మేరా దర్ద్‌ న జానే కోయీ... నళినీ జయవంత్‌

అవి పాతరోజులు. మూకీ సినిమాలకు కాలం చెల్లి టాకీలు వస్తున్న కొత్తరోజులు. సినిమాలలో ఆడవాళ్లు నటించడం ఆరోజుల్లో పెద్ద అవమానంగా భావించేవారు. సినిమాలలో నటించే ఆడపిల్లల నడవడి మంచిది కాదనే అపవాదు వుండేది. అటువంటి అననుకూల పరిస్థితులలో కళారంగానికి సేవచేయాలని, తమలో వున్న కళాతృష్ణకు భాష్యం చెప్పాలని దుర్గా ఖోటే, లీలా చిట్నీస్, శోభనా సమర్థ్, శాంతా ఆప్టే, వనమాల వంటి నటీమణులు తమదైన శైలిలో సినిమాలలో నటించి సినిమా చరిత్రలో తమ పేర్లను స్వర్ణాక్షరాలతో లిఖింపజేసుకున్నారు. అటువంటి వారిలో నళినీ జయవంత్‌ కూడా ఒకరు. ఒక సాధారణ మరాఠీ కుటుంబంలో పుట్టి, తన అందమైన రూపం, అద్భుత నటనా పటిమతో పాతికేళ్లు హిందీ, మరాఠీ చిత్రసీమను ఏలిన మహారాజ్ఞి నళినీ. డిసెంబరు 20న నళినీ జయవంత్‌ వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని జ్ఞాపకాలు...

తొలిరోజుల్లో నళినీ...

