మనసుతో పాడిన సైగల్
కుందన్ లాల్ సైగల్... ఆ పేరు వింటేనే సంగీత అభిమానుల తనువు పులకించి పోతుంది. సైగల్ ని తొలి హిందీ సూపర్ స్టార్ గా భావించేవారు. కలకత్తాలో వుంటూ హిందీ చిత్రసీమకు సంగీతపరంగా, నటనపరంగా యెనలేని సేవలు అందించిన తొలితరం గాయకుడు, నటుడు ఈ కుందన్ లాల్ సైగల్. భావం ఉట్టిపడేలా గుండెల లోతుల్లోంచి పాటలు ఆలపించిన సైగల్ భావితరం హిందీ గాయకులకు మార్గదర్శిగా నిలిచారు. తెలుగు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కు సైగల్ అంటే ఎనలేని భక్తి, అభిమానం. 1932-47 మధ్యకాలంలో హిందీ చిత్రరంగాన్ని అటు తన నటనతో, ఇటు వైవిధ్యమైన గళసంపదతో అభిమానుల్ని సమ్మోహనపరచిన సైగల్ ను తరవాతి కాలంలో గాయకులుగా రాణించిన కిషోర్ కుమార్, ముఖేష్ లు మొదట్లో అనుకరించే ప్రయత్నం చేశారు. అంటే సైగల్ ప్రభావం హిందీ సంగీతం మీద యెంత వుందో బేరీజు వేయవచ్చు. ఆయన రిహార్సల్స్ లేకుండా పాడిన ఎన్నో పాటల్ని అలాగే రికార్డు చేసిన సందర్భాలు అనేకం. ఏప్రిల్  11న కుందన్ లాల్ సైగల్  జయంతి. ఆ సందర్భంగా సైగల్ గురించిన కొన్ని విశేషాలు...


జననం... బాల్యం...
పంజాబ్ లోని నవాషేహర్ లో కుందన్ లాల్ సైగల్ ఏప్రిల్ 11 1904 న జన్మించారు. చిన్నతనం నుంచి సైగల్ కు సంగీతమంటే ప్రాణం. సైగల్ తల్లి కేసరీబాయి అతని అభిరుచికి అనుగుణంగా సూఫీ కళాకారుడు పీర్ సల్మాన్ యూసఫ్ వద్ద శిక్షణ ఇప్పించింది. సైగల్ తండ్రి అమర్ చంద్ సైగల్ జమ్మూ కాశ్మీర్ రాజు గారి దివాణంలో తహసీల్దారుగా పనిచేసేవారు. పన్నెండేళ్ళ వయసులో సైగల్ తన గళాన్ని విప్పి ప్రతాప్ సింగ్ రాజావారి సభలో భజన గీతాలు, గజళ్ళు వినిపించారు. సైగల్ ఎక్కువగా చదువుకోలేదు. పదమూడవ ఏట తన గొంతులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ రోజుల్లో సైగల్ చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. కొంతకాలం రెమింగ్టన్ టైప్ రైటర్ల విక్రయాలను అమ్మే వుద్యోగం నిర్వహించాడు. తరవాత మెల్లగా పంజాబ్ రైల్వేలో టైమ్ కీపర్ ఉద్యోగం సంపాదించగలిగాడు. కొంతకాలం హోటల్ మేనేజరుగా కూడా పని చేశాడు. అలా ఉద్యోగాలు చేస్తూ కలకత్తా వచ్చాడు. సంగీతంపట్ల మక్కువ విడనాడలేదు. తీరిక సమయాల్లో రాగాలు తీస్తూవుంటే స్నేహితులు తన్మయత్వం చెందేవారు. సైగల్ స్నేహితులముందు పాడడం హిందూస్తాన్ రికార్డింగ్ కంపెనీలో పనిచేసే ఒకవ్యక్తి వినడం జరిగింది. అతని చొరవతో సైగల్ ఆ రికార్డింగ్ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అదే సైగల్ ప్రతిభను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు పడిన ముందడుగు. సైగల్ పాడగా రికార్డైన మొదటి పాట దేవగాంధర్వ రాగంలో అమరిన ‘ఝులానా ఝులావో రీ’ అనే గీతం. ఆ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. భైరవి రాగంలో టుమ్రీలు సైగల్ ఆలపించినట్లు మరొకరు ఆలపించలేరని ఆరోజుల్లో చెప్పుకునేవారు. “రాగం అనే భాషతో సైగల్ సంగీతాభిమానుల హృదయాలను దోచుకున్నాడు” అంటూ పత్రికలూ శ్లాఘించాయి. గానంతోబాటు సినిమాల్లో నటించటానికి కూడా సైగల్ కు అవకాశాలు రాసాగాయి.


కలకత్తా న్యూ థియేటర్స్ లో సైగల్...

