సమాజ సేవకుడు

బా
లీవుడ్‌లో నటన కంటే సమాజ సేవకుడిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్‌ దత్‌. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, సమాజ సేవకుడు, కేంద్ర మంత్రిగా బహుముఖంగా రాణించారు. తన సినిమాలకు తనే కథానాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మారిపోయిన నటుల్లో మొదటివాడితడు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కుమారుడు సంజయదత్‌పై అక్రమ ఆయుధాల కేసు విషయంలో కుమారుడిని అరెస్టు చేస్తామని పోలీసులంటే ‘‘చట్టం తన పని తాను చేసుకుపోవాల’’ంటూ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన నిజాయితీపరుడు. సునీల్‌ దత్‌ అసలు పేరు బాల్‌రాజ్‌ దత్‌. తొలిసారిగా హిందీలో ‘రేడియో సిలోన్‌’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లో ‘రైల్వే ప్లాట్‌ఫారం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన ‘మదర్‌ ఇండియా’ చిత్రంలో నర్గీస్‌కి కుమారుడి పాత్రలో నటించారు. ఆ రోజుల్లో ఈ చిత్రం భారీ విజయాన్నుందుకుంది. తర్వాత నర్గీస్‌నే వివాహమాడారు. ‘సాధన’, ‘సుజాత’, ‘మై చుప్‌ రహూంగీ’ వంటి మహిళలను చైతన్యపరిచే చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. సునీల్‌ దత్‌ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం ‘ముజే జీనే దో’. దీంతో బాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీనికి తొలిసారిగా ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. సునీల్‌ దత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో ఆయనే నిర్మించిన చిత్రం ‘యాదేన్‌’. ఇది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇవి కాకుండా ఆయన ‘రేష్మా ఔర్‌ షేర్‌’, ‘రాకీ’, ‘దర్ద్‌’, వంటి పలు చిత్రాలకు కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత వంటి ఎన్నో బాధ్యతలను మోశారు. ఇవన్నీ మంచి విజయం సాధించాయి. తెలుగులో మంచి హిట్టుకొట్టిన ‘మూగ మనసులు’ చిత్రం హిందీలో సునీల్‌ దత్‌ హీరోగా ‘మిలాన్‌’గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ‘కాందాన్‌’తో ఆయన కాందాన్‌ చూపించారు. కుమారుడు సంజయ్‌ దత్‌తో కలసి ‘మున్నాభాయ్‌ ఎమ్‌.బి.బి.ఎస్‌.’ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. భార్య నర్గీస్‌ మరణం తర్వాత ‘నర్గీస్‌ ఫౌండేషన్‌’ పేరుతో కాన్సర్‌తో బాధపడేవారికి వైద్యసేవలందిస్తున్నారు. ఆయన మన్మోహన్‌ మంత్రివర్గంలో 2004-05 మధ్యలో కేంద్ర యువజన, క్రీడా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. నటుడిగా ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. సునీల్‌ దత్‌ జూన్‌ 6, 1929లో జన్మించారు. ఆయన మే 25, 2005లో మరణించారు. ఇవాళ ఆయన జయంతి.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.