కింగ్‌ ఆఫ్‌ డైలాగ్స్‌... రాజకుమార్‌

అతని విగ్రహం గంభీరం... అతని అడుగులు గంభీరం...

అతని కంఠస్వరం మరీ గంభీరం... కానీ అతని నటన చాలా సున్నితం!

ఆ కళల కలబోతే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రాజకుమార్‌. అది హీరో పాత్రకావచ్చు, సహచర హీరో పాత్రకావచ్చు .... విలన్‌ పాత్ర కూడా కావచ్చు ...


ఆపాత్ర నటనలో శౌర్యం వుంటుంది, సున్నితత్వం వుంటుంది, కనొపించని మార్దవం, ప్రేమతత్వం కూడా వుంటుంది. అలాంటి విలక్షణ నటుడు రాజకుమార్‌. ఒక ‘వఖ్త్‌’, ఒక ‘నీల్‌ కమల్‌’, ఒక ‘హమ్‌ రాజ్‌’, ఒక ‘పాకీజా’ సినిమా... ఏది చూసినా ఏదో నూతనత్వం అతని నటనలో గోచరిస్తుంది. నటించిన సినిమాలు డెబ్భై దాటవు. కానీ నటించిన పత్రి సినిమాలో అతడే హైలైట్‌ అవుతాడు. తెలుగులో జగ్గయ్యకు సరిపోల్చగల బాలీవుడ్‌ నటుడు రాజకుమార్‌. అతని డైలాగ్‌ డెలివరీ ప్రత్యేకంగా వుంటుంది. ‘వో దూసరోం పర్‌ పత్తర్‌ ఆహీ ఫేంకా కర్తే’ (వక్త్‌), ‘ఇస్‌ జవాన్‌ కి కసమ్...జవాబ్‌ దేనే ఆవూంగా, హిందూస్తాన్‌ కి కసమ్’ (హిందూస్తాన్‌ కి కసమ్), ‘ఆప్కే పావోం దేఖే, బహుత్‌ హసీన్‌ హై... ఇన్హే జమీన్‌ పర్‌ మత్‌ ఉతారియేగా.. మైలా హో జాయేంగే’ (పాకీజా), ‘జబ్‌ రాజేశ్వర్‌ దోస్తీ నిభాతా హై, తో అఫ్సానే లిఖే జాతే హై, అవుర్‌ జబ్‌ దుష్మనీ కర్తా హై తో తారిఖ్‌ బన్‌ జాతీ హై’ (సౌదాగర్‌)... ఈ డైలాగులు రాజకుమార్‌ గొప్పతనాన్ని గుర్తు చేయడానికే. రాజకుమార్‌కు రచయితలు రాసే డైలాగులు క్లుప్తంగా, సున్నితంగా వుంటాయి. అది రాజకుమార్‌ ప్రత్యేకత. అక్టోబర్‌ 8న రాజకుమార్‌ 94వ జయంతి. ఆ సందర్భంగా రాజకుమార్‌ గురించి కొన్ని విశేషాలు...

తొలిరోజుల్లో...

రాజకుమార్‌ అసలుపేరు కులభూషణ్‌ పండిట్‌. పుట్టింది అక్టోబర్‌ 8, 1926న ప్రస్తుత పాకిస్తాన్‌లో వున్న బెలూచిస్తాన్‌ వద్దగల లోరాలాయ్‌లో. వారిది కాశ్మీరీ పండిట్‌ వంశం. నలభయ్యవ దశకంలో రాజకుమార్‌ కుటుంబం బొంబాయిలో స్థిరపడింది. అక్కడే రాజకుమార్‌ బొంబాయి పోలీసు శాఖలో సబ్‌-ఇనస్పెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. 1950లో ఆ పదవికి రాజీనామా చేసి నటన వైపు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1952లో రాజకుమార్‌ ‘రంగీలి’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌ చిత్రసీమకు పరిచయమయ్యారు. నజాం నఖ్వి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజకుమార్‌ సరసన రెహనా హీరోయిన్‌ గా నటించింది. మెహమూద్, లీలా మిశ్రా, ముంతాజ్‌ ఆలి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా పెద్దగా పేరుతెచ్చుకున్నది కాదు. తరువాత ‘ఆబ్‌ షార్‌’, ‘ఘమండ్‌’ వంటి ఓ ఐదు సినిమాలలో నటించినా అవి రాజకుమార్‌ని నటుడిగా నిలబెట్టలేదు సరికదా, విజయవంతం కూడా కాలేదు.

