మరాఠీ రసిక్... సులోచన
1990 నుంచి 2009 వరకు అంటే పందొమ్మిదేళ్ళుకు ముందువరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆ అవార్డు ఎవ్వరికీ ఇవ్వలేదు. 2009లో ఆ ప్రతిష్టాత్మక ‘మహారాష్ట్ర భూషణ్’ పురస్కారం బాలీవుడ్ సీనియర్ నటీమణి సులోచన కు దక్కడం విశేషం. మరాఠీ కళాభిమానుల గుండెల్లో చోటుచేసుకున్న సులోచన లట్కర్ ఈ పురస్కారం స్వీకరిస్తూ తన నటప్రస్థానం మొదలైన భూమి మీద అటువంటి సత్కారం జరగడం ఒక కళాకారిణి గా, ఒక మరాఠీ మహిళగా మహదానందాన్ని కలుగజేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అఖిల భారతీయ మరాఠీ చిత్రపట్ మహామండల్ సంస్థ సులోచనకు ‘చిత్ర భూషణ్’ పురస్కారాన్ని అందజేసింది. ప్రఖ్యాత పెయింటర్ బాబురావు పటేల్ స్మారక అవార్డుగా దీనిని పరిగణిస్తారు. 250 హిందీ సినిమాలే కాకుండా సులోచన 150 మరాఠీ సినిమాలలో నటించింది. తన గురువు బాల్జి పెండార్కర్ స్వీకరించిన బహుమతి తనకు కూడా దక్కడం పూర్వజన్మ సుకృతమని సులోచన సన్మాన కార్యక్రమంలో ప్రకటించడం విశేషం. హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, దేవానంద్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచన్ వంటి సూపర్ స్టార్స్ కు ఆమె తల్లిగా, అశోక్ కుమార్, నాజిర్ హుసేన్ వంటి సీనియర్ నటులకు ప్రియురాలిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. అటువంటి సీనియర్ నటి రెండు వందలకు పైగా హిందీ సినిమాల్లో నటించారు. జూలై 30న ఆమె 92వ పడిలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సులోచన గురించి కొన్ని విశేషాలు...


బాలతార నుంచి హీరోయిన్ గా...
సులోచన శంకర్ రావు లట్కర్ 1928 జూలై 30న కర్నాటక రాష్ట్రం బెల్గాం జిల్లా లోని ఖడక్లత్ లో జన్మించింది. తండ్రి పోలీసు శాఖలో ఫౌజీదార్ గా వుండేవారు. 1932లో... అంటే నాలుగేళ్ళకే ఇంపీరియల్ ఫిలిం కంపెనీ నిర్మించిన ’మాధురి’ అనే చిత్రంలో బాల తారగా ఆమె నటించింది. రూబీ మేయర్, గులాం మహమ్మద్ నటించిన ఈ చిత్రానికి ఆర్.ఎస్. చౌదరి దర్శకుడు. నాల్గవ శతాబ్దంలోని గుప్తుల కాలంలో ఉజ్జయని-కనౌజ్ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో నిర్మించిన సినిమా ‘మాధురి’. యుక్త వయసులో మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు వెళ్లి భాల్జీ పెండార్కర్ కు సంబంధించిన జయప్రభ స్టూడియోలో చేరింది. నటనలో ఆమెకు మెలకువలు నేర్పింది పెండార్కరే. అందుకే ఆమె పెండార్కర్ ను గురువుగా గౌరవించేది. పెండార్కర్ నిర్మించి దర్శకత్వం వహించిన మరాఠీ సినిమాలు ‘మహారథి కరణ్’, ‘వాల్మీకి’ చిత్రాల్లో జూనియర్ నటిగా సులోచన దర్శనమిచ్చింది. ఆమెకు పదనాలు ఏళ్ళకే పెళ్లయింది. తనకు పందొమ్మిది ఏళ్ళు వచ్చినప్పుడు 1948లో ప్రభాకర్ పిక్చర్స్ పతాకం మీద పెండార్కర్ నిర్మించిన ‘జై భవాని’ అనే మరాఠీ సినిమాలో సూర్యకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇందులో జయశంకర్, భీమారావు కాలే, విశ్వాస్, వసంతషిండే, లీలాజోషి, అంజని మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో మహాత్మా గాంధి హత్యకు గురికావడంతో ఆర్.