వెండితెర చందమామ... అందచందాల నందా!

బొంబాయి ప్లాజా సినిమా థియేటర్‌ మీదుగా బాలీవుడ్‌ నటి వహీదా రెహమాన్‌ తరచూ వెళ్తూ వుండేది. ఆ సినిమా హాలు మీద ‘షేవ్‌ గ్యాచే షేంఘా’ అనే మరాఠీ సినిమా పోస్టర్‌ దర్శనమిస్తూ వుండేది. ఆ పోస్టర్‌ మీద బేబీ ఫేసులో వున్న ఓ అందమైన అమ్మాయి నవ్వు ముఖం వహీదా రెహమాన్‌ను తలతిప్పుకోనీయకుండా చేసేది. ఒకసారి గురుదత్‌కు చెందిన లోనావాల ఫారమ్‌ హౌస్‌లో పిక్నిక్‌ ఏర్పాటైతే అక్కడ ఆ పోస్టర్లోని అమ్మాయిని చూసి గుర్తుపట్టి దగ్గరకెళ్లి ముద్దు పెట్టుకుంది. ఆ చిరునవ్వుల చిన్నారే హిందీ చిత్రరంగంలో విశేషంగా రాణించి, ఒక వెలుగు వెలిగి మబ్బుల్లోకి మాయమైన ‘నందా’. తరువాత ఇద్దరూ సెంట్రల్‌ స్టూడియో సెట్స్‌ మీద కలుసుకున్నారు. వహీదా రెహమాన్‌ ‘కాగజ్‌ కే ఫూల్‌’ షూటింగులో వుండగా ఈ అమ్మాయి ‘నయా సంసార్‌’ సినిమా షూటింగులో మరొక ఫ్లోర్‌లో వుంది. విరామ సమయంలో వహీదా ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టి స్నేహహస్తం చాచింది. ఆ స్నేహం నందా చివరి క్షణాల వరకూ కొనసాగింది. అంతేకాదు 1960లో దేవానంద్‌ నిర్మించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ‘కాలా బజార్‌’లో వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గా నటించగా హీరో దేవానంద్‌ చెల్లెలుగా నందా నటించింది. ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారామ్‌ నందాకు మేనమామ. మార్చి 25న వర్థంతి. ఈ సందర్భంగా ఆమెను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...


బాల నటిగా...

నందా బొంబాయిలో 1941 జనవరి 8న పుట్టింది. తండ్రి మాస్టర్‌ వినాయక్‌ సినిమా నటుడు. తల్లి సుశీల. ఏడుగురు సంతానంలో నందా మూడవది. నందా బాల్యంలో బొద్దుగా, అందంగా వుండేది. ఆమెకు ఏడేళ్ల వయసులో తండ్రి ప్రోద్బలంతో ‘మందిర్‌’ (1948) అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఆ చిత్రానికి నందా తండ్రే దర్శకుడు. అయితే ఈ చిత్ర నిర్మాణ దశలోనే నందా తండ్రి హఠాన్మరణం పాలయ్యాడు. అసంపూర్తిగా వున్న ఆ చిత్రాన్ని దినకర్‌ పాటిల్‌ పూర్తిచేశాడు. ఈ చిత్రంలో నందా తండ్రి మాస్టర్‌ వినాయక్‌ తోబాటు సాదు మోదక్, శాంతా ఆప్టే, గాయని లతా మంగేష్కర్‌ నటించారు. తండ్రి మరణంతో నందా కుటుంబం అస్తవ్యస్తమైంది. పిల్లలంతా చిన్నవాళ్లు కావడంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉండేందుకు నందా సినిమాల్లో నటించేందుకు ఉద్యుక్తురాలయింది. తరవాత జగదీశ్‌ సేథి దర్శకత్వం వహించిన ‘జగ్గు’ (1952) సినిమాలో నందా నటించింది. అప్పుడు ఆమెకు పదకొండేళ్లు మాత్రమే.


చెల్లెలి పాత్రల్లో రాణించి...
 

