అందాల మొలక... భాను ‘రేఖ’!
‘‘బొంబాయి నగరం ఓ పెద్ద అడవి లాంటిది. అనామకురాలిగా ఆ అడవిలో అడుగు పెట్టాను. అవి నా జీవితంలో భయభ్రాంతులకు లోనైన రోజులు. నా దుర్బలత్వాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఎందరో శాయశక్తులా ప్రయత్నించారు. స్కూల్లో చదుకోవలసిన వయసు. తోటి స్నేహితులతో ఆటలాడుతూ, ఐస్‌ క్రీమ్‌ తింటూ సరదాగా గడపాల్సిన సమయంలో నాకు అలవాటులేని నటనా జీవితంలో అడుగుపెట్టడం నా తల్లిని కాపాడుకునేందుకేనన్న విషయం గుర్తుకొస్తే ఏడుపొస్తుంది. నాకు యిష్టమైన తిండి తినేందుకు లేదు. అసభ్యకరమైన దుస్తులు వేసుకొమ్మని దర్శకుల ఆజ్ఞ పాటించకపోతే మనుగడ లేదు. రోజూ ఇంటికొచ్చి కంటినిండా ఏడ్చేదాన్ని. అలర్జీకి గురిచేసే నకిలీ ఆభరణాలు ధరిస్తుంటే నా పరిస్థితికి నాకే ఏడుపొచ్చేది. తలంటి స్నానం చేసినా నా తలవెంట్రుకులకు అంటిన హెయిర్‌ స్ప్రే వాసనలు వదిలేవి కావు. ఆ వాసనంటే నాకు చిరాకు కలిగేది. ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకి లాక్కెళ్లినంత పనిచేసేవారు నిర్మాతల సిబ్బంది. పదహారేళ్ల వయసులో నేను అనుభవించిన ఈ కర్కశత్వం మరే ఇతర బాలికకూ అంటరాదని దేవుని ప్రార్దిస్తున్నా’’... ఈ మాటలు అన్నది చిన్న చిన్న వేషాలు వేసే ఎక్స్‌ ట్రా నటి కాదు. బాలీవుడ్‌లో అందాల తారగా, వయసు పైబడినా అందం తరగని అభినేత్రిగా రాణించిన రేఖ అనే భానురేఖ. రేఖ అచ్చం మన తెలుగమ్మాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తన తొలి ప్రస్థాన అనుభవాలను పంచుకున్న ఈ ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌ 65వ పుట్టినరోజు అక్టోబరు 10న. ఈ సందర్భంగా రేఖ గురించిన కొన్ని విశేషాలు సితార డిజిటల్‌ పాఠకుల కోసం....


చిన్నతనంలో కష్టాలతో...
రేఖ అనబడే భానురేఖ తమిళ హీరో జెమిని గణేశన్, తెలుగు నటి పుష్పవల్లిల కుమార్తె. 1954 అక్టోబరు 10న రేఖ మద్రాసులో జన్మించింది. అయితే రేఖ తన కుమార్తె అని చెప్పుకోవడానికి జెమిని గణేశన్‌ ఇష్టపడలేదు. ఎందుకంటే పుష్పవల్లిని అతడు లాంఛనంగా పెళ్లి చేసుకోలేదు కనుక. ఆమె బాలీవుడ్‌లో గొప్ప హీరోయిన్‌గా ఎదుగుతున్నప్పుడు జెమిని ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా, చిన్ననాటి చెడు అనుభవాలు ఆమెను తండ్రికి దూరం చేశాయి. రేఖ చదువు సంధ్యలు మద్రాసులోని సేక్రెడ్‌ హార్ట్‌ బాలికల పాఠశాలలో కొనసాగగా, ఆమె తన పదమూడవ సంవత్సరంలోనే ఆ చదువుకు స్వస్తి చెప్పింది. తన తల్లికి సహాయపడాలని ఉదరపోషణ కోసం సినిమాల్లో నటించేందుకే చదువుకు స్వస్తి చెప్పేసిందంటే ఆశ్చర్యంగా వుంటుంది. రేఖ తన మాతృభాషను తెలుగు అనే చెప్పుకునేది. 