‘మదర్‌ ఇండియా’తో గుర్తింపు...

ప్రముఖ దర్శక నిర్మాత 1957లో ప్రతిష్టాత్మక చిత్రం ‘మదర్‌ ఇండియా’ను టెక్నికలర్‌లో నిర్మించినప్పుడు రాజకుమార్‌ను నర్గీస్‌ భర్తగా పరిచయం చేశారు. సినిమాలో రాజకుమార్‌ పాత్ర పేరు ‘షాము’. అతడు ఒక పల్లెటూరి రైతు. భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే సినిమాగా, సగటు భారత స్త్రీ తన కుటుంబం కోసం, పిల్లలకోసం ఎంతగా పాటుపడుతుందో కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. రాధ(నర్గీస్‌)ను పెళ్లాడేందుకు రాజకుమార్‌ తల్లి (జిల్లు మా) ఓ వడ్డీ వ్యాపారి వద్ద 500 అప్పుచేస్తే రాజకుమార్‌ పండించే పంటలో మూడువంతులు వడ్డీ రూపేణా ఇవ్వాలని ఆ వడ్డీ వ్యాపారి షరతు విధిస్తాడు. పంటలు పండకపోవడంతో రాజకుమార్‌ వడ్డీ తీర్చలేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు అవహేళన చేస్తే అతడు వూరు విడిచి వెళ్లిపోతాడు. ఒక ప్రమాదంలో రెండు చేతులు కోల్పోతాడు. భార్య తన ఇద్దరు బిడ్డలు బిర్జు (సునీల్‌ దత్‌), రాము (రాజేంద్రకుమార్‌)తో కలిసి జీవనం సాగిస్తుంది. చివర్న విఘాతానికి వ్యతిరేకి అయిన సొంత కొడుకుని కాల్చి చంపుతుంది. ఆరోజుల్లోనే ఈ చిత్రం నాలుగు కోట్ల వసూళ్లు నమోదుచేసి రికార్డు నెలకొలిపింది. విదేశీ భాషా చిత్రాల శ్రేణిలో భారత్‌ నుంచి ఆస్కార్‌ బహుమతికి నామినేట్‌ అయిన చిత్రమిది. జాతీయ బహుమతితోబాటు, కార్లోవివరి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో నర్గీస్‌కు బహుమతి దక్కింది. ఇవి కాక ఇదు ఫిలింఫేర్‌ బహుమతులు కూడా ఈ చిత్రం గెలుచుకోవడంతో రాజకుమార్‌కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బంగారుతల్లి’ (1971) పేరుతో పునర్నిర్మించారు.

హీరోగా... సహనాయకుడిగా...

1960-70 సంవత్సరాల మధ్యకాలంలో రాజకుమార్‌ అటు హీరోగానే కాకుండా సహనాయకుడుగా అనేక సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అతని గంభీర కంఠంలో పలికే డైలాగులు ప్రేక్షకులను కట్టిపడేసేవి. దాంతో రాజకుమార్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా అతనికి తగిన పాత్రల్ని రచయితలు ప్రత్యేకంగా రూపొందించే వారు. హీరో వేషం కాకపోయినా రాజకుమార్‌ పాత్రకు ఒక ప్రత్యేకత అలాగే నిలిచిపోయింది. రాజకుమార్‌ ఊతపదం ‘జాని’. ఈ పదాన్ని రాజకుమార్‌ అనేక సినిమాలలో వాడారు. 1957లో సోహ్రాబ్‌ మోడీ దర్శకత్వంలో వచ్చిన ‘నౌషేర్వన్థ్‌ ఎ-ఆదిల్‌’ సినిమాలో రాజకుమార్‌ మాలాసిన్హా ప్రక్కన హీరోగా నటించారు. అయినా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 1958లో ‘దుల్హన్‌’ చిత్రంలో నందా సరసన హీరోగా నటించినా ఆ సినిమా విజయవంతం కాలేదు. అయితే 1959లో బి.నాగిరెడ్డి నిర్మాతగా జెమిని వాసన్‌ దర్శకత్వంలో ‘పైగామ్’ అనే చిత్రం నిర్మించగా అందులో దిలీప్‌ కుమార్‌కు అన్నగా రాజకుమార్‌ రెండవ హీరోగా నటించారు. వైజయంతిమాల, బి.సరోజాదేవి ఇందులో నాయికలు. ఇందులో రాజకుమార్‌కు జోడీగా పండరీబాయి నటించింది. సినిమా విజయవంతమై రాజకుమార్‌కు పేరు తెచ్చింది. ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చిన రామానంద సాగర్‌కు ఉత్తమ సంభాషణల రచయితగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. రాజకుమార్‌ పేరు ఉత్తమ సహాయనటుడుగా నామినేట్‌ అయినా, ఆ బహుమతి ‘ధూల్‌ కా ఫూల్‌’లో నటించిన మన్మోహన్‌ కృష్ణను వరించింది. ఈ చిత్రం తరువాత దిలీప్‌ కుమార్‌తో రాజకుమార్‌ నటించింది ‘సౌదాగర్‌’ (1991) సినిమాలోనే. 1959లోనే మీనాకుమారితో కలిసి రాజకుమార్‌ నటించిన ‘అర్ధాంగిని’ సినిమా కూడా విడుదలైంది. మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అజిత్‌ చక్రవర్తి నిర్మించి దర్శకత్వం వహించగా రెండేళ్ల తరువాత ముక్తా రామస్వామి ఈ చిత్రాన్ని తమిళంలో ‘పణిత్తిరై’ పేరుతో పునర్నిర్మించారు.