ఎస్.ఎస్ కు చెందిన వారిని చెదరగొట్టడం, అరెస్టు చెయ్యడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెండార్కర్ కూడా ఆర్.ఎస్.ఎస్ సానుభూతి పరుడు కావడంతో పెండార్కర్ కు సంబంధించిన స్టూడియోని ముష్కరులు తగులబెట్టడం జరిగింది. దాంతో స్టూడియో పూర్తిగా కాలిపోయి బూడిద మిగిలింది. సినిమా విడుదల ఆలస్యమైంది. అయితే ధైర్యస్తుడైన పెండార్కర్ తన శక్తినంతా కూడగట్టి అదే స్థానంలో మరలా స్టూడియో నిర్మించారు. ఇప్పటికీ ఆ స్టూడియో పదిలమే. పెండార్కర్ కు 1994 లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే బహుమతి ప్రదానం చేసింది. ఈ సంఘటన జరిగాక సులోచన రాజా పరాంజపే, సుదీర్ ఫడ్కే మరికొందరు కళాకారులతో కలిసి పూణే చేరుకుంది. 1950లో అక్కడే సులోచన చిత్ర సహకార్ బ్యానర్ మీద సదాశివ్. జె. రావ్ నిర్మించిన ‘వాహినిచ్య బంగ్ డ్య’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇందులో హీరోగా వివేక్ నటించగా ఇతర పాత్రలను చిత్ర, మాధవ్, ధూమల్ పోషించారు. వి. శాంతారాం దర్శకత్వం వహించగా చంద్రకాంత్ పాండ్య సంగీతం సమకూర్చారు. తరవాత అజంతా ఫిలిమ్స్ అధిపతి దత్తా ధర్మాధికారి సమర్పించిన ‘బాల జో జో రే’ లో సూర్యకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ‘స్త్రీ జన్మ హి తుజి కహాని’ చిత్రంలో కూడా సులోచన హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ చిత్రం సిల్వర్ జూబిలీ చేసుకుంది. ఇదే చిత్రాన్ని ‘అవురత్ తేరి యాహి కహాని’ పేరుతో హిందీలో పునర్నిర్మించారు. ఇదే సమయంలో సులోచన హిందీ రంగ ప్రవేశం చేసింది.


నన్హే మున్నే తో హిందీ లో...
పద్దెనిమిది ఏళ్ళ వయసులో 1946లో ‘కీమత్’ అనే హిందీ సినిమాలో తొలిసారి బద్రి ప్రసాద్ సరసన సులోచన హీరోయిన్ గా నటించింది. కర్దార్ ప్రొడక్షన్ తరఫున ఎ.ఆర్. కర్దార్ నిర్మించిన ఈ చిత్రానికి కథ సమకూర్చి దర్శకత్వం వహించింది నజీర్ అజ్మేరి. నౌషాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అప్పుడు నౌషాద్ కర్దార్ స్టూడియోలో 500 రూపాయల జీతానికి పనిచేసేవారు. అందులో అమీర్ బాయ్ కర్నాటకి, అమర్ ఆలపించిన “సాగర్ మే ఉథి దో మౌజే” పాట గొప్ప పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం సిల్వర్ జూబిలీ చేసుకుంది. తరవాత మరాఠీ చిత్రాల్లో బిజీ కావడంతో సులోచనకు హిందీ సినిమాల్లో నటించే సమయం దొరకలేదు. అలా 1948 నుండి 1953 వరకు పూణే లోనే వుంటూ మరాఠీ సినిమాల్లో నటించింది. ‘స్త్రీ జనమా హి తుజి కహాని’ సినిమాని హిందీలో ‘అవురత్ తేరి యహీ కహానీ’ గా పునర్నిర్మించారు. అలాగే సులోచన నటించిన మోరో చిత్రం ‘వహినిచ్య బంగ్ దయ’ మరాఠీ చిత్రాన్ని ‘భాభి కి చూడియా’ గా హిందీలో నిర్మించారు. ఇందులో