలా అభిమానం. బొంబాయిలో బస్‌ కండక్టరుగా పనిచేస్తున్నప్పుడు నూర్‌ మహమ్మద్‌ చార్లీని అనుకరిస్తూ ప్రయాణీకులను తన హాస్యంతో నవ్విస్తూ, కుచేష్టలతో కుప్పిగంతులు వేసి సరదాగా మాట్లాడుతూ వారికి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ప్రముఖ రచయిత, నటుడు బల్రాజ్‌ సాహ్ని అదే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బద్రుద్దీన్‌ ‘హల్‌ చల్‌’ సినిమాలో ఒక హాస్య సన్నివేశాన్ని అనుకరిస్తూ ప్రయాణీకులను అలరించడం గమనించారు. 1951లో విడుదలైన ఆ సినిమాలో బల్రాజ్‌ సాహ్ని కూడా నటించి ఉండడంతో, అతణ్ణి గురుదత్‌ వద్దకు తీసుకెళ్ళారు.

కట్‌ చేస్తే...

1946 ప్రాంతంలో పూనాలోని ప్రభాత్‌ ఫిలిం కంపెనీ వారు ‘హమ్‌ ఏక్‌ హై’ సినిమా నిర్మిస్తున్నప్పుడు అందులోని హీరో దేవానంద్‌తో ఆ సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్న గురుదత్‌కు విచిత్రమైన పరిస్థితుల్లో దోస్తీ కుదిరింది. అప్పుడు వారిద్దరిమధ్య ఒక మౌఖిక ఒప్పందం జరిగింది. ‘గురుదత్‌ నిర్మాతగా మారితే అందులో దేవానంద్‌ హీరోగా నటించాలి; దేవానంద్‌ నిర్మాత అయితే ఆ సినిమాకు గురుదత్‌ దర్శకత్వం వహించాలి’ అనేది ఆ ఒప్పందం. దేవానంద్‌ హీరోగా స్థిరపడిన తరువాత 1950లో నవకేతన్‌ ఫిలిమ్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా 1950లో ‘అఫ్సర్‌’ సినిమా నిర్మించి విజయం సాధించాక, రెండవ ప్రయత్నంగా ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘బాజి’ (1951) సినిమా నిర్మాణం చేపట్టి, దర్శకత్వ బాధ్యతలు అనుకున్నట్లు గానే గురుదత్‌కు అప్పగించాడు. ఆ సినిమాకు కథ, మాటలు, స్కీన్ర్‌ ప్లే సాహిర్‌ లూధియాన్వితో కలిసి బల్రాజ్‌ సాహ్ని రాస్తున్నారు. బల్రాజ్‌ సాహ్ని బద్రుద్దీన్‌ని గురుదత్‌కు అప్పగిస్తూ, ‘మనం తీయబోయే ‘బాజి’ సినిమాలో కామెడీ పాత్రకు ఇతడు పనికివస్తాడు. ప్రయత్నించండి’ అని సిఫారసు చేశారు. గురుదత్‌ బద్రుద్దీన్‌కు స్కీన్ర్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఒక తాగుబోతు ఎలా ప్రవర్తిస్తాడో అలా నటించి చూపాడు. గురుదత్‌కు బద్రుద్దీన్‌ నచ్చాడు. ఆ రోజుల్లో భాగ్యవంతుల కోసం ‘జానీవాకర్‌’ బ్రాండ్‌తో విదేశీ విస్కీ వచ్చేది. జానీవాకర్‌ తాగుబోతు పాత్రను అద్భుతంగా నటించి చూపడంతో అతని పేరును గురుదత్‌ ‘జానీవాకర్‌’గా మార్చి ‘బాజీ’ సినిమాలో తాగుబోతు పాత్రలోనే నటింపజేశారు. అలా బద్రుద్దీన్‌ జమాలుద్దీన్‌ ఖాజీ జానీవాకర్‌గా మారిపోయాడు.


