అందాల తారక... సైరాబాను
‘నీ గురించి నేను ఎలా భావించుకుంటున్నానో, నీవు సెలవిస్తే తెలియజేస్తాను. నువ్వంటే నాకు ప్రాణం... నిన్ను నేను ప్రేమిస్తున్నాను’ అనే భావన వచ్చేలా షమ్మికపూర్‌ ‘జంగ్లీ’ సినిమాలో హీరోయిన్‌ సైరాబానుతో విన్నవిస్తాడు... ‘ఎహసాన్‌ తేరా హోగా ముఝ్‌ పర్, దిల్‌ చాహతా హై వో కేహనే దో’ అంటూ మహమ్మద్‌ రఫీ పాడే పాటలో. అదే స్వరంలో లతామంగేష్కర్‌ గొంతులో మరో సన్నివేశంలో సైరాబాను షమ్మీకపూర్‌కు జవాబిస్తుంది, అతని ప్రేమకు జోహార్లు అర్పిస్తూ. సైరాబాను తొలిసారి నటించిన ‘జంగ్లీ’ సినిమా ఒక పెద్ద మ్యూజికల్‌ హిట్‌. ఆ ఒక్క సినిమాతోనే సైరాబాను హిందీ చిత్రసీమలోని స్టార్డమ్‌ అనే సోపానికి ఎగబాకింది. అందుకే ‘కెహనా హై...కెహనా హై, ఆజ్‌ తుమ్సే ఏ పెహలీ బార్‌... హో తుమ్‌ హి, తో లయ్‌ హో, జీవన్‌ మే మేరే, ప్యార్‌ ప్యార్‌ ప్యార్‌’ అంటూ ‘పడోసన్‌’ సినిమాలో సునీల్‌ దత్‌ సైరాబాను వెంటపడ్డాడు. అలా సైరాబాను తొలి నాలుగు సినిమాలతోనే అందలమెక్కింది, ఆమె తల్లి నసీం బాను పారంపరను కొనసాగిస్తూ. హిందీ చలనచిత్ర సీమలో కొద్దికాలమే వున్నా, ఆమె జ్ఞాపకాలు మరువరానివి. ఆమె నటించిన సినిమాల్లో అధిక శాతం విజయవంతమైనవే. ఆ అందాల దేవేరి 75వ జన్మదినం ఆగస్టు 23న. ఈ సందర్భంగా సైరాబాను చలనచిత్ర విశేషాలను తెలుసుకుందాం...