బల్రాజ్ సాహ్ని, మీనాకుమారి నటించగా సదాశివరావు దర్శకత్వం వహించారు. ఇందులో “జ్యోతి కళాశ చలకే” అనే భూపాల రాగంలో స్వరపరచిన భజన పాట నేటికీ జనరంజకమే. ఈ చిత్రానికి సుదీర్ ఫడ్కే సంగీతం సమకూర్చారు. తరవాత సులోచన ఎక్కువగా పౌరాణికచిత్రాల్లో నటించింది. వాటిలో ‘సతీ అనసూయ’ చిత్రం చాలా విజయవంతంగా ఆడింది. మొత్తం మీద సులోచన 40 కి పైగా పౌరాణిక సినిమాలలో విభిన్న పాత్రలు పోషించింది. అయితే పౌరాణిక సినిమాలకు ఆరోజుల్లో పెద్దగా గుర్తింపు వుండేది కాదు. ముఖ్యంగా ‘ఎ’, బి’ కేంద్రాలలో కొన్ని వారాలు మాత్రమే ఆ సినిమాలు ఆడేవి. రాబడి అంతా ‘సి’ కేంద్రాల థియేటర్ల ద్వారా సమకూరేది. కానీ అందుకు చాలా సమయం పట్టేది. బసంత్ వాడియా వంటి సంస్థలు మినహాయిస్తే పెద్ద నిర్మాణ సంస్థలు పౌరాణిక సినిమాల జోలికి వెళ్ళేవి కావు. దాంతో సులోచన పౌరాణిక సినిమాలలో నటనకు స్వస్తి చెప్పి మరాఠీ సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ‘ప్రపంచ’, ‘పతివ్రత’, ఏక్ థీ’, మోల్ కిరణ్’, ‘మరాఠా తిటుక మేల్వావ’ సినిమాలు అలా వచ్చినవే. 1953 లో ఆహ్లాద్ చిత్ర సంస్థ నిర్మాత, దర్శకుడు దత్తా ధర్మాధికారి హిందీలో ‘నన్హే మున్నే’ అనే సినిమా నిర్మించింది. ఇందులో సులోచన హీరోయిన్ గా , రాజానెనే హీరోగా నటించగా బేబి శకుంతల ఒక ముఖ్య పాత్రను పోషించింది. వసంత దేశాయ్ సంగీతం సమకూర్చారు. 1954 లో దత్తా ధర్మాధికారి అనంత్ మానె దర్శకత్వంలో నిర్మించిన ‘సుహాగన్’ సినిమాలో సులోచన ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. ఇందులో గురుదత్ హీరోగా నటించగా మాలా సిన్హా, గీతాబాలి హీరోయిన్లు గా నటించారు. వసంత దేశాయ్, సి. రామచంద్ర సంగీతం సమకూర్చారు.


బిమల్ రాయ్ పిలుపుతో సుజాత లోకి...
ఇదిలావుండగా ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్ సులోచనను రంజిత్ స్టూడియోకి పిలిపించి తను నిర్మించబోయే ‘సుజాత’ చిత్రంలో తల్లి పాత్ర పోషించమని కోరారు. సులోచన అప్పటికే మరాఠీ సినిమాలలో హీరోయిన్ పాత్రలు పోషిస్తూ వుంది. అటువంటిది బిమల్ రాయ్ ఆహ్వానాన్ని వదలుకోవడమా లేక హీరోయిన్ గా మరాఠీ సినిమాలలో కొనసాగడమా అనే మీమాంసలో పడిపోయింది. సన్నిహితులు వద్దన్నారు. అయితే సులోచన తన బాల్య స్నేహితురాలు లలితా పవార్ ను సలహా కోరింది.”నీకు ఎక్కువకాలం సినిమా రంగంలో ఉండాలనుకుంటే క్యారక్టర్ రోల్స్ చెయ్యి. హీరోయిన్ పాత్రలు కొంత వయసు వచ్చేదాకే మన్నుతాయి. కొత్త నీరు వస్తే పాతనీరును తోసేసే విధంగా హీరోయిన్ పాత్రల మనుగడ వుంటుంది. అందులో బిమల్ రాయ్ వంటి దర్శకుల సూచనను పాటించడం ఒక సీనియర్ నటిగా నీ బాధ్యత” అని సలహా ఇచ్చింది. మరో ఆలోచనకు తావీయకుండా సులోచన తల్లి పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. అలా 1959లో బిమల్ రాయ్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సుజాత’ లో సులోచన నటించింది. అందులో సునీల్ దత్, నూతన్, లలితా పావర్, శశికళ, తరుణ్ బోస్, అసిత్ సేన్ ముఖ్య తారాగణం. ఒక ధనిక యువకుడు నిమ్నజాతి యువతిని ప్రేమించి పెళ్లాడడం ఈ సినిమా నేపథ్యం. నిమ్నజాతికి చెందిన సుజాత(నూతన్) ను బ్రాహ్మణ కులానికి చెందిన చారు చౌదరి (సులోచన), ఉపేంద్రనాథ్ చౌదరి (తరుణ్ బోస్) అనాధ శరణాలయం నుంచి తీసుకొచ్చి పెంచుతారు. చారు మాత్రం సుజాతను దరిచేరనివ్వదు. ఒకసారి చారు మెట్లమీదనుంచి జారిపడి ఆసుపత్రిలోచేరగా ఆమెకు చాల రక్తం పోతుంది. ఆమెకు రక్తం ఎక్కించేందుకు అరుదైన ఆమె రక్తం గ్రూపు దొరకదు. అదే గ్రూపు రక్తం సుజాతలో వుంటుంది. ఆమె తన రక్తమిచ్చి పెంపుడు తల్లిని కాపాడుతుంది. ఈ చిత్రానికి బిమల్ రాయ్ (ఉత్తమ దర్శకుడు), నూతన్ (ఉత్తమ నటి), ఉత్తమ చిత్రం (బిమల్ రాయ్), సుబోద్ ఘోష్ (ఉత్తమ రచన) లు ఫిలింఫేర్ బహుమతులు అందుకున్నారు. కేన్స్ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక గోల్డన్ పామ్ బహుమతి లభించింది. జాతీయ స్థాయిలో తృతీయ ఉత్తమ చిత్రంగా ఈ సినిమా ఎంపికైంది. సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ ఆలపించిన “సునో మేరె బంధు రే సునో మేరె మిత్వా” పాట ఇందులోదే. ఈ చిత్ర విజయంతో సులోచనకు హిందీలో తల్లి పాత్రలు ఒకదానివెంట మరొకటిగా ఒక డజను కు పైగా తన్నుకుంటూ వచ్చాయి. 1960 దశకంలో ఎక్కువగా సులోచన తల్లి పాత్రలకు పరిమితమైంది. అలా సుజాత తల్లి పాత్రలు పోషించిన హిందీ చిత్రాలు నాసిర్ హుసేన్ నిర్మించిన ‘దిల్ దేఖో దేఖో’ తో మొదలై జె.పి. దత్తా నిర్మించిన ‘గులామీ’ వరకు కొనసాగాయి. తరవాత మేరా ఘర్ మేరె బచ్చే, ఝూలా, సంఘర్ష్, జానీ మేరా నామ్, రేష్మా అవుర్ షేరా, ఆ గలే లగ్ జా, కోరా కాగజ్, బెయీమాన్, రామ్ పు కా లక్ష్మణ్, విశ్వనాథ్, అంధా కానూన్ వంటి 250 సినిమాలలో నిర్ణయాత్మకమైన పాత్రలు పోషించి ఆయా చిత్రాలకు వన్నె తెచ్చింది. ఆమె నటించిన రోజుల్లో హిందీ చిత్రసీమలో అందరూ సూపర్ స్టార్లే. ఆమెకు దిలీప్ కుమార్ అంటే ఎంతో ఇష్టం. దేవానంద్ ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ గల నటుడు అని సులోచన అతణ్ణి కీర్తించింది. దేవానంద్ సెట్స్ మీద వుంటే స్నేహితులనుగాని, బంధువులనుగాని రానిచ్చేవాడు కాదట. వాళ్ళు వస్తే తన నటనకు భంగం కలిగిస్తారని ఆ నియమం పాటించేవాడని ఒకానొక ఇంటర్వ్యూలో సులోచన వెలిబుచ్చిన అభిప్రాయమది. ఇక రాజకపూర్ విషయానికివస్తే, తను స్వయంగా దర్శకుడై వుండికూడా ఇతర నిర్మాతల సినిమాల విషయాల్లో తలదూర్చేవారు కాదట. దర్శకునికి పూర్తి స్వేచ్చను ఇచ్చి వారు చెప్పినట్లు నటించేవారట. దాదా మోనిగా కీర్తించబడే అశొక్ కుమార్ తో హీరోయిన్ గా నటించేటప్పుడు ఆయన కళ్ళలోకి చూసేందుకు సులోచన జంకేదట. అయితే సన్నివేశం రక్తి కట్టించేందుకు అశోక్ కుమారే ఆమెకు ధైర్యాన్ని నూరిపోసి ‘ఫ్రీగా’ నటించమని చెప్పేవారని సులోచన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. బల్రాజ్ సాహ్ని