ఫిబ్రవరి 18, 1926న జన్మించిన నళినీ జయవంత్‌ కుటుంబం బొంబాయి గిర్గామ్‌ ప్రాంతంలో వుండేది. ఆమె తండ్రి ఒక కస్టమ్స్‌ అధికారిగా పనిచేసేవారు. ఇద్దరు అన్నల మధ్య నళినీ ఒక్కటే చెల్లెలు. నటి నూతన్, తనూజల తల్లి శోభనా సామర్థ్‌ ఆమెకు వరసకు అక్క అవుతుంది. ఆమెకు చిన్నతనం నుంచి నాట్యమంటే వల్లమాలిన అభిమానం. ఆమె ఉత్సుకతను గమనించిన తండ్రి నళినీకి మోహన్‌ కళ్యాన్‌ పుర్‌ వద్ద కథక్‌ నృత్యంలో శిక్షణ ఇప్పించారు. సమాంతరంగా హిందుస్తానీ సంగీతాన్ని నళినీ హీరాబాయి జవేరి వద్ద నేర్చుకుంది. తను నివసించే గిర్గామ్‌ ప్రాంతంలో ఆరోజుల్లో స్వస్తిక్, డైమండ్, ఇంపీరియల్‌ సినిమా హాళ్లలో అనేక హిందీ, మరాఠీ సినిమాలు ప్రదర్శితమవుతూ ఉండేవి. అందులో ప్రదర్శించే చిత్రాలను నళినీ తదేక దీక్షతో చూసేది. కానీ తను సినిమాలలోకి ప్రవేశిస్తానని మాత్రం కలలో కూడా ఊహించలేదు. అయితే అప్పటికే శోభనా సామర్థ్‌ సినిమాలలో నటిస్తూ వుండేది. అయితే నళినీ తండ్రికి నళినీ జయవంత్‌ సినిమాలలో నటించటం మీద ఇష్టం వుండేది కాదు. ఆరోజుల్లో చిమన్‌ భాయ్‌ దేశాయ్‌కి నిర్మాతగా మంచి పేరుండేది. సాగర్‌ మూవిటోన్, నేషనల్‌ స్టూడియో, అమర్‌ పిక్చర్స్‌ పేర్లతో చిమన్‌ భాయ్‌కి సినీనిర్మాణ సంస్థలు ఉండేవి. ‘జడ్జ్మెంట్‌ ఆఫ్‌ అల్లా’, ‘వతన్‌’, ‘గ్రామఫోన్‌ సింగర్‌’, ‘అవురత్‌’, ‘నిర్దోష్‌’, ‘రోటీ’, ‘ఆంఖ్‌ మిచౌలి’, ‘ఆదాబ్‌ అర్జ్‌’ వంటి అనేక సినిమాలు నిర్మించి చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ మంచి పేరు గడించారు. వీటిలో 1935లో వచ్చిన ‘జడ్జ్మెంట్‌ ఆఫ్‌ అల్లా’ (అల్‌-హిలాల్‌) సినిమా ద్వారా ప్రముఖ దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌ దర్శకునిగా, సితారాదేవి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అంతకుముందు సితారాదేవికి నాలుగైదు సినిమాలలో నాట్యం చేసిన అనుభవం మాత్రమే వుండేది. అలాగే నటుడు మోతిలాల్‌ను ‘షహర్‌ కా జాదూ’ (1934) చిత్రం ద్వారా, సంగీత దర్శకుడు అనిల్‌ బిస్వాస్‌ను ‘మహాగీత్‌’ (1937) ద్వారా, గాయకుడు ముఖేష్‌ని ‘నిర్దోష్‌’ (1941) చిత్రం ద్వారా చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ పరిచయం చేశారు. ఈ సినిమాలను నిర్మించింది చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ కావడం విశేషం. వీరందరిలాగే చిమన్‌ భాయ్‌ నళినీ జయవంత్‌ను కూడా తన నేషనల్‌ స్టూడియో బ్యానర్‌ మీద నిర్మించిన ‘రాధిక’ (1941) చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ చిత్రంలో నళినీతో బాటు కన్హయ్య లాల్‌ చతుర్వేది, హరీష్, జ్యోతి నటించారు. ఒకసారి నూతన్‌ జన్మదిన వేడుకలో చిమన్‌ భాయ్‌ దేశాయ్‌కి శోభనా సమర్థ్‌ నళినీ జయవంత్‌ను పరిచయం చేసింది. అప్పుడు చిమన్‌ భాయ్‌ ‘రాధిక’ చిత్రాన్ని నిర్మించే పనిలో వున్నారు. నళినీ జయవంత్‌కు అప్పుడు కేవలం పద్నాగేళ్లే. ఆమెను హీరోయిన్‌గా ‘రాధిక’లో నటింపజేస్తానని అక్కడ చిమన్‌ భాయ్‌ ప్రకటించగానే నళిని తండ్రి వారించారు. అయితే చిమన్‌ భాయ్‌ నళినీ తండ్రికి నచ్చజెప్పి ఆయనను ఒప్పించారు. ‘రాధిక’ చిత్రానికి చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ తనయుడు వీరేంద్ర దేశాయ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా నటించిన హరీష్‌ తరవాతి కాలంలో ‘కాలీ టోపీ లాల్‌ రుమాల్‌’, ‘దో ఉస్తాద్‌’, ‘నకిలీ నవాబ్‌’, ‘బర్మా రోడ్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాధిక’ చిత్రంలో నళినీ జయవంత్‌ మూడు సోలో పాటలు పాడటమే కాకుండా హరీష్, నూర్జహాన్, మారుతీరావు లతో కలిసి నాలుగు యుగళగీతాలను ఆలపించింది. ఈ సినిమా తరవాత నేషనల్‌ స్టూడియో బ్యానర్‌ మీదే నిర్మించిన ్డబహెన్‌’, ‘నిర్దోష్‌’ చిత్రాలలో ఆమె హీరోయిన్‌గా నటించింది.

నేషనల్‌ స్టూడియో హీరోయిన్‌గా...

చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ 1941లోనే నేషనల్‌ స్టూడియో బ్యానర్‌ మీద ‘బహెన్‌’ (సిస్టర్‌) అనే చిత్రాన్ని మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వంలో నిర్మించారు. అంతకు ముందు చిమన్‌ భాయ్‌ నిర్వహిస్తూ వచ్చిన సాగర్‌ మూవిటోన్‌ సంస్థను రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మూసివేసి తదనంతరం నేషనల్‌ స్టూడియోను చిమన్‌ భాయ్‌ ప్రారంభించారు. ‘బహెన్‌’ చిత్రంలో షేక్‌ ముఖ్తర్, హరీష్, కన్హయ్య లాల్‌ ముఖ్య పాత్రలు పోషించగా నళినీ జయవంత్‌ షేక్‌ ముఖ్తర్‌ చెల్లెలు ‘బీనా’ పాత్రను పోషించింది. మీనాకుమారి ఇందులో చిన్ననాటి ‘బీనా’ పాత్ర పోషించడం విశేషం. 1941లోనే నేషనల్‌ స్టూడియో వారు ‘నిర్దోష్‌’ అనే చిత్రాన్ని వీరేంద్ర దేశాయ్‌ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో గాయకుడు ముఖేష్‌ హీరోగా నళినీ జయవంత్‌ సరసన నటించడం విశేషం. ఇతర పాత్రల్లో కన్హయ్య లాల్, సతీష్, గుల్జార్‌ మారుతిరావు నటించారు. అశోక్‌ ఘోష్‌ సంగీత దర్శకత్వం వహించారు. తరువాత అమర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద నిర్మించిన ‘ఆంఖ్‌ మిచౌలి’ (1942), ‘ఆదాబ్‌ అర్జ్‌’ (1943) చిత్రాలలో నళినీ జయవంత్‌ నటించింది. ‘ఆంఖ్‌ మిచౌలి’ చిత్రానికి ఆర్‌.ఎస్‌.చౌదరి దర్శకత్వం వహించగా సతీష్, సులోచన, ప్రతిమాదేవి, ఆనంద్‌ ప్రసాద్‌ కపూర్‌ నటించారు. ఇందులో నళినీ జయవంత్‌ మూడు సోలో పాటలు ఒక యుగళ గీతాన్ని ఆలపించింది. ‘ఆదాబ్‌ అర్జ్‌’ చిత్రానికి వీరేంద్ర దేశాయ్‌ దర్శకుడు. నళినీ జయవంత్‌ సరసన ఇందులో ముఖేష్‌ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలలో నళిని తన పాటలు తనే పాడుకుంది.

వీరేంద్ర దేశాయ్‌తో వివాహం...

చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ కుమారుడు, దర్శకుడు వీరేంద్ర దేశాయ్‌ 1945లో నళినీ జయవంత్‌ను పెళ్లి చేసుకున్నారు. అతను అప్పటికే వివాహితుడు, పిల్లలు కూడా వున్నారు. వీరేంద్ర దేశాయ్‌ నళినీ జయవంత్‌ను వివాహమాడడం వారి కుటుంబానికి నచ్చలేదు. తండ్రి చిమన్‌ భాయ్‌ దేశాయ్‌ వీరేంద్రను తన వ్యాపార కార్యకలాపాలనుంచి తప్పించారు. దానితో నేషనల్‌ స్టూడియో, అమర్‌ పిక్చర్స్‌ సంస్థలతో నళినీ జయవంత్‌కు కూడా సంబంధాలు తెగిపోయాయి. తరువాత వీరేంద్ర దేశాయ్, నళినీ జయవంత్‌లు ఫిల్మిస్తాన్‌ కంపెనీకి మారాల్సి వచ్చింది. ఆ స్టూడియోకి దగ్గరలోవున్న తూర్పు మలాడ్‌ వద్ద వారు కొత్త సంసారాన్ని సాగించారు. అయితే ఫిల్మిస్తాన్‌లో నళినీకి నటించే అవకాశాన్నిగాని, వీరేంద్ర దేశాయ్‌కి దర్శకత్వం వహించే అవకాశాన్ని గాని ఆ సంస్థ యాజమాన్యం కల్పించలేదు. కేవలం రెండువేల రూపాయల పారితోషికాన్ని మాత్రం ప్రతినెలా ఇú ్తుండేవారు. వీరేంద్ర దేశాయ్‌ దర్శకత్వం వహించే సినిమాలలోనే నళినీ నటిస్తుందనే షరతును వీరేంద్ర దేశాయ్‌ విధించడం దీనికి కారణమని చెప్పవచ్చు. ఫిల్మిస్తాన్‌ అధినేత శశిధర్‌ ముఖర్జీ అలా రెండేళ్లు నళినీకి సినిమాలలో నటించే అవకాశం లేకుండా చేశారు. అప్పట్లో నసీమ్‌ ఫిల్మిస్తాన్‌ సంస్థ నిర్మించే సినిమాలలో హీరోయిన్‌ గా నటిస్తూ వ ±ండేది. రెండేళ్ళు నళినీ జయవంత్‌ సినిమాలలో కనిపించకపోయేసరికి ప్రేక్షకులు ఆమెను దాదాపు మరచిపోయారు. ఈ పరిస్థితులలో నళినీ జయవంత్‌ వీరేంద్ర దేశాయ్‌ తో వారి మూడేళ్ళ వైవాహిక బంధానికి 1948లో స్వస్తి చెప్పింది. ఈ మధ్యకాలంలో నళిని నటించిన ఒకే ఒక చిత్రం వీనస్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘ఫిర్‌ భి అపనా హై’. అది కూడా చాలాకాలంగా నిర్మాణంలో ఉండడంతో సాధ్యమైంది. ఇందులో నళినీ జయవంత్‌ సరసన కరణ్‌ దివాన్‌ నటించగా ఇతర పాత్రలను జగదీశ్‌ సేథి, సరోజ్‌ బోర్కర్, కుసుమ్‌ దేశ్‌ పాండే పోషించారు. వీరేంద్ర దేశాయ్‌తో బాటు ఫిల్మిస్తాన్‌ సంస్థతో సంబంధాలు తెంచుకొని వీరేంద్రతో విడాకులు తీసుకున్న తరువాత నళినీ జయవంత్‌కు సినిమా అవకాశాలు మెల్లిగా పుంజుకున్నాయి. వీరేంద్ర దేశాయ్‌ దర్శకత్వంలో నళిని నటించిన చివరి చిత్రం ‘గుంజన్‌’. ఇందులో నళిని కి జోడీగా త్రిలోక్‌ కపూర్‌ నటించాడు. ఈ చిత్రాన్ని నళిని ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నిర్మించారు.

టాప్‌ హీరోలతో...

