తెలంగాణ సినీ చరిత్రకు ఆద్యుడు ధీరేన్‌ గంగూలి

ఈరోజు  ధీరేన్‌ గంగూలీ  (18, డిసెంబర్ 1978) వర్ధంతి. ఈ సందర్భంగా 

అయన  గురించి కొన్ని విషయాలు...భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ మ్యాజిక్‌ లాంతర్‌తో శ్రీకారం చుట్టుకుని మూకీలతో ప్రాణం పోసుకొని టాకీలతో దేశవ్యాప్తమై జన సామాన్యానికి చేరువైంది. దాదా సాహెబ్‌ పాల్కే ‘‘రాజా హరిశ్చంద్ర’’ (1913) తొలి మూకీ తీశాక బొంబాయి, కలకత్తా, నాసిక్, షోలాపూర్, మదరాసులతో బాటు హైదరాబాద్‌లో కూడా మూకీల నిర్మాణం జరిగింది.


తెలంగాణ సినిమా రంగానికి హైదరాబాద్‌లో అంకురార్పణ జరిగితే దానికి ఆద్యుడు బెంగాలీ అయిన ధీరేన్‌ గంగూలీ. ఈ ధీరేన్‌ గంగూలీ ఎవరో ఎక్కడి వాడో తెలుసుకుంటే హైదరాబాద్‌లో తొలినాళ్లలో మూకీల సంగతులు తెలుస్తాయి. ఈ ధీరేన్‌ గంగూలీ బెంగాలీ చిత్ర సీమకు ఆద్యులైన జె.ఎఫ్‌.మదన్, హీరాలాల్‌ సేన్‌ల పరంపరలో మూకీల కాలంలో పనిచేసిన వారిలో ఒకరిగా చరిత్రకెక్కారు.


ధీరేన్‌ గంగూలీ పూర్తి పేరు ధీరేంద్రనాథ్‌ గంగోపాధ్యాయ. నేటీ బంగ్లాదేశ్‌లోని బారిసాలలో సాంప్రదాయ ఉన్నత కుటుంబంలో 1893 మార్చి 26న జన్మించిన ధీరేన్‌ గంగూలీ బాల్యంలో సహజంగానే నాటకం, లలితకళల పట్ల ఆకర్షితులయ్యారు. ఫలితంగా రవీంద్రనాథునితో పరిచయం కలగడానికి ఎంతో కాలం పట్టలేదు. కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యార్థిగా చేరారు. రవీంద్రుని శిష్యరికంలో చిత్రలేఖనం వంటి కళలలపై మంచి పట్టు సాధించారు. ఆయనకు అతి సన్నిహితునిగా మెలిగారు. ఠాగూర్‌ రాసిన ‘వాల్మీకి’ ‘రాజ్‌ అండ్‌ ఢాక్‌ ఘర్‌’ వంటి నాటకాల్లో నటించడమే గాక వాటిని ప్రదర్శించారు కూడా. శాంతినికేతన్‌లో చదువు పూర్తయ్యాక 1910లో ధీరేన్‌ స్కాటిష్‌ చర్చి కాలేజీలో చేరి ఆరునెలల తరువాత జూబిలీ ఆర్ట్స్‌ అకాడమీ, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చదివి 1912లో డిస్టింక్షన్‌లో పాసయ్యారు.