గొప్ప దక్షత గల నటులు అని సులోచన క్లీర్తించేది. రాజేష్ ఖన్నా నటించిన ‘రాజ్’, ‘బహారోం కే సప్నే’ సినిమాలలో పనిచేసినప్పుడు, అతడు ఎప్పటికైనా సూపర్ స్టార్ అవుతాడని సులోచన భావించిందట. ఆ భావన నిజరూపం దాల్చింది. అలాగే ‘రేష్మా అవుర్ షేరా’ లో అమితాబ్ తో నటించినప్పుడు కూడా ఇలాంటి అంచనా వేసి తన కూతురుకి చెప్పిందట. తరవాతి కాలంలో అదే నిజమైంది. ‘ఏక్ థీ’ సినిమా ప్రదర్శన కోసం ఆమె బెర్లిన్ కు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మెహమూద్ ‘మై సుందర్ హూ’ సినిమా నిర్మిస్తున్నాడు. మెహమూద్ కి ఆమె కాల్షీట్లు బుక్ అయ్యాయి. కానే విషయం తెలుసుకున్న మెహమూద్ ఆమె బెర్లిన్ వెళ్లి వచ్చాక కాల్షీట్లు సవరించి షూటింగ్ జరిపాడు. సులోచన ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకుంది. అయితే సులోచన జీవితంలో కొన్ని విషాద సంఘటనలు కూడా జరగకపోలేదు. హిందీ చిత్రసేమలో నిలదొక్కుకునే సమయంలోనే ఆమెకు ఎంతో అండగా నిలిచిన భర్త మరణించడం సులోచనను కుంగదీసింది. అప్పుడు సులోచన ఏకైక కుమార్తె కు ఎనిమిదేళ్ళు. కూతురుకి పెళ్లీడు వచ్చాక ప్రముఖ మరాఠీ నటుడు డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ తో వివాహం జరిపించింది. అయితే పెళ్లి అయ్యాక నాలుగు సంవత్సరాల లోపే అతడు మరణించి సులోచన కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చాడు. తన జీవన ప్రస్థానంలో సులోచన యెప్పుడూ నెగటివ్ పాత్రలు పోషించలేదు. వాటికి ఆమె వ్యతిరేకం.

సత్కారాలు... బిరుదులూ...
1999 లో భారత ప్రభుత్వం సులోచనకు పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. 2004లో ఆమెకు ఫిలింఫేర్ యాజమాన్యం, సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లు హిందీ చిత్రసీమకు చేసిన సేవలకు గుర్తింపుగా జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించాయి. అఖిల భారతీయ మరాఠి చిత్రపట్ మహామండల్ సంస్థ బాబురావు పెయింటర్ సంస్మరణార్ధం సులోచనకు ‘చిత్రభూషణ్’ అవార్డు ప్రదానం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2009లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ఇచ్చి గౌరవించింది. మరాఠీ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా 2012 లో మహారాష్ట్ర ప్రభుత్వం సులోచనకు వి. శాంతారాం స్మారక అవార్డు బహూకరించింది. సులోచనకు పేరు తెచ్చిన హిందీ సినిమాలలో ‘సంపూర్ణ రామాయణ్’, ‘ఆయే దిన్ బహార్ కే’, ‘తలాష్’, ‘కహాని కిస్మత్ కి’ సినిమాలు కొన్ని మాత్రమే. అలాగే హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టిన మరాఠీ సినిమాల్లో ‘వాహినీచ్య బంగ్దయా’, ‘మీట్ బకర్’, ధక్తి జావ్’ చిత్రాలు కూడా కొన్ని మాత్రమే. సులోచన ప్రస్తుతం ముంబై లోని ప్రభాదేవిలో పెద్ద బంగాళా కట్టుకొని అందులో విశ్రాంత జీవనం సాగిస్తోంది.ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.