ఆమెకు పద్నాలుగేళ్లు వుండగా ప్రఖ్యాత దర్శక నిర్మాత వి.శాంతారాం నందాను సినిమాల్లోకి ప్రవేశపెట్టాలని తోచింది. ఒక వివాహ కార్యక్రమానికి హాజరౌతూ, నందాను చీర కట్టుకొని రమ్మని చెప్పారు శాంతారాం. హీరోయిన్‌ పాత్రలకు సరిపడే ప్రాయం వచ్చిందని సంతృప్తి చెంది ఆమెను ‘తూఫాన్‌ అవుర్‌ దీయా’ (1956) సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో ప్రవేశపెట్టారు. ఆమెకు జంటగా రాజేంద్రకుమార్‌ నటించారు. ఈ సినిమా బాగా ఆడడంతో నందాకు చెల్లెలి పాత్రలు రావడం మొదలైంది. 1957లో ఎ.వి.ఎం సంస్థ కృష్ణన్‌-పంజు దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన ‘కులదైవం’ చిత్రాన్ని ‘భాభి’ (1957) పేరుతో పునర్నిర్మించి నప్పుడు అందులో బల్రాజ్‌ సాహ్ని చెల్లెలుగా బాల్యవితంతువు పాత్రను నందా పోషించింది. ఆ పాత్ర పోషణకు నందా పేరు తొలిసారి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్‌ బహుమతి కోసం పరిశీలనలోనికి వచ్చింది. తరువాత 1959లో ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం మీద ఎల్‌.వి.ప్రసాద్‌ తమిళంలో హిట్టయిన ‘ఎన్‌ తంగై’ ని ‘చోటి బహెన్‌’ (తెలుగులో ఆడపడుచు) పేరుతో పునర్నిర్మించితే అందులో కూడా నందా బల్రాజ్‌ సాహ్ని చెల్లెలి పాత్ర పోషించింది. ఆ సినిమా సూపర్‌ హిట్టయింది. వరసగా చెల్లెలి పాత్రలు వస్తుండడంతో మొదట ‘చోటి బహెన్‌’లో కూడా నటించనని చెబితే, ప్రసాద్‌ పట్టుబట్టి ఆమెచేత చెల్లెలి పాత్రను పోషింపజేశారు. అయితే నందాకు చెల్లెలి పాత్రల పోషణ తప్పలేదు. 1960లో వసంత్‌ జోగ్లేకర్‌ ‘ఆంచల్‌’ అనే సినిమాను నిర్మిస్తూ అందులో నందాకు చెల్లెలి పాత్రను ఇచ్చారు. అశోక్‌ కుమార్, నిరూపరాయ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో నటనకు నందా ఉత్తమ సహాయ నటిగా తొలి ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకుంది. 1960లో దేవానంద్‌ తన సొంత బ్యానర్‌ నవకేతన్‌ ఫిలిమ్స్‌ పతాకం మీద ‘కాలాబజార్‌’ చిత్రాన్ని నిర్మించాడు. తమ్ముడు విజయానంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కూడా నందా దేవానంద్‌కు చెల్లెలుగా నటించాల్సి వచ్చింది. అందులో హీరోయిన్‌గా నటించిన వహీదా రెహమాన్‌ నందాకు ప్రాణ స్నేహితురాలైంది. వారి మైత్రీబంధం 55 ఏళ్లపాటు కొనసాగిందంటే విశేషమే. ఈ చిత్రంలో నటించేటప్పుడే నందా దేవానంద్‌తో అటువంటి గ్లామర్‌లేని పాత్రలు పోషించడం ఇష్టం లేదని చెప్పింది. అయితే దేవానంద్‌ ఆమెకు సర్దిచెబుతూ, తరువాతి సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కలిపిస్తానని సమాధానపరచాడు. 


‘హమ్‌ దోనో’తో హీరోయిన్‌గా...

