బహుముఖ ప్రజ్ఞాశాలి..

సుభాష్‌ ఘయ్‌.. హిందీ సినిమాలను ఇష్టపడేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరిది. నటుడిగా వెండితెరపైకి దూకిన ఈ ప్రతిభాశాలి తర్వాతి కాలంలో రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌ సినీప్రియుల్ని అలరించారు. దర్శకుడిగా ఓ ఫిలింఫేర్‌ పురస్కారంతో పాటు.. నిర్మాతగా ఓ జాతీయ అవార్డును అందుకొని భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు సుభాష్‌. భారతీయ సినిమా అభివృద్ధికి అతను చేసిన కృషికిగానూ 2015లో ఐఫా పురస్కారాన్ని అందుకున్నారు. 1945 జనవరి 24న నాగపూర్‌లో జన్మించిన సుభాష్‌ ఘయ్‌.. మహారాష్ట్రలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో చేరి నటన, దర్శకత్వ శాఖల్లో ఓనమాలు దిద్దుకున్నారు. ఓ చిన్న నటుడిగా ‘తక్‌దీర్‌’ (1967) సినిమాతో వెండితెరపై తొలిసారి తళుక్కుమన్న సుభాష్‌.. ఆ తర్వాత ‘ఆరాధన’ (1971), ‘ఉమాంగ్‌ అండ్‌ గుమ్రాహ్‌’ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి నటుడిగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత దర్శక, రచయితగా టర్న్‌ తీసుకున్న సుభాష్‌ తొలిసారి ‘కాళీ చరణ్‌’ (1976)తో దర్శకుడిగా మారారు. ఆయన తన సినీ కెరీర్‌లో మొత్తం 16 సినిమాలకు దర్శకరచయితగా పనిచేయగా.. వాటిలో ‘కర్రీ’, ‘హీరో’, ‘మేరీ జంగ్‌’, ‘కర్మ’, ‘రామ్‌ లఖన్‌’, ‘సౌదాగర్‌’, ‘కల్నాయక్‌’, ‘పర్దేశ్‌’, ‘తాల్‌’, ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ వంటివి మైలురాళ్లుగా నిలిచాయి. వీటిలో ‘హీరో’ (1983) సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా తొలి ఫిలింఫేర్‌ను, ‘పర్దేశ్‌’తో ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా మరో ఫిలింఫేర్‌ను అందుకోగా.. ఆయన సొంతంగా నిర్మించిన ‘ఇక్బాల్‌’ చిత్రంతో జాతీయ పురాస్కారాన్ని అందుకున్నారు. సుభాష్‌ 1982లో ముక్తా ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించగా.. 2000 సంవత్సరం నుంచి అది పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థగా అవతరించింది. దీంతో పాటు ముంబయిలో విస్లింగ్‌ వుడ్స్‌ అంతర్జాతీయ చలనచిత్ర మీడియా సంస్థను స్థాపించారు సుభాష్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.