హాస్యనటుడుగా రాణించి...
రూప్‌.కె. షోరే దర్శకత్వంలో వచ్చిన ‘ఆగ్‌ కా దరియా’ (1953) అనే సినిమాలో జానీవాకర్‌ నటించాడు. అందులో జానీవాకర్‌కు ‘జా చలి జా ఓ ఘటా’ అనే డ్యూయట్‌ కూడా వుంది. ఈ సినిమాలో జానీవాకర్‌ నటనకు మంచి పేరొచ్చింది. అదే సంవత్సరం ‘బాజ్‌’, ‘హమ్‌ సఫర్‌’, ‘ఠోకర్‌’ సినిమాల్లో హాస్యనటుడిగా రాణించాడు. గురుదత్‌ నిర్మించిన అన్ని సినిమాలలో జానీవాకర్‌కు మంచి పాత్ర వుండాల్సిందే. అలాగే గురుదత్‌ నిర్మించిన ‘జాల్‌’ సినిమాలో దేవానంద్‌కు స్నేహితుడిగా జానీవాకర్‌ నటించాడు. గురుదత్‌ నిర్మించిన మరొక చిత్రం ‘ఆర్‌ పార్‌’లో జానీవాకర్‌ కు ‘అరె నా నా నా నా నా నా తోబా తోబా’ అనే డ్యూయట్‌ వుంది. రఫీ, గీతా దత్‌ ఆలపించగా షకీలా సరసన జానీవాకర్‌ ఆ పాటకు అభినయం చూపాడు. 1955లో జానీవాకర్‌ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా బిమల్‌ రాయ్‌ నిర్మించిన ‘దేవదాస్‌’ సినిమాలో జానీవాకర్‌ పాత్రను గుర్తుచేసుకోవాలి. తెలుగులో పేకేటి ధరించిన భగవాన్‌ పాత్రను హిందీలో జానీవాకర్‌ పోషించి రక్తి కట్టించాడు. జానీవాకర్‌కు గురుదత్‌ అంటే అభిమానం. అందుకు కారణం తనకు చిత్ర బిక్ష పెట్టింది అతనే. గురుదత్‌ కూడా జానీవాకర్‌ లేకుండా సినిమాలు నిర్మించలేదు. ‘మేరే మెహబూబ్‌’, ‘ప్యాసా’, ‘దిఖిదీ’, ‘నయా దౌర్‌’, టాక్సీ డ్రైవర్‌’, ‘చోరి చోరి’ వంటి సినిమాలలో కథలో మమేకమయ్యే హాస్య పాత్రలను జానీవాకర్‌ కోసమే సృష్టించిన మహనీయుడు గురుదత్‌. జేబులుకొట్టే పిక్‌ పాకెటర్‌గా దిఖిదీలో జానీవాకర్‌ నటన పరమాద్భుతం. అలాగే ‘ప్యాసా’లో అత్తరు అమ్మే సత్తారు సాహెబ్‌గా మాలీష్‌ చేస్తూ పాట పాడుతుంటే ప్రేక్షకులు ఈలలు వేసేవారు. జి.పి.సిప్పీ నిర్మించిన ‘మెరైన్‌ డ్రైవ్‌’ సినిమాలో ‘మోహబ్బత్‌ యూ భీ హోతీ హై’ అనే బీచ్‌ సాంగ్‌లో జానీవాకర్‌ చొక్కా లేకుండా ఎగురుతూ పాడే పాటను జనం మరచిపోలేదు. గురుదత్‌ నిజంగానే జానీవాకర్‌కు గురువులాంటివాడు. అతడు జానీవాకర్‌కు ఎంత స్వేచ్చను ఇచ్చేవాడంటే, షూటింగులో జానీకి ఇష్టం వచ్చిన రీతిలో డైలాగులు చెప్పమనేవాడు. జానీ తన సహజమైన పద్ధతిలో కొన్ని మాటల్ని జోడించి డైలాగు చెప్పేవాడు. గురుదత్‌ ఆ డైలాగులు లైట్‌ బాయ్‌ లకు, కెమెరా బాయ్‌ లకు నవ్వు తెప్పిస్తున్నాయా లేవా అని గమనించి, వాటినే కరారు చేసేవారు. గురుదత్‌ సినిమాలలో జానీ నటించడమే కాదు, అతనిమీద కొన్ని పాటలు కూడా పెట్టేవారు గురుదత్‌. జానీవాకర్‌ హాస్య నటుడిగా యెంతగా ప్రసిద్ధికెక్కాడంటే, 1957లో అతని పేరుమీదే ‘జానీవాకర్‌’ సినిమా వచ్చింది. అందులో జానీవాకరే హీరో. అతని సరసన శ్యామా నటించింది. ఆ సినిమాకు ఓ.పి. నయ్యర్‌ సంగీతం అందించడం విశేషం. అందులో ఫ్రెంచ్‌ దుస్తుల్లో, చేతికి గ్లోవ్స్‌తో పెద్ద టోపీ పెట్టుకొని ‘ఆయే దిల్‌ తు న డర్‌ ఇస్‌ జహా సే’ అంటూ మహమ్మద్‌ రఫీ గొంతులో పాడుతూవుంటే ఏదో ఇంగ్లీష్‌ సినిమా చూసినట్టే వుండేది. అలాగే బొంబాయి రోడ్లమీద, మెరైన్‌ డ్రైవ్‌ మీద శ్యామా సైకిలు తొక్కుతూ వెళుతుంటే, ఆటపట్టిస్తూ పాడే డ్యూయట్‌ ‘బచ్కే బాలమ్‌ చల్‌ కి రాస్తా హాయ్‌ ముష్కిల్‌ మోహబ్బత్‌ కే బాజార్‌ కా’ కూడా గొప్ప హిట్టు. మరొక మరచిపోలేని పాట ‘మహమ్మద్‌ రఫీ, మన్నాడే పాడిన ‘మోహ్‌ సే మత్‌ లగా చీజ్‌ హై బురీ’ అనే క్లబ్‌ సాంగ్‌. 1955లో వచ్చిన ‘రైల్వే ప్లాట్‌ ఫారం’ సినిమా ద్వారా సునీల్‌ దత్‌ హిందీ వెండితెరకు పరిచయమయ్యాడు. అందులో ‘దేఖ్‌ తేరే భగవాన్‌ కి హాలత్‌ క్యా హోగయి ఇన్సాన్‌’ పాట బాగా పాపులర్‌. ఈ పాటలో జానీవాకర్‌దే మొత్తం హవా. ‘మధుమతి’ సినిమాలో నటనకు జానీవాకర్‌కు తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1968లో విడుదలైన ‘షికార్‌’ సినిమాలో అందించిన గంభీరమైన పాత్రకు జానీవాకర్‌ రెండవ ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకున్నాడు. అలా మూడు వందల సినిమాల్లో జానీవాకర్‌ నటించగలిగాడంటే, అది జానీలో వున్న మంచితనం, పేదరికాన్ని మరచిపోని మంచితనం. తను ఎంత ఎదిగినా ఒదిగి వున్నాడు. జానీవాకర్‌ ఎప్పుడూ ఒక ‘స్టార్‌’గా ఫీలవలేదు. ఒక సాధారణ వ్యక్తిలాగే వ్యవహరించేవాడు.


