మూవీల్యాండ్ మదర్’ నర్గిస్
మదర్ ఇండియా సినిమా పేరు వింటే నర్గిస్ పేరు గుర్తురాక మానదు. ప్రముఖ సినిమా పత్రిక ఫిలిం ఇండియా సంపాదకుడు బాబురావు పటేల్ ఎవరినైనా పొగిడారంటే అది నర్గిస్ ని మాత్రమే. ఎందుకంటే బాబురావు పటేల్ తన కలం బలంతో హిందీ చిత్రాల విజయాలను శాసించారు. 1957లో ఆమె నటించిన మదర్ ఇండియా సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం వెనుక నర్గీస్ అద్భుత నటన వుందనేది నిర్వివాదాంశం. మదర్ ఇండియా షూటింగులో అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంలో సునీల్ దత్ తెగించి మంటల్లో దూకి ఆమెను రక్షించడం నర్గీస్ ను కలచివేసింది. తనకన్నా వయసులో పినవాడైన సునీల్ దత్ ను వివాహమాడింది. అప్పట్లో మదర్ ఇండియా సినిమా సూపర్ హిట్ గా ఆడుతుండేది. అటువంటి స్టార్డంను విడిచి గృహిణిగా స్థిరపడేందుకే నర్గీస్ మొగ్గు చూపింది. ఇది ఆమె వ్యక్తిత్వానికి గీటురాయి. 1940-60 దశకాల మధ్య కాలంలో నర్గీస్ ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు చూరగొంది. భారత రాజ్యసభ సభ్యురాలిగా, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, తొలి ఫిలింఫేర్ బహుమతి అందుకున్న నటిగా నర్గీస్ నటప్రస్థానం అద్వితీయం. జూన్ 1 న నర్గీస్ 90వ జయంతి సందర్భంగా ఆమెను గురించి కొన్ని విశేషాలు.

పుట్టుపూర్వోత్తరాలు...
నర్గీస్ పుట్టింది కలకత్తా నగరంలో జూన్ నెల 1, 1929న. ఆమె అసలుపేరు ఫాతిమా రషీద్. ఆమె తండ్రి మోహనచంద్ ఉత్తమచంద్ మొహియాల్ బ్రాహ్మణ సంతతికి చెందినవారు. ఆయన రావల్పిండి లోవుండేవారు. ఆయన్ని మోహన్ బాబు అని పిలిచేవారు. తరవాత ఆయన ఇస్లాం మతబోధనలకు దగ్గరై ఇస్లాం మతం పుచ్చుకున్నారు. దాంతో ఆయన పేరు అబ్దుల్ రషీద్ గా మార్చుకున్నారు. రావల్పిండి నుంచి నర్గీస్ కుటుంబం అల్లహాబాద్ కు మకాం మారింది. నర్గీస్ తల్లి జద్దన్ బాయి హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో నిష్ణాతురాలు. టాకీలు వచ్చిన కొత్తల్లో ఆమె అనేక సినిమాలకు పాటలు పాడారు, నటించారు కూడా. చిన్నతనంలో నర్గీస్ క్రికెట్, ఫుట్ బాల్ వంటి క్రీడల్లో తన సోదరులతో కలిసి పాల్గొనేది. ఈత అంటే నర్గీస్ కు ప్రాణం. తన తల్లి నటిస్తూ సంగీతం సమకూర్చిన చిమన్లాల్ లూహర్ నిర్మించిన ‘తలాషే హఖ్’ (1935) అనే చిత్రంలో బేబీ రాణి పాత్రలో బాలనటిగా నర్గీస్ కనిపించింది. అప్పుడు నర్గీస్ పేరు ఫాతిమా... వయసు కేవలం ఆరేళ్ళు మాత్రమే.

మెహబూబ్ ఖాన్ చిత్రంతో హీరోయిన్ గా...
1943లో మెహబూబ్ ఖాన్ సొంత చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘తఖ్దీర్’ అనే ఒక కామెడీ చిత్రం నిర్మిస్తూ నర్గీస్ ను హీరోయిన్ గా నియమించి వెండితెరకు పరిచయం చేశారు. ఈ చిత్రంలోనే ఫాతిమా పేరును ‘నర్గీస్’ గా మెహబూబ్ ఖాన్ మార్చారు. నర్గీస్ అంటే గులాబి/డాఫోడిల్ పుష్పం లాంటి సువాసనగలడి అని అర్ధం. ఈ చిత్రంలో నర్గీస్ నటించేనాటికి ఆమెకు కేవల పద్నాలుగు ఏళ్ళు మాత్రమే. అయితే అందులో హీరోగా నటించిన మోతిలాల్ కు ఏకంగా 33 ఏళ్ళు. అదులో నర్గీస్ మీద చిత్రీకరించిన పాటలన్నీ శంషాద్ బేగమ్ చేత పాడించారు. గులామ్ మొహమ్మద్ రాసిన కథకు రఫీఖ్ ఘజ్నవి సంగీతం సమకూర్చారు. ఆ సంవత్సరంలో విడుదలైన సినిమాలు ఆర్జించినమొత్తం రాబడిలో ‘తఖ్దీర్’ సినిమా తొమ్మిదవ స్థానంలో నిలిచి నర్గీస్ సినీ ప్రస్థానానికి మంచి బాటలు పరిచింది.