ప్రతినాయకుడి పాత్రల్లో...

తెలుగులో హీరో జగ్గయ్య ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’ సినిమాలలోను, హీరో కాంతారావు ‘శభాష్‌ రాముడు’, ‘రక్తసంబంధం’ వంటి సినిమాలలోను సెకండ్‌ హీరోలా వుండే ప్రతినాయకుడి పాత్రలు పోషించినట్లే, రాజకుమార్‌ కూడా కొన్ని అటువంటి పాత్రల్లో నటించారు. అయితే ఆయా సినిమాలలో రాజకుమార్‌ పాత్రలకే ఎక్కువ మార్కులు పడేవి. 1959లో ఎఫ్‌.సి.మెహ్రా నిర్మించిన ‘ఉజాలా’ చిత్రంలో రాజకుమార్‌ విలన్‌గా నటించగా షమ్మికపూర్‌ హీరోగా నటించాడు. మాలాసిన్హా ఇందులో హీరోయిన్‌. శంకర్‌-జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో ‘ఝూమ్‌ కా మౌసం మస్త మహీనా’, ‘దునియా వాలోం సే దూర్‌’ పాటలు ఇప్పటికే వినవచ్చేవే. ఎస్‌.ఎస్‌.వాసన్‌ జెమినీ సంస్థ కోసం నిర్మించి దర్శకత్వం వహించిన ‘ఘరానా’ చిత్రంలో రాజకుమార్‌ విలన్‌ లాంటి పాత్రను పోషించారు. రాజేంద్రకుమార్, ఆశాపరేఖ్‌ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘శాంతి నివాసం’ చిత్రానికి రీమేక్‌. అందులో కాంతారావు పోషించిన పాత్రే రాజకుమార్‌ హిందీ చిత్రంలో పోషించారు. రవికి ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. ‘హుస్న్‌ వాలే తేరా జవాబ్‌ నహీ’ పాట రాసిన షకీల్‌ బదాయునికి ఉత్తమ గేయరచయిత బహుమతి లభించింది. ఇదే చిత్రాన్ని 1988లో గోవింద, రిషికపూర్, జయప్రద జంటగా ‘ఘర్‌ ఘర్‌ కి కహాని’ పేరుతో జవహర్లాల్‌ బాట్నా నిర్మించి హిట్‌ చేశారు.

క్యారక్టర్‌ నటుడుగా...