చదువు పూర్తవ్వగానే చిత్రకారుడిగా నాటక ప్రయోక్తగా కళారంగంలోకి ప్రవేశించిన ధీరేస్‌ పేయింటింగ్స్‌ ప్రదర్శనలు నిర్వహించారు. అవి అమ్ముడవటమే గాదు చాలా పత్రికలలో ముద్రితమయినవి కూడా. ఇవి గాక శాంతినికేతన్‌ ద్వారా కలకత్తా పోలీసులకు మారు వేషాలు వేసుకొనే పద్ధతులు నేర్పే ఉద్యోగం ఒకటి కూడా చేసారు. ఇవన్నీ చేస్తూనే ఫోటోగ్రఫీలో ఆసక్తిని పెంచుకొని ఆ రంగంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. తానే వివిధ వేషధారణలతో కూడిన ఫోటోలు దిగి ఒక పుస్తకం తయారు చేశారు. దాని పేరు ‘భవనేర్‌ అభివ్యక్‌.’ భావవ్యక్తీకరణ వివిధ సందర్భాలలో ఎన్ని రూపాలుగా ఉంటుందో తెలుపడమే ఈ ఫోటో సంకలనం ఉద్దేశ్యం. ఫోటోగ్రఫీలో ధీరేన్‌ ప్రతిభను తెలుసుకున్న నిజాం ప్రభువు వెంటనే తన నిజాం ఆర్ట్స్‌ కళాశాలలో ఉద్యోగం ఇస్తూ 1915లలో ఉత్తర్వులు జారీ చేశారు. అతికొద్ది కాలంలలోనే ఆయన ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎదిగారు. హైదరాబాద్‌ వచ్చాక ధీరేన్‌ ‘‘అమార్‌దేశ్‌ (నా దేశం)’ అనే మరో ఫోటో సంకలనాన్ని వెలువరించారు. దీని ప్రతినొక దానిని అప్పుడప్పుడే మూకీల నిర్మాణం ప్రారంభించిన జె.ఎఫ్‌.మదన్‌ (కలకత్తా)కి పంపారు. ధీరేర్‌ పనితనాన్ని చూసిన జె.ఎఫ్‌.మదన్‌ ‘‘మనం సినిమాల గురించి కొంత పని కలిసి చేయాల్సి ఉంది. అందులో నీ ప్రతిభ ఉపయోగపడుతుంది. వెంటనే, కలకత్తా రమ్మని ఉత్తరం రాశాడు.

1918లో ధీరేన్‌ కలకత్తా తిరుగు ప్రయాణమయ్యారు. జె.ఎప్‌.మదన్‌ ధీరేన్‌లోని రచయిత, నటుడు, ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు ఇవన్నీ సినీమాకు పనికి వస్తాయనే నిర్ణయానికి వచ్చి కలిసి సినిమాలు తీద్దాం అని నిర్ణయించుకున్నారు. పైగా ధీరేన్‌కు ఠాగూర్‌తో దగ్గరి పరిచయం ఉంది. మదన్‌కు అది బాగా నచ్చింది. ఠాగూర్‌ రాసిన ‘సాక్రిఫైస్‌’’ (త్యాగం) నాటకం అప్పటికే బెంగాల్‌ సమాజంలో బాగా ప్రసక్తి పొందింది. దానిని సినిమాగా తీయాలనేది మదన్‌ ఆలోచన. ఠాగూర్‌ వద్దకు పోయి అనుమతి తేగలిగింది ధీరేన్‌ ఒక్కరేనని ఆయన గుర్తించారు. అనుకున్నట్లు అనుమతి తీసుకుని వచ్చాడు ధీరేన్‌. అయితే వివిధ కారాణాల వల్ల ఈ సినిమా నిర్మాణం వాయిదా పడూతూ వచ్చింది. మరోవైపు 1919 నాటికి భారత రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించాయి. అప్పటికే జనరల్‌ దయ్యార్‌ జలియన్‌ వాలా బాగ్‌ దురంతానికి కారకుడై దేశమంతా ఆగ్రహజ్వాలగా మారింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్, బ్రిటీష్‌ సర్కారు తనకిచ్చిన ‘‘నైట్‌హుడ్‌’’ బిరుదును తిరిగి ఇచ్చేసాడు. గాంధీజీని బ్రిటీష్‌ ప్రభుత్వం జైల్లో పెట్టింది. పత్రికారంగంపై ఆంక్షలు విధించింది. ఇక సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికేట్లు తిరస్కరించగా, 49 సినిమాలకు లెక్కలేనన్ని కటింగ్స్‌తో అనుమతులిచ్చింది బ్రిటీష్‌ ప్రభుత్వం.