అయితే గురుదత్‌ మరణం జానీవాకర్‌ను కుంగదీసింది. పైగా మెహమూద్‌ రాకతో జానీవాకర్‌ ప్రభావం తగ్గింది. సినిమా నటన మీద నిర్వేదం, నిరాశ చోటు చేసుకుంది. నెమ్మదిగా వ్యాపారం వైపు దృష్టి మరల్చాడు. ఖరీదైన జాతి రాళ్ళ అమ్మకం వ్యాపారం చేశాడు. సొంతంగా 1986లో ‘పహుంచే హుయే లోగ్‌’ అనే సినిమా నిర్మించాడు. అందులో తన మేనకోడలు జొహరా ను వెండితెరకు పరిచయం చేశాడు. కళ్యాణ్‌ జి ఆనంద్‌ జి సంగీత దర్శకత్వం వహించగా, తనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. హర్షద్‌ ఖాన్, అమ్జాద్‌ ఖాన్, ఆశా లత, శక్తి కపూర్‌ నటించిన ఈ సినిమా విజయం వరించకపోగా, జానీవాకర్‌కు కష్టాలను తెచ్చిపెట్టింది. జానీవాకర్‌ చివరిసారి వెండితెరమీద కనిపించింది కమల్‌ హసన్‌ నటించిన ‘చాచీ 420’ (2003) సినిమాలో. ఎప్పటిలాగే ఒక మందు సీసాతో ఇందులో కనిపించాడు.


నూర్జహాన్‌తో ప్రేమలో...