1966లో ప్రముఖ దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో రేఖ తల్లి పుష్పవల్లి రమణారెడ్డి భార్యగా నటించగా, అదే సినిమాతో రేఖ తన పన్నెండవ ఏటనే తెరంగేట్రం చేసింది. బేబీ భానురేఖగా ఆమె త్యాగరాజు కూతురుగా నటించింది. మూడేళ్ల తరువాత 1969లో కన్నడ దర్శక నిర్మాత నిర్మించిన ‘ఆపరేషన్‌ జాక్‌ పాట్‌ నల్లి ‘సీఐడీ 999’ అనే స్పై చిత్రంలో రాజకుమార్‌ సరసన నటించింది. హీరోయిన్‌గా రేఖకు ఇదే తొలి చిత్రం. తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి 1970లో ‘సావన్‌ భాదోం’ చిత్రంలో పదహారేళ్లకే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాకి ముందు 1969లోనే రేఖ ‘అంజనా సఫర్‌’ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అందులో హీరో బిశ్వజిత్‌. తనకు తెలియకుండా ఒకానొక సన్నివేశంలో బిశ్వజిత్‌ గట్టిగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. తన అంగీకారం లేకుండా అటువంటి సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకునికి రేఖ వార్నింగ్‌ ఇచ్చింది. ఆ సన్నివేశం విదేశీ మార్కెట్‌ కోసమని దర్శకుడు నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఆ ముద్దు సన్నివేశం ‘లైఫ్‌’ (ఏసియన్‌) పత్రికలో ముఖచిత్రంగా రావడంతో రేఖ కంగు తిన్నది. తరువాత ఆ సినిమా సెన్సారు చిక్కుల్లో పడి విడుదలకు కూడా నోచుకోలేదు. తొమ్మిదేళ్ల తరువాత ఆ కథను ‘దో షికారి’ పేరుతో కుల్జిత్‌ పాల్‌ పునర్నిర్మిస్తే అందులో రేఖ వినోద్‌ ఖన్నా సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. బొంబాయిలో అడుగుపెట్టి నటనకు ఒప్పుకుంది కేవలం అనారోగ్యంలో వున్న తన తల్లిని రక్షించుకునేందుకు, కష్టాల్లో వున్న తన కుటుంబాన్ని ఆదుకునేందుకు మాత్రమే అన్నది నిజం. హిందీ చిత్రసీమలో ప్రవేశించినప్పుడు ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. హిందీ పలకడం చేతనయ్యేదికాదు. సహచర నటీనటులతో మాట్లాడలేకపోయేది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని, ఒక దక్షిణాది అమ్మాయి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నెట్టుకురావడం మాటలు కాదు. 1970లో చిన్ని బ్రదర్స్‌ పతాకం మీద పి.ఆదినారాయణరావు, అంజలీదేవి ‘అమ్మ కోసం’ చిత్రం నిర్మించారు. అందులో కృష్ణ, కృష్ణంరాజు హీరోలు కాగా రేఖ, కృష్ణంరాజు సరసన హీరోయిన్‌గా తొలిసారి తెలుగులో నటించింది. తరువాత దర్శక నిర్మాత మోహన్‌ సెగల్‌ నిర్మించిన ‘సావన్‌ భాదోం’ సినిమాలో నవీన్‌ నిశ్చల్‌ సరసన తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘వీటుక్కు ఒరు పిళ్ళై’గా పునర్నిర్మించారు. ఈ సినిమా విజయంతో రేఖ రాత్రికి రాత్రే స్టారై పోయింది.

70వ శకంలో బాలీవుడ్‌ రాణిగా...
గ్లామర్‌ గాళ్‌గా కనిపించే రేఖకు తరువాత వచ్చిన పాత్రలన్నీ అలాంటివే. నటనకు ఏమాత్రం అవకాశం లేని పాత్రలవి. అయితే ఆ సినిమాలన్నీ విజయవంతం కావడం రేఖ అదృష్టం. 1972లో మన్మోహన్‌ దేశాయి నిర్మించిన ‘రామ్‌ పుర్‌ కా లక్ష్మణ్‌’ చిత్రంలో రణధీర్‌ కపూర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఇదే చిత్రాన్ని తమిళంలో ‘మంగుడి మైనర్‌’గా పునర్నిర్మించారు. తరువాతి సంవత్సరం కపిలేశ్వర్‌ పిక్చర్స్‌ పతాకంపై అర్జున్‌ హింగోరని నిర్మాణ దర్శకత్వంలో ‘కహాని కిస్మత్‌ కి’ సినిమా విడుదలైంది. ఇందులో రేఖా ధర్మేంద్ర సరసన హీరోయిన్‌గా నటించింది. కళ్యాన్‌ జి ఆనంద్‌ జి సంగీత సంరంభంతో సినిమా హిట్‌గా నిలిచింది. తరువాత 1974లో రేఖ సునీల్‌దత్‌ సరసన ‘ప్రాణ్‌ జాయే పర్‌ వచన్‌ న జాయే’ సినిమాలో నటించింది. ఒ.