1963లో తమిళ దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్‌ ‘నెంజిల్‌ ఒరు ఆలయం’ చిత్రాన్ని హిందీలో ‘దిల్‌ ఏక్‌ మందిర్‌’ (తెలుగులో ‘మనసే మందిరం’ చిత్రం) పేరుతో పునర్నిర్మించారు. రాజేంద్రకుమార్, మీనాకుమారి, రాజకుమార్‌ ఇందులో ముఖ్య తారాగణం. సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు శంకర్‌-జైకిషన్‌ సంగీతం సమకూర్చారు. తెలుగులో జగ్గయ్య పోషించిన పాత్రను రాజకుమార్‌ ఎంతో గంభీరంగా, ప్రేక్షకుల హృదయాలు ద్రవించేలా నటించి మన్నన పొందారు. ఈ చిత్రాన్ని కేవలం రెండు సెట్టింగులతో 27 రోజుల వ్యవధిలో నిర్మించడం శ్రీధర్‌ గొప్పతనం. ఈ చిత్రంలో నటనకు రాజకుమార్‌కు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటుడి బహుమతి దక్కింది. తరువాత కమల్‌ అమ్రోహి ‘దిల్‌ అపనా అవుర్‌ ప్రీత్‌ పరాయీ’ చిత్రాన్ని నిర్మించాడు. కిషోర్‌ సాహు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజకుమార్‌కు జంటగా మీనాకుమారి నటించింది. శంకర్‌-జైకిషన్‌ సంగీతం సమకూర్చారు. ఇందులో లతామంగేష్కర్‌ ఆలపించిన టైటిల్‌ సాంగ్‌ సంగీత ప్రియులకు సుపరిచితమే. ‘అజాబ్‌ దాస్తాన్‌ హై’ వంటి పాటలు స్వరపరచిన శంకర్‌ జైకిషన్‌కు ఉత్తమ సంగీత దర్శకులుగా ఫిలింఫేర్‌ బహుమతి దక్కింది. అయితే పోటీలోకి నిలిచిన ‘మొఘల్‌-ఎ-ఆజం’ చిత్ర సంగీతదర్శకుడు నౌషాద్‌ కు రాకపోవడం కొంత ఘర్షణకు దారి తీసింది. ప్రముఖ హిందీ రచయిత మున్షి ప్రేమ్‌ చంద్‌ రాసిన ‘గోదాన్‌’ నవలను అదేపేరుతో త్రిలోక్‌ జెట్లీ సినిమాగా నిర్మించారు. అందులో రాజకుమార్‌ది ఉదాత్తమైన పాత్ర. తరువాత ‘ఫూల్‌ బనే అంగారే’, ‘ప్యార్‌ కా బంధన్‌’ వచ్చాయి. 1964లో జెమినీ సంస్థకోసం రామానంద్‌ సాగర్‌ ‘జిందగీ’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదే చిత్రం తెలుగులో ‘ఆడబ్రతుకు’ పేరుతో జెమినీ వారే తెలుగులో నిర్మించారు. తెలుగులో కాంతారావు పోషించిన పాత్రనే రాజకుమార్‌ పోషించారు. రాజేంద్ర కుమార్, వైజయంతిమాల హీరో, హీరోయిన్లుగా నటించారు. సినిమా బాగా విజయవంతమైంది. మొఘుల్స్‌ బ్యానర్‌ మీద నిర్మించిన ‘మేరే హుజూర్‌’ చిత్రంలో రాజకుమార్, మాలాసిన్హా, జితేంద్ర నటించారు. నవాబ్‌ సలీంగా రాజకుమార్‌ నటన అద్భుతంగావుంటుంది. శంకర్‌-జైకిషన్‌ ఇందులో దర్బారీ కానడ రాగంలో స్వరపరచిన సెమి క్లాసికల్‌ గీతం ‘ఝనక్‌ ఝనక్‌ తోరే బాజే పాయలియా’ ఒక గొప్ప పాటగా రికార్డులలో నిలిచిపోయింది. అలాగే రఫీ ఆలపించిన ‘రుఖ్‌ సే జరా నఖాబ్‌ ఉఠా దో మేరె హుజూర్‌’ కూడా ఒక అద్భుతమైన పాటగా నిలిచింది. తెలుగులో వచ్చిన ‘పుణ్యవతి’ (తమిళంలో ‘పూవుమ్‌ పొట్టుమ్‌’) సినిమాను సి.వి.శ్రీధర్‌ హిందీలో ‘నయీ రోషినీ’ పేరుతో ఒక సోషల్‌ డ్రామాగా నిర్మించారు. అశోక్‌ కుమార్, బిస్వజిత్, మలాసిన్హా, భానుమతి, అసిత్‌ సేన్‌ ముఖ్య తారాగణం. అశోక్‌ కుమార్‌ భార్యగా భానుమతి నటించగా, రాజకుమార్‌ వారి కుమారుడుగా నటించారు. సినిమా హిట్టయింది.

వక్త్‌.... హమ్‌ రాజ్‌...నీల్‌ కమల్‌...పకీజా...