1954లో గురుదత్‌ నిర్మించిన ‘ఆర్‌ పార్‌’ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడు నటి నూర్జహాన్‌ (నూర్‌ అని కూడా పిలుస్తారు)తో పరిచయమై, అది కాస్తా ప్రేమగా వికసించింది. 1955లో నూర్జహాన్‌ను జానీవాకర్‌ పెళ్లాడాడు. తరువాత నూర్జహాన్‌ సినిమాలకు స్వస్తి చెప్పి గృహిణిగానే వుండిపోయింది. నూర్జహాన్‌ నటి షకీలాకు సోదరి. సినిమాల్లో జానీవాకర్‌ సాధారణంగా తాగుబోతు పాత్రలు పోషించినా, నిజజీవితంలో అతడు మద్యం ముట్టలేదు. సంప్రదాయ ముస్లింగా ఇదు పూటలా ప్రార్ధనలు చేసుకుంటూ, బీదలకు సాయంచేస్తూ జీవితాన్ని గడిపాడు. జానీవాకర్‌ కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. తను ఆరవతరగతి కి మించి చదువుకోలేకపోయానని, ముగ్గురు కుమారులను అమెరికాంపించి చదివించాడు. వాళ్లు ముగ్గురూ అక్కడే స్థిరపడ్డారు.
మరిన్ని విశేషాలు...

* జానీవాకర్‌ పేరు వింటే వెంటనే మన మదిలో మెదిలే పాటలు గురుదత్‌ సినిమా ‘ప్యాసా’లో ‘సర్‌ జొ తేరా చకరాయే, యా దిల్‌ డూబా జాయే, ఆజా ప్యారే పాస్‌ హమారే, కాహే ఘబరాయే... కాహే ఘబరాయే’ (రఫీ); దిఖిదీ సినిమాలో ‘ఆయ్‌ దిల్‌ హై ముష్కిల్‌ జీనా యహా, జరా హట్‌ కే జరా బచ్‌ కే, ఏ హై బొంబాయి మేరీ జాన్‌’ (రఫీ, గీతాదత్‌).

* జానీవాకర్‌ సోదరుడు టోనీ వాకర్‌ కూడా సినిమారంగంలో నిర్మాతగా వ్యవహరిస్తూ, ‘వాంటెడ్‌’ వంటి కొన్ని లఘు బడ్జట్‌ సినిమాలు నిర్మించాడు. మరొక సోదరుడు వహిరుద్దీన్‌ (వ్యావహారిక నామం విజయకుమార్‌) కూడా నటుడే. టోనీ వాకర్‌ నిర్మించిన ‘వాంటెడ్‌’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

* ఒకానొక ఇంటర్యూలో జానీవాకర్‌ చెప్పిన మాటలు: ‘కాలగమనంలో మెహమూద్‌ రాకతో హిందీ సినిమాల్లో కామెడీకి ఇచ్చే స్థానం పలచబడింది. ఆ రోజుల్లో సినిమాలకు కుటుంబ సభ్యులతో వచ్చేవారు. సంసార పక్షమైన కథ, ఆ కథలో ఇమిడిపోయే పాత్రలు, హాస్యం ఇవన్నీ మిళితమైతే ఒక చక్కని సినిమాగా తయారయ్యేది. కథనుబట్టి నటీనటుల ఎంపిక జరిగేది. ఇప్పుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని కథానిర్మాణం జరుగుతోంది. కథకు సంబంధం లేకుండా హాస్యపాత్రలు మధ్యమధ్యలో కనిపిస్తూవున్నాయి. అబ్రార్‌ ఆల్వి, గురుదత్‌ సినిమాలు చూడండి. హాస్యపాత్రలు కథలో భాగంగా కలిసివుంటాయి. ఇప్పుడు హాస్యనటులచేత అశ్లీలపు మాటలు మాట్లాడించి అదే హాస్యం అనిపిస్తున్నారు. నేను 300 సినిమాలకు పైగా నటించాను. నా పాత్రకు ఏనాడూ సెన్సార్‌ బోర్డు అభ్యతరాలు చెప్పలేదుృ. ఇలాంటి పాత తరం నటులనుంచి భావితరం నటులు ఎంతోనేర్చుకోవాల్సి ఉందన్నమాట నిజం!- ఆచారం షణ్ముఖాచారిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.