పి.నయ్యర్‌ సూపర్‌ హిట్‌ పాటలతో ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టయింది. ‘చైన్‌ సే హమ్‌ కో కభీ’ అనే పాటను ఆలపించిన ఆశాభోస్లేకు ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ బహుమతి దక్కింది. రేఖ దక్షిణాది రూపురేఖలతో కాస్త నల్లగా వుండేది. దాంతో ఆమెను ‘అగ్లీ డక్లింగ్‌’ అంటూ సంబోధించేవారు. కొందరు ఇతర హీరోయిన్లతో పోలుస్తూ అవహేళన చేస్తుండేవారు. అందుకు రేఖ రెండు పరిష్కార మార్గాలు ఆలోచించింది. మొదటిది తన రూపురేఖలు మార్చుకోవడం. రెండవది నటనలో సత్తా చూపడం. వీటిని చాలెంజ్‌గా తీసుకొని శ్రమించి విజయాన్ని అందుకుంది. అచ్చం ఉత్తరాది అమ్మాయిలా మార్పు చేసుకుంది. హిందీ భాషాజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంది. నాజూకుగా ఉండేందుకు ఆహార నియమాలను పాటిస్తూ అందాల నటిగా తయారైంది. 1973లో హృషికేష్‌ ముఖర్జీ నిర్మించిన ‘నమక్‌ హరామ్’లో రేఖా, అమితాబ్‌ బచన్‌ సరసన తొలిసారి హీరోయిన్‌గా నటించింది. 1976లో దులాల్‌ గుహ నిర్మించిన ‘దో అంజానే’ సినిమాలో కూడా రేఖా అమితాబ్‌ బచన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. అమితాబ్‌తో భుజం భుజం రాసుకుంటూ సన్నిహితంగా మెలిగింది. తదనంతర కాలంలో వీరిద్దరూ మంచి హిట్‌ పెయిర్‌గా గణుతికెక్కారు. ఈ సినిమాలో నటించిన ప్రేమ్‌ చోప్రాకు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటుడి బహుమతి లభించింది. సినిమా సూపర్‌ హిట్టయింది. ఇదే సినిమాను తెలుగులో ‘మావారి మంచితనం’ పేరుతోను, కన్నడంలో ‘ఆసెయా బలే’ పేరుతో పునర్నిర్మించారు. అందరిచేత ‘అగ్లీ డక్లింగ్‌’ అని పిలిపించుకున్న రేఖ, ప్రకాష్‌ మెహ్రా నిర్మించిన ‘ముఖద్దర్‌ కా సికందర్‌’ (1978)లో అమితాబ్‌ సరసన అద్భుతంగా నటించి అందరి నోళ్లూ మూయించింది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో ఇదే అతిపెద్ద వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. బాక్సాఫీస్‌ హిట్‌గా నిలవడమే కాకుండా సోవియట్‌ యూనియన్‌ లో కూడా బాగా ఆడింది. దీనినే తెలుగులో ‘ప్రేమ తరంగాలు’ (1980)గా పునర్నిర్మించారు.

కొనసాగిన గ్లామర్‌ శకం...
హృషికేష్‌ ముఖర్జీ 1980లో నిర్మించిన ‘ఖూబ్‌ సూరత్‌’ సినిమాలో రేఖాకు అత్యంత ప్రతిష్టాకరమైన మంజు దయాళ్‌ పాత్రను రూపొందించి ఆమె నుంచి మంచి కామెడీ నటన రాబట్టారు. ఈ సినిమాలో నటనకు రేఖా ఫిలింఫేర్‌ వారి నుంచి ఉత్తమ నటి బహుమతి గెలుచుకుంది. ఆమె అమితాబ్‌ బచన్‌తో నటించిన ‘ఆలాప్‌’, ‘ఇమాన్‌ ధరమ్’, ‘గంగా కి సౌగంధ్‌’, ‘కస్మే వాదే’, ‘గోల్‌ మాల్‌’, ‘మిస్టర్‌ నట్వర్‌ లాల్‌’, ‘సుహాగ్‌’, ‘రామ్‌ బలరామ్’, ‘చశ్మే బుద్ధూర్‌’ సినిమాలు అన్నీ బాగా ఆడాయి. వీరిద్దరూ వెండితెరమీదే కాదు, తెర వెనుక కూడా ప్రేమాయణం సాగించారనే వార్తలు ఆరోజుల్లో దావానలంలా చిత్రసీమను ఊపేశాయి. ఈ సంబంధంతో అమితాబ్‌-జయభాధురిల మధ్య అపోహలు చోటు చేసుకున్నాయి. 