1961లో విజయానంద్‌ దర్శకత్వంలో దేవానంద్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘హమ్‌ దోనో’ (1961) నిర్మించాడు. అందులో దేవానంద్‌ మేజర్‌ మనోహర్‌ లాల్‌ వర్మగా, కెప్టన్‌ ఆనంద్‌గా రెండు పాత్రలు పోషించాడు. ఇందులో హీరోయిన్లుగా మీనాకుమారి, సాధనాను తీసుకుందామని విజయానంద్‌ ప్రతిపాదించాడు. కానీ మాట ఇచ్చిన ప్రకారం ‘రుమా’ పాత్రకు నందాని తీసుకుందామని, మీనాకుమారి కంటే ఆ పాత్రకు నందా సరిగ్గా నప్పుతుందని దేవానంద్‌ నందాను ఎంపిక చేశాడు. అందులో ఒక విషాద సన్నివేశంలో నందా గ్లిజరిన్‌ లేకుండానే నటించి రక్తికట్టించింది. షాట్‌ కట్‌ చెప్పిన తరువాత ఆ మూడ్‌ నుంచి బయటకు రాలేక పది నిమిషాలపాటు ఆమె ఏడుస్తూనే వుంది. పాత్రలో లీనమై నటించే ప్రతిభగల నటిగా గుర్తించిన దేవానంద్‌ దర్శక నిర్మాత అమర్జీత్‌ నిర్మించిన ‘తీన్‌ దేవియా’ (1965) సినిమాలో ప్రధమ హీరోయిన్‌గా, తరువాతి హీరోయిన్లుగా కల్పనా, సిమి గారేవాల్‌ను నటింపజేశాడు. ప్రఖ్యాత ప్రయోక్త అమీన్‌ సాయాని ముందుమాటతో సాగే ఈ చిత్రంలో నందా, దేవానంద్‌ మీద చిత్రీకరించిన ‘లిఖాహై తేరీ ఆంఖోం మే కిసికా అఫ్సానా’ పాట సూపర్‌ హిట్టయింది. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ మ్యూజికల్‌ హిట్‌గా ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తరువాత నందా హీరోయిన్‌గా వెనక్కి చూసుకోలేదు. కృష్ణ చోప్రా నిర్మించిన ‘చార్‌ దివారి’ (1961) సినిమాలో నందా శశికపూర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటికి శశికపూర్‌ సినిమాల్లో నటించడం క్రొత్త. ఈ సినిమా ఫ్లాపైంది. కానీ నందా శశికపూర్‌ని నిరాశ పరచలేదు. మరుసటి సంవత్సరం సూరజ్‌ ప్రకాష్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘మెహంది లాగి మేరె హాత్‌’ అనే చిత్రంలో శశికపూర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. తరువాత శశికపూర్‌తో నందా మరో ఐదు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి హిట్‌ చేసింది.


శశికపూర్‌తో ...