బ్యూటీ క్వీన్‌ తొలిరోజులు...
అలనాటి బాలీవుడ్‌ తార సైరాబానుని సైరాబానో అని కూడా సంబోధిస్తుంటారు. ‘సైరా’ అంటే ‘దక్షత’ లేక ‘సంతుష్ట’ అని అర్ధం. ‘బానో’ అంటే రాజకుమారి అని అర్ధం. అటువంటి అందాల రాజకుమారి సైరాబాను 23 ఆగస్టు 1944న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జన్మించింది. ఆమె తండ్రి పాకిస్తాన్‌ చిత్ర నిర్మాత మిలన్‌ ఎహసాన్‌−ఉల్‌−హఖ్, తల్లి నసీంబాను. నసీంబాను పాతతరం హీరోయిన్‌. సోహ్రాబ్‌ మోడీ నిర్మించిన ‘ఖూన్‌ కా ఖూన్‌’ (1935) సినిమాతో నటప్రస్థానం మొదలెట్టి, ‘పుకార్‌’, ‘అనోఖి అదా’, ‘శీష్‌ మహల్‌’, ‘షబిస్తాన్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. 1935−57 మధ్య కాలంలో నసీంబానుని ‘బ్యూటీ క్వీన్‌’గా వర్ణించేవారు. అంతేకాదు, ఆమెను ‘భారతీయ సినిమా తొలి సూపర్‌ స్టార్‌’గా కూడా కీర్తించేవారు. ఆమెకు సైరాబాను మొదటి సంతానం. స్వాతంత్య్రానంతరం నసీం బాను భర్త మిలన్‌ ఎహ్సాన్‌−ఉల్‌−హఖ్‌ పాకిస్తాన్‌లో స్థిరపడగా, నసీం బాను మాత్రం భారత్‌లోనే ఉండిపోయింది. తరువాత ఆమె ఇంగ్లాండ్‌ వెళ్లిపోయి సైరాబానుని, కొడుకు సుల్తాన్‌ అహ్మద్‌ని అక్కడే చదివించి పెద్దచేసింది. సైరాబాను పూర్వీకులంతా సినిమా ప్రపంచానికి సుపరిచితులే. ఆమె మేనకోడలు షహీన్‌ బాను కూడా సినిమా నటే. . 1961లో సుబోద్‌ ముఖర్జీ నిర్మించిన ‘జంగ్లీ’ సినిమాతో షమ్మికపూర్‌ సరసన తొలిసారి సినిమా తెరమీద అరంగేట్రం చేసింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో సైరాబాను అంటే హిందీ సినీ అభిమానులకు ప్రీతిపాత్రమైన పేరుగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్‌ బహుమతి కోసం ప్రతిపాదించారు కూడా. ఈ సినిమాలో నటించినప్పుడు సైరాబానుకు సంభాషణలు పలకడంలో తర్ఫీదు ఇచ్చింది ఆ సినిమా రచయిత ఆఘాజాని కష్మేరి. ‘జంగ్లీ’ సినిమాతో మొదలైన సైరాబాను ప్రస్థానం పది సంవత్సరాలు అప్రతిహతంగా నడిచిపోయింది. ఆమె నటించిన రెండవ చిత్రం ధర్మేంద్ర, మనోజ్‌ కుమార్‌ నటించగా కృష్ణన్‌−పంజు దర్శకత్వం వహించిన ‘షాది’ (1962). సైరాబాను హీరోయిన్‌గా నటించిన అన్ని సినిమాలూ దాదాపుగా శతదినోత్సవాలు చేసుకున్నవే కావడం విశేషం. షమ్మికపూర్‌తో మన్మోహన్‌ దేశాయ్‌ దర్శకత్వంలో సైరాబాను ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. అది కూడా సూపర్‌ హిట్టే!