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రంగంలోకి వచ్చిన ధీరేన్‌ గంగూలీ నితీష్‌ చంద్ర లహిరితో కలిసి 1921లో ‘ఇండో బ్రిటీష్‌ ఫిలిం కంపెనీ’ ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ‘బిలాత్‌ ఫెరాత్‌’ (ఇంగ్లాండ్‌ రిటర్న్‌డ్‌) అనే మూకీ తీశారు. ఇంగ్లాండ్‌ నుంచి తిరిగి వచ్చిన భారతీయుడు ప్రవర్తించే తీరును వ్యంగ్యంగా చిత్రీకరించిన ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత భాగస్వాములంతా విడిపోయారు. అయితే ‘బిలాత్‌ ఫెరాత్‌’ ఇచ్చిన విజయంతో భవిష్యత్తులో కూడా మరిన్నీ కామెడీలు తీయాలని ధీరేన్‌ నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే రవీంద్రుడు తన దగ్గరి బంధువులమ్మాయితో ధీరేన్‌ వివాహం జరిపించారు.

1920ల నాటికి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూకీల నిర్మాణం ఊపందుకున్నది. హైదరాబాద్‌లో కూడా సినిమాలు తీయాలని, అందుకు ఎవరైనా ప్రతిభావంతులుంటే పంపమని నిజాం జె.ఎఫ్‌మదన్‌ని కోరారు. మదన్‌నే కోరడానికి ఒక కారణముంది. 1908లో హైదరాబాద్‌ను మూసీ వరదలు ముంచెత్తాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించింది జె.ఎఫ్‌.మదన్‌ బృందం. ఆ పరిచయంతో నిజాం కోరగానే ధీరేన్‌ గంగూలీని హైదరాబాద్‌కు సినిమా నిర్మాణం వెళ్లమన్నారు. ధీరేన్‌కు ఎలాగూ హైదరాబాద్‌తో పరిచయం ఉంది గనుక కొందరు సినిమా టెక్నీషియన్లను తోడుగా తీసుకుని వచ్చేసాడు.

హైదారాబాద్‌లో ‘‘లోటస్‌ ఫిలిం కంపెనీ’’ (దక్కన్‌)ని 1922లో నిజాం అజమాయిషితో నెలకొల్పిన ధీరేన్‌ స్వంతంగా భవనాలను ఉపయోగించుకోవచ్చని ధీరేన్‌కు అనుమతిచ్చారు. ధీరేన్‌ హైదరాబాద్‌లో తీసిన మూకీలు మొత్తం ఎనిమిది అవన్నీ వరుసగా ‘‘చింతామణి’’ (21.7.1922), ‘‘ఇంద్రజిత్‌’’ (1922) నటీనటులు ధీరేన్‌ గూంగూలీ, సీతాదేవి) ‘‘మేరేజ్‌ టానిక్‌’’ (1922), ధీరేన్‌ గంగూలీ, సీతాదేవి - కామెడీ చిత్రం), ‘‘సాధూకీసైతాన్‌’’ (1922) ధీరేన్, లీలా వాలెంటేన్, సుశీలాదేవి కామెడీ) ‘‘స్టెప్‌ మదర్‌’’ (1923 - ధీరేన్‌ గంగూలీ, సీతాదేవీ, బోయ్‌బెల్లే) ‘యాయాతీ’ (4.4.1923 - ధీరేన్, సీతాదేవి) ‘హరగౌరి’ (5.1.1923- పౌరాణికం). ఈ మూకీలు అన్నీ కూడా హైదరాబాద్‌లో ఆయన నిర్మించిన రెండు థియేటర్లలో ప్రదర్శించబడినవి. నిజాం ప్రభువు వీటి తరువాత సినిమా నిర్మాణం కొనసాగించాలనుకున్నాడు. కానీ 1924లో ఆర్ధేషిర్‌ ఇరానీ ‘మెజాస్టిక్‌ ఫిలిం కంపెనీ’ బ్యానర్‌పై తీసిన ‘రజియాబేగం’ మూకీని ధీరేన్‌ హైదరాబాద్‌లోని తన థియేటర్‌లో విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ముస్లీం. కానీ హిందువులను ప్రేమించి పెళ్లాడుతుంది. అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలోని పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కథ, కథనాలున్నాయి. ధీరేన్‌ గంగూలీని ఇరవై నాలుగు గంటలలో నగరం విడిచి వెళ్లవలసిందిగా నిజాం ఆదేశించారు. నియంతకు ఎదురు చెప్పలేక చేసేదేమీ లేక కలకత్తా తిరిగి వెళ్లాడు.