1981లో యాష్‌ చోప్రా నిర్మించిన ‘సిల్సిలా’ సినిమా వీరిద్దరి సంబంధం నేపథ్యంలో నడిచింది. అసలు ఈ సినిమాలో అమితాబ్‌ సరసన పర్వీన్‌ బాబి, స్మితా పాటిల్‌ను బుక్‌ చేయాలని యాష్‌ చోప్రా భావించారు. కానీ అమితాబ్‌ సలహా మేరకు రేఖా, జయభాధురిల చేత నటింపజేశాడు. ఈ సినిమా తరువాత రేఖతో అమితాబ్‌ సంబంధాలు మసకబారాయి. అమితాబ్‌తో రేఖ నటించిన ఆఖరి చిత్రం ‘సిల్సిలా’. ఈ సినిమా ఎందుకో కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. కానీ, తరువాతి కాలంలో ఈ సినిమా ఉత్తమ క్లాసిక్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు, యాష్‌ చోప్రాకు బాగా నచ్చిన సినిమా ఇదేనని ఎన్నో సమావేశాల్లో ఆయనే చెప్పడం విశేషం. 1988లో వచ్చిన ‘ఖూన్‌ భరీ మాంగ్‌’ సినిమాలో రేఖ నటన తారాస్థాయిని అందుకుంది. ఈ విషయాన్ని ‘ఎంసైక్లోపీడియా బ్రిటానికా’ పుస్తకంలో కూడా తెలియజేశారు. తొంభయ్యవ దశకంలో రేఖ ప్రభంజనం కాస్త తగ్గినా, హేమామాలిని, రాఖీల లాగా రేఖ ఆంటీ పాత్రలు వెయ్యలేదు. తన గ్లామర్‌ను అలాగే కాపాడుకుంటూ హీరోయిన్‌ పాత్రలనే పోషిస్తూ వచ్చింది. ఈ దశాంకం తొలి రోజుల్లో వచ్చిన ‘మేరా పతి సిర్ఫ్‌ మేరా హై’, ‘అమీరి గరీబి’ మొదలైన సినిమాలు వెలుగు చూడకుండానే తప్పించుకున్నాయి. అయితే కె.సి.బొకాడియా నిర్మించిన ‘ఫూల్‌ బనే అంగారే’ (1991) సినిమా బాక్సాఫీస్‌ హిట్టయింది. ఈ చిత్రంలో రేఖ రజనికాంత్‌ సరసన నటించడం విశేషం. అయితే ‘ఇన్సాఫ్‌ కి దేవి’ (1992), ‘అబ్‌ ఇన్సాఫ్‌ హోగా’ (1995), ‘ఉడాన్‌’ (1997) సినిమాలు ఫ్లాపులయ్యాయి. శక్తి సామంత నిర్మించిన ‘గీతాంజలి’ సినిమాలో రేఖా ద్విపాత్రాభినయం చేసింది. అయితే ఈ దశకంలో రేఖా నటించిన సినిమాలు విమర్శలకు గురయ్యాయి. వాటిలో ‘కామ సూత్రా’, ‘ఖిలాడియోం కా ఖిలాడి’ సినిమాలను ఉదహరించాలి. ‘కామ సూత్రా’ సినిమా మీరా నాయిర్‌ నిర్మించిన విదేశీ చిత్రం. ఇందులో రేఖ కామ సూత్రాలను బోధించే ఉపాధ్యాయినిగా నటించింది. ‘ఖిలాడియోం కా ఖిలాడి’ సినిమా బాగానే ఆడింది. బాసు భట్టాచార్య నిర్మించిన ‘ఆస్థా ఇన్‌ ప్రిజన్‌ ఆఫ్‌ స్పి్రంగ్‌’ సినిమా కూడా విమర్శలకు గురయ్యింది. తరువాత రేఖా ‘బులండి’, ‘లజ్జ’ సినిమాలలో నటించింది. రాకేశ్‌ రోషన్‌ నిర్మించిన ‘కోయి మిల్‌ గయా’ సినిమాలో రేఖా మానసికంగా ఎడుగుదలలేని ఒక యువకునికి తల్లిగా నటించింది. ఈ చిత్రం బాగా ఆడింది. 2006లో వచ్చిన ‘కుడియోంకా హై జమానా’ సెక్స్‌ కామెడీ ఘోరంగా విఫలమైంది. అయితే రాకేశ్‌ రోషన్‌ నిర్మించిన ‘క్రిష్‌’ సినిమాలో సోనియా మెహ్రా పాత్రలో రేఖా రాణించింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. గౌతమ్‌ ఘోష్‌ నిర్మించిన ‘యాత్ర’ సినిమా తరువాత రేఖా నాలుగేళ్లు సినిమాలో నటించలేదు. ‘యాత్ర’ సినిమా నేపథ్యం మంచిదే అయినా ఎందుకో సెల్యూలాయిడ్‌ మీద సరిగ్గా రాణించలేదు. తరువాత రమేష్‌ తల్వార్‌ దర్శకత్వంలో ‘ఆజ్‌ ఫిర్‌ జీనే కి తమన్నా హై’ సినిమాలో శత్రుఘ్నసిన్హా సరసన ఒక మోడరన్‌ గాయనిగా రేఖా నటించింది.