విజయవంతమైన సినీ ప్రస్థానం...
సైరాబాను నటించిన సినిమాలన్నీ రొమాంటిక్‌ మ్యూజికల్‌ నేపథ్యంలో వచ్చినవే. జూబిలీ నటుడు రాజేంద్ర కుమార్‌ సరసన సైరాబాను ‘ఝుక్‌ గయా ఆస్మాన్‌’, ‘ఆయీ మిలన్‌ కి బేలా’ హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే బిశ్వజిత్‌ సరసన ‘ఏప్రిల్‌ ఫూల్‌’ హిట్‌ చిత్రంలో నటించింది. జాయ్‌ ముఖర్జీ సరసన ’ఆవో ప్యార్‌ కరే’, ‘సాజ్‌ అవుర్‌ ఆవాజ్‌’, ‘దూర్‌ కి ఆవాజ్‌’, ‘ఏ జిందగీ కిత్నీ హసీ హై’, ‘షాగిర్ద్‌’ వంటి ఇదు సినిమాల్లో సైరాబాను నటించడం విశేషం. ‘ఏ జిందగీ కిత్నీ హసీ హై’ సినిమాలో సైరాబాను ద్విపాత్రాభినయం చేసింది. 1966లో దిలీప్‌ కుమార్‌ను పెళ్ళాడాక సైరాబాను నటించిన తొలి చిత్రం రాజేంద్రకుమార్‌ హీరోగా నటించిన ‘అమన్‌’(1967). పెళ్ళయిన తరవాత కూడా సైరాబాను పదేళ్ళపాటు సినిమాల్లో నటిస్తూనే వుంది. హాస్యనటుడు మెహమూద్‌ నిర్మించిన ‘పడోసన్‌’ సినిమాలో సునీల్‌ దత్‌ సరసన నటించగా అది పెద్ద హిట్టయింది. 1970లో భీమ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ‘గోపి’ (తెలుగులో పల్లెటూరి చిన్నోడు) సినిమాలో భర్త దిలీప్‌ కుమార్‌ సరసన సైరాబాను నటించింది. బి.ఆర్‌. చోప్రా నిర్మించిన ’ఆద్మీ అవుర్‌ ఇన్సాన్‌’లో ధర్మేంద్ర సరసన హీరోయిన్‌గా నటించింది. దేశభక్తి నేపథ్యంలో మనోజ్‌ కుమార్‌ నిర్మించిన రెండవ చిత్రం ‘పూరబ్‌ అవుర్‌ పశ్చిమ్’ లో సైరాబాను నటించింది. సస్పెన్స్‌ కామెడీ విక్టోరియా 203లో హీరో నవీన్‌ నిశ్చల్‌కు జోడీగా, ఆదుర్తి సుబ్బారావు నిర్మించిన ‘జ్వర్‌ భాటా’ (తెలుగులో దాగుడు మూతలు) సినిమాలో ధర్మేంద్ర సరసన హీరోయిన్‌గా సైరాబాను నటించింది. ఆమె 1974లో దిలీప్‌ కుమార్‌ సరసన నటించిన మరో చిత్రం తపన్‌ సిన్హా నిర్మించిన ‘సగీనా’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధేందు రాయ్‌కి ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. బిగ్‌−బి అమితాబ్‌ బచన్‌ సరసన 1975లో వచ్చిన మరొక బి.ఆర్‌. చోప్రా సూపర్‌ హిట్‌ సినిమా ‘జమీర్‌’ లో సైరాబాను హీరోయిన్‌గా నటించింది. తరవాత చెప్పుకోదగిన సినిమాలు ‘సాజిష్‌’ (ధర్మేంద్ర), ‘చైతాలి’ (ధర్మేంద్ర−హృషికేష్‌ ముఖర్జీ), ‘హీరా ఫేరి’(అమితాబ్‌ బచన్‌− ప్రకాష్‌ మెహరా), దిలీప్‌ కుమార్‌ హీరోగా నటించిన అసిత్‌ సేన్‌ చివరి చిత్రం ‘బైరాగ్‌’ (1976), ‘కాలా ఆద్మీ’ (సునీల్‌ దత్‌) మొదలైనవి. అయితే సైరాబాను నటించగా ఫ్లాప్‌ అయిన సినిమాలు కూడా లేకపోలేదు. వాటిలో ‘దామన్‌ అవుర్‌ దాగ్‌’, ‘మౌంటో’, ‘’జమీర్‌’, ‘కోయి జీతా కోయి హరా’ ముఖ్యమైనవి. సైరాబాను నటించిన ‘మేరె వచన్‌ గీత్‌ కి కసమ్’, ‘ఆరంభ్‌’ సినిమాలు వివిధ కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. వినోద్‌ ఖన్నాతో ‘ఫైసలా’ సినిమాలో నటించాక 1984లో సైరాబాను నటనకు గుడ్‌ బై చెప్పేసింది. ఉత్తమ నటి పురస్కారానికి ‘దీవానా’ సినిమాలో నటనకు సైరాబాను పేరు ప్రతిపాదనకు వచ్చినా ఫిలింఫేర్‌ బహుమతి ఆమెకు దక్కలేదు.


మరిన్ని విశేషాలు...
* సైరాబాను సూపర్‌ స్టార్‌ రాజేష్‌ ఖన్నాతో మాత్రం నటించలేకపోయింది. తెలుగు సినీ దర్శకనిర్మాత నిర్మించిన ‘చోటి బహు’ (1971−తెలుగులో ముద్దుబిడ్డ) సినిమాలో తొలుత సైరాబానుని తొలుత హీరోయిన్‌గా బుక్‌ చేసి రెండురోజుల షూటింగ్‌ కూడా జరిపారు. తరవాత ఆమెకు జ్వరం రావడం, అది తగ్గటానికి చాలా వ్యవధి కావలసి రావడంతో సైరాబాను స్థానంలో షర్మీలా టాగూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.