సంగీత దర్శకులు రాయ్ చంద్ బోరల్, పంకజ్ మల్లిక్ లు ఈ 26 ఏళ్ళ సంగీత నిధిని బి.ఎన్. సర్కార్ కు పరిచయం చేశారు. సర్కార్ కలకత్తాలో న్యూ థియేటర్స్ సినిమా నిర్మాణ సంస్థ సంస్థాపకుడు. నెలకు రెండు వందలు జీతం ఇచ్చే పధ్ధతి మీద సర్కార్ సైగల్ ను న్యూ థియేటర్స్ లోకి తీసుకున్నాడు. ప్రేమాంకుర్ అతోర్తి దర్శకత్వంలో సర్కార్ నిర్మించిన ‘మొహబ్బత్ కే ఆంసూ’ (1932) అనే ఉర్దూ సినిమాలో సైగల్ ను ప్రధాన పాత్రలో పరిచయం చేశారు. సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా న్యూ థియేటర్స్ వారు తరవాతి కాలంలో నిర్మించిన అనేక సినిమాల్లో సైగల్ కు నటించే అవకాశం దక్కింది. అదే సంవత్సరం న్యూ థియేటర్స్ వారు సైగల్ హీరోగా ‘జిందా లష్’ చిత్రాన్ని విడుదల చేశారు. రత్తన్ బాయ్ యిందులో హీరోయిన్ గా నటించింది. ఆర్.సి.బోరల్ సంగీత దర్శకత్వంలో సైగల్ ఆలపించిన ‘లాగి కరేజ్వా మే చొట్’ అనే పాట బాగా పాపులర్ అయింది. అయితే మొదటి సినిమాలాగే ఈ చిత్రం కూడా విజయవంతం కాలేదు. సైగల్ నటించిన మూడవ చిత్రం న్యూ థియేటర్స్ వారే నిర్మించిన ‘సుభా కా సితారా’. అదే దర్శకుడు, అదే హీరోయిన్, అదే సంగీత దర్శకుడుతో నిర్మితమైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలా న్యూ థియేటర్స్ వారు సైగల్ హీరోగా నిర్మించిన మూడు చిత్రాలూ ఫ్లాప్ లు గా ముద్రపడ్డాయి. 1933లో న్యూ థియేటర్స్ వారే సైగల్ హీరోగా ‘యాహుది కి లడ్కి’ చిత్రాన్ని నిర్మించారు. ఆఘా హషర్ కాశ్మీరి కవి బెంగాలిలో రచించిన నాటకం ఈ సినిమాకు ఆధారం. ఈ చిత్రంతో పంకజ్ మల్లిక్ సంగీతదర్శకుడిగా పరిచయమయ్యారు. అందులో పంకజ్ మల్లిక్ భీంపలాస్ రాగంలో స్వరపరచగా సైగల్ ఆలపించిన మీర్జా గాలిబ్ క్లాసికల్ గీతం “నుక్తాచీన్ హై ఘమ్-ఏ-దిల్” బాగా హిట్టయింది. న్యూ థియేటర్స్ సంస్థ 1934లో నితిన్ బోస్ దర్శకత్వంలో ‘చండీదాస్’ అనే చిత్రాన్ని హిందీలో నిర్మించింది. 1932 లో బెంగాలిలో వచ్చిన దేవకీ బోస్ చిత్రం ‘చండీదాస్’ కి ఈ సినిమా రీమేక్. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ హిందీ చిత్రంలో సైగల్ కు జోడీగా ఉమాశశి నటించగా ఆర్.సి. బోరల్ సంగీత దర్శకత్వం వహించారు. 15 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి చండీదాస్ కుల వ్యవస్థ, అస్పృశ్యత, సమాజ వంచన వంటి అరాచాకాలపై ప్రతిఘటించడం ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రానికి పూర్తి స్థాయి ఆర్కెస్ట్రాను వాడి బోరల్ మంచి ఫలితాలను రాబట్టారు. సైగల్, ఉమా శశి ఆలపించిన యుగళగీతం ‘ప్రేమ్ నగర్ మే బనూంగీ ఘర్ మై’ జాతీయ స్థాయిలో బాగా జనరంజకమైంది.


దేవదాసుగా సైగల్...

శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ప్రముఖ నవల ‘దేవదాస్’. ఈ నవలలో ప్రధాన పాత్రధారులు దేవదాస్, పార్వతి (పారూ), చంద్రముఖి. ఈ పాత్రలు మనకు పురాణంలో కనిపించే శ్రీకృష్ణుడు, రాధ, మీరాలను పోలివుండడం యాదృచ్చికం. 1935లో బెంగాలి భాషలో ‘దేవదాస్’ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పి.సి. బరువా (ప్రమతేష్ చంద్ర బారువా) హీరోగా కూడా నటించాడు. జమున పార్వతి పాత్రను, చంద్రావతి దేవి చంద్రముఖి పాత్రను పోషించారు. తరవాత 1936 లో పి.సి. బరువా హిందీలో ‘దేవదాస్’ సినిమా నిర్మించాడు. అందులో సైగల్ దేవదాసుగా, జమున పార్వతిగా, రాజకుమారి చంద్రముఖిగా నటించారు. సైగల్ కు న్యూ థియేటర్స్ వారి ‘సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ స్థాయిని తెచ్చిపెట్టన సినిమా ‘దేవదాస్’. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తరవాత అస్సామీ భాషలో కూడా నిర్మించారు. ఆ తరవాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తుంపర తెంపరగా ఈ సినిమా ను నిర్మించారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం ప్రాముఖ్యతను చూరగొన్నది. సైగల్ ఆలపించిన ‘బాలమ్ ఆయే బసో మోరే మన్ మే’; ‘దుఃఖ్ కే అబ్ దిన్ బీతత్ నాహీ’, ‘చుట్టే అసీర్ తో బదలా హువా జమానా థా’ పాటలు అజరామరాలుగా నిలిచాయి. న్యూ థియేటర్స్ సంస్థతో సైగల్ బాంధవ్యాలు కొనసాగి ‘ప్రెసిడెంట్’ (1937), ‘ధర్తిమాత’(1938), ‘స్ట్రీట్ సింగర్’ (1938), ‘దుష్మన్’ (1939), ‘జీవన్ మరన్’ (1939), ‘జిందగి’ (1940) సినిమాల్లో నటించారు.


బొంబాయికి మకాం...మరణం...
రంజిత్ మూవీటోన్ వారితో పనిచేయడానికి సైగల్ 1941లో బొంబాయి వెళ్ళారు. ఆ సంస్థ నిర్మించిన ‘భక్త సూరదాస్’ (1942), ‘తాన్ సేన్’ (1943)సినిమాల్లో నటించారు. చతుర్భుజ దోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు జ్ఞాన దత్ సంగీత దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం హీరోయిన్ ఖుర్షీద్ కు కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇందులో సైగల్ ఆలపించిన “కదం చలే ఆగే మాన్ పాచే భాగే’, ‘మధుకర్ శ్యామ్ హమారే చోర్’, ‘మనవా కృష్ణ నామ్ రాతే జా’ పాటలు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. ‘తాన్ సేన్’ చిత్రానికి జయంత్ దేశాయి దర్శకత్వం వహించగా అందులో 13 హిట్ పాటలుగా నిలిచాయి. ‘రమఝుం రమఝుం చల్ తిహారి’, ‘బాగ్ లాగా దున్ సజని’, ‘బినా పంఖ్ పంచి హూ మై’ వంటి పాటలు అజరామరాలు గా నిలిచాయి. దీపక్ రాగంలో సైగల్ ఆలపించిన ‘దియా జలావో’ పాట సంగీతాభిమానులకు గుర్తుండే వుంటుంది. ఈ సినిమాల్లో నటించాక సైగల్ న్యూ థియేటర్స్ వారి ‘మై సిస్టర్’ చిత్రంలో నటించేందుకు సైగల్ మరలా కలకత్తా తిరిగి వచ్చారు. ఈ సమయంలో సైగల్ తాగుడు కు బానిసైపోయారు. మందు తాగితేగాని పాట పాడలేననే స్థితికి చేరుకున్నారు. దాంతో జలంధర్ లో కేవలం 42 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అయితే చనిపోవడానికి ముందు ‘షాజహాన్; (1946) సినిమాకోసం సంగీత దర్శకుడు నౌషాద్ సైగల్ తో ‘జబ్ దిల్ హాయ్ టూట్ గయా’, మేరె సపనో కి రాణి’, ‘ఆయె దిలే బేకరార్ ఝూం’ వంటి అద్భుతమైన పాటలు పాడించారు. సైగల్ నటించిన చివరి చిత్రం ‘పర్వానా’. ఈ చిత్రం సైగల్ మరణించిన తరవాత 1947 లో విడుదలైంది. సైగల్ కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భార్య ఆశారాణి ని సైగల్ 1935లో పెళ్లి చేసుకున్నారు. మొత్తం మీద సైగల్ 36 సినిమాల్లో నటించారు. వాటిలో 28 చిత్రాలు హిందీవి కాగా మిగతావి బెంగాలీ భాషలలో నటించినవి. తమిళ దేవదాసులో కూడా సైగల్ నటించడం విశేషం. బి. ఎన్. సర్కార్ సైగల్ మీద ఒక డాక్యుమెంటరీని నిర్మించారు. మొత్తం మీద సైగల్ 185 పాటలు పాడారు. వాటిలో 45 పాటలు ప్రైవేట్ పాటలు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.