1965లో నిర్మాత బి.ఆర్‌. చోప్రా ‘వక్త్‌’ అనే చిత్రాన్ని యష్‌ చోప్రా దర్శకత్వంలో నిర్మించారు. బాలీవుడ్‌ టాప్‌ 10 చిత్రాల జాబితాలో ఈ చిత్రం చోటుచేసుకుంది. బల్రాజ్‌ సాహ్ని, సునీల్‌ దత్, రాజకుమార్, శశికపూర్, సాధనా, షర్మీలా టాగూర్‌ అచలా సచ్‌ దేవ్‌ వంటి అగ్రశ్రేణి తారలు నటించిన సినిమా ఇది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో వసూళ్ళపరంగా అగ్రస్థానం ఆక్రమించిన ఈ సినిమాలో నటనకు రాజకుమార్‌ ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటుడి బహుమతి అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (యష్‌ చోప్రా), ఉత్తమ కథారచన(అఖ్తర్‌ మీర్జా), ఉత్తమ సంభాషణలు (అఖ్తర్‌ ఉల్‌ ఇమ్రాన్‌), ఉత్తమ కలర్‌ సినిమాటోగ్రాఫర్‌ (ధరమ్‌ చోప్రా) విభాగాల్లో కూడా ఈ చిత్రం ఫిలింఫేర్‌ బహుమతులు అందుకుంది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి (సాధన) విభాగాల్లో పోటీపడింది కూడా. రవి సంగీత దర్శకత్వంలో ఆశాజీ పాడిన ‘ఆగే భీ జానే న తూ’, ‘చెహరే పే ఖుషి ఛా జాతి హై’, ‘కౌన్‌ ఆయా కి నిగాహో మే చమక్‌ జగ్‌’, మన్నాడే ఆలపించిన ‘ఆయ్‌ మేరె జోహరా జబీన్‌’ పాటలు సూపర్‌ హిట్లే. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భలేఅబ్బాయిలు’ (1969)గా పునర్నిర్మించారు. 1967లో బి.ఆర్‌.చోప్రా స్వీయ దర్శకత్వంలో ‘హమ్‌ రాజ్‌’ అనే సస్పెన్స్‌ చిత్రాన్ని నిర్మించారు. అందులో కూడా రాజకుమార్‌ ది కెప్టన్‌ రాజేష్‌ అనే అద్భుతమైన పాత్ర. సునీల్‌ దత్, ముంతాజ్, విమి, బల్రాజ్‌ సాహ్ని ముఖ్య తారాగణం. ఈ సినిమా బాక్సాఫీస్‌ సూపర్‌ హిట్టయింది. రవి స్వరపరచిన ఐదు పాటలూ అద్భుతంగా అమరాయి. ‘నీలే గగన్‌ కే తలే’ అనే పాటను ఆలపించిన మహేంద్రకపూర్‌కు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్‌ బహుమతి, ఎం.ఎం.మల్హోత్రా కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ బహుమతి లభించాయి. మల్హోత్రాకు జాతీయ బహుమతి కూడా లభించింది. ఇందులో పాటలన్నీ మహేంద్ర కపూర్‌ పాడడం విశేషం. ముఖ్యంగా ‘కిసీ పత్తర్‌ కీ మూరత్‌ సే మోహబ్బత్‌ కా ఇరాదా హై’, ‘తుమ్‌ అగర్‌ సాథ్‌ దేనే కా వాదా కరో’, ‘న మూన్‌ చుపాకే జియో’ పాటలు నేటికీ నిత్యనూతనాలే. 1968లో వచ్చిన మరొక రాజకుమార్‌ చిత్రం రామ్‌ మహేశ్వరి దర్శకత్వం వహించిన ‘నీల్‌ కమల్‌’ సినిమా. రాజకుమార్, మనోజ్‌ కుమార్, బల్రాజ్‌ సాహ్ని, మెహమూద్‌ ప్రధాన తారాగణం కాగా, టైటిల్‌ పాత్రను పోషించింది వహీదా రెహమాన్‌. ఈ చిత్రం ద్వారా వహీదా రెహమాన్‌ రెండవసారి ఫిలింఫేర్‌ బహుమతి అందుకుంది. చిత్రసేన్‌ అనే వృత్తికళాకారుడుగా రాజకుమార్‌ ఈ సినిమానటనలో జీవించారు. రాజకుమార్‌ ధరించిన పాత్రకు ఉత్తమ ఫిలింఫేర్‌ బహుమతి త్రుటిలో తప్పిపోయింది. ఆ బహుమతి ‘ఆద్మీ’ చిత్రంలో నటించిన మనోజ్‌ కుమార్‌కు దక్కింది. అంతేకాదు మరో నాలుగు విభాగాల్లో కూడా ఈ సినిమాకి బహుమతులు తృటిలో చేయి జారాయి. ఈ చిత్రంలో రవి సమకూర్చిన సంగీతానికి ప్రత్యేకత వుంది. రఫీ ఆలపించిన ‘బాబుల్‌ కి దువాయే లేతీ జా’, ‘ఆజా తుఝ్‌ కో పుకారే మేరా ప్యార్‌’, ‘షరమా కే యు న దేఖ్‌’ పాటలు, ఆశాజీ ఆలపించిన ‘హే రోమ్‌ రోమ్‌ మే బస్నే వాలే రామ్’ పాటలు కలకాలం నిలిచిపోయేవే. కమల్‌ అమ్రోహి కలల పంట ‘పాకీజా’ సినిమా. అందులో మీనాకుమారి, రాజకుమార్, అశోక్‌ కుమార్‌ ముఖ్యతారాగణం. మీనాకుమారి నటించిన చివరి చిత్రం కూడా ఇదే. 1956లో మొదలుపెట్టిన సినిమా పదహారేళ్ల తరువాత 1972లో విడుదలైంది. రాజకుమార్‌ ఇందులో సలీం అహ్మద్‌ ఖాన్‌ పాత్ర పోషించారు. ఇందులో రాజకుమార్‌ చెప్పే ‘అఫ్సోస్‌... లాగ్‌ దూద్‌ సేభి జల్‌ జాతే హై’ చిన్న డైలాగు ఆరోజుల్లో ప్రతి ఇంటిలోనూ మారుమోగింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మీనాకుమారికి హీరోగా అశోక్‌ కుమార్‌ను అనుకున్నారు. కానీ సినిమా నిర్మాణం కుంటుపడడంతో ఆ పాట రాజకుమార్‌ చేత పోషింపజేశారు. అంతకుముందు రాజకుమార్, కమల్‌ అమ్రోహి ‘దిల్‌ అపనా అవుర్‌ ప్రీత్‌ పరాయి’ సినిమాకు పనిచేయడం లాభించిన అంశం. రాజకుమార్‌ కోసం ఈ సినిమాలోని పాత్రను కొంచెం మార్చాల్సివచ్చింది.