*
సైరాబానుకు దిలీప్‌ కుమార్‌ అంటే యెంతో ఇష్టం. తన పన్నెండవ ఏట ఆమె దిలీప్‌ కుమార్‌ను చూసింది. అప్పుడు దిలీప్‌కు 34 ఏళ్ళు. అప్పటినుంచే ఇద్దరి మధ్యా తెలియని ప్రేమ అంకురించింది. ‘మొఘల్‌−ఎ−ఆజం’ సినిమా ప్రీమియర్‌లో సైరాబాను దిలీప్‌ని కలుసుకుంది. అయితే దిలీప్‌ కుమార్‌కు మొదట ఆస్మా అనే మహిళతో పెళ్లయింది. దిలీప్‌ కుమార్‌ ఆమెతో అతి తక్కువ కాలం కాపురం చేశారు. ‘జంగ్లీ’ (1961) సినిమా విడుదల సందర్భంగా సైరాబాను దిలీప్‌ దగ్గరైంది. ‘ఝుక్‌ గయా ఆస్మాన్‌’ సినిమా నిర్మాణ సమయంలో ఇద్దరూ పెళ్ళాడాలని నిశ్చయానికొచ్చారు. అప్పటికే దిలీప్‌ కుమార్‌ మధుబాల విషయంలో భగ్నహృదయుడై వున్నాడు. తరవాత 1966 అక్టోబరులో దిలీప్‌ కుమార్‌ సైరాబానును పెళ్ళాడారు. అప్పుడు సైరాబానుకు 22 ఏళ్ళు కాగా, దిలీప్‌ వయసు 44 ఏళ్ళు. సైరాబాను తల్లి నసీం బాను ‘ఇస్లాం ఖత్రే మే హై’ అంటూ ఈ పెళ్ళికి సుముఖత వ్యక్తం చేసింది.

*
కొన్ని ఆధారాలనుబట్టి చూస్తే సైరాబాను మొదట రాజేంద్రకుమార్‌ను వివాహమాడాలని తలపోసింది. రాజేంద్రకుమార్‌ అప్పటికే వివాహితుడు కావడంతో సైరాబాను తల్లి అందుకు ఒప్పుకోలేదు. సైరా తల్లి దిలీప్‌ కుమార్‌ వద్దకు వెళ్లి ఆమెకు నచ్చజెప్పమని కోరింది. దిలీప్‌ కుమార్‌నే పెళ్లాడమని సలహా ఇచ్చింది కూడా సైరా తల్లే.


*
సైరాబాను− దిలీప్‌ కుమార్‌లకు 1972లో ఒక కొడుకు పుట్టాల్సి వుండగా, ఎనిమిదవ మాసంలో ఆమెకు రక్తపోటు అధికం కావడంతో, డాక్టర్ల సలహామేరకు గర్భాన్ని విచ్చిన్నం చేయాల్సివచ్చింది. తరవాత వారసులు వద్దనే నిర్ణయానికి రావడంతో వారికి సంతానం లేకుండా పోయింది.


*
1963−69 మధ్యకాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హిందీ హీరోయిన్లలో సైరాబాను మూడవ స్థానంలో వుంది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లు కావడమే ఇందుకు ముఖ్య కారణం. 1971−76 మధ్య కాలంలో ఆమె నాలుగవ స్థానంలో నిలిచింది.* సైరాబాను తొలి సినిమా ‘జంగ్లీ’. అందులో హీరోగా నటించిన షమ్మి కపూర్‌ తో 14 సంవత్సరాల తరవాత బి.ఆర్‌.చోప్రా నిర్మించిన ‘జమీర్‌’ సినిమాలో సైరాబాను అతనికి కూతురుగా నటించింది.

                                                                                                                                                       
 − ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.