అంబికా ఫిలిమ్స్‌ నిర్మాత సీతారాం ముంగ్రే 1948లో ధరంసే దర్శకత్వంలో ‘అనోఖా ప్యార్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో దిలీప్‌ కుమార్‌ హీరోగా నటించగా అతనికి జోడీగా నళినీ జయవంత్‌ నటించింది. ఈ ముక్కోణపు ప్రేమకథ దిలీప్‌ కుమార్, నళినీ, నర్గీస్‌ల మధ్య సాగుతుంది. నళినీ సినిమా చివర్లో చనిపోతుంది. సినిమా మంచి హిట్‌గా నిలిచింది. 1950లో దేవేంద్ర గోయల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆంఖే’ చిత్రంలో భరత్‌ భూషణ్‌కు జంటగా నళినీ జయవంత్‌ నటించింది. సంగీత దర్శకుడు మదన్‌ మోహన్‌ ఈ చిత్రంతోనే చిత్రసీమకు పరిచయమయ్యారు. పాల్‌ జిల్స్‌ దర్శకత్వంలో ‘హిందూస్తాన్‌ హమారా’ అనే చిత్రం 1950లో వచ్చింది. అందులో పృధ్విరాజ్‌ కపూర్, దేవానంద్, నళినీ జయవంత్‌ నటించారు. అరవింద్‌ సేన్‌ దర్శకత్వంలో అదే సంవత్సరం ‘ముఖద్దర్‌’ అనే చిత్రం వచ్చింది. అందులో కిషోర్‌ కుమార్‌తో నళినీ నటించింది. ఫిల్మిస్తాన్‌ సంస్థ రమేష్‌ సైగల్‌ దర్శకత్వంలో ‘సమాధి’ అనే గూఢచారి చిత్రాన్ని నిర్మిస్తే అందులో అశోక్‌ కుమార్, కులదీప్‌ కౌర్, శ్యామ్‌లతోబాటు నళినీ జయవంత్‌ నటించింది. ఈ చిత్రం ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లను రాబట్టింది. అదే సంవత్సరం బాంబే టాకీస్‌ వారు నిర్మించిన ‘సంగ్రామ్’ చిత్రంలో నళిని నటించగా, అదికూడా మంచి హిట్టయింది. 1950-60 సంవత్సరాల మధ్య నళిని 41 సినిమాలలో నటించింది. వాటిలో ‘భాయి కా ప్యార్‌’, ‘ఏక్‌ నజర్‌’, ‘జాదూ’, ‘నంద కిషోర్‌’, ‘నౌజవాన్‌’, ‘జల్పరి, నౌబహార్‌’, ‘సలోని’, ‘రాహి’, ‘శక్తి’, ‘బాప్‌ బేటి’, ‘లగాన్‌’, ‘నాస్తిక్‌’, ‘మునీంజీ’, ‘ఆవాజ్‌’, ‘దుర్గేశ్‌ నందిని’, ‘హమ్‌ సబ్‌ చోర్‌ హై’, ‘కాలాపానీ’, ‘మిలû’Â, ‘ముక్తి2, ‘నాజ్‌’ వంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ‘నాజ్‌’ చిత్రాన్ని కైరో, లండన్‌ నగరాల్లో నిర్మించారు. ఇతరదేశాలలో షూటింగు జరుపుకున్న మొదటి సినిమా ‘నాజ్‌’. దేవానంద్‌ హీరోగా నళినీ జయవంత్‌ హీరోయిన్‌గా నటించిన మరొక చిత్రం ‘మునీంజీ’. శశిధర్‌ ముఖర్జీ ఈ చిత్రాన్ని సుబోద్‌ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మించారు. ఎస్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్టయింది. 1960 దశకంలో ‘అమర్‌ రహే ఏ ప్యార్‌’, ‘సేనాపతి’, ‘గరల్స్‌ హాస్టల్‌’, ‘జిందగీ అవుర్‌ హమ్‌’ చిత్రాలలో నళినీ జయవంత్‌ నటించింది. ‘మునీంజీ’ చిత్రంలో నటించేటప్పుడు ప్రభుదయాల్‌తో ప్రేమలోపడి నళినీ జయవంత్‌ అతణ్ణి పెళ్లాడింది. నళినీ నటించిన చివరి సినిమా ‘బాంబే రేస్‌ కోర్స్‌’ (1965). అయితే సుమారు 18 సంవత్సరాల విరామం తరువాత నళినీ 1983లో ‘నాస్తిక్‌’ సినిమాలో అమితాబ్‌ బచన్‌కు తల్లిగా ఆమె నటించింది. తరవాత మరే సినిమాలోను ఆమె నటించలేదు.


25 సంవత్సరాల నట జీవితంలో నళినీ జయవంత్‌ 60 సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అశోక్‌ కుమార్, అజిత్‌ల సరసన నళిని 10 సినిమాలలో జంటగా నటించింది. మొత్తం మీద నలభైకి పైగా పాటలు పాడింది. 1959లో ‘కాలాపానీ’ చిత్రంలో నటనకు ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్‌ బహుమతి అందుకుంది. 1950లో ఫిలింఫేర్‌ సంస్థ నిర్వహించిన పోలింగ్‌లో నళినీ జయవంత్‌ను అత్యంత అందమైన నటిగా ప్రేక్షకులు ఎంపిక చేశారు. 2005లో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అకాడమీ’ వారు ఆమెకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రభుదయాల్‌ 2001లో మరణించాక నళినీ జయవంత్‌ చెంబూర్‌ శివార్లలోని యూనియన్‌ పార్క్‌ వద్దగల పెద్ద బంగళాలో ఒంటరిగానే జీవించింది. 85 ఏళ్ల వయసులో 20 డిసెంబర్‌ 2010న ముంబైలో నళినీ జయవంత్‌ గుండెపోటుతో మరణించింది.

- ఆచారం షణ్ముఖాచారి Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.