కలకత్తా వెళ్ళి ధీరేన్‌ నాటకరంగంలో తన కృషిని కొనసాగించాడు. 1927లో ‘‘శంకరాచార్య’’ అనే మూకీలో నటించారు. ఈ చిత్ర దర్శకుడు కాళీప్రసాద్‌ఘోష్‌. దేవకీబోస్‌ దర్శకత్వంలో ‘‘పంచాసర్‌’’ (1.11.1930)లో ‘ఆఫ్టర్‌ ది డెత్‌’ (7.2.1931) ఎ.కె.రామ్‌ దర్శకత్వంలో ‘‘ది బోర్డర్‌ థీప్‌’’ మూకీల్లో నటించారు. థీరేన్‌ గంగూలీ, దర్శకునిగా ‘అలీక్‌ బాబు’ (24.5.1930), ‘‘ప్లేమ్‌ ఆఫ్‌ ఫ్లెష్‌’’ (22.2.1930) ‘‘నాటిబాయ్‌’’ (1931). ‘‘చరిత్రహీన్‌’’ (9.5.1931) మూకీలను దర్శకత్వం చేశాడు.

టాకీలు రాగానే న్యూథియేటర్స్‌ సంస్థాపకులలో ఒకరుగా కృషీ చేసిన థీరేన్‌ గంగూలీ ‘‘నైట్‌బర్డ్‌’’ ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్‌’’ (1934), ‘‘బిద్రోహి’’, (హిందీ, బెంగాలీ - 1935), ‘‘కంట్రీగర్ల్‌ (1936), ‘మస్ట్‌ టో భాయ్‌’’ (1940) ‘‘ఆహుతి’ (1941), ‘‘శేష్‌నివేదన్‌’’ (1949) ‘‘కార్టూన్‌’’ (1948) వంటి టాకీలు తీసి కొన్నింటిలో నటించాడు. ఈయన తీసిన సినిమాల్లో ఎక్కువగా కామెడీలే. అందుకే ఆయనను ‘‘ఇండియన్‌ చాప్లిన్‌’’ అనేవారు. ఆయనే ‘‘జీవితంలో ప్రతివిషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. సీరియస్‌గానే విశ్లేషణ జరపాలి. కానీ నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెప్పాల్సి వచ్చినపుడు వీలైనంత సరళంగా, హాస్యపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువగా కామెడీలు తీయడానికి కారణమిదే’’ అన్నారొక సందర్భంలో. సినిమా రంగానికి దేవకీబోస్‌. పి.సి.బారువా, సబితాదేవీలను ఈయనే పరిచయం చేశారు.

అయితే సినిమా నిర్మాణం వ్యాపార పంరంగా నష్టాలు తేవడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో శరీరపరంగా సినిమాలు తీయాలనుకున్న ధీరేన్‌ ఇంటికే పరిమితం కావలిసి వచ్చింది. భారతీయ సినిమాకు 50 ఏళ్లు పాటు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 1974 ‘‘పద్మభూషణ్‌’’ పురస్కారంతో 1975లో ‘‘దాదాఫాల్కే’’ అవార్డుతో గౌరవించింది. భారతీయ సినిమా పితామహుల్లో ఒకరుగానే హైదరాబాద్‌ సినిమాకు ఆద్యుడుగా ధీరేన్‌ గంగూలీని మనం స్మరించుకోవాలి. ఆ మహనీయుడు 1978 నవంబర్‌ 18న తనువు చాలించారు. ఆయన వేసిన బీజాలే తెలంగాణ సినిమా చరిత్రకు పునాదిరాళ్లుగా నిలిచాయి.


-హెచ్‌.రమేష్‌బాబు (వ్యాసకర్త సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌)  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.