రాజకపూర్ తో ప్రేమాయణం...సునీల్ తో వివాహం...
అవారా, శ్రీ 420, బర్సాత్, జాగ్తే రహో వంటి దాదాపు 16 సినిమాల్లో రాజకపూర్ కు నర్గీస్ హీరోయిన్ గా నటించింది. 1946 లో రాజకపూర్ కు 22 ఏళ్ళ వయసున్నప్పుడు కృష్ణరాజ కపూర్ ను వివాహమాడారు. ఆమెను వివాహమాడే సమయానికే రాజకపూర్ నర్గీస్ తో తలలోతు ప్రేమలో మునిగిపోయి వున్నాడు. ‘అందాజ్’ సినిమా నిర్మాణంలో వుండగా రాజకపూర్ నర్గీస్ ప్రేమలో పడ్డారు. అప్పటికే నర్గీస్ 8 సూపర్ హిట్ సినిమాలతో సూపర్ స్టార్ హోదాలో వుంది. రాజకపూర్ తో రెండవ వివాహానికైనా నర్గీస్ సిద్ధపడింది. ఈ విషయం గురించి ఒకానొక సమయంలో ఆమె న్యాయవాదిని కూడా సంప్రదించింది. అది చట్టబద్ధం కాదు అని ఆ న్యాయవాది తేల్చి చెప్పాడు. దాంతో నర్గీస్ కొంతకాలంపాటు డిప్రెషన్ లోకి జారిపోయింది. వీరి ప్రేమాయణం దాదాపు పదహారేళ్ళు నడిచింది. అప్పుడే మెహబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’ చిత్రాన్నికొల్హాపూర్, సూరత్, నాసిక్ ప్రాంతాల్లో అవుట్ డోర్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పొలంలో అగ్ని ప్రమాద దృశ్యాలు చిత్రీకరిస్తుండగా, పెద్ద గాలి వచ్చి నర్గీస్ ని అగ్ని కీలల్లోకి లాగేసింది. అందులో నర్గీస్ కు కొడుకుగా నటిస్తున్న సునీల్ దత్ మరో ఆలోచన లేకుండా దూకి నిప్పంటుకున్న గడ్డివామునుండి నర్గీస్ ను లాగేసి ఆమెను కాపాడారు. దాంతో ఫిదా అయిన నర్గీస్ వయసులో చిన్నవాడైనా సునీల్ దత్ తో వివాహానికి సిద్ధపడింది. సంవత్సరం తరవాత ఇద్దరూ ఒక ఇంటివారయ్యారు. అయితే తలవని తలంపుగా వచ్చిన ఈ వార్త రాజకపూర్ కు ఆశనిపాతంగా మారింది. చాలాకాలం మనిషి కాలేకపోయాడు.

                           
 