శశికపూర్‌తో నటించిన వాటిలో సూరజ్‌ ప్రకాష్‌ 1965లో నిర్మించిన ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’ గురించి చెప్పుకోవాలి. శశికపూర్‌ కాశ్మీరు దాల్‌ సరస్సులో పడవ నడిపే సరంగుగా, నందా కాశ్మీరు అందాలు చూసేందుకు వచ్చే శ్రీమంతురాలైన టూరిస్టుగా ఇందులో పాత్రలు పోషించారు. ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఆ సంవత్సరం విడుదలైన సినిమాల కలక్షన్లను అధిగమించి ప్రధమ స్థానంలో నిలిచింది. యాభై వారాలు ఆడి గోల్డన్‌ జుబిలీ జరుపుకుంది. కళ్యాన్‌ జి ఆనంద్‌ జి సమకూర్చిన సంగీతం మొరాకో, లిబియా, అల్జీరియా వంటి ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రజలను ఉర్రూతలూగించింది. ప్రముఖ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌ ఈ సినిమాకు సహాయకులుగా పనిచేయడం విశేషం. నందా, శశికపూర్‌ మీద చిత్రీకరించిన ‘ఏక్‌ థా గుల్‌ అవుర్‌ ఏక్‌ థి బుల్బుల్‌’, నందా మీద చిత్రీకరించిన ‘పరదేశియోం సే నా ఆంఖియా మిలానా’, ‘ఏ సమా సమా హై ప్యార్‌ కా’ పాటలు జనరంజకాలయ్యాయి. శశికపూర్‌ నందాగురించి మాట్లాడుతూ ‘ఆమె పెద్ద స్టార్‌ హోదాలో వున్నప్పుడు నేను వెండితెర ప్రవేశం చేసిన ‘మెహంది లాగి మేరె హాత్‌’ సినిమాలో నా సరసన నటించింది. ఆమె నా అభిమాన నటి. ఆమెతో నటించిన నా సినిమాలన్నీ మంచి హిట్లయ్యాయి’ అని చెప్పారు. ఈ సినిమా శశికపూర్‌ తొలి కలర్‌ హిట్‌ సినిమాగా మెప్పు పొందింది. పడవ నడిపేవానిగా నటించేందుకు శశికపూర్‌ స్వయంగా ఆ సరంగుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా షూటింగులో వుండగా ఒక లెఫ్టినెంట్‌ కల్నల్‌ నందా అందాన్ని చూసి ఆమెను పెళ్లాడతానని ప్రతిపాదించాడు. నందా ఒప్పుకోలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌ లో శశికపూర్‌ నందాను పరుగెత్తే రైలులోకి లాక్కోవాలి. ఈ సన్నివేశ చిత్రీకరణలో నందాను రైలులోకి లాగే సమయానికి ఆ రైలు ప్లాట్‌ ఫారం దాటి పోయింది. త్రుటిలో నందా ప్రమాదం నుంచి బయటపడింది. 1965లోనే నందా శశికపూర్‌తో ‘మోహబ్బత్‌ ఇస్‌ కో కెహతే హై’ సినిమాలో నటించింది. అఖ్తర్‌ మీర్జా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత 1966లో శివసాహ్ని దర్శకత్వంలో ‘నీంద్‌ హమారీ క్వాబ్‌ తుమ్హారే’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. సినిమా హిట్టయింది. 1968లో సూరజ్‌ ప్రకాష్‌ నిర్మించిన ‘జువారి’, 1969లో సూరజ్‌ ప్రకాషే నిర్మించిన ‘రాజా సాబ్‌’ సినిమాల్లో ఇద్దరూ జంటగా నటించి రెండు సినిమాలనూ విజయవంతం చేశారు. 1970లో ఇద్దరూ సుందర్డర్‌ దర్శకత్వంలో ‘రూఠా నా కరో’ సినిమాలో జంటగా నటించి మెప్పించారు.


చిత్ర విజయాలు...