వ్యక్తిగతం...

రాజకుమార్‌ ‘‘హీరా రన్ఝా’, ‘లాల్‌ పత్తర్‌’, ‘మర్యాదా’, ‘హిందుస్తానీ కా కసమ్’, ‘కర్మయోగి’, ‘ఖుద్రత్‌’, ‘రాజ్‌ తిలక్‌’, ‘శారద’, ‘ఇతిహాస్‌’, ‘సాజిష్‌’, ‘సౌదాగర్‌’, ‘తిరంగా’, ‘బేతాజ’్ వంటి మంచి సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించారు. రాజకుమార్‌ నటించిన ఆఖరి చిత్రం ‘గాడ్‌ అండ్‌ గన్‌’. రాజకుమార్‌ జెన్నిఫర్‌ అనే ఆంగ్లో-ఇండియన్‌ అమ్మాయిని వివాహమాడారు. జెన్నిఫర్‌ ఎయిర్‌ ఇండియాలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తూ వుండేది. ఆమె రాజకుమార్‌కు విమానంలో పరిచయం కావడం, ఇద్దరూ ప్రేమించుకోవడం, పెళ్ళాడడం వెంటవెంటనే జరిగిపోయాయి. పెళ్లయ్యాక జెన్నిఫర్‌ తన పేరును హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా ‘గాయత్రి’ అని మార్చుకుంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కూతురు వాత్సవిక 2006లో ‘ఎయిట్‌: ది పవర్‌ ఆఫ్‌ షాని’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. అలాగే కుమారుడు పురు రాజకుమార్‌ కూడా బాలీవుడ్‌ నటుడుగా పరిచయమైనా వీరిద్దరూ పెద్దగా వెండితెరపై రాణించలేదు. జూలై 3, 1990న 69వ ఏట గొంతు క్యాసర్‌తో బాధపడుతూ ముంబైలో రాజకుమార్‌ మరణించారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.