రాజకపూర్ తో హిట్ పెయిర్ గా...
రాజకపూర్ స్వంత బ్యానర్ మీద 1949లో నిర్మించిన ‘బర్సాత్’ సినిమా అతనికి అఖండ విజయాన్ని కట్టబెట్టింది. ఈ సినిమా రాబడితోనే రాజకపూర్ ఆర్.కె స్టూడియో నిర్మించారు. ఈ సినిమా విజయానికి నర్గీస్ పాత్ర ఎంతైనా వుంది. రాజకపూర్ కు నర్గీస్ అంటే ఎంత అభిమానమో! ఆర్.కె స్టూడియో లోగో లో నర్గీస్ మెడచుట్టూ కుడి చేతిని పెనవేసి, ఎడమచేత్తో గిటార్ ను పట్టుకునే చిత్తరువును వాడుకోవడం అతని అభిమానానికి, ప్రేమాతిశాయానికి గుర్తింపుగా భావించాలి. ప్రముఖ మాస్టర్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. పండిట్ ఈ చిత్రానికి రూపురేఖలు దిద్దిన తీరు మరో అద్భుతం!! రామానంద సాగర్ రాసిన కథను రాజకపూర్ సెల్యూలాయిడ్ మీదకు ఎక్కించిన తీరు మహాద్భుతం. శంకర్-జైకిషన్ లకు ఈ చిత్రమే తొలి చిత్రం కావడం, అందులోని పాటలన్నీ జనరంజకం కావడం విశేషం. నర్గీస్, రాజకపూర్ ల మీద చిత్రీకరించిన “చోడ్ గయే బాలమ్ ముఝే హాయ్ అకేలా చోడ్ గయే”, నర్గీస్ మీద చిత్రీకరించిన “అబ్ మేరా కౌన్ సహారా” పాటలు నేటికీ నిత్యనూతనాలే. నిమి కూడా రెండవ హీరోయిన్ గా ఈ చిత్రంలోనే పరిచయమైంది. 1949లో లోనే మెహబూబ్ ఖాన్ నిర్మించిన ‘అందాజ్’ చిత్రం అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డులు అందుకుంది. ఇది కూడా ఒక ముక్కోణపు ప్రేమకథ. ఇందులో దిలీప్ కుమార్, రాజకపూర్ ప్రేమికులు కాగా ఆ ప్రేమికులమధ్య నలిగిపోయిన ప్రేమరాణిగా నర్గీస్ నటించింది. ‘బర్సాత్’ చిత్రం తో పోటీపడి నిలిచి ‘అందాజ్’ చిత్రం వసూళ్లను తిరగరాసింది. ఇందులో లతాజి ఆలపించిన “కోయి మేరె దిల్ మే”, “మేరి లాడ్లీ రే”, ముఖేష్ ఆలపించిన “హమ్ ఆజ్ కహీ దిల్ ఖో బైటే”, “తూ కహా అగర్” పాటలు ఆణిముత్యాలుగా చాలాకాలం నిలిచాయి. 1951 లో రాజకపూర్ నిర్మించిన ‘ఆవారా’ చిత్రంలో నర్గీసే హీరోయిన్. ఇందులో రాజకపూర్ తండ్రి పృద్విరాజ్ కపూర్, తాత దీవాన్ విశ్వనాథ కపూర్, తమ్ముడు శశికపూర్ (బాలుడుగా) నటించడం ఒక ప్రత్యేకత అయితే, ఈ చిత్రం హిందీ చిత్రసీమకే ఒక మైలు రాయిగా నిలవడం మరో రికార్డు. సోవియట్ రష్యా, తూర్పు ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, తూర్పు యూరప్ దేశాల్లో ఈ చిత్రానికి అత్యంత ఆదరణ లభించింది. టైమ్ మ్యాగజిన్ గుర్తించిన 100 అత్యద్భుత సినిమాలలో ఈ సినిమా పేరు కూడా చోటుచేసుకోవడం దాని విశిష్టత. 1955లో వచ్చిన మరో రాజకపూర్ సూపర్ హిట్ చిత్రం ‘శ్రీ 420’ లో నర్గీస్ హీరోయిన్. ఈ చిత్రం 1955లో విడుదలైన అన్ని చిత్రాలకన్నా వసూళ్ళలో తొలి స్థానం ఆక్రమించింది. “మేరా జూతా హై జపానీ” పాటతో ముఖేష్ మంచి గాయకుడుగా స్థిరపడ్డారు. తెలుగు జానపద గీతం నుంచి శంకర్ జైకిషన్ స్పూర్తి పొంది రూపొందించిన “రామయ్యా వస్తావయ్యా “ పాట ఈరోజుకీ ఎక్కడో ఒకదగ్గర వినపడుతూనే వుంటుంది. “ప్యార్ హువా ఇఖరార్ హువా” పాటలో చిన్ననాటి రిషి కపూర్ దర్శనమిస్తాడు. ఈ చిత్రానికి రెండు ఫిలింఫేర్ బహుమతులు, ఒక జాతీయ బహుమతి (ఉత్తమ చిత్రం) లభించాయి. ఆగ్, ప్యార్, జాన్ పెహచాన్, అంబర్, అనహోనీ, ఆషియానా, బేవఫా, ఆహ్, పాపి, దూన్, సినిమాలలో నర్గీస్ రాజకపూర్ సరసన నటించింది. ఇక నర్గీస్-రాజకపూర్ కలిసి నటించిన ఆఖరి సినిమా అనంత ఠాకూర్ దర్శకత్వం వహించిన ‘చోరి చోరి’ (1956). ఇందులో నర్గీస్ , రాజకపూర్ ల మీద చిత్రీకరించిన “ఏ రాత్ భీగీ భీగీ ఏ మస్త్ ఫిదా”, “ఆజా సనమ్ మాధుర్ చాందినీ మే”, “రసిక్ బలమా హాయ్ దిల్ క్యోం లగాయా తోసే” పాటలు అజరామరాలు. శంకర్ జైకిషన్ కు ఉత్తమ సంగీత దర్శకులుగా బహుమతి తెచ్చిపెట్టిన సినిమా ఇది. నర్గీస్ దిలీప్ కుమార్ సరసన జోగన్, బాబుల్, హల్ చల్, దీదార్ వంటి సినిమాల్లో నటించింది.