1965 లో రాజా నవాథే నిర్మించిన సస్పెన్స్‌ త్రిల్లర్‌ చిత్రం ‘గుమ్‌ నామ్’లో నందా మనోజ్‌ కుమార్‌ సరసన నటించింది. ఆంగ్లనవలా రచయిత్రి ఆగతా క్రిస్టీ కథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం సూపర్‌ హిట్టయింది. ఇందులో లక్ష్మిఛాయా నర్తించిన మహమ్మద్‌ రఫీ పాట ‘జాన్‌ పెహచాన్‌ హో’ నేటికీ మారుమోగుతూనే వుంటుంది. అలాగే నందా మీద చిత్రీకరించిన ‘గుమ్‌ నామ్‌ హై కోయీ’, ‘జానే చమన్‌ షోలా బదన్‌’ పాటలు కూడా పలువురు గాయనీమణుల గళంలో ఇప్పటికే నిత్యనూతనంగా వినపడుతూనే వుంటాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా మూడు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి చరిత్ర పుటలకెక్కింది. 1969లో నరేంద్ర సూరి నిర్మించినన్‌ ‘బడీ దీది’ సినిమాలో జితేంద్ర సరసన నందా నటించింది. ఈ సినిమా కూడా విజయవంత మైనదే. బి.ఆర్‌.చోప్రా నిర్మించిన మరొక చిత్రం ‘ఇత్తేఫాఖ్‌’. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో నందా రాజేష్‌ ఖన్నాకు జంటగా నటించింది. ఈ సినిమాలో పాటలు లేకుండటం ప్రత్యేకత. అంతకు ముందు బి.ఆర్‌.చోప్రా నిర్మించిన ‘కానూన్‌’ సినిమాలో కూడా పాటలు లేవు. అందులో కూడా హీరోయిన్‌ నందా కావడం యాదృచ్చికం. ఈ సినిమాలో రాజేంద్రకుమార్‌ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ బహుమతితో బాటు బి.ఆర్‌.చోప్రాకు ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1970లో రవికాంత్‌ నగాయిచ్‌ దర్శకత్వంలో రాజేష్‌ ఖన్నా సరసన నందా ‘ది ట్రెయిన్‌’ (తెలుగులో సర్కార్‌ ఎక్స్‌ ప్రెస్‌) చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్‌. రాజేష్‌ ఖన్నా నటించిన 17 వరుస హిట్‌ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇందులో నందా, రాజేష్‌ ఖన్నా మీద చిత్రీకరించిన ‘గులాబి ఆంఖే జో తేరీ దేఖీ’ అద్భుత హిట్‌ పాట. అలాగే నందా మీద చిత్రీకరించిన ‘కిస్‌ లియే మైనే ప్యార్‌ కియా’ పాటకూడా హిట్టే. నందా- రాజేష్‌ ఖన్నా నటించిన మూడవ హిట్‌ చిత్రం 1972లో వచ్చిన ‘జోరూ కా గులామ్’. ఈ సినిమాకు ఎ.బీమసింగ్‌ దర్శకుడు. మనోజ్‌ కుమార్‌ సొంత చిత్రం ‘షోర్‌’ (1972)లో నందా మనోజ్‌ కుమార్‌ భార్యగా నటించింది. అయితే ఆమె ధరించిన పాత్ర ఒక ప్రమాదంలో మరణిస్తుంది. తరువాత జయభాధురి మనోజ్‌ కుమార్‌కు దగ్గరవుతుంది. ఇందులో మనోజ్‌ కుమార్‌-నందా మీద చిత్రీకరించిన ‘ఏక్‌ ప్యార్‌ కా నగుమా హై, మౌజోం కి రవానీ హై, జిందగీ అవుర్‌ కుచ్‌ భి నహీ తేరి మేరి కహానీ హై’ పాట సూపర్‌ హిట్టయింది. తరువాత నందా ‘నయా నషా’ (1974) చిత్రంలో మత్తుమందుకు బానిసైన పాత్రలో నందా నటించింది. ఈ సినిమా తరువాత ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. 1982లో మళ్లీ తెరమీదకు వచ్చి ‘ఆహిస్తా ఆహిస్తా’, ప్రేమ్‌ రోగ్‌’ చిత్రాల్లో నటించింది. చివరిసారిగా నందా 1983లో బి.ఆర్‌.చోప్రా నిర్మించిన ‘మజదూర్‌’ సినిమాలో దిలీప్‌ కుమార్‌తో నటించింది. ఈ మూడు చిత్రాల్లో నందా పద్మిని కొల్హాపురికి తల్లిగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి.

వివాహ విషాదం ... వ్యక్తిగతం...

నందాకు బిడియం ఎక్కువ. యాభై ఏళ్ల వరకు నందా పెళ్లి వూసెత్తలేదు. చివరికి 1992లో నడిమి వయసులో పెళ్లికి సిద్ధపడింది. సినిమా నిర్మాత, దర్శకుడు మన్మోహన్‌ దేశాయిని పెళ్లాడేందుకు సిద్ధపడి నిశ్చితార్ధం జరుపుకుంది. దురదృష్టవశాత్తు పెళ్లికి ముందు మన్మోహన్‌ దేశాయి ఒక ప్రమాదంలో ఇరుక్కొని పెద్ద మేడ మీద నుంచి పడిపోయి మరణించాడు. తరువాత నందా తల్లి, సోదరుడు కూడా మరణించడం నందాను కృంగ దీసింది. ఒంటరి జీవితం ఆమెకు దుర్బరమైంది. అప్పటికీ వహీదా రెహమాన్, సాధనా, ఆశా పరేఖ్, హెలెన్, సైరాబానులతో ఎక్కువగా కాలక్షేపం చేసేది. 2014 మార్చి 25న ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆ తీవ్రత నందా ప్రాణాలను తీసింది. నటి జయశ్రీ, టి.నందాకు వదిన. నిర్మాత సి.వి.కే.శాస్త్రి నందా సోదరి మీనాను వివాహమాడారు. విషాదపాత్రలకు మీనాకుమారి తరువాత నందా పెట్టింది పేరు.

- ఆచారం షణ్ముఖాచారి  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.