వ్యక్తిగతం...
1990లో రేఖ ముఖేష్‌ అగర్వాల్‌ అనే ఢిల్లీకి చెందిన బడా వ్యాపారవేత్తను పెళ్లాడింది. పెళ్లయిన సంవత్సరం తరువాత రేఖ లండన్‌ పర్యటనలో వుండగా ముఖేష్‌ అగర్వాల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు కూడా ముఖేష్‌ ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన దాఖలాలు వున్నాయి. అయితే ముఖేష్‌ రాసిన మరణ వాంగ్మూల పత్రంలో తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 1973లో రేఖ వినోద్‌ మెహ్రాను వివాహమాడినట్లు వదంతులు వ్యాపించినా, సిమి గారేవాల్‌కు ఇచ్చిన టెలివిజన్‌ ముఖాముఖిలో ఆ వదంతిని రేఖ ఖండించింది. తన కుటుంబానికి వినోద్‌ మెహ్రా మంచి మిత్రుడని, ఆప్తుడని తెలియజేసింది.

మరిన్ని విశేషాలు...
* 1979 నుండి 2007 వరకు నటించిన సినిమాలలో 12 సార్లు ఉత్తమ నటి బహుమతికోసం రేఖ నామినేట్‌ అయ్యింది. వాటిలో ‘ఖూబ్‌ సూరê’Â, ‘ఖూన్‌ భారీ మాంగ్‌’, ‘ఖిలాడియోం కా ఖిలాడి’ సినిమాలకు ఆమె ఉత్తమ నటి బహుమతి అందుకుంది. 2003 రేఖకు ఫిలింఫేర్‌ వారి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. శాంసంగ్‌ దివా బహుమతిని, ఇండియన్‌ ఫిలిం అకాడమీ బహుమతిని రేఖ గెలుచుకుంది.
* బెంగాల్‌ ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ వారు ‘ఉత్సవ్‌’ సినిమాలో నటనకు ఉత్తమ నటి బహుమతిని ఆమెకు ప్రదానం చేశారు. రెండు సార్లు ఆమెకు స్టార్‌ స్కీన్ర్‌ బహుమతి, జీ సినీ అవార్డు లభించింది. స్టార్‌ డస్ట్‌ సంస్థ రేఖకు ‘రోల్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2006 మరియు 2012’ బహుమతి, ఎడిటర్స్‌ చాయిస్‌ ఐకాన్‌ బహుమతి ప్రదానం చేశారు. ఫిలిం వరల్డ్, లాక్మే టైమ్‌ లెస్‌ బ్యూటీ, మహా స్టైల్, బిగ్‌ స్టార్‌ ఎటర్నల్‌ బహుమతులు కోకొల్లలుగా రేఖకు సంక్రమించాయి. రేఖ నలభై ఏళ్ళు హిందీ చిత్రరంగంలో హీరోయిన్‌గా వెలిగింది. ఇంతకాలం హీరోయిన్‌గా కొనసాగిన వాళ్లు వేరెవరూ లేరు. 2010లో రేఖకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. రేఖ ప్రస్తుతం రాజ్య సభ (నామినేటెడ్‌) సభ్యురాలిగా వున్నారు.
* రేఖకు ప్రపంచమంతా చుట్టిరావాలనే కోరిక బలీయంగా వుండేది. అందుకే ఎయిర్‌ హోస్టెస్‌ కావాలని ప్రయత్నించింది. అందుకు కావలసిన వయసు లేకపోవడంతో ఆమె అభ్యర్ధనను ఎయిర్‌ ఇండియా త్రోసిపుచ్చింది. ఆమె చదువుకున్న కాన్వెంట్‌ స్కూలులో ఐరిష్‌ సన్యాసినిలు వుండేవారు. తను కూడా ‘నన్‌’ కావాలని కోరుకునేది. కానీ స్కూలు నుంచి మధ్యలో వచ్చేయడంతో ఆ కోరిక నెరవేరలేదు.
- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.