ప్రాణాలు తీసిన క్యాన్సర్ మహమ్మారి...
నర్గీస్ కాలేయ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి న్యూయార్క్ లోని కేట్టేరింగ్ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స తీసుకుంది. ఇండియాకు తిరిగివచ్చాక వ్యాధి బాగా ముదిరింది. అప్పుడే నర్గీస్ ను బొంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే నర్గీస్ కోమాలోకి వెళ్లిపోయింది. కోమాలోకి వెళ్ళిన మరుదినమే... అంటే మే నెల 3, 1981 న తనువు చాలించింది. అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న కుమారుడు సంజయ్ దత్ నటించిన తొలి చిత్రం ‘రాకీ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మే నెల 7 న విడుదలైన ఆ సినిమా ప్రీమియర్ షో లో నర్గీస్ కోసం ఒక సీటును ఖాళీగా ఉంచారు. ఎందుకంటే ఆ సినిమాను తను చూడాలని నర్గీస్ యెంతో కుతూహలపడేది. కానీ దైవం కరుణించలేదు. సునీల్ దత్, సంజయ్ దత్ ఇద్దరూ ఆ ప్రీమియర్ షో లో కుప్పకూలిపోయారు. ముఖ్యంగా సునీల్ దత్ చాలకాలం వరకు మామూలు మనిషి కాలేక పోయారు. వారిరువు శయనించే బెడ్ రూమ్ లో ఎంతమాత్రం ఇమడలేకపోయారు. కొన్నిసార్లు ఉదయం 4 గంటలకే నర్గీస్ సమాదివద్దకు వెళ్లి రోదించేవారు. నర్గీస్ కు సంజయ్ దత్ అంటే ఆందోళన ఉండేది. అమెరికాలో చికిత్సకు వెళుతూ కూడా కూతురు నమ్రతకు ఉత్తరాలు రాసేది. “సంజయ్ చెడు సావాసాలు చేస్తున్నాడు. అది అతని భవిష్యత్తుకు మంచిది కాదు. ఆ చెడ్డ పిల్లలకు దూరంగా సంజయ్ ను ఉంచే బాధ్యతను నువ్వు తీసుకో” అంటూ మొరపెట్టుకునేది. నర్గీస్ చనిపోయాక 1982లో ‘నర్గీస్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ‘ స్థాపించబడింది. ఈ సంస్థ ద్వారా ఎందఱో క్యాసర్ బాధితులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు.

ఇతర విశేషాలు...
భర్త సునీల్ దత్ తో కలిసి నర్గీస్ ‘అజంతా ఆర్ట్స్ కల్చరల్ ట్రూప్’ అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పింది. తద్వారా అలనాటి నటీనటులను, గాయనీగాయకులను సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్ళి వీర జవానులకు ముప్పిరిగోలిపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిని ఉత్తేజపరచింది. ప్రతి సంవత్సరం జనవరి మొదటి తారీఖున అజంతా ఆర్ట్స్ వార్షికోత్సవాన్ని నిర్వహించేది. స్పాస్టిక్ సొసైటీ అఫ్ ఇండియా సంస్థకు ముఖ్య పోషకురాలిగా మారి ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి సంఘసేవకురాలిగా మన్ననలు పొందింది. నర్గీస్ కు తెల్ల చీరలంటే యెంతో ఇష్టం. పండగలకు, ఇతర ఫంక్షన్లకు ఆమె తెల్లతీరలోనే దర్శనమిచ్చేది. అందుకే అభిమానులు ఆమెను ‘లేడీ ఇన్ వైట్’ అని గర్వంగా పిలుచుకునేవారు. 1980లో ఆమెను రాజ్యసభకు సభ్యురాలిగా ఎంపిక చేశారు. ఆమె గౌరవార్ధం జాతీయ బహుమతుల జాబితాలో ‘నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్’ అనే బహుమతిని ప్రవేశపెట్టారు. పద్మశ్రీ బిరుదు అందుకున్న తొలి సినీ నటి నర్గీస్. మదర్ ఇండియా సినిమాలో నటనకు ఫిలింఫేర్ వారి ఉత్తమ నటి బహుమతి స్వీకరించింది. ఈ సినిమా కార్లో వీవారీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకుంది. ‘రాత్ అవుర్ దిన్’ అనే సొంత సినిమాలో నటనకు నర్గీస్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి బహుమతి అందుకుంది. 1993 లో భారత తంతి తపాలా శాఖ నర